పాఠకులనూ రచయిత్రులనూ పెంచిన సులోచనారాణి

యుద్ధనపూడి సులోచనా రాణి మరణంతో తెలుగు సాహిత్యం ఒక ప్రథమ శ్రేణి రచయిత్రిని కోల్పోయింది. ప్రజలను ముఖ్యంగా మహిళలను అమితంగా ఆకర్షించి ఉత్సాహపర్చిన కలం ఆమెది. తొలి నవల సెక్రటరీతోనే తారాపథంలోకి దూసుకువెళ్లి రచయిత్రులకు ఒక ప్రాచుర్యం కల్పించిన ప్రత్యేకత ఆమెది. సెక్రటరీ నవల తొంభై ముద్రణలు పొందడం తెలుగు సాహిత్యంలో అపూర్వమైన విజయమే. ఈ నవల మరో పదేళ్ల తర్వాత చలన చిత్రంగానూ విజయం సాధించింది.జీవన తరంగాలు, మీనా,విజేత,అగ్నిపూలు, ఆరాధన, కీర్తి కిరీటాలు,ప్రేమలేఖలు,ఆత్మీయులు, గిరిజా కళ్యాణం,చండీప్రియ,రుతు రాగాలు, పార్థు,ఈ తరం కథ, బంగారు కలలు వంటి ఇంకా అనేక నవలలు ఆమె వెలువరించారు. అప్పటి వారపత్రికల్లో సీరియల్‌గా వచ్చే ఆమె నవలల కోసం పాఠకులు ఎంతగానో నిరీక్షించేవారు. ప్రచురణకర్తలు పరితపించేవారు.
1967లో వెలువడిన సెక్రటరీ నూతన విద్యాధిక యువతుల మనోభావాలను ఆశలనూ ఆకాంక్షలకూ అద్దం పట్టింది. దాంతోపాటే ఈ తరం మహిళలకు చదవడంతో పాటు రాయడం కూడా అలవాటు చేసింది. ఇది ఎంత వరకూ వచ్చిందంటే పురుషులు కూడా మహిళల పేర్లు కలం పేర్లుగా రాసేంత! ఇదోరకం వెక్కిరింతగానూ మారింది.( ఆమె నవల ఆధారంగా తీసిన సెక్రటరీ చిత్రంలోనే గిరిజ పాత్ర ఇలాటి వెక్కిరింతే) కాని మన పురుషాధిక్య సమాజ నేపథ్యంలో సులోచనా రాణి కృషిని ప్రత్యేకంగా అంచనా కట్టవలసి వుంటుంది.స్త్రీలు చదువుకోవడం రాయడం పెద్దగా ప్రోత్సహించబడని చోట కలం పట్టుకుని తనకంటూ ఒక లోకాన్ని సృష్టించుకోవడం చిన్న విషయం కాదు. జీవన తరంగాలు మీనాతో మొదలుపెట్టి సులోచనా రాణి నవలలు చిత్రాలుగా రావడం, అఖండ విజయాలుసాధించడం ఆమెకు మరింత ఆకర్షణ తెచ్చిపెట్టింది. ఈ విషయంలో ఆమెను మరెవరితో పోల్చలేము. మొదటి స్టార్‌ రైటర్‌ అంటుంటారందుకే! టీవీ సీరియల్స్‌ మొదలైనాక ఆమె రుతురాగాలు తొలి తెలుగు మెగా ధారావాహిక కావడం కూడా సహజంగా జరిగిపోయింది. సామాజిక సమస్యలు సిద్దాంతాల ప్రస్తావన లేకుండా కేవలం ప్రేమ కోపతాపాలు సెంటిమెంట్లతో కథ నడిపించేస్తారని ఆమెపై విమర్శ వుండేది. ఆమె నవలల్లో ఇలాటి సామాజిక చర్చ వుండని మాట నిజమే గాని వ్యక్తిగత స్థాయిలో అమ్మాయిల ఘర్షణ, ఆత్మగౌరవ అస్తిత్వ పోరాటం పుష్కలంగా చూడొచ్చు.వాటిని కష్టాలుగా అణచివేతగా గాకుండా ఆయా కథానాయకులు వ్యక్తిగత పోకడలుగా సమాజంలో చవకబారు లక్షణాలుగా మాత్రమే చూపించేవారు.
సులోచనా రాణి నవలలు బాగా ఆదరణ పొందిన కాలంలోనే తెలుగు సాహిత్యంలో . సాహిత్యవిమర్శలోయాంత్రికత అప్పుడు కొంత వరకూ రాజ్యమేలింది.సులోచనా రాణి నవలలు నేల విడిచి సాము చేస్తాయని,సిమెంటురోడ్డుపై రాజహంస లాటి కార్లలో వచ్చే ఆరడుగుల రాజశేఖరాల కోసం నాయికలు నిరీక్షిస్తుంటారని అపహాస్యాలు అధికంగా నడిచాయి. సెక్రటరీ నవలలోనే నాయకుడు ఆధునిక వ్యాపార వేత్తగా వున్న మాట నిజమే. సామాజిక ఇతివృత్తాలు గల కథల్లోనూ అది అసాధారణం కాదు. ఎటొచ్చి సంస్కారవంతుడుగా ఆధునికుడుగా వుండి తమను ప్రేమగా చూసుకోగల కథానాయకుడి కోసం అమ్మాయిలు ఎదురు చూడటం ఆనాటికి పగటి కలలు కనడంగా తోచింది. ఇవన్నీ మిల్స్‌ అండ్‌ రాబిన్స్‌ నవలలకు అనుకరణలని కొట్టిపారేశారుకొందరు. ఆ నవలల్లో శృంగారవ్యామోహమే ప్రధానమైతే సులోచనారాణి నవలల్లో కేవలం ప్రేమభావనే వుంటుందని విమర్శకురాలు, ఆమెకు సన్నిహితురాలు మృణాళిని వివరించారు.జేన్‌ఆస్టిన్‌ రచనల ఛాయలు కొంత కనిపిస్తాయంటారామె. చదువుకున్న అమ్మాయిలు సంస్కారం వంతుడైన సున్నిత ప్రేమికుడి కోసం చూడటంలో తప్పేమీ లేదని కూడా కొందరు అంగీకరించలేకపోయారు. (ి చాలా విప్లవకరంగా రాసే ఒక సీనియర్‌ రచయిత్రి కూడా నాతో ఇంటర్వ్యూలో ఇలాటి మాటే అన్నారు) అప్పటికి స్త్రీల పట్ల వున్న సంకుచితత్వం ఇందులోనూ కనిపిస్తుంది. పై తరగతుల గురించి రాయడమంటే వారిని బలపర్చడం ఆకర్షణలకు లోనుకావడమే అవుతుందన్న పొరబాటు అవగాహన కూడా ఇందుకు కొంత కారణం. సులోచనా రాణి నాయికలు ఆ విధంగా తాము లోబడిపోబోమని చెప్పడానికి పెనుగులాడుతుంటారు. అయితే ఆనవలలు నాయికా ప్రధానమైనవేననిగుర్తుంచుకోవాలి.జీవనతరంగాలు,విచిత్రబంధం(విజేత)సెక్రటరీ చిత్రాల్లో నాయికగా నటించిన వాణిశ్రీ ఆనాటి యువతుల ఆరాధ్య నాయిక కావడం నవలల కొనసాగింపేనని చెప్పొచ్చు.అందమైన కథానాయకులను సృష్టించడం ఇతర పురుషులకు నచ్చివుండకపోవచ్చు. నా హీరో ఆరడుగులు వుంటాడని నేను ఒక్కచోటైనా రాసేనేమో చూడండి అని ఆమె ఒక సత్కార సభలో నాతో అన్నారు! అయితే ఏ దశలోనూ సులోచనా రాణి నవలల్లో మూఢనమ్మకాలు లొంగుబాట్లు ప్రలోభాలకు లోబడటం ధన వ్యామోహం వంటివి చూడం. మామూలు మనుషులు అందులోనూ మహిళలు మర్యాద పూర్వకమైన జీవితం కోసం మదనపడటం ఆమె ఇతివృత్తం. సెక్రటరీలో పెట్టుబడిదారీ యుగపు తొలి అడుగులు కనిపిస్తాయి. మీనాలో ఇప్పుడు అందరూ చెప్పే పొసెసివ్‌ నెస్‌ చూస్తాం. తెలుగులో రెండుసార్లు చిత్రంగా వచ్చిన ఒకే ఒక్క నవల ఇది.
ఏమైనా తొలిరోజుల్లోనే కుటుంబాలలో పఠనాసక్తి రచనాశక్తి పెంచిన ఘనత నిస్సందేహంగా సులోచనారాణికి అధికంగా చెందుతుంది.తనకన్నాముందున్న తనతో పాటు రాస్తున్నరచయితలను కూడా కాదని ఆమె పాఠకులను ఆకట్టుకోవడానికి బలమైన శైలి జీవితాల మనస్తసత్వాల పరిశీలన దోహదం చేసింది.తనపై లత ప్రభావం వుందని కూడా చెప్పారు. అభ్యుదయ కరంగానూ వుండే కొందరి కంటే మామూలు అంశాలు బలంగా చెప్పగల శిల్పం ఆమెను ముందుభాగాన నిలిపింది.నవల రాసేముందు కథ అరగంట వివరించేవారట. సలహాలు సూచనలు తీసుకుని పూర్తి చేసేవారు. తర్వాత అక్షరం మార్చడానికి ఒప్పుకునేవారు కాదని 1980 ల తర్వాత ఆమె పుస్తకాలన్నీ ప్రచురించిన ఎమెస్కొ విజయకుమార్‌ నాతో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అదే సినిమాలకు ఇచ్చేశాక అ మార్పులు అస్సలు పట్టించుకునే వారు కాదట. వ్యక్తిగాసేవాదృష్టి, మానవీయత, ఆధునికత గల ఆమె పేరు కోసం లేదా సన్మానాలు ప్రచారాల కోసం పాకులాడకపోవడం మరో విశేషం. అపారమైన పాఠకాకర్షణ వున్నా సామాన్య వ్యక్తిగా ఇంటర్వ్యూలు సభలకు కూడా దూరంగా గడిపేవారు. కొన్ని స్వచ్చంద సంస్థలను కూడా ప్రోత్సహించారు. ఆమెతో పరిచయం వున్నవారంతా ఆత్మీయతను గుర్తు చేసుకుంటారు. నిజంగానే ఆమె లేని లోటు తీరనిది.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *