ఉద్వాసన దిశలో ‘ఉప’ సంకేతాలు

గతసారి గమనంలో కర్ణాటక సంగీతం పేరిట కర్ణాటక ఎన్నికల ఫలితాలపై రాసే సమయానికి ఇంకా పరిణామాలు ఒక కొలిక్కి రాలేదు. తర్వాత యెడ్యూరప్పకు ఆహ్వానం, ప్రభుత్వ ఏర్పాటు, బలపర్చేవారు లేక/రాక అవమానకరంగా నిష్క్రమించడం చూశాం. కుమారస్వామి కొలువు తీరిన సందర్భం దేశవ్యాపితంగా ప్రతిపక్షాల పునస్సమీకరణలకు వేదిక కావడం యాదృచ్చికం కాదు. ఆ కర్ణాటకం తాజా ఉప ఎన్నికల ఫలితాలతో హిందూస్థానీ రాగమై పోయింది! మోడీ గ్రాఫ్‌ దిగజారుతున్న పరమ సత్యాన్ని కళ్లకు కట్టింది. ఇది బిజెపికి మూడో వరస దెబ్బ. ఉప ఎన్నికల ఓటమి,కర్ణాటక శృంగభంగం, ఇప్పుడు పలు రాష్ట్రాలలో పరాజయ పరంపర. అవరోహణ పర్వంలోమరో ఘట్టం. త్వరలో జరిగే మూడు రాష్ట్రాలు చత్తీస్‌ఘర్‌, రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు కూడా పూర్తయితే 2019 మహా పతనానికి మార్గం స్పష్టమై పోవచ్చు. ఎవరికైనా సందేహాలుంటే ఇటీవల వరుసగా వెలువడుతున్న ఎన్నికల సర్వేలనూ పెట్రోలు ధర పెంపుపై మండుతున్న ప్రజలనూ అడగొచ్చు.
మోడీకి మద్దతు యథాతథంగా కొనసాగుతున్నట్టు చెప్పిన టైమ్స్‌ నౌ సర్వేకూడా ఆయన పట్ట ఆదరణ 53 శాతం చూపించింది. అంటే సగంకు కొంచెమే ఎక్కువ. మరో సర్వేలోనైతే అది దిగజారింది కూడా. ఆరెస్సెస్‌ సర్వేల్లోనూ మోడీత్వ క్షీణత తెలియబట్టే కాయకల్ప చికిత్సలు ప్రారంభించింది. వరుసగా మేథా మధనాలు జరిపి ఆపద్ధర్మ వ్యూహాలు ఆలోచిస్తున్నది. తమ కరుడుగట్టిన హిందూత్వ భావజాలాన్ని సున్నితంగా జనామోదయోగ్యంగా మింగించేందుకు తగిన మేధావులను రచయితలనూ కూడగట్టుకోవాలని నిర్ణయం తీసుకుంది. మరో వైపున ప్రజలు తమను తిరస్కరించేందుకు కారణమవుతున్న ప్రజాస్వామ్య లౌకిక భావధారపై దాడి పెంచాలనీ నిర్ణయించింది. జెఎన్‌యులో ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక వేత్తలైన ప్రభాత్‌ పట్నాయక్‌,ఉత్సాపట్నాయక్‌ల గదికి తాళం వేసి కక్ష తీర్చుకోవడం ఈ కుటిల వ్యూహాలకూ కుసంస్కారానికి తాజా ఉదాహరణ. అచ్చే దిన్‌ అన్నవి కాస్తామతతతత్వంతో కక్షే దిన్‌గా, ఆర్థిక సమస్యలతో చచ్చేదిన్‌గా మారాయని మామూలు మనుషులు మాట్లాడుకుంటున్నారు. దానికి అనుగుణంగానే ఓటు ముద్రేస్తున్నారు. అందుకే ఉప ఫలితాలు ప్రజాస్వామ్యప్రియులకు ఉపశాంతి కలిగించవచ్చు. ఆ మేరకు సంఘీయులు నీరస పడొచ్చు కూడా. లేదా ఓటమి సంకేతాలు భరించలేక వీరంగం తొక్కొచ్చు.
గతసారి బిజెపికి ఒంటరిగా మెజార్టి రావడానికి ప్రధాన కారణం యుపి బీహార్‌లే. మరీ ముఖ్యంగాయుపిలో ఏకంగా 73 బీహారలో 31,్‌ ఎంపి రాజస్థాన్‌ గుజరాత్‌లలో దాదాపు మొత్తం రావడం ఫలితాల స్వభావాన్నే మార్చేసింది. యుపిలో అమిత్‌షాను ముందే పురమాయించి కుతతంత్రాల నుంచి మత మంత్రాల వరకూ అన్నిటినీ ప్రయోగించారు. మళ్లీ మొన్న శాసనసభ ఎన్నికలలో గనక అక్కడ ఓడిపోతే మొత్తంగా చేటు వస్తుందని మరింత పకడ్బందీగా పాచికలు వేశారు. ఈ సమయంలో ఎస్‌పి బిఎస్‌పి తదితర పార్టీలు సమైక్యంగా ఎదుర్కోలేక పోగా పాలకపక్షమైన ఎస్‌పినే తండ్రీ కొడుకుల మధ్య ముక్కచెక్కలైంది. ఓట్ల చీలికతో దక్కిన ఈ విజయాన్ని నోట్లరద్దుకు మద్దతుగా బిజెపి టముకు వేసుకుంది.. అయితే అనంతర కాలంలో స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లోనే గిజగిజలాడి గెలవడంతో ఇదంతా ఆవిరి కాక తప్పలేదు. తర్వాత ఉప ఎన్నికలు ఎస్‌పికి బిఎస్‌పి మద్దతు కారణంగా ఓటమి తెచ్చిపెట్టాయి. ఎంపి రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌ కోలుకుంది. ఆ పైన కర్ణాటక ఇప్పుడు ఉప ఫలితాల ద్వితీయ పర్వం. అన్ని దశల్లోనూ మోడీ జోడీని అపజయాలే వెన్నాడుతున్నాయి. ఇది గాక రాజకీయంగా తెలుగుదేశం బయిటకు రావడం, శివసేన శివమెత్తడం,యశ్వంత సిన్హా తదితరుల నిష్క్రమణ, కర్ణాటకంలో సుప్రీం కోర్టు మొట్టి కాయలు వంటవిి రాజకీయంగానూ రాజ్యాంగ పరంగానూ అంతర్గతంగానూ ఎదురుదెబ్బలుగా మారాయి.
ఈ క్రమంలో ప్రస్తుత ఉప ఎన్నికలు జరిగిన నాలుగు లోక్‌సభ స్థానాలలో మూడు బిజెపివి కాగా ఒక్కటి మాత్రమే తిరిగితెచ్చుకోగలిగింది.గత ఉప పలితాలతో లోక్‌సభలో కనీస మెజార్టి(స్పీకర్‌ మినహా) 272కు క్షీణించిన బిజెపి ఈ దెబ్బతో స్వంత మెజార్టి అనే భుజకీర్తి కోల్పోడం అనివార్యం.శతృఘ్న సిన్ణా కీర్తి ఆజాద్‌లు సస్పెన్షన్‌లో వున్నారు గనక వారికీ పార్టీ విప్‌ వర్తించదు. ఏతావాతా మోడీ మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడి మనుగడ సాగించవలసిన దశకు చేరుకున్నారు.మొత్తం 20 చిన్న చితక ప్రాంతీయ పార్టీలతో కూడిన ఎన్‌డిఎ ఇక అనుబంధంగా గాక ప్రాణవాయువుగా మారిపోనుంది. పెద్ద భాగస్వాములైన తెలుగుదేశం శివసేన వంటివే తమ దారి తాము చూసుకున్న ప్రభావం ఈ పార్టీలపైనా పడొచ్చు. యుపిబీహార్‌లలో 2014 వూపు పూర్తిగా మాయమై పోగా కేరళ బెంగాల్‌ కర్ణాటక పంజాబ్‌ వంటి రాష్ట్రాలలో వ్యతిరేకత కొనసాగుతూనే వుంది. మరి కొద్ది మాసాల్లో రాజస్థాన్‌ చత్తీస్‌ఘర్‌ మధ్య ప్రదేశ్‌లలో కూడా బిజెపి ప్రభుత్వాలు ఓడిపోతే 2014లో మోడీ పునరాగమనం అసంభవమే కావచ్చు. దీనికి కారణాలు చాలానే వున్నాయి.ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో చీప్‌ కృష్ణారావుగారు మొన్నటి సంచికలో వాటిని సవివరంగా ప్రస్తావించారు కూడా. ఒక్క ముక్కలో చెప్పాలంటే కార్పొరేట్‌ కాషాయ కూటమి త్రీడీలో చూపిన మోడీ ఇమేజ్‌ ఆయన ఏలుబడికి సంబంధించిన కఠోర వాస్తవాల ముందుకరిగిపోతున్నది.
ఈ దేశాన్ని గత డెబ్బై ఏళ్లలోనూ ఎన్నో ప్రభుత్వాలను చూసింది. పీడాకరమైన ఎమర్జన్సీకాలాన్ని ఓడించి మరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంది.భారత్‌ వెలిగిపోతుంది అంటూ ఎన్నికలకు వెళ్లిన వాజ్‌పేయి బిజెపి ఎన్‌డిఎ సర్కారును ఓడించి కాదు, దేశం రగిలిపోతున్నదని చాటిచెప్పింది.ఆ ప్రభుత్వంతో పోలిస్తే మోడీ పాలనలో హిందూత్వ రాజకీయాలు మరింత వెర్రితలలు వేశాయి. స్వంతంగా మెజార్టి వుంది గనక ఆరెస్సెస్‌ నేరుగా రంగ ప్రవేశంచేసి ప్రత్యక్ష జోక్యానికి పాల్పడింది. గోరక్షణ పరిట హత్యలూ దళిత మైనార్టిలపై దాడులూ మతకలహాలూ స్త్రీలపై తిరోగమన దాడులూ బాలికలతో సహా వారిపై అత్యాచారాలూ విశ్వ విద్యాలయాల్లో విద్వేష వాతావరణం అన్నీ ఆందోళన కరంగా పరిణమించాయి. విదేశీ బ్యాంకుల లోని అక్రమధనం తెచ్చింది లేదు గానిఇక్కడ బ్యాంకుల లూటీ కొనసాగి ఎగవేసినబాబులు విదేశాలకు ఉడాయించే పరిస్థితి దాపురించింది. జిడిపి పెరుగుదల రేటు 8 శాతం నుంచి 6.6 శాతానికి పడిపోయింది. రాష్ట్రాల హక్కులపై వనరులపై దాడి ప్రణాళికా విధానం ఎత్తివేత, చ రిత్ర పరిశోధనా రంగాలలో చొరబాటు ప్రతిదీ వికృతరూపం తీసుకుంది. అన్ని వ్యవసÊథలపై ఆధిపత్యం ఆఖరుకు అత్యున్నత న్యాయాధిపతులే దేశప్రజల ముందుకొచ్చి గోడు వెళ్లబోసుకోవలసిన విపరీత పరిస్థితికి దారితీసింది. తెలుగు రాష్ట్రాల సమస్యల సంవాదాల పరిష్కారంపై నిర్లక్ష్యం, ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హౌదావాగ్దాన భంగం అదనపు దెబ్బలుగా మారాయి.ఇలాటి అనేకానేక కారణాలతో మోడీ దూకుడును ప్రజలు, పార్టీలూ సహించలేని స్థితి ఏర్పడింది. అందుకే అన్ని చోట్లా ప్రతికూల ఫలితాలు అనివార్యమైనాయి. ఇప్పటికీ బిజెపి పట్ల మెతక వైఖరి ప్రదర్శించే వైఎస్‌ఆర్‌సిపి వంటి పార్టీలు, దాటవేతతో సరిపెట్టే టిఆర్‌ఎస్‌ అధినేతలూ ఈ ఉప ఎన్నికల తర్వాతనైనా వాస్తవ పరిస్థితి తెలుసుకుంటారేమో చూడాలి. నాలుగేళ్లు బిజెపితో వుండి ఇప్పుడు పవన్‌ జగన్‌ ఇద్దరూ దాంతో వున్నారని అదేపనిగా ఆరోపిస్తున్న టిడిపి కూడా తన ప్రచార సరళి ఎవరికి మేలు చేస్తుందో ఆలోచించాలి. మరోవైపున కాంగ్రెస్‌ కర్ణాటకలో వలె ఆలస్యంగా తప్పు దిద్దుకోవడం గాక ముందే తన పరిమితులు గుర్తించి తగు విధంగా వ్యవహరించాలి. 2014లో బిజెపికి 31 శాతం,కాంగ్రెస్‌కు 19 శాతం (దాదాపు) ఓట్లు రాగా తక్కిన యాభై శాతం ఇతరులకే వచ్చాయి. సీట్టలో మాత్రం బిజెపికి 52 శాతం, కాంగ్రెస్‌కు 8 శాతం(సుమారుగా) వచ్చాయి. ఈ రెండు లెక్కలు కూడా దేశంలో వామపక్షాలు ప్రాంతీయ పార్టీలకున్న బలమైన పునాదినిచెబుతున్నాయి. బిజెపి దెబ్బతినడమంటే కాంగ్రెస్‌ రాజ్యం తిరిగిరావడమేనని ఎవరైనా అనుకుంటే పొరబాటే. రకరకాల రాజకీయ సామాజిక పునస్సమీకరణలకు 2019 ఎన్నికలు దారి తీస్తాయి. నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక మిత్రుడు రాసినట్టు ఈ పునస్సమీకరణలన్నిటినీ తిట్టిపోయడం అర్థరహితం. గతంలో చాలా సార్లు జరిగినట్టే ఇప్పుడు కూడా ఎన్నికల అనంతర సమీకరణలే నూతన ప్రభుత్వానికి బాట వేస్తాయి. (ఆంధ్రజ్యోతి గమనం, 30,5,18)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *