పొంతన లేని కెసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌

తెలంగాణ ముఖ్యమంత్రి టిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాటల్లో, చేతల్లో రాజకీయంతో పాటు నాటకీయత కూడా మిక్కుటంగా వుంటుంది. ఈ ప్రక్రియను ఆయన ఇప్పుడు జాతీయ స్థాయికి విస్తరింపచేశారు. నాకు బంగారు తెలంగాణ ముఖ్యం, జాతీయ పాత్ర గురించి ఆలోచించడం లేదని టీవీ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశారుకి చెప్పిన కొద్దిరోజుల్లోనే కెసిఆర్‌ ‘దేశ్‌ కీ నేత’ అని టిఆర్‌ఎస్‌ అనుయాయులు నినాదమిచ్చే వాతావరణం సృష్టించారు. ఆయన ప్రధాని ఎందుకు కాకూడదని కుమార్తె, ఎంపి కవిత ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ బిజెపిలు విఫలమైనాయి గనక దేశం దుస్థితిలో పడిపోయిందని చైనాతో పోల్చి లెక్కలు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో గుణాత్మకమైన మార్పు తీసుకురావడం కోసం దేశమంతా తిరిగి మిగిలిన పార్టీలను కూడగడతానని ప్రకటించారు.. మరి మీరు కోరే గుణాత్మక మార్పు ఏంటి? ఏ దిశలో వుంటుంది? అంటే విధాన చట్రం తయారవుతుందని రెండు నెలల గడువు పెట్టారు. ఈ రాజకీయం బండి ముందు గుర్రం వెనక చందంగా వుందని ఎవరైనా అంటే తప్పు పట్టలేము. ఎప్పుడైనా ఏదైనా ఒక విధాన ప్రాతిపదిక తయారైతే దాన్ని బట్టి ఎవరితో కలసి ఎవరికి వ్యతిరేకంగా ఏ దిశలో ఏ దశలో వంటివి నిర్ధారణ అవుతాయి. కాని కెసిఆర్‌ మాత్రం విధాన సూత్రాలు చెప్పకుండానే రాష్ట్రాల పర్యటన, రాజకీయ నేతలతో చర్చలు సాగిస్తున్నారు. ఈ కారణంగానే దీనిపై పరిపరి విధాలైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కాంగ్రెస్‌ బిజెపి యేతర కూటములు ఏర్పడ్డం గాని ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం గాని కొత్త కాదు. రాష్ట్రాల లోనూ కేంద్రంలోనూ కూడా అటువంటి అనుభవాలు చాలా వున్నాయి. సిపిఐ నుంచి జనసంఘం (బిజెపి పాత రూపం) వరకూ కలసి వుండిన సంయుక్త విధాయక్‌ దళ్‌(ఎస్‌విడి) ప్రభుత్వాలు 1967లో వచ్చాయి. సిపిఎం నాయకత్వాన వామపక్ష ఐక్య సంఘటనలు కేరళ, బెంగాల్‌లలో వచ్చాయి. ఈ కాలంలోనే అనేక ప్రాంతీయ పార్టీలు డిఎంకె, అకాలీదళ్‌ వంటి వాటితో పాటు ఉత్కళ కాంగ్రెెసు, బంగ్లా కాంగ్రెసు, కేరళ కాంగ్రెసు లాటివి వచ్చాయి. మొదట ఇందిరా గాంధీకి అనుకూలంగా వున్న ఈ పార్టీలు తర్వాత వ్యతిరేకంగా మారాయి. కాంగ్రెస్‌, సిపిఐ ఐక్య సంఘటనలు కూడా నడిచాయి. బీహార్‌, గుజరాత్‌లలో జనతా సంఘటనలు వున్నాయి. 1977లో ఇందిరాగాంధీ ఓటమి తర్వాత అధికారం చేపట్టిన జనతాపార్టీ వివిధ పార్టీల కలయికతో ఏర్పడిందే. అకాలీదళ్‌, డిఎంకె వంటి పార్టీలు కూడా ఆ ప్రభుత్వంలో వుంటే సిపిఎం బయట నుంచి బలపర్చింది. ఇది ఒక దశ. 1980లలో అన్నాడిఎంకె, తెలుగుదేశం, కర్ణాటక క్రాంతిదళ్‌ వంటివి అధికారాలు చేపట్టాయి. ఇందులో కొన్ని కలసి జనతాదళ్‌ నేషనల్‌ ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. 1989లో ఈ కూటమి అధికారం చేపట్టగా వామపక్షాలు, బిజెపి బయట నుంచి బలపర్చాయి. అప్పటికి బిజెపి బలం పెరుగుతుంటే కాంగ్రెస్‌ బలహీనపడుతున్న దశ. బిజెపి కూటమిగా ఏర్పడినా 1996లో కనీస మెజార్టీ తెచ్చుకోలేకపోయింది. 1998 నాటికి తెలుగుదేశం లౌకిక శిబిరం నుంచి ఆ వైపు దూకడంతో వాజ్‌పేయి ప్రభుత్వం నిలబడగలిగింది. కాంగ్రెస్‌ కూడా ఒంటరిగా అధికారంలోకి రాలేననే వాస్తవం గ్రహించి ఐక్య సంఘటనలకు సిద్ధమైంది. నూతన ఆర్థిక విధానాలు మతతత్వ రాజకీయాలు సామ్రాజ్య వాద ప్రపంచీకరణ కూడా బలంగా కాలూనిన దశ ఇది. మతతత్వ బిజెపిని ఓడించేందుకు వామపక్షాలు మద్దతు ఇచ్చిన కారణంగా కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఎ1 ప్రభుత్వం ఏర్పడింది. కొన్ని మంచి శాసనాలు రూపొందినా మౌలికంగా సరళీకరణ, ప్రపంచీకరణ నమూనాలో అణు ఒప్పందంపై సంతకాలు చేసి దేశ సార్వభౌమత్వానికి చేటు తెచ్చింది. వామపక్షాలు వ్యతిరేకించి విడగొట్టుకోగా, కొన్ని ప్రాంతీయ పక్షాలు కొత్తగా చేరాయి. యుపిఎ2 పై పెల్లుబికిన అసంతృప్తిని సొమ్ము చేసుకొని మోడీ మొదటిసారి పూర్తి మెజార్టీ సాధించగలిగారు. సరళీకరణ విధానాల బాట పట్టిన ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా పోరాడటం గాక కేంద్రంలో అటో ఇటో చేరిపోయే అవకాశ వాదం ప్రబలింది. గతంలో చాలా కూటములు ఫలితాల తర్వాతనే ఏర్పడడం ఇందువల్లనే. ఈ ప్రజా వ్యతిరేకమైన ప్రపంచీకరణను ప్రతిఘటించే సిపిఎం, వామపక్షాలు ప్రజా ఉద్యమాలను బలోపేతం చేస్తూ స్వతంత్ర పాత్ర పెంచుకోవా లని నిర్ణయించుకున్నాయి. అదే సమయంలో ఫాసిస్టు తరహా పోకడలు పెరుగుతున్న దృష్ట్యా బిజెపి కూటమిని ఓడించడా నికి తగిన ఎత్తుగడలను చేపట్టడానికి సిద్ధమైనాయి.

2014 ఎన్నికల్లోనూ తర్వాత టిడిపి నేరుగా ఎన్‌డిఎలో భాగస్వామి కాగా టిఆర్‌ఎస్‌ మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చింది. అసహన రాజకీయా లు, దళితులు మైనార్టీలపై దాడులు తదితర అంశాలపైన ఈ పార్టీలు గాని ప్రభుత్వాలు గాని విధానపరంగా విమర్శలు చేసింది శూన్యం. పైగా కేంద్రంతో మంచిగా వుంటేనే అభివృద్ధి సాధ్యమన్నట్లు మాట్లాడుతూ వచ్చాయి. జ్యోతిబసు, రామకృష్ణ హెగ్డే, ఫరూక్‌ అబ్దుల్లా వంటి వారితో కలసి రాష్ట్రాల కోసం పోరాడి సర్కారియా కమిషన్‌ సాధించిన ఎన్టీఆర్‌ వారసులా వీరు అని అడగాల్సి వచ్చింది 2018లో అంటే ఎన్నికల సంవత్సరంలో టిడిప,ి టిఆర్‌ఎస్‌ అధినేతల రాజకీయాలు ఒక్కసారిగా కొత్త మలుపు తిరిగాయి. ఎపిలో ప్రత్యేక హోదా రాకున్నా ప్యాకేజీ భజన చేసిన చంద్రబాబు నాయుడు ఎన్‌డిఎ నుంచి బయటకు వచ్చేశారు. ఇక తాము కోరిన నిధులు రిజర్వేషన్ల వర్గీకరణకు ఆమోదం ఇవ్వలేదని కెసిఆర్‌ విమర్శలు మొదలుపెట్టారు. అయితే ఆయన మోడీ విధానాలపై సూటిగా విమర్శలు చేయడం కన్నా 70 ఏళ్ల చరిత్ర, వ్యవసాయం పరిశ్రమల వంటి సాధారణాంశాలే మాట్లాడుతు న్నారు. తెలంగాణలో మజ్లిస్‌కు రాజకీయ నేస్తంగా వున్న టిఆర్‌ఎస్‌ నేత మతతత్వాన్ని ఓడించడంపై వక్కాణింపు ఇవ్వడం లేదు. 15 వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు నష్టదాయకంగా వున్నాయని కేరళ చొరవతో రాష్ట్రాలు సమా వేశమవుతుంటే ఆయన ప్రభుత్వం పాలుపంచుకోలేదు. తన రాజకీయ సంప్రదింపులలో భాగంగా కెసిఆర్‌ మొదట బెంగాల్‌ వెళ్లారు. గతంలో ఎన్‌డిఎ భాగస్వామి, విశ్వసనీయ తకు చోటు లేని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. ఆమె కాంగ్రెస్‌తో కలసి పని చేయాలని చెప్పే వ్యక్తి. యుపిలో కాంగ్రెస్‌తో కలసి ఎన్నికల్లో పాల్గొన్న ఎస్‌పి నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌ను, తమిళనాడులో ఆ పార్టీ భాగస్వామి డిఎంకెను కలసి వచ్చారు. కాంగ్రెస్‌తో కూడా అవసరమైతే తర్వాత చూస్తామని కూడా కెసిఆర్‌ చెన్నైలో చెప్పారు.

జాతీయ స్థాయి రాజకీయాలలో ప్రకంపనాలకు హైదరాబాద్‌ కేంద్ర బిందువవుతుందని టిఆర్‌ఎస్‌ ప్లీనరీలో ఘనంగా చెప్పొచ్చు గాని గందరగోళ వ్యూహాలు ప్రచార ప్రహసనాలుగానే మిగులుతాయి. కెసిఆర్‌ పరస్పర విభిన్నంగా మాట్లాడుతుండటం కూడా వాస్తవమే. ఫ్రంట్‌ అని నేనెప్పుడూ చెప్పలేదంటూనే ఫెడరల్‌ ఫ్రంట్‌ రాగమాలపిస్తున్నారు. 2019 ఎన్నికల కోసం ఇదంతా చేయడం లేదంటున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని ఓడించడం టిఆర్‌ఎస్‌ లక్ష్యంగా లేదా? కెసిఆర్‌ మొదట్లో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో మాట్లాడానని చెప్పారు. వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం కోసం హైదరాబాదులో జరిగిన సిపిఎం మహాసభలు పిలుపునిచ్చాయి. సహజంగానే రాష్ట్ర ప్రభుత్వంపైనా విమర్శలు వచ్చాయి. మహాసభలు ముగిసిన మర్నాడే టిఆర్‌ఎస్‌ నేతలు సిపిఎంపై విమర్శల దాడి చేశారు. కర్ణాటక వెళ్లిన కెసిఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెడిఎస్‌కు మద్దతు ప్రకటించారు. వీటన్నిటిని బట్టి బిజెపి కన్నా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే టిఆర్‌ఎస్‌ ఇవన్నీ చేస్తోందన్న అభిప్రాయం ప్రబలుతున్నది. కెసిఆర్‌తో చర్చల కొనసాగింపుగా హైదరాబాద్‌ వచ్చిన అఖిలేష్‌ బిజెపిపైనే విమర్శలు చేసినప్పుడు కాంగ్రెస్‌ విషయం అడిగితే ‘నో కామెంట్‌’ అంటూ దాటవేశారు. కాంగ్రెస్‌ను వ్యతిరేకించవచ్చు గాని ఇప్పుడు పాలిస్తున్న బిజెపిపై కేంద్రీకరణ లేకపోవడమేం టి? నటుడు, లౌకిక వాది ప్రకాశ్‌ రాజ్‌తో కలసి వ్యవహరిం చడం బాగానే వుంది గాని ఆయన బిజెపిపై చేసే విమర్శలలో శతాంశం కూడా కెసిఆర్‌ నోట వినలేకపోతున్నాం. ఆ విధంగా తక్షణ కర్తవ్యం, దిశానిర్దేశం లేని విన్యాసాలతో ఫలితం వుండదు.

కెసిఆర్‌ గాని చంద్రబాబు గాని మతతత్వ విధానాలను నిశితంగా విమర్శించరు. ఆర్థిక రంగంలో అదే బాటలో నడు స్తుంటారు. ప్రజా ఉద్యమాల పట్ల ప్రతికూల వైఖరి ప్రదర్శి స్తారు. అంతర్జాతీయ అంశాల జోలికే పోరు. పాలనా పరంగా అనేక ఆరోపణలు ఆశ్రిత పక్షపాతాలతో అభిశంసనకు గురవుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో సర్దుబాట్లకు టిడిపి సిద్ధమవుతుందనే వార్తలు ఒకవైపు వున్నాయి. వీటికి విరుగుడుగానే కెసిఆర్‌ మూడేళ్ల తర్వాత ఓటుకు నోటు కేసును తిరగ దోడారనే కథనాలున్నాయి. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు ఆయన జాతీయంగా బిజెపికి ఉపయోగపడే పాత్ర నిర్వహిస్తున్నారా? ఇలాటి ప్రశ్నలు రావడానికి కారణం ఆయనే. విధాన స్పష్టత లేకుండా విశ్వసనీయత రాదు. ఇక కెసిఆర్‌ ‘దేశ్‌ కీ నేత’ అని ‘కాబోయే ప్రధాని’ అని చెప్పుకోవడం మరీ తాడూ బొంగరం లేని ముచ్చటే. 24 సీట్లు గెలిపిస్తే వచ్చే సారి ప్రధానిని ఎపి నిర్ణయిస్తుందని చంద్రబాబు చెప్పే కబుర్లు కూడా ఈ కోవలోవే. ప్రత్యామ్నాయం ప్రజల కోణంలో రావాలి గాని ప్రచారార్భాటంలో, ప్రధాని పదవి కోణంలో కాదు. PUBLISHED IN PRAJASAKTI , NAVATELANGANA

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *