‘అధర్మ’ తిరుగుబాట్లు – ‘విద్రోహ’ విన్యాసాలు

ధర్మాధర్మాల మాట పక్కనపెడితే ఆంధ్ర ప్రదేశ్‌ ఇప్పుడు టిడిపి వైసీపీల హౌరాహౌరీ పోటా పోటీలతో దద్దరిల్లిపోతున్నట్టు కనిపిస్తుంది. ఢిల్లీలో అవిశ్వాస తీర్మానం నోటీసులు, ధర్నాలు దీక్షలూ రకరకాల చోట్ల అనేక రకాల పేర్లతో జరిగిన తర్వాత సీన్‌ రాష్ట్రానికి మారింది. ఢిల్లీలో ఇవన్నీ చేసేది చేస్తున్నామన్నది మోడీ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయినా వీరిద్దరూ పరస్పరం తిట్టుకున్నదే జాస్తి. బిజెపికి మీరు ఎక్కువ లొంగిపోయారంటే మీరంటూ ఆధారాలు ఫోటోలు రికార్డులు క్లిప్పింగులు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు పుంఖానుపుంఖంగా విడుదల చేసుకున్నారు. తిట్ల పురాణాలు నడిపించారు. ఆందోళనలు ఇక్కడ కాదు ఢిల్లీలో చేయాలని అంతకు ముందు కాలంలో సవాళ్లు విసిరిన వారు పార్లమెంటు ముగియగానే గోడకు కొట్టిన బంతుల్లా తిరిగివచ్చేసి రంగం రాష్ట్రానికి మార్చారు. ఎక్కడైనా అదే ముచ్చట అన్నట్టు ఇక్కడా అదే తంతు. కేంద్రాన్ని అంటూనే అంతకు పదిరెట్టు వైసీపీని అంటుంది టిడిపి. టీడీపిని పది తిట్టి అందులో పదిశాతం కేంద్రంపై మాట్లాడుతుంది వైఎస్‌ఆర్‌సిపి. ఇవన్నీ చిద్విలాసంగా చూస్తూ కూచునే అవకాశం కేంద్ర బిజెపికి దక్కింది. వారూ గవర్నర్లు నిఘా విభాగాన్ని వినియోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించే ప్రయత్నంలో వున్నారు. అయితే రాష్ట్రపార్టీ అద్యక్షుడిని కూడా ఎన్నుకోలేని అవస్థ వారిది. అయినా మధ్యేమధ్యే పానీయం సమర్పయామి అన్నట్టు మోడీ మెప్పుకోసంరాష్ట్రానికి చేసిన సాయం, హౌదాకు బదులు ఇచ్చిన నిధులు వంటివాటిపై ఏవో నివేదికలు పత్రాలు పుస్తకాలు విడుదల చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు బిజెపి నేతలు. వామపక్షాలూ ప్రత్యేకహౌదా సాధన సమితి ఆందోళనలు కొనసాగిస్తుంటే జనసేన కూడా శక్తిమేరకు పాలుపంచుకుంటున్నది. నిన్ననే రాష్ట్రమంతటా రెండు గంటల పాలు విద్యుద్దీపాలు ఆర్పివేసి నిరసన తెలిపారు ప్రజలు. అందుకే బిజెపి టిడిపి వైసీపీ రాజకీయ వ్యూహాలు ఏమైనప్పటికీ ప్రజా ఉద్యమం మాత్రం కొనసాగుతూనే వుంది.తీవ్రమవుతూ వుంది కూడా.
కేంద్రం హౌదా ముగిసిన అధ్యాయం అని ప్రకటించినప్పుడు, ముఖ్యమంత్రి అదే సంజీవిని కాదని తీసిపారేసినప్పుడు ప్రజా ఉద్యమం ఇంత కాలం పట్టుగా సజీవంగా వుంటుందని వూహించలేకపోయారు. అందుకే టిడిపి బిజెపి నేతలు ఒకరినొకరు పొగిడేసుకుంటూ పబ్బం గడిపారు. ఊరు ముందుకొచ్చాక ఉరుకులు పెట్టినట్టు ఎన్నికల సంవత్సరం చేరువైనాక వీరావేశం పొంగిపొర్లుతున్నది. బొబ్బిలి సింహాలై పెడబొబ్బలు పెడుతున్నారు బాలయ్య బాబులు. అటైనా ఇటైనా మేమే అన్నట్టు నాలుగేళ్ల కాషాయ కాపురం మంచిదే, ఇప్పుడు విడిపోయి వీరంగం వేయడమూ గొప్పే అంటున్నారు. కొంతమంది చెప్పినట్టు మొదటే విడిపోయి వుఠటే రాష్ట్రంలో ఇంత అభివృద్ధి పోలవరం తదితరాలు జరిగేవి కాదంటూనే మళ్లీ ముఖ్యమంత్రి ఒక విధంగా ఆయన వియ్యంకుడైన నందమూరి బాలుడు మరో రకంగా విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇంతకాలం ఆంధ్ర ప్రదేశ్‌ టీకప్పులో ఈగలాగా గిలగిల కొట్టుకుంటుంటే ప్రధాని మోడీ దాన్ని తీసి చప్పరిస్తున్నారని ఆయన అంటాడు. ఇంతకాలం కలిసి వున్నందుకే అభివృద్ది అనడమే గాక ఇప్పుడు కూడా అభివృద్దిని ఆపలేరని చంద్రబాబు వువాచ. టిడిపి బిజెపితో కలసి వుంటుందా లేదా అనేది వారి స్వంత వ్యవహారం. కాని రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగినా ఎందుకు నాలుగేళ్లు కళ్లు మూసుకోవడమే గాక ప్రజల కళ్లు కప్పారనేది ప్రశ్న. పోనీ మీనోరు పొగడ్తలతో పరవశిస్తున్నా పోరాడే వారినైనా ఎందుకు అడ్డుకున్నారనేది రెండవ ప్రశ్న. వీటికి జవాబివ్వకుండా అడిగేవారిపై నిందలు మోపడం దారుణం. అప్పుడేమో అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నారని ఆరోపించి నిర్బంధం సాగించారు. ఇప్పుడేమో అంతా మా నాయకత్వంలో పోరాట్టం లేదని తప్పు పడుతున్నారు. రాష్ట్ర ప్రయాజనాల పల్లవి పాడుతూనే స్వీయ రాజకీయ వ్యూహాలచుట్టూ రాష్ట్రం పరిభ్రమించాలనే కుటిల నీతి ఇది. ఈ ద్వంద్వక్రీడలో భాగంగానే మొన్న ముఖ్యమంత్రి సర్కారీ హంగామాతో ధర్మపోరాట దీక్ష చేశారు. ఇప్పుడేమో తిరుపతిలో తిరుక్షవరం పూర్తి చేస్తారట.ఏమంటే ఎన్నికల ముందు తిరుపతి సభలోనే మోడీ ప్రత్యేకహాదాపై హామీ ఇచ్చారు గనక అక్కడ ఏప్రిల్‌ 30న దండోరా సభ జరుపుతారట.

ఇస్తామన్న హౌదా నిరాకరించి రాష్ట్రానికి ద్రోహం చేసిన కేంద్రం కంటే ఎన్నికల్లో మా ప్రత్యర్థి టిడిపిని ఓడించడం ముఖ్యం గనక వారిపైనే బాణం ఎక్కుపెడతామన్నది వైసీపీ వైఖరి. వారు కూడా ఏప్రిల్‌ 30నే విశాఖపట్టణంలో విద్రోహ దినం అంటూ నిరాహారదీక్షలు చేపడతామని ప్రకటించారు. పోటాపోటీ దీక్షలు అని మీడియాలో ఇది ప్రచారమైంది. సరే రాష్ట్రం కోసం పోటీపడితే మంచిదే గాని రాజకీయ ప్రయోజనాలకోసం బిజెపిని కాపు కాయడం హాస్యాస్పదం. టిడిపిని ఎంతైనా విమర్శించవచ్చు గాని జరిగిన ద్రోహానికి వారే కారణమంటూ బిజెపిని కాపు కాయడం ఏం ధర్మం? ‘ సిఎం మోస పూరిత విధానం, కేంద్రం వైఖరికి నిరసనగా’ ఈ వంచన దినం నిర్వహిస్తున్నట్టు సాక్షి పతాకశీర్షికలో(ఏప్రిల్‌ 23) చెప్పిన మాట. నాలుగేళ్లుగా చంద్రబాబు మాటల వల్లే హౌదా రాలేదన్న ధర్మాన, వంచనలో ఎన్డీఏ పక్షాలన్నిటికీ బాద్యత వుందని సెలవిచ్చారు. ఆరవ పేజీలో కొనసాగిన ఈ కథనంలో విమర్శలన్నీ టిడిపిపై 90 శాతం దాడి, బిజెపిపై 10 శాతం సుతిమెత్తని ప్రస్తావనలు అన్నట్టు సాగింది. మాలాటివారి విమర్శల వల్ల తప్పనిసరై సన్నాయి నొక్కులు నొక్కడం తప్ప ప్రధాని మోడీని పల్లెత్తు మాట అనడానికి వైసీపీ ఎందుకింత తటపటాయిస్తుందో అర్థం కాదు. అర్థమైందేదో అంటే వారికి మింగుడు పడదు. మొత్తంపైన కేసుల కారణంగానే మీరు లొంగిపోయారంటే మీరు లొంగిపోయారని ఈ రెండు పార్టీలూ రోజూ దుమ్మెత్తిపోసుకోవడం రాష్ట్రానికి తలవంపులు తేవడంతో పాటు కేంద్రం ముందు పలచన చేస్తున్నది.
ప్రభుత్వంలో వుండి ప్రత్యేక హౌదా తదితర అంశాలపై చేయాల్సిన కృషి తేవాల్సిన ఒత్తిడి తేకపోవడం టిడిపి అధినేత నిర్వాకం గనక నిస్సందేహంగా అందుకు విమర్శ మోయవలసిందే. అందుకోసం ఇప్పటికైనా ఆత్మ విమర్శ లేకపోగా అవతలివారిపై దాడితో ఆత్మస్తుతి పరనింద తతంగంగా ప్రత్యేకహౌదా పోరాటాన్ని దిగజార్చినందుకు కూడా తప్పు పట్టవలసిందే. వైఎస్‌ఆర్‌సిపి పాక్షికత్వంతో టిడిపిపైనే దాడి చేస్తూ కేంద్రం అన్యాయాన్ని ఎదిరించలేకపోవడం కూడా విమర్శకు గురికావలసిందే. రాజీలేదంటూనే చంద్రబాబు 2018 దాకా భాగస్వామ్యం లాగించారు. జగన్‌ 2016 అక్టోబరులో రాజీనామాల సంకల్పం ప్రకటించి ఇప్పటిదాకా ఆగారు. ఆఖరు బడ్జెట్‌ కోసం ఆగామన్నదే ఇద్దరి నోట వినిపించే మాట. కాబట్టి ఈ జంట భాగోతాన్ని ఎంత చెప్పినా అక్కడికే వస్తుంది. మా వల్లనే తెలుగుదేశం ఇప్పుడు ఇదంతా చేస్తున్నట్టు చెప్పే వైసీపీ ఇప్పుడు తాము బిజెపి పట్ట మెతకవైఖరితో చొరవ కోల్పోతున్న వాస్తవం గుర్తించలేకపోవడం విచిత్రం. ఏం చేసినా ప్రజలు మా వెనకే వుంటారని ఈ రెండు పార్టీల నాయకత్వాలు పొరబడుతున్నాయి. అన్ని రకాల రాజకీయ విన్యాసాలనూ ప్రజలు అప్రమత్తంగానే చూస్తున్నారు. ధర్మ దీక్షల వెనక మర్మాలు విద్రోహాల్లో వ్యూహాలు పసిగడుతున్నారు. మనం అడిగిన ప్రకారం టిడిపి కేంద్రం నుంచి వైదొలగింది గనక ప్రభుత్వానికి మద్దతు నివ్వాలని కొందరు మాట్లాడుతున్నారు. హీరో శివాజి వంటివారు పూర్తిగా టిడిపి వెనక చేరిపోయారు. కాంగ్రెస్‌ తన దైన రీతిలో మల్లగుల్లాలు పడుతున్నది. కొన్ని అనామక సంఘాలు అవకాశ వాద నేతలు ఇదే అదనుగా ప్రజా ధనంతో ప్రభుత్వ భజనకు సిద్ధమై పోతున్న దుస్థితి.
ఈ సమయంలో జనసేన సిపిఎం సిపిఐలు ప్రత్యేక హాదా సమతి వివిధ ప్రజా సంఘాలు చేపట్టిన పోరాటాలు ఉత్సాహం నింపాయి. భయపడిపోయిన బిజెపి తానేదో ఒరగబెట్టినట్టు పుస్తకాలు విడుదల చేసింది. దిగిపోయే ముందు ఆ పార్టీ రాష్ట్ర అద్యక్షుడు హరిబాబు ఇచ్చిన నివేదిక చూసినా రాష్ట్రానికి అన్యాయం జరిగినట్టు స్పష్టమవుతుంది. మీడియా సినీ రాజకీయ కాలుష్యాల కారణంగా దృష్టి మరల్చిన జనసేన అద్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ త్వరలో చిత్తూరు జిల్లాలో పర్యటన కార్యక్రమం ప్రకటిస్తున్నారు. ఆ పార్టీ నికరంగా నిలబడాలని నిర్మాణాత్మకంగా ముందుకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కమ్యూనిస్టులు తమ వంతు ఉద్యమాలు సాగిస్తూ వస్తున్నారు. ఎవరి రాజకీయాలు ఏమైనా రాష్ట్రం కోసం బేషరతుగా గొంతెత్తాలి గాని చిత్తశుద్ధి లేని వ్యవహారం కాకూడదు. మొన్నటి దాకా మిత్రధర్మం అంటూ ప్రజా ధర్మం విస్మరించిన చందం పునరావృతమైతే ప్రజలుసహించరు.
(ప్రజాశక్తి, ఏప్రిల్‌ 26,2,18)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *