సిపిఎంలో చీలిక మిథ్య

సిపిఎం ప్రకంపించి పోతున్నట్టు విభేదాలు చీలికకు దారితీయడం అనివార్యమైనట్టు హౌరెత్తిపోతున్న ప్రచారం నిలిచేది కాదని నేను ఇదే గమనంలో జనవరి 26 రాశాను. నిజంగానే అలాటిదేమీ జరగకపోగా అన్ని రాష్ట్రాలలోనూ మహాసభలు క్రమబద్దంగా పూర్తి చేసుకుని అనుకున్న ప్రకారం హైదరాబాద్‌లో సిపిఎం 22వ మహాసభలు ఉత్సాహంగా ప్రారంభమై నిర్విఘ్నంగా నడుస్తున్నాయి. తెలుగునాడుకు కమ్యూనిస్టు ఉద్యమంతో అనుబంధం ఈనాటిది కాదు. మహాసభలకు అతిథ్యమివ్వడం ఇది తొలిసారీ కాదు. సిపిఎంగా ఏర్పడిన తర్వాత ఇది నాలుగోసారి. రాష్ట్ర విభజన తర్వాత 2015లో విశాఖపట్టణంలో జరిగితే ఇప్పుడు హైదరాబాదులో నిర్వహించడం ఉభయ రాష్ట్రాల్లోనూ ఎర్రజండాకున్న ఆదరణకు అభిమానానికి నిదర్శనం. తమ కన్నా వనరులూ వసతులూ అధికారాలు అపారంగా వుండే రాజకీయ పక్షాల కన్నా కమ్యూనిస్టుల సభలు కట్టుగా ఘనంగా జరగడానికి కారణం వాటి రాజకీయ చారిత్రిక నేపథ్యమే. ఆ పార్టీలో సభ్యులుగా వుండేవాళ్లకన్నా బయిటనుంచి బలపర్చేవాళ్లు వారు బాగుండాలని కోరుకునే వాళ్లుకొన్ని రెట్లు ఎక్కువ.ఎరుపులోనే మెరుపుంది పోరాడే శక్తుంది అని అని సుబ్బారావు పాణిగ్రాహి గొప్పగా రాశాడు. ఓట్లు రాలేదని సీట్లు లేవనీ అపహాస్యం చేసేవారి విషయం వేరు. అధికారాలు హంగూ దర్పాలు పైరవీలకు పనికి రావచ్చు గాని హక్కులు సాధించుకోవడానికి పోరాడే సత్తా ఇచ్చేది మాత్రం కమ్యూనిస్టులేనని ప్రతివారూ అంగీకరిస్తారు, ఆ మేరకు ఆహ్వానిస్తారు కూడా. సిపిఎ ంమహాసభలపై వచ్చిన వస్తున్న కథనాల గురించి అలాటి అశేషాభిమానులు అనేకమంది ఒకింత ఆందోళనకు గురైవుండొచ్చు, కాని అలాటి అవసరమే లేదనీ, అభేద్యమైన ఐక్యతతో ఉద్యమం ముందుకు సాగుతుందని ఘంటాపథంగా చెప్పొచ్చు. అందుకు ఆధారాలు స్పష్టంగానే వున్నాయి. మతతత్వ బిజెపిని అధికారంలోకి దింపాలని లౌకిక శక్తులను కలుపుకుని పోరాడాలని సిపిఎం ఏకాభిప్రాయంతో వుంది.అందుకోసం వీలైనంత విశాల కృషి చేయాలనీ భావిస్తున్నది. ఇప్పుడు పక్కనే వున్న కర్ణాటక ఎన్నికల పోరాటంలో తాను పోటీ చేయని చోట్ల బిజెపిని ఓడించాలని సిపిఎం పిలుపునిచ్చింది కూడా.సిపిఎం నడక సూటిగానే వుందని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు.
మహాసభ క్రమంలో ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరికీ పూర్వ కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌కు ఏదో ప్రచ్చన్న యుద్ధం నడుస్తున్నట్టు వచ్చే కథలు నవ్వుతెప్పిస్తాయి. అవి కమ్యూనిస్ట్టు పని విధానం తెలియకనో తెలిసినా గందరగోళం పెంచడానికో చేసే వూహాగానాలు మాత్రమే. బిజెపిని ఓడించడానికి ఎలాటి ఎత్తుగడలు అనుసరించాలి ఎవరితో ఏ మేరకు కలిసి వెళ్లాలన్న అంశంపై మాత్రమే రెండు వాదనలు వున్నాయని అధికారికంగానే వివరణ ఇచ్చారు. ఇందులో ఏచూరి వాదన మైనార్టిలో వున్నట్టు కూడా స్పష్టంగానే వెల్లడించారు. ఇక గోప్యత గాని నిగూఢత కాని ఏముంది? మహాసభ ముసాయిదాపై స్థానిక శాఖలన్ని సవరణలు పంపించాయి.సభలో చర్చ జరుగుతున్నది. ప్రజాస్వామ్యమే వుండదనే ఒక పార్టీలో ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టడమే గాక మైనార్టి అభిప్రాయం కూడా అగ్రస్తానంలో వున్న ప్రధాన కార్యదర్శి వివరించేందుకు అవకాశం లభించింది. కొంతమంది అంటున్నట్టు ఇవి రెండు తీర్మానాలు కాదు. ఒకే తీర్మానం ముసాయిదా. దాంట్లోని ప్రతిపాదనలతో పాటు బలంగా చర్చకు వచ్చిన మరో మైనార్టి వాదనను కూడా వినిపించడం మాత్రమే. రెంటినీ మహాసభే చర్చించి విధానం ఖరారు చేస్తుంది. ముసాయిదా అధికార విధానమై అమలుకు వస్తుంది. అప్పుడు అందరూ దాన్నే అనుసరించి పని చేస్తారు. ఇందులో అస్పష్టత అనైక్యత ఏమున్నట్టు? ముసాయిదాను ప్రధాన కార్యదర్శి గాక మరొకరు ప్రతిపాదించడం ఇదేమొదటి సారి అని మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి గాని అది నిజం కాదు. బిటి రణదివే మొదటి రోజుల్లో తప్ప ఎప్పుడూ కార్యదర్శి కాదు గాని బతికున్నంత కాలం ఎవరు కార్యదర్శిగా వున్నా ఆయనే ముసాయిదా ప్రవేశపెట్టి గొప్పగా వివరించేవారు. నంబూద్రిపాద్‌ కార్యదర్శిగా వున్నా హరికిషన్‌ సింగ్‌సూర్జిత్‌ ముసాయిదా ప్రతిపాదించేవారు.
ఒక సజీవమైన పార్టీలో సైద్ధాంతిక చర్చ తప్పనిసరి. పాలక పార్టీల్లో ముఠాకుమ్ములాటలనూ కమ్యూనిస్టుపార్టీలలోవిధానపరమైన మధనాన్ని కలగాపులగం చేయడం కుదిరేపని కాదు. సిపిఎంలో విధానపరమైన తేడాలు రావడం ఇదే మొదటిసారి కాదు. వ్యవస్థాపక కార్యదర్శి మహానాయకుడు సుందరయ్య కూడా మెజార్టి విధానంతో విభేదించి రాజీనామా చేశారు. 1978లో జలంధర్‌లో జరిగిన మహాసభలో ఆయన అసమ్మతి పత్రం కూడా ప్రవేశపెట్టడం ఓటింగు జరిగాయి. కొంతమంది అప్పటి మాజీలు మాటిమాటికి సుందరయ్య ఏదో అన్నారని రాస్తూనే వుంటారు గాని ఆయన ఆఖరు వరకూ పార్టీలోనే , తోనే వున్నారని గొప్పగా సేవలు కొనసాగించారని గుర్తుంచుకోవాలి. 1979లో జనతా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంపై తర్వాత 1982లో విజయవాడలో జరిగిన 11వ మహాసభలో పార్టీ చీలిపోతుందన్నారు. 1996లో జ్యోతిబాసుకు ప్రధాని పదవికి ఎంపిక చేస్తే ఆమోదించకపోవడం, దాన్ని ఆయన ఆత్మకథలో చారిత్రిక తప్పిదం అని వర్ణించడం ఆయనకు సూర్జిత్‌ మద్దతు ఇప్పటికి చెబుతుంటారు. 1998 మహాసభ ప్రధాని పదవి నిరాకరణ సరైందని పునరుద్ఘాటించిందే తప్ప ఐక్యత దెబ్బతిన్నది లేదు. సూర్జిత్‌ మరో ఏడేళ్లు ్ల ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.2008లో యుపిఎకు మద్దతు ఉపసంహరించిన తర్వాత ప్రకాశ్‌కరత్‌ కరుడుగట్టిన నేతగా చిత్రించినవారే ఇప్పుడు కూడా కథనాలు కొనసాగిస్తున్నారు. నిజానికి ఇవి ఎత్తుగడల అన్వయంలో తేడాలు తప్ప వ్యక్తిగత విభేదాలు కావు. ఏ విధానం నెగ్గినా మిగిలిన వారు అలిగిపోయేదీ వుండదని అందరికీ ఆచరణ పూర్వకంగా తెలుసు. సిపిఎం ఎప్పుడూ నాయకుల చుట్టూనే తిరిగిన వ్యక్తి ప్రధాన పార్టీ కాదు.
సిపిఎం ముసాయిదా ఆమోదించిన నాటికి ఇప్పటికీ మోడీ ప్రభుత్వ పరిస్తితి ఎవరూ వూహించనంత వేగంగా క్షీణిస్తున్నది. ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో చీఫ్‌ ఎ..కృష్ణారావు తాజాగా రాసిన న్యూఢిల్లీగేట్‌ ఈ దిగజారుడు పరిస్థితినీ కారణాలనూ కూడా కళ్లకు కట్టింది. బాలికలపై అత్యాచారాల వంటి అమానుషాలకు కూడా మతం రంగు పులమడం, బిజెపి ఎంఎల్‌ఎలు మంత్రులూ కూడా యుపి కాశ్మీర్‌లలో రాజకీయ కళంకం పులుముకోవడం కటకటాలపాలు కావడం వంటి ఘటనలు కాషాయ పార్టీ ప్రతిష్టను మసకబార్చాయి. నోట్లరద్దు తర్వాత ఇంత కాలానికి కూడా నగదులేని ఎటిఎంలు ప్రజలను వెక్కిరిస్తున్నాయి. ఉపాధి లేమిపై నిపుణులు నిర్ఘాంతపోతున్నారు. బిజెపి పెద్దలే తిరుగుబాటుకు అసమ్మతీయులను సిద్దం చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో టిడిపి వంటి పార్టీలు నిష్క్రమించగా శివసేన శివాలు కొనసాగుతూనే వున్నాయి.జమిలి ఎన్నికలు పెడితే తప్ప గండం గట్టెక్కలేమన్న ఆందోళన అధికార పక్షాన్ని ఆవహించింది. కర్ణాకట ఎన్నికలలో గాలి జనార్థనరెడ్డి పరివారానికి గండపెండేరం తొడగడంతో బిజెపి అవినీతి వ్యతిరేకత తేటతెల్లమై పోయింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వుంటాయనే అంచనాలు ఆచరణలో చూడాలి.అయితే అంత మాత్రాన బిజెపి వ్యతిరేకత అంటే కాంగ్రెస్‌ను బలపర్చడమే అనే భావం శుద్ధతప్పు. ఆ పార్టీ విశ్వసనీతయ విధాన మార్పులు కూడా ప్రశ్నార్థకాలే. నేరుగా బిజెపి మతోన్మాదాఇ్న విమర్శించకుండా కెసిఆర్‌ ఫెడరల్‌ ప్రంట్‌తో సహా చాలామంది చేస్తున్న హడావుడి కూడా తాడూ బొంగరం లేనిదే. ప్రజా పోరాటాలు పెంచకుండా కమ్యూనిస్టులు బలపడకుండా, వామపక్ష ఐక్యత పెంపొందకుండా నిజమైన ప్రత్యామ్నాయం సాధ్యం కాదన్నది సిపిఎం చేసుకుంటున్న ప్రధాన నిర్ధారణ. సిపిఎం 22 మహాసభలు ఆ దిశలో స్పష్టమైన నిర్దేశం చేస్తాయని నిస్పందేహంగా చెప్పొచ్చు. బిజెపికి నిజమైన సైద్ధాంతిక ప్రత్యర్తిగా చెప్పబడే మార్క్సిస్టుల నిర్దేశం దేశమంతటా వాతావరణంపై చాలా ప్రభావం చూపిస్తుందనేది చరిత్ర చెబుతున్న వాస్తవం. బిజెప మతతత్వి ఓటమితో పేద ప్రజల ప్రయోజనాల పరిరక్షణ వంటి కర్తవ్యాల పరిపూర్తికి అదే బాట అవుతుందని భావించవచ్చు. ( ఆంధ్రజ్యోతి,20.4.18)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *