నిరంకుశ నిరశన- ఆక్రోశ ఆనందం!

వాస్తవాలు కల్పన కంటే చిత్రంగా వుంటాయంటారు ఇంగ్లీషోళ్లు(ప్యాక్ట్స్‌ ఆర్‌ స్ట్రేంజర్‌ దేన్‌ ఫిక్షన్‌) ఆ సంగతి బాగా తెలిసిన పెద్ద మనుషులు, పేద్ద నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నాలుగేళ్ల జోడీ విడిపోయిన తర్వాత కూడా వారిద్దరినీ కలిపి ప్రస్తావించడంపై వచ్చే సందేహాలు కాస్సేపట్లో నివృత్తి అవుతాయి గనక కాస్త నిరీక్షణ అనివార్యమే. మంగళవారం మహానేతలిద్దరి నిర్వాకాలు నిశ్చయాల గురించిన నివేదికలు అప్పటికప్పుడే టీవీల్లోనూ, బుధవారం పత్రికల్లోనూ దర్శనమిస్తున్నాయి. ఎంతైనా పిఎం సిఎం అంటే మజాకానా? ఇంతకూ విడివిడిగా ఈ ఉభయ ఉద్దండుల ఉద్దేశాలు ఏమనగా- ప్రతిపక్షాలు అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నందుకు ఆవేదన చెందిన మెడీజీ గురువారం నాడు ఒక పూట నిరశన(అంటే అన్నం మానేయడం. అశనం అంటే అన్నం.) దీక్ష చేస్తారట. ఈ ఒకరోజు నిరశనలో ప్రత్యేకత ఏమంటే మోడీజీ ఒకచోట కూచోరు. తన పనులన్నీ షరా మామూలుగానే చేసుకుంటారు. ే తను సెలవు తీసుకోరుగాని తిండికి మాత్రమే సెలవిస్తారట. ఆయనకు వత్తాసుగా దేశమంతటా కూడా బిజెపి ఎంపిలు తమ తమ నియోజకవర్గాల్లో(మరోచోటనైతే ఎన్నికల లబ్ది వుండదు కదా) నిరాహారదీక్షలకు కూచుంటారట. ఇంతకూ వీరందరూ ఇంతటి వీర కఠోర నిర్ణయం తీసుకోవడానికి కారణమేమంటే లోక్‌సభ సమావేశాలు వ్యర్థమై పోవడమేనట. కాంగ్రెస్‌ నాయకత్వంలో ప్రతిపక్షాలు కావాలని సభకు అడ్డుతగిలి గత పద్దెనిమిదేళ్లలో ఎన్నడూ లేనట్టు సభా సమయం పూర్తిగా వృథా చేశారని మోడీజీ ఇదై పోతున్నారట. ఆయన ఆవేదన అర్థం చేసుకున్న అనుచర ఎంపిలు కూడా మీకు అక్కర్లేని అన్నం (ఆ ఒక్క రోజు)మాకు మాత్రం సహిస్తుందా అబ్బే మేమూ మెతుకుముట్టం అనేశారట. ఇకపోతే ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తలమునకలై వున్న మోడీజీ జిగ్రీదోస్తుడైన అమిత్‌ షా మహాశయుడు కూడా సేమ్‌ టు సేమ్‌ ఫీలైనా మధుమేహం కారణంగా తిండి మానేయలేక రెండు గంటలు ధర్నా చేసి ధామంతం తీర్చుకుంటారట. బిజెపి ఎంపిలంతా తిండి మానేసి కూచోవడం గాక జనంలోకి వెళ్లి ప్రతిపక్షాలు ఎలా సభను జరగనీయకుండా చేశాయో వివరిస్తారట.
తప్పెవరిది? తతంగమేమిటి?
ఇదంతా వినడానికే విడ్డూరంగా వున్న ఈ ప్రహసనంపై మీడియాలో ఇప్పటికే చాలా రకాల విమర్శలూ విసుర్లూ కనిపిస్తున్నాయి. అధికారపక్షంగా సభను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత మీపై వుంటే మరెవరికి వ్యతిరేకంగా నిరశన చేపడుతున్నారు? ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేక హౌదానిరాకరణపై వచ్చిన అవిశ్వాసం నోటీసుకు కావలసినంత మద్దతు వున్నా చర్చకు తిరస్కరించారు గాని అనుమతించి వుంటే ఒకటి రెండు రోజుల్లో అంతా అయిపోయేది కదా! దాన్ని చర్చకు అనుమతించకపోవడం మోడీ మదిలో గూడు కట్టుకున్న అభద్రతే గాని అవతలిపక్షం కాదు కదా! పోనీ ఆ ప్రతిష్టంభన జరిగిన సమయంలో ఒక్కరోజైనా ప్రధాని సర్దుబాటుకు సమన్వయానికి ప్రయత్నించారా? సంభాషణలకు ఆహ్వానించారా అంటే లేనేలేదు. అన్నా డిఎంకె అనే ఒక ప్రాంతీయ పార్టీ సభ్యులు మాత్రమే నిరసన తెల్పుతుంటే దాన్ని సాకుగా చూపి క్షణాల మీద వాయిదాలు వేస్తూ ప్రజాస్వామాన్ని సహా నియమావళిని అపహాస్యం చేశారు. కాబట్టి ఇందుకు పూర్తి బాధ్యత మోడీ సర్కారుదే తప్ప ప్రతిపక్షాల బాధ్యత లేదు. అన్నాడిఎంకె అక్షరాలా తమ చేతుల్లోనే వుందని, అనుకుంటే ఆందోళన కట్టిపెడుతుందని వేరే చెప్పనవసరం లేదు. మరి ఆ ఒక్క ఆటంకాన్ని ప్రతిఫక్షాలన్నిటికీ ఆపాదించడమంటే వారే మొత్తం ప్రతిపక్షమని భావిస్తున్నారా ప్రధాని గారు?
నిజానికి పార్లమెంటు జరక్కుండా అడ్డుకోవడంలో ప్రతిష్టంభనను అస్త్రంగా కొనసాగించడంలో బిజెపి చరిత్ర చాలా దారుణంగా వుంది. 1990ల నుంచి ప్రధాన ప్రతిపక్షం వారే గనక చిన్న చిన్న సాకులతో ఆరోపణలతో వారు వారాల తరబడి సభను అడ్డుకునేవారు. ఉదాహరణకు యుపిఎ 1 హయాలంలో ఏడుసార్లు సభను జరగకుండా ఆపేశారు. కుంభకోణాలను సాకుగా చూపుతూ రోజుల తరబడి నిలిపేసేవారు. అప్పుడు మిగిలిన ప్రతిపక్షాలు కొంతైనా వాస్తవికంగా వెళదామని ప్రతిపాదిస్తే ససేమిరా అన్నారు.ఇప్పుడు రాజ్యసభ చైర్మన్‌గా వుండి సభ జరగలేదని రోజూ నిట్టూర్పులు విడిచే శ్రీమాన్‌ వెంకయ్యనాయుడు గారు అప్పట్లో అక్కడ సీనియర్‌ సభ్యుడుగా వుంటూనే సభను స్తంభింపచేయడం ఒక ప్రజాస్వామిక రూపమని సెలవిచ్చారు. 2012 సెప్టెంబరు 1న ఆయన మాట్లాడింది చూస్తే సభను జరక్కుండా చేయడం తప్పేనని ఒప్పుకుంటాను గాని అది ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుందన్నారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెంకయ్య కన్నా ముందే 2012 ఆగష్టులో ఒక పత్రికలో వ్యాసం రాస్తూ సభను అడ్డుకోవడం ద్వారా తాము ప్రజాస్వామ్య పరిరక్షణ సంకేతాలు పంపిస్తున్నామని ప్రవచించారు! మరో ఏడాది తర్వాత వీరిద్దరే సభలో ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం చర్చలో ప్రత్యేకహౌదాపై పోరాడి సాధించామన్నారు. అధికారంలోకి వచ్చాక దానికే పిండిపదానం చేశారు. ఇన్ని వికృత వాస్తవాలు విపరీత పోకడలు చరిత్రలో నమోదై వుంటే మోడీ అమిత్‌ షా జోడీ సభల స్తంభన సమయం గురించి గగ్గోలు పెట్టడం ఎదురుదాడికి అతి తెలివికి అద్బుత ఉదాహరణ అవుతుంది. ఏప్రిల్‌ 12వ తేదీని ఎంచుకోవడమంటే మరో రెండు రోజుల తర్వాత అంబేడ్కర్‌ జయంతినాడు ఎదురయ్యే నిజమైన నిరసనలపై ముందస్తు అస్త్రంగా చూడవలసి వస్తుంది. స్వంతపార్టీ ఎంపిలే దళిత సమస్యలపై ఆగ్రహంతో రగిలిపోతుండగా గోముఖ వ్యాఘ్రాల్లా ి గోసాయి చిట్కాలతో సరిపెట్టడం కుదరదు గాక కుదరదు. కదిలిపోతున్న మోడీత్వ పునాది నిలవనూ నిలవదు. ఒక్క పూట అన్నం మానేస్తే మరో పూట నాలుగు ముద్దలు కలిపి తినొచ్చునేమో గాని అంతకు మించిన ఫలమేమీ దక్కదు.
ఆనందం పేర అపహాస్యం
ఇక ఇప్పుడు మన మాన్య ముఖ్యమంత్రి విషయం. ఈవెంట్‌ మేనేజిమెంటులో మునిగితేలేచంద్రబాబు నాయుడు చాలా కాలంగా హ్యాపీ సండేస్‌ , స్ట్రెస్‌ బస్టింగ్‌ అంటూ సందేశాలిస్తున్నారు. రాజగురువులాటి జగ్గీ వాసుదేవ్‌తో కలసి ఆనంద నృత్యం చేయడం ఆయన పాత అలవాటే. వాసుదేవుల వారు కూడా కాలానుగుణమైన కదలికలతో కవళికలతో కథలూ కబుర్లతో ఆకట్టుకోగల ఆధ్మాత్మిక శేఖరుడు. కుబేరులూ ఘనాపాటీలను అలరించడంలో ఆరితేరిన వారు. స్టార్లతో సార్లతో మెట్ట వేదాంత విన్యాసాలు సాగిస్తుంటారు. చంద్రబాబు గారికి మొదటి నుంచి ప్రశాంతతా ప్రదాతగా వున్న వాసుదేవులు ఈ సంక్లిష్ట సన్నివేశంలో ప్రత్యక్షం కావడం సహజమే. నాలుగేళ్ల పాకేజీ భజన నుంచి సరికొత్తగా అందిపుచ్చుకున్న హౌదాస్మరణకు పరివర్తన చెందే సమయంలో ఎలాటి సందేహాలు సంధిగ్ధాలు ముఖ్యమంత్రిని పట్టిపీడించాయో తెలియదు గాని బాబాగారి సూక్తి సుధాకరం గ్రోలాలని నిర్ణయించుకున్నారు. ఆధ్యాత్మికత కన్నా ఆనందానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే వాసుదేవులు కటాక్షించారు. ఏతావాతా ఆనంద నగరాలపై వూకదంపుడు మొదలుపెట్టారు. అమరవతిని అంతర్జాతీయ ఆనందనగరం చేస్తామని ప్రకటించారు. ఆలూలేదు చూలూ లేదు అబ్బాయికి అమెరికా వీసా అన్నట్టు ఆంధ్రావని రాజధాని నగరమే అస్పష్ట ఘట్టంలో వుంటే ఆనంద తాండవాలేమిటి? ఇలాటి సందేహాలు అల్పజీవులకు సహజంగా వస్తాయని ఎరిగినవారై చంద్రబాబు గారు ఓ మాట చెప్పేశారు. మీరు సంతోషమెక్కడ అని వూరికే ఇదై పోకుండా ఇంట్లోకి వెళ్లి బిగ్గరగా మొత్తుకుంటు చాలా పిచ్చ హాపీ అయిపోతారని ఒక పరమ రహస్యం వెల్లడించారు. శంకర్‌దాదా ఎంబిబిఎస్‌లో లాఫింగ్‌ థెరిపీ కింద లింగం ప్రొఫెసర్‌ మింగాలేక కక్కాలేక రాని నవ్వుతెచ్చుకోవడానికి పడీపడీ దొర్లినట్టు చేయమనేశారు.అసలదంతాఎందుకు గాని మనం ఇప్పుడు చేస్తుంది రోజూ ఇంట్లోకెళ్లి జుట్టుపీక్కోవడం అరిచి గీపెట్టడం గాక మరేమిటి? ఆ మాటకొస్తే మోడీ మొండికేసి విడాకులిచ్చి తరిమేశాక అమరావతి ప్రభువు ఆక్రోశిస్తున్నదీ అదే కదా!
అంచేత అయ్యా ఇలాటి విష ఘడియల్లో శక్తికొద్ది లేదా అంతకు మించి అరచి గీపెట్టినా ఆనందం కలగదు సరికదా అభాసుపాలవడం తథ్యం. ఇప్పటికి జరిగిన అవమానాలు అపహాస్యాలు చాలక మళ్లీ ఈ ఆనంద ఫార్ములాలు అక్కర్లేదు గాక లేదు. ఇది ఆంధ్ర ప్రదేశ్‌లోఅక్కా చెల్లీ అన్నా తమ్ముడూ అమ్మా నాన్నా అవ్వా తాతలందరూ కలసి చేస్తున్న మనవి. అంతగా ఏదైనా చేతనైతే మోడీ సర్కారు వచ్చే నిధులకు కోత కోసినందుకు నిరసనగా రాష్ట్రాల వాణి వినిపించేందుకు కేరళ వామపక్ష ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నది మీరూ గొంతు కలపండి. ఆర్థిక శాఖలో ఆరితేరిన యనమల రామకృష్ణుల వారు అక్కడకువెళ్లి తెచ్చిన సందేశమేదో ఆలించి పాటించి నిధులు రాబట్టి విధులు నిర్వహించండి. లేదంటే మీరనే ఆనంద తాండవం వికటించి ఆగ్రహ జ్వాలలు వెలువడతాయి.

నిరంకుశంలో నిరశనలూ ఆక్రోశంలో ఆనందాలు ఆట్టే పనిచేయబోవని చంద్ర నరేంద్ర చంద్రులిద్దరూ గ్రహింతురు గాక. పువ్వయినా నవ్వయినా నీ కోసం పూయదు అని ఆత్రేయ గీతం ఆలకింతురు గాక. Prajasakti, April12,2018

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *