విశ్వాస సంక్షోభంలో విశాల చైతన్యం

భారతీయ జనతా పార్టీ వార్షికోత్సవ సందర్భంలో ఆ పార్టీ అద్యక్షుడు అమిత్‌ షా ప్రతిపక్షాలను కుక్కలు పిల్లులు పాములతో పోల్చారు. ఇలాటి జంతువులన్నీ వరద దెబ్బకు భయపడి చెట్టెక్కినట్టు ప్రధాని మోడీ దెబ్బకు భయపడి ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయని తిట్టిపోశారు. చాలా బుద్ధిశాలి గనక అమిత్‌ షా నక్కలు తోడేళ్ల వంటి పేర్లు ప్రతిపక్షాలకు కేటాయించకుండా తమకే అట్టిపెట్టుకున్నారన్నమాట. భయపడి పారిపోయింది ఎవరో భద్రతా రాహిత్యంలో కొట్టుమిట్టాడింది ఎవరో తాజాగా ముగిసిన పార్లమెంటు సమావేశాలు తెలియజెప్పాయి. అవిశ్వాస తీర్మానాన్ని ఆహ్వానిస్తున్నామంటూనే అనుమతించకుండా చర్చకు రాకుండా సభను చివరి రోజు వరకూ నడిపించిన తీరు ఇంత వరకూ స్వతంత్ర భారత చరిత్రలోనే ఎరుగని వైపరీత్యం. ఇదంతా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేక హౌదా సమస్య చుట్టూ పరిభ్రమించడం మరో విశేషం. పాలక బిజెపిని వారిని పక్కన పెడితే ఎపి తరపున లోక్‌సభలో వున్న టిడిపి వైసీపీ సభ్యులే గనక పేరు ప్రత్యేక హౌదా అయినా వారి వారి ఎజెండాల ప్రకారం ఈ తతంగం చాలా మలుపులు తిరిగింది. సభ నిరవధిక వాయిదా తర్వాత కూడా రకరకాల విన్యాసాలు సాగుతూనే వున్నాయి. ఎపి హౌదాకు తోడు ఎస్‌సిఎస్‌టి చట్టం తీర్పు, పిఎన్‌బి కుంభకోణం తదితర సమస్యలు ముందుకొచ్చాయి. అన్నిటిపైనా మోడీ ప్రభుత్వం ఏకపోంగా వ్యవహరించినందుకు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్షాలూ సభ బయిట నిరసన హారం కట్టాయి.అవిశ్వాసం నోటీసు మొదట ఇచ్చిన వైసీపీ, దాన్ని చర్చకు రాకుండా చేయడానికి సహకరించిన అన్నా డిఎంకె మాత్రమే ఈ హారంలో పాలుపంచుకోకపోవడం గమనార్హం. సభానంతరం వైసీపీ ఎంపిలు రాజీనామా చేసి ఎపి భవన్‌లో నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించారు. నాలుగేళ్లుగా ప్రభుత్వంలో కొనసాగిన టిడిపి ఎంపిలు సభ ముగిశాక ప్రధాని కూచునే ఖాళీ స్థానం దగ్గర తర్వాత స్పీకర్‌ కార్యాలయంలో నిరసన తెలిపి మార్షల్స్‌ తొలగింపునకు గురయ్యారు. పార్లమెంటు ప్రహసనం మధ్యలో ఢిల్లీ యాత్ర చేసి పాత పల్లవినే పదేపదే వినిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారందరినీ ఢిల్లీలోనే వుండమని ఆదేశించారట. తన ఢిల్లీ యాత్ర ఫలితాల కొనసాగింపుపై ఆయన అఖిలపక్షం ఏర్పాటు చేసి సమాచారం పంపగా దాదాపు అన్ని పార్టీలూ తిరస్కరించాయి. రాజకీయంగా తెలుగుదేశం కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నదనే సంకేతాలు రావడం పట్ల ఎపిసిపి ఆందోళన చెంది తమకు ఎలాటి పొత్తు వుండబోదని స్పష్టం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వైసీపీ నేతలు బిజెపితో కలసి పోతున్నారని చెప్పడానికి టిడిపి అనుకూల మీడియా కేంద్రీకరించి ప్రసారాలు చేస్తున్నది. ఈ పరస్పర ఆధిక్యతా సమరంలో పోటాపోటీ భాగోతాలలో ప్రత్యేక హౌదా లేదా నిధుల సాధన వంటివి కేవలం మంత్ర జపాలుగా మారిపోయాయంటే ఆశ్చర్యం లేదు. ఇన్ని వైరుధ్యాల మధ్యనా టిడిపి వైసీపీ పార్టీలు పవన్‌ కళ్యాణ్‌ జనసేనపై దాడి చేయడం ఉమ్మడి అంశం కావడం విచిత్రం. ఆ స్థాయిలో కమ్యూనిస్టులను అనడానికి సాహసించలేకపోయినా ఎంపి విజయసాయి రెడ్డి మాత్రం కమ్యూనిస్టు నాయకులేదో సంజాయిషీ చెప్పాలన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేశారు.

అదే బెంజి సర్కిల్‌లో…
ఇన్ని ప్రకంపనాల మధ్యన ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ప్రత్యేక హౌదా కోసం ప్రత్యక్ష పోరాటం ప్రారంభించేందుకు జనసేన సిపిఎం సిపిఐ కలసి ముందుకేయడం ఈ కాలంలో ఒక సంచలన పరిణామం. విభజనకు మొదట అంగీకరించి తర్వాత సంకల్ప యాత్రల వంటి సర్కారీ సంరంభాలు సాగించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేదికగా చేసుకున్న విజయవాడ బెంజి సర్కిల్‌ నిజమైన ఈ ప్రజా కదలికకు రంగస్థలం కావడం ప్రాధాన్యత గల విషయం. పవన్‌ కళ్యాణ్‌కున్న ప్రజాదరణకు తోడు ప్రత్కేకహౌదా సమస్యపై ప్రజల్లో రగులుతున్న ఆగ్రహావేదనలను కూడా ఈ సందర్భం ప్రతిబింబించింది. వాస్తవానికి ఈ పరిస్థితిని గుర్తించడం వల్లనే 2016 సెప్టెంబరులో ప్యాకేజికి స్వాగతం పలికిన చంద్రబాబు నాయుడు పల్లవి మార్చారు. అదే ఏడాది అక్టోబరులో రాజీనామాల గురించి మాట్లాడిన ప్రతిపక్ష నేత జగన్‌ ఇప్పుడు అమలు చేశారు. ఇద్దరు నేతలు ఇచ్చే వివరణ ఒక్కటే- 2018 చివరి బడ్జెట్‌ వరకూ నిరీక్షణ. జగన్‌ హౌదా కోసం నిరాహారదీక్షలు యువభేరీల వంటి కార్యక్రమాలు చేసిన మాట నిజమే. కాని రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాజకీయ సందేహాలకు కారణమైనారు. నంద్యాల ఉప ఎన్నికలో గాని లేదా తన సుదీర్ఘ పాదయాత్ర ప్రథమార్థంలో గాని హౌదాను ప్రధాన నినాదంగా తీసుకున్నది లేదు. దీనిపై ఈ రచయిత ఒక ముఖాముఖిలో ప్రశ్నించినపుడు ఎవరు హౌదా ఇస్తే వారికి మద్దతు అన్న మాట చెప్పారు. మొన్న మంగళవారంకూడా సాక్షిలో మా చర్చలో ఆ పార్టీ ఎంపి వరప్రసాద్‌ మాట్లాడుతూ చంద్రబాబు సరిగ్గా వ్యవహరించకపోవడం వల్లనే కేంద్రం హౌదా ఇవ్వలేదని విశ్లేషించారు. జగన్‌ తాజాగా నిర్వహించిన మీడియా గోష్టిలోనూ ఇదే ఆరోపణ. చంద్రబాబు ప్రభుత్వంపై తెలుగుదేశంపై విమర్శలు చేయొచ్చు గాని కేంద్రం నయవంచనను ముందు విమర్శించకపోతే విశ్వసనీయత ఎలా వస్తుంది? తాము ఇంత కాలం హౌదా సమస్యను సజీవంగా వుంచినందుకే చంద్రబాబు యు టర్న్‌ తీసుకున్నారని వైసీపీ చెబుతున్న మాట. అదే నిజమనుకున్నా ఇలాటి సమయంలో తాము బిజెపిపై మోడీ ప్రభుత్వంపై రాజకీయంగా దృఢ వైఖరి ప్రదర్శించలేకపోవడం టిడిపి వ్యూహాలకే అవకాశమిస్తున్న వాస్తవాన్ని కూడా ఒప్పుకోవలసి వుంటుంది.
ఢిల్లీ యాత్ర వైఫల్యం
ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన పేలవంగానే ముగిసిపోయింది. ఢిల్లీలోచక్రం తిప్పిన రోజుల గురించి ఆయన వందిమాగధులు ప్రచారం చేయడమే గాని అప్పటి వలె ఆయనకు అండగా నిలబడే హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ జ్యోతిబాసు వంటి దిగ్గజాలు లేరు. రెండుసార్లు లౌకిక శిబిరం నుంచి బిజెపికి మారడం ద్వారా విశ్వసనీయత దెబ్బతినిపోయింది. ఇప్పుడు ప్యాకేజీ విషయంలో చేసిన విన్యాసాలు మరింత విలువ తగ్గించాయి. నెల రోజులుగా అరిగిపోయిన రికార్డులాగా ఆయన ఒకే కథ వినిపిస్తున్నా వినేవారు లేకపోవడం స్వయం కృతాపరాధమే.ఇప్పుడు వైసీపీతో పాటు జనసేనను కూడా కలిపి విమర్శించడం ఎవరూ ఆమోదించలేకపోతున్నారు. లోకేశ్‌పై విమర్శ చేసే వరకూ పవన్‌ కళ్యాణ్‌ను ఎర్రతివాచీతో ఆహ్వానించిన వైనాలు గుర్తు చేస్తున్నారు. ఒకప్పుడు అమెరికా అద్యక్షుడు బుష్‌ మీరు ఉగ్రవాదులతో వున్నారా మాతోనా అని అడిగారు. ఇటీవలి వరకూ ప్రధాని మోడీ మీరు అభివృద్ధితో వున్నారా అని అవినీతితో వున్నారా అని అడిగేవారు. అలాగే చంద్రబాబు కూడా మీరు కేంద్రంతో వున్నారా ఆంధ్ర ప్రదేశ్‌తో వున్నారా అని ప్రశ్నించడం హాస్యాస్పదంగా మారింది. ఏమంటే మొన్నటి వరకూ కేంద్రంలో రాష్ట్రంలో వారే కలసి పాలించారు. పవన్‌ కళ్యాణ్‌ వారిని ఎన్నికల్లో బలపర్చి వుండొచ్చు గాని తర్వాత అధికార చట్రంలో భాగం కాలేదన్నది ఒక నిజం.

నూతన భూమిక
ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ అవకతవకలు అవినీతి అని బిజెపి ఆరోపిస్తున్నది. కాగ్‌ నివేదికలో అభిశంసనలు కూడా అందుకు నిదర్శనంగా చూపిస్తున్నది. రాష్ట్రం తప్పిదాలు నివేదికల సమస్య ఒకటైతే రాష్ట్రానికి రాజ్యాంగబద్దంగా ఇవ్వాల్సినవి నిరాకరించడం మరొకటి. ఈ రెంటినీ కలగాపులగం చేసి కొందరు బిజెపిని కొందరు టిడిపిని కాపాడాలని చూస్తున్నప్పుడు రెంటికీ అతీతంగా కమ్యూనిస్టులు జనసేన కలసి కదం తొక్కడం కొత్త చైతన్యం నింపింది. ఈ కొత్త శక్తులూ కదలికలూ మింగుడుపడని టీడీపీ వైసీపీ బీజెపిలు నానా రకాలుగా విషప్రచారాలు చేస్తున్నాయి. పవన్‌కు బిజెపికి ముడిపెట్టి మాట్లాడేవారు కొందరైతే కమ్యూనిస్టులు సీట్లకోసం ఆయనతో చేరారని ఆరోపించేవారు ఇంకొందరు. ఉద్యమాల వూసు లేకుండా ధనబలంతో కులమతాలతో రాజకీయాలు నడుపుతూ అధికారపీఠాలు కాపాడుకోవాలనుకునే వారి కుటిల ప్రచారాలకు ఎంత విలువ ఇవ్వాలో ప్రజలకు తెలుసు గనకే మూడు పార్టీల పిలుపుపై అంతగా స్పందించారు. వామపక్షాలకు విస్పష్టమైన విధానాలు కార్యాచరణ ఉద్యమాల వారసత్వం వుంది.వాటిని ఎప్పుడూప్రస్తావిస్తూ ఉద్యమాట పట్ల గౌరవం కనపరుస్తున్న పవన్‌ జనసేన సమిష్టి ఉద్యమాలకు కలసి రావడం విశ్వసనీయతా సంక్షోభం తాండవిస్తున్న వాతావరణంలో విశాల చైతన్యానికి సంకేతమవుతున్నది. దీన్ని మరింత ముందుకు తీసుకుపోగలిగితే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులకు వాతావరణానికి వూతం వస్తుంది. ప్రజలలో నెలకొన్న స్తబ్దతా వాతావరణం పటాపంచలవుతుంది. విభజనానంతరం మొదటి అయిదేళ్లు వివాదాలకు సరిపోయినా కనీసం భవిష్యత్తులోనైనా నిజమైన ప్రజానుకూల విధాన నమూనాను ప్రగతిశీల లౌకిక రాజకీయాలను ముందుకు తీసుకుపోయేందుకు భూమిక ఏర్పడుతుంది. అయితే అది నిర్దిష్ట నిర్మాణాత్మక రూపం తీసుకోవడానికి సమయం స్పష్టత రెండూ కావలసి వుంటుంది. (Prajaskti,8,4,18)

.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *