కేంద్రం భజన, ఉద్యమాల అవహేళన దారి తప్పిన ఆర్కే కొత్తపలుకులు

చచ్చినోడిపెళ్లికి వచ్చిందే కట్నం.. రెచ్చిపోయిననోరు తిట్టిందే తిట్టు. ఆంధ్రజ్యోతి అధినేత ఆర్కేకు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌ అంటే అంత అధ్వాన్నంగా హీనంగా కనిపించింది. ”..చచ్చినోడిపెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ప్రస్తుతానికి కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజిని తీసుకోవడం విజ్ఞత గల వారు చేయవలసిన పని”అని ఆయన ప్రవచిస్తున్న తాజా కొత్త పలుకు. ఇలాటి విజ్ఞత లేని అజ్ఞాని గనక గమ్యం ఏమిటో తెలియక పవన్‌ కళ్యాణ పోరాటం చేస్తామంటూ ప్రజాబలం లేని కమ్యూనిస్టులను పట్టుకుని వూరేగుతున్నారట. కమ్యూనిస్టులతో కలసి కొంతమంది వ్యక్తులు ప్రత్యేక హౌదా అని నినదిస్తే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ దాన్ని అందిపుచ్చుకున్నదట. వీరంతా కలసి ఒత్తిడి చేస్తే తెలుగుదేశం మోడీ ప్రభుత్వం నుంచి ఎన్‌డిఎ నుంచి బయిటకు వచ్చేసి అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైందట. ఇదంతా తట్టుకోలేక తల్లడిల్లిపోయి ఎవరు ఏం చేసినా ఆంధ్ర ప్రదేశ్‌కు మాత్రం ప్రత్యేక హౌదా రాదని శాశ్వత శాపం పెట్టేశారు. ఎన్‌డిఎ నుంచి టిడిపి వచ్చేసినా హౌదా రాలేదంటే ఒత్తిడి చేసిన మహానుభావులు ఏం జవాబు చెబుతారని సవాలు విసిరారు. హౌదా ఇవ్వని కేంద్ర బిజెపిని కలసి పాలన చేసిన టిడిపి ఫ్రభుత్వాన్ని వదలిపెట్టి మరెవరినో అడగడం కన్నా తలకిందులు తర్కం, తలబిరుసు భాష వుంటాయా?
ఉద్యమాలపై ఉక్రోషం
తన వ్యాసంలో పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాని అనీ, కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని పదే పదే ఇష్టానుసారం దూషణలకు పాల్పడిన ఈ మీడియాధినేత అక్కసుకు అంతే లేదు.ే నీతి నిజాయితీలూ నిబద్దత మృగ్యమై పోతున్న ఈ కాలంలో నిజంగా ప్రజల కోసం నిలబడతారనే విశ్వసనీతయ విలువ కమ్యూన్ణిస్టులకే వుంది గనకే అంత భయం. కమ్యూనిస్టుల ఓట్లు సీట్ల గురించిన అపహాస్యాలు కొత్తేమీ కాదు.కులాలు మతాలు ప్రాంతాల వారిగా పల్లవి మారుస్తూ పదవుల కోసం రంగులు మార్చేవారైతే కమ్యూనిస్టులు ఎన్నడో దేశాన్ని రాష్ట్రాలనూ కూడా పాలించుతుందేవారు. ప్రజల మధ్య వుండి పోరాడుతూ చైతన్యం పెంచాలని తప్ప రకరకాల పిల్లిమొగ్గలతో ప్రజలను వంచించాలని వారెప్పుడూ భావించలేదు. తమ అండదండలతో అధికారపీఠాలెక్కిన వారి నుంచికూడా అడ్డగోలు ప్రయోజనాలు ఆశించలేదు.కాంట్రాక్టులు వ్యాపార వాటాల కోసం ఎగబడలేదు.తుచ్చ ప్రయోజనాలు తృణప్రాయంగా చూసి విశాల ప్రజా రాశుల కోసం ఉద్యమించడమే ఆదర్శంగా ఆశయంగా పెట్టుకున్నారు. పైరవీలకు పాలక పక్షాలను గుర్తు చేసుకుంటారేమో గాని సమస్యలొస్తే ప్రజలు కమ్యూనిస్టులనే అనుకుంటారు. రాజకీయాలు, మీడియా వ్యవహారాలు కూడా బేహారుల బేరసారాలుగా మారిపోయినా, ఈ కారణంగా ఎదురుదెబ్బలు తగిలినా కమ్యూనిస్టులు పోరాటశీలులుగాే నిలిచారు. హౌదా సమితికి తోడు సిపిఎం సిపిఐ గట్టిగా రంగంలోకి దిగాక హౌదా సమస్యను దాటవేయడం సాధ్యం కాదని అర్థమైంది గనకే ప్రధాన పార్టీలన్నీ వారి ఎజెండా ప్రకారం నడవాల్సి వచ్చింది. అదే ఆర్కే అక్రోశం.

విమర్శిస్తే విద్రోహులు
ఈ పోరాటాలు రాజకీయ విలువల పట్ల గౌరవం నమ్మకం వున్నాయి గనకనే జనసేనాధినేత పవన్‌ కళ్యాణ్‌ కమ్యూనిస్టులతో కలసి హౌదా పోరాటం సాగిస్తామని ప్రకటించారు. పదవులు లేకున్నా ప్రజల కోసం పోరాడే వారి విశిష్టత గురించి ఆయన ఎప్పుడూ చెబుతూనే వున్నారు. టిడిపి నేతల్లా ఆఖరి వరకూ బిజెపిని అంటిపెట్టుకుని వుండి చివరలో ఫిరాయించిన వ్యక్తి కాదు పవన్‌. అప్పటి అవగాహనతో ఎన్నికల్లో టిడిపి బిజెపి కూటమిని బలపర్చినా పదవులకోసం ప్రయోజనాల కోసం పాకులాడిన దాఖలాలు లేవు. మధు వంటి వారు ప్రత్యక్షంగా వుండి నడిపిస్తున్న ప్రజా పోరాటాలకు పవన్‌ మద్దతు ప్రకటించారు.కొన్నిచోట్ల పర్యటించారు. దాంతో కంగుతిన్న చంద్రబాబు నాయుడు పవన్‌ తమతో వుంటాడనుకుని వున్నాడని నమ్మించడం కోసం ఎర్రతివాచీ పరిచి ఆహ్వానించి అమిత స్పందన చూపించారు. అదే వ్యక్తి తన ప్రభుత్వంపై, మంత్రులపై విమర్శలు చేయగానే విద్రోహ ముద్ర వేశారు. ఒకప్పుడు పవన్‌ ఆంధ్రజ్యోతిపై ఆరోపణలుచేస్తే ఆర్కే సమాధానం ఇచ్చి వుండొచ్చు. కాని ఇప్పుడు నిష్కారణంగా ్ల అజ్ఞాని అని చులకన చేయడం ఎంతటి మహాజ్ఞానులకైనా తగనిపని. మీడియాను నడిపించేవారెవరికైనా ఒకింత నమ్రత వాస్తవికత వుండాలి తప్ప జ్ఞానంతమ గుత్తసొమ్ము కాదు. అన్నీ తెలిసిన వారూ ఏదీ తెలియని వారు ఎవరూ వుండరని సామెత. సిపిఎం వైసీపీతో పొత్తుకు సిద్ధంగా వుందని కొండంత కట్టుకథ వదలడంలోనూ దుర్బుద్ధి కనిపిస్తూనే వుంది. తెలుగుదేశం ఇప్పటివరకూ బిజెపితో కలసి వుంటే ఇప్పుడు వైసీపీ దోబూచులాడుతున్నదని జనసేన కమ్యూనిస్టుల సంయుక్త ప్రకటన స్పష్టంగా పేర్కొంది.
ప్యాకేజీ భజనలో పరవశం
ఇలా పవన్‌నూ కమ్యూనిస్టులనూ ఆడిపోసుకున్న నోటితోనే ఆర్కే కేంద్రానికి వంతపాడటం మరో విపరీతం. రాజును మించిన రాజభక్తి అన్నట్టు బాబును మించిన వీరభక్తితో ఆర్కే కేంద్ర ప్యాకేజి గురించి పలవరిస్తున్నారు.అప్పట్లోనూ ఆర్కే ఇలాగే రాస్తే నేను ‘ప్రత్కేక వంచనకు కొత్తపలుకుల వంత’ అని ఆక్షేపించడం చర్చనీయమైంది. నమో ప్యాకేజీ నమో స్తుతే అంటూ చంద్రబాబు సర్కారు చాలా కాలం భజనచేసింది.ి చివరకు హళ్లికి హళ్లి సున్నకు సున్నగా హౌదా ప్యాకేజీ రెండూ బూటకమని తెలిసి తెల్లమొహం వేసింది. తాము బిజెపిని నమ్మి రాష్ట్ర ప్రజలను కూడా నమ్మించి మోసపోయామని పల్లవి పట్టుకుంది. కొత్త పలుకుల వ్యాఖ్యాతకు ఇంకా ఆ మాత్రం జ్ఞానోదయం కాలేదు. ఇంతగా పోరాడుతున్న ఎపిని చచ్చినోడితో పోలుస్తూ వచ్చిందే కట్నంలాగా కేంద్రం విదిలించిందే కళ్లకు అద్దుకోమని సలహా ఇస్తున్నారు. పైగా ఎవరైనా ఇంకా హౌదాకోసం పట్టుపట్టడమంటే రాష్ట్రానికి ద్రోహం చేయడమేనని కూడా శాపనార్థాలు పెడుతున్నారు.టిడిపి ఎలాగోలా బిజెపితో సర్దుకోవాలని బాహాటంగా సలహాలివ్వడంలో మతలబులేమిటో ఆయనకే తెలియాలి. ‘ఆంధ్ర ప్రదేశ్‌లో ఎవరు ఎవరితో లాలూచీ పడుతున్నారో ఎవరికీ తెలియని స్థితి’ అంటున్న ఆర్కే ఆ వ్యాఖ్యలు అందరికీ వర్తిస్తాయని ఒప్పుకోవాలి. ఆ మాటకొస్తే ఆంధ్ర తెలంగాణ రెంటిలోనూ పబ్బం గడుపుకొంటున్న ప్రబుద్ధులెవరో ఎందరో కూడా ప్రజలకు తెలుసు.. ఇప్పటికీ కేంద్రం ప్యాకేజీ ఇస్తున్నా టిడిపి తీసుకోవడం లేదని చెప్పడానికి ఆర్కే దగ్గర ఆధారాలున్నాయా? హౌదా కావలసిందేనని చెబుతున్న చంద్రబాబు కూడా ద్రోహం చేస్తున్నాడని ఆయన అనుకుంటున్నారా? అలాగాక ప్యాకేజిని టిడిపిని ఒప్పించే పనిలో వున్నారా? కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన వాటిపై జెఎప్‌సి నివేదిక తర్వాత పవన్‌ కళ్యాణ్‌ హౌదా కార్యాచరణకై కమ్యూన్ణిస్టులతోకలసి పోరాట ప్రకటన చేశారు. మరోవైపు లోక్‌సత్తా జెపి మరో కమిటీ వేసి హౌదా కోసం పట్టుపట్టడం కంటే వాస్తవికమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలని సూక్తులు చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే ప్రజా ఉద్యమాన్ని పక్కదోవపట్టించే పథకమేదో నెడుస్తుందని భావించాల్సి వస్తుంది.
మోడీ మెడ వంచేలా…
”కేంద్రం మెడలు వంచైనా సరే హౌదా సాధిస్తామని చెబుతున్న సిపిఎం నాయకుడు మధు వంటివారిని నరేంద్ర మోడీ మెడ ఎలా వంచుతారో చెప్పమని ప్రజలు నిలదీయాలి” అని పిలుపునిస్తున్న రచయిత చరిత్ర జ్ఞానానికి విచారపడాలి. కేంద్రంలో రాష్ట్రాలలోనే గాక అంతర్జాతీయంగా కూడా హిట్లర్‌ వంటి వారు కూడా చరిత్రలో కలసిపోయారు. ప్రజల ధాటికి మట్టిగరచిన మహాఘనులెందరో వున్నారు. కమ్యూనిస్టులనూ వారిని గౌరవించే పవన్‌ కళ్యాణ్‌ వంటివారిని ఏ ప్రజా ఉద్యమాలు చేస్తున్నందుకు గాను ఆర్కే ఆక్షేపిస్తున్నారో ఆ ఉద్యమాలే అందరికీ కళ్లు తెరిపిస్తాయి. దిమ్మదిరిగే పాఠం నేర్పిస్తాయి. ఇప్పటికే మోడీకి ఎదురుగాలి మొదలైంది. ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతిలోనే దీనిపై పెద్ద విశ్లేషణ నడుస్తుంది గనక ఒకసారి చూసుకోవచ్చు. కమ్యూనిస్టులు నిజంగా అంత అనామకులై పోయారనుకుంటే వారి పోరాటాలకు వారిని వదిలేసి తాము హాయిగా నమో భజన చేసుకోనూవచ్చు. అంతేగాని బిజెపి నయవంచనకు గురైన రాష్ట్రాన్ని ప్రజలనూ తూలనాడటం తగనిపని. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకునే దుర్గతి ఎపికి లేదు. దగాకోరురాజకీయ నేతలనూ దళారులనూ చావుదెబ్బ కొట్టి రాజ్యాంగ బద్దంగా రావలసినవి సాధించుకోగల చైతన్యం సమరశీలత వారికి పుష్కలంగా వున్నాయి. వారిని పోరాట పథంలో నడిపించేందుకు కమ్యూనిస్టులూ జనసేన ఇతర ఉద్యమ సంస్థలూ వున్నాయి. ఇంత జరిగిన తర్వాత కేంద్రాన్నినమ్మేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలు ఆయన అనుకుంటున్నట్టు చేవ చచ్చిన వారు కాదు,చైతన్యం మూర్తులు. ఢిల్లీ మెడలు వంచి ఎన్నో కీలక విజయాలు సాధించిన చరిత్ర తెలుగు ప్రజలకు వుంది. ఆ చైతన్య పున: ప్రజ్వలనఘట్టం ఇది.దగాకోరు నేతలకూ అవాస్తవ రాతలకూ అదే సమాధానం.  (prajasakti,3,4,18)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *