‘ప్రత్యేక’ రాజకీయంలో పార్టీల పిల్లిమొగ్గలు

తమ అవసరాలకు తక్షణ ప్రయోజనాలకు అనుగుణంగా పాలక పార్టీలు ఎన్ని పిల్లిమొగ్గలు వేస్తాయో, ఎలాటి రాజకీయ విన్యాసాలు చేస్తాయో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేక హౌదాపై నడుస్తున్న నాటకాలు నిరూపిస్తాయి. విభజిత రాష్ట్రావిర్భావం ముందునుంచి వున్న అంశంపై నాలుగేళ్లు గడవనిచ్చి ఇప్పుడు హఠాత్తుగా జ్ఞానోదయమైనట్టు హడావుడి చేస్తుంటే విస్తుపోవడం ప్రజల వంతవుతున్నది.ి విభజన తతంగానికి ఆధ్వర్యం వహించిన కాంగ్రెస్‌ వారినుంచి ప్రత్యేక హౌదా సాధించామని చెప్పుకున్న బిజెపి తానే అధికారంలో వుండి దానికి పూర్తిగా మంగళం పాడేసింది.(హౌదా కృష్ణార్పణం, ప్యాకేజీకి పిండ ప్రదానం అని అప్పట్లో నేను ప్రజాశక్తిలో వ్యాసం రాశాను) అదంతా జరుగుతున్నా అభివృద్ధి కోసమే బిజెపితో జట్టుకట్టానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ఏడాదిలో ఎక్కడ లేని ఆవేదన ప్రదర్శిస్తూనే ఎన్‌డిఎలో కొనసాగుతున్నారు. ఆయన అనుచర గణం ఆవే మాటలే ప్రతిధ్వనిస్తూ రాజకీయాలు రసవత్తరం చేస్తున్నారు. వారి మాటలను ఖండించే పేరిట బిజెపి పెద్దలు వున్నవీ లేనివీ కలిపి వూదరకొడుతున్నారు. వీరిద్దరి మధ్య- తానే ప్రత్యేక హౌదా ఉద్యమాన్ని బతికించానంటున్న ప్రతిపక్ష వైసీపీ నేత జగన్‌ అవిశ్వాస తీర్మానమే బ్రహ్మాస్త్రమైనట్టు భ్రమ పెడుతున్నారు. ఇక జెఎఫ్‌సి పేరిట బోలెడు లెక్కల కసరత్తు చేసి పాత విషయాలే పాక్షికంగా పున: ప్రకటించిన జనసేన పవనన కళ్యాణ్‌ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడానికి ఆపసోపాలు పడుతున్నారు. ఈ మధ్యలో కాంగ్రెసన అద్యక్షుడు రాహుల్‌ గాంధీ తాము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఎపి ప్రత్యేక హౌదాపైనే అని ప్రకటించి గతంలో తప్పును సవరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమస్యను నిజంగా సజీవంగా వుంచి వీరందరినీ దారికి తెచ్చిన వామపక్షాలు ప్రత్యేక హౌదా సాధన సమితి ఇతర ప్రజా సంఘాలు ఢిల్లీ నుంచి విజయవాడ వరకూ ప్రతిచోటా నిరసన హౌరెత్తిస్తున్నాయి. ముగిసిపోయిందన్న ప్రత్యేక హౌదా అధ్యాయం పున: ప్రారంభానికి మూలకారణం నిజానికి ఈ ప్రజా ఉద్యమాలే. మీడియా సంస్థలు ఎక్కడికక్కడ ఈ సమస్యపై చర్చలు ఏర్పాటు చేయడం కూడా వూపు పెంచింది.2018 బడ్జెట్‌లో ఈ విషయమై ఏమీ చెప్పకుండా ఇంతటి కదలికకు కారణమైన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాత్రం సెంటిమెంట్లతో నిధులు రావని ప్రవచిస్తున్నారు. హౌదా అనేది కమిట్‌మెంట్‌ తప్ప సెంటిమెంటు కాదు.
తెలుగుదేశం ఆఖరి పాచిక
అరుణ్‌జైటఆదినుంచీ అదనంగా పైసా లేదు పొమ్మంటుంటే ముఖ్యమంత్రి అందని కేంద్రం సహాయాన్ని కీర్తిస్తూ సన్మానాలూ తీర్మానాలు చేశారు. అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చంద్రబాబూ పరస్పరం పొగుడుకున్నారు. ప్రతిపక్షాలూ పరిశీలకులూ చాలాసార్లు విమర్శిస్తుంటే, చర్చల్లో చెబుతుంటే నెగిటివ్‌ మైండ్‌ అన్నారు. . ఇప్పటిదాకా అడుక్కున్నాం ఇక ఒత్తిడి చేస్తామని గొప్పగా చెప్పినా ఇంకా వేడుకోలు రాగాలే ఆలపిస్తున్నారు.ఆఖరి ఘట్టంలో అనివార్యంగా మోడీ ప్రభుత్వం నుంచి నిష్క్రమించినా ఎన్‌డిఎను అంటిపెట్టుకునే వున్నారు తమకు నేరుగా ఆర్థిక రాజకీయ లాభం రాని చోటకు వనరులు తరలించడం బిజెపి విధానమే కాదు.మిత్రపక్షాలను మింగడం బిజెపి వారికి వెన్నతో పెట్టిన విద్య అని మహారాష్ట్ర, హర్యానా, అస్సాం,తాజాగా నాగా మిజో అనుభవాలు చెబుతున్నాయి. అయినా విభజిత రాష్ట్రానికి విదిలింపులే ప్రసాదం అంటూ అంటకాగిన తెలుగుదేశం ఆలస్యంగా బయిటకు రావడంలోనూ రాజకీయాలూ వున్నాయి.ి గతంలో వారు అంగీకరించి ఆకాశానికెత్తిన ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడేందుకు సిద్ధమై కేంద్రంచివరి నిముషంలో ఆహ్వానించినా ససేమిరా కాదనడంలోనే ఆ రాజకీయం వుంది. ఈ దశలో పత్యేక హౌదా అనకపోతే ప్రజలు సహించేప్రసక్తి లేదని తెలిశాకే అడ్డం తిరిగారు తప్ప విధానపరమైన వ్యత్యాసాలతో కాదు. తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన వారు అమరావతిలోనూ డిల్లీలోనూ మాట్లాడింది చూస్తే పరస్పరం ఎంతగా పెనవేసుకుపోయారో అర్థమవుతుంది. అయినా టిడిపి అనుకూల మీడియా ఏదో మహా సమరం సాగుతున్నట్టు చిత్రిస్తున్నది.
వైసీపీ మల్లగుల్లాలు
ఇక జగన్‌ ఎన్‌డిఎ నుంచి తెలుగుదేశం నిష్ట్రమిస్తే పరోక్షంగా ో తాను బిజెపి మైత్రిలో ప్రవేశిద్దామని ఆలోచిస్తున్నారు. అంతకుమించి అడుగేయడానికి సిద్దంగా లేరు. ప్రత్యేక హౌదా కోసం పోరాడేది మేమేననడం తప్ప ప్రధాన ప్రతిపక్షంగా తన పాదయాత్రలో దాన్ని వినిపించిన సందర్భం లేదు. పైగాహౌదానూ నిధులనూ కూడా నిరాకరించే కేంద్రాన్ని నేరుగా అనకుండా చంద్రబాబుపై విమర్శలకే ప్రాధాన్యత నిస్తున్నారు. తెలుగుదేశం తన తప్పులు కేంద్రం ఖాతాలో వేస్తున్నదనీ, చాలా డబ్బులు వచ్చినా లెక్కలు చెప్పలేదని బిజెపి వాదనలే వినిపిస్తున్నారు. జగన్‌ టీవీ ఛానళ్లలో మాట్లాడిన నిడివి గాని లేక సాక్షి లో వచ్చిన నివేదికలు గాని పరిశీలిస్తే మోడీపై లేక మంత్రి జైట్లీపై నేరుగా విమర్శలు కనిపించవు.ే టిడిపిని మాత్రం చీల్చిచెండాడుతుంటారు. అందుకు అభ్యంతరం లేదు గాని ఆ పేరిట కేంద్రాన్ని వదిలేయడం ఎలా సాధ్యం? ఏం న్యాయం? అవిశ్వ్ణాస మంత్రం కూడా పవన్‌ కళ్యాణ్‌ సవాలు తర్వాతే జగన్‌ చేపట్టారు. టిడిపి కూడా కలసి రావాలని అడుగుతున్నారు ఉభయులూ కలసి 25 అయినా అవసరమైన దానిలోసగమే వుంటారు. ఇప్పటికీ కేంద్రంలో భాగస్వామిగా వున్న టిడిపి అవిశ్వాసం పెడుతుందని ఎలా అనుకోవడం? అవిశ్వాసం నోటీసు ఇచ్చినా ఫలితం వుండదనేది ఒకటైతే అసలు ఆ నోటీసు ఆమోదించేందుకే బలం లేనప్పుడు ఇంకా దాన్ని గొప్పగా చెప్పుకోవడం ఏం లాభం? రాజీనామాల విషయంలోనూ వైసీపీ ప్రతిపాదనను మంత్రుల రాజీనామాల రూపంలో టిడిపి ముందే అమలు చేసేసింది. ఇంతకాలం కేంద్రంలో వున్న తెలుగుదేశం ఇప్పుడు విడగొట్టుకోవడంలోనూ ముందుండే వ్యూహం అమలు చేస్తే రకరకాల వాదనలతో ప్రతిపక్షం వెనకబడి పోవడం విచిత్రం. విశ్వసనీయతకు పరీక్ష
ప్రభుత్వ ప్రధాన ప్రతిపక్ష నేతలు కేంద్రం విషయంలో ఇంతగా తటపటాయించడానికి కారణం వారిపై వున్నరకరకాల కేసులూ తిరకాసులేనన్న అభిప్రాయం వుంది. కక్ష సాధింపునకు మారుపేరైన బిజెపి కేంద్రం ఆ విధంగా వారిని లోబర్చుకుంది. మనుగడ కోసం మాట్లాడుతూనే మోడీకి కోపం రాకుండా ఉభయ పక్షాలూ జాగ్రత్త పడుతుంటాయి. రెండు పార్టీలూ ఎందుకో కేంద్రానికి భయపడుతున్నాయని పవన్‌ కళ్యాణ్‌ కూడా అననే అన్నారు. పైగా తనను కూడా లొంగదీసుకోవడానికి ఐటి కత్తిని చూపించి భయపెట్టినట్టు మొదటిసారి వెల్లడించారు. టిడిపి బిజెపి ఇద్దరితో కలసి ఎన్నికల ప్రచారం చేసి విజయానికి దోహదపడిన జనసేనాధిపతి కొందరు మాజీ ఐఎఎస్‌ల సహాయంతో ఏవో లెక్కల కసరత్తులు ప్రకటించారు గాని భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నదీ తెలియదు.

పవన్‌ కళ్యాణ్‌ పాట్లు
ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలంటూ అవహేళన చేసిన పవన్‌ వాటిపై జెఎఫ్‌సి వేసి మరీ అధ్యయనం చేయించారు! అయితే ఈ క్రమంలో అచ్చంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన లెక్కలపైనే ఆధారపడ్డారన్నది కూడా నిజం. కేంద్రానికి రాష్ట్రం లెక్కలు చెప్పవలసిన అవసరం లేదని మొదట ప్రకటించి తర్వాత సర్దుకున్నారు. ఇంత చేసినా పవన్‌ వ్యూహంపై ఎవరికీ స్పష్టత లేదు-ఆయనతో సహా! ఈ అస్పష్టతను కొనసాగించడం కూడా ఒక వ్యూహమే. అన్ని అవకాశాలూ అట్టిపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సహా రకరకాల రాజకీయ వేదికల గురించి మాట్లాడుతున్నారు.
కొత్త కదలికలు
ఈ పూర్వరంగంలో కాంగ్రెస్‌ తను చొరవ తీసుకున్నట్టు చెబుతున్నది. కొంత ఆందోళన చేస్తున్నది లోక్‌సభలో రాజ్యసభలో వారు పూర్తిగా పాల్గొంటే ఈ సమస్య రాష్ట్ర సమస్య గాక జాతీయ సమస్య అవుతుంది. గతంలో వీరప్ప మొయిలీ ప్రత్యేక హౌదాకు అభ్యంతరం చెప్పారు గనక తాము దాన్ని ఏ మాత్రం ఆమోదించినా కర్ణాటకలో బెడిసికొడుతుందని బిజెపి కాంగ్రెస్‌ రెండూ భావిస్తున్నాయి.రాహుల్‌ గాంధీ మొదటి సంతకం రాజకీయ ప్రకటన తప్ప తక్షణ వ్యవహారం కాదు. అయినా ఆ ప్రకటనను చంద్రబాబు జగన్‌ పవన్‌ ముగ్గురూ ప్రస్తావించారు. బిజెపితో పూర్తిగా తెగతెంపులైతే కాంగ్రెస్‌కు దగ్గరగా వ్యవహరించేందుకు టిడిపికి అభ్యంతరం వుండదని వారికి సన్నిహితంగా వుండే ప్రముఖులొకరు నాతో అన్నారు. ఎపిలో వైసీపీ ప్రధాన ప్రతిపక్షం గనక కాంగ్రెస్‌ తమకు ఉపయోగపడొచ్చనే వాదన ఒకటి టిడిపిలో వుంది.( తెలంగాణలోనూ పరోక్షంగా కలవొచ్చంటారు.) ప్రత్యేక హౌదా ఎవరు ఇస్తే వారికి మద్దతు ఇస్తామని చెప్పడం కాంగ్రెస్‌కూ వర్తిస్తుందని వైసీపీ వారి వివరణ. ఇలా రాష్ట్ర రాజకీయం కప్పల తక్కెడగా మారిపోయిందంటే అందుకు కారణం అన్ని రకాల అవకాశవాదాలే. ఈ అవకాశ వాదంలో ఎ వరి లొసుగులు వారు దాచుకుని అవతలివారిపై విరుచుకుపడుతున్నారు. ఇంతకాలం కలసి వుండి ఇప్పుడు పరస్పరం తిట్టుకున్నంత మాత్రాన బిజెపి టిడిపిల ఉమ్మడి బాధ్యత ఎక్కడికి పోదు. పార్టీలుగా వాటి సంబంధాలు సంఘర్షణలూ ఎలా వున్నా కేంద్ర రాష్ట్రాల మధ్య రాజ్యాంగ సంబంధమైన బాధ్యతలు దాటేసే పరిస్థితి అనుమతించలేము. ప్రతి చోటా బిజెపి నేతకూ రాష్ట్రం లెక్కలు ఇవ్వాలనే వాదన సరికాదు. కేంద్రం కావాలంటే తన మార్గాల్లో తను తెప్పించుకోవచ్చు. పోలవరం నిర్మాణం కేంద్రం నుంచి వెంటబడిమరీ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వారి ఆజమాయిషీలో జరుగుతుందని అంగీకరించి వుంది గనక ఇప్పుడైనా లోబడే చేయవలసి వుంటుంది. ఈ ఉభయులూ కలసి కూడా సహాయ పునరావాస సమస్యలు దాటేస్తున్నారన్నది ఆందోళన కలిగించే అంశం.రెవెన్యూ లోటు ఇప్పటికీ తేల్చలేకపోయినట్టు కేంద్ర రాష్ట్రాలు రెండూ ఒప్పుకోవడం దివాళా కోరుతనం. ఇక మరో పాతికేళ్ల తర్వాత ఇచ్చేపద్దులు కూడా కలిపి లక్షన్నర కోట్ల మేరకు నిధులు తరలించినట్టు బిజెపి వల్లించే జాబితాలు హాస్యాసపదమైనవి. రాష్ట్రం నుంచి కూడా పన్ను వసూలు వాటాలు వెళ్తుండగా అంతా తామే దానగుణంతో గుమ్మరించినట్టు చెప్పడం అవమానకరం. విభజన తప్పిదాలలో కాంగ్రెస్‌ బిజెపిలకూ ఒక మేరకు టిడిపికి కూడా వాటా వుంది. వైసీపీ అప్పుడూ ఇప్పుడూ గోడమీద పిల్లివాటమే. ఇలాటి ధోరణుల వల్ల ఇప్పటికే కావలసినంత నష్టపోయిన ఎపిని ఇంకా తమ రాజకీయ క్రీడకు రంగస్థలంగా చేసుకోవడం దారుణం. ప్రజలు ఆమోదించని విషయం. (ప్రజాశక్తి, 10-3-18)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *