జగన్‌ రాజీనామాస్త్రంతో కొత్త మలుపు

గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కేంద్ర వైఖరిపై సాగుతున్నఆందోళన వైసిపి రాజీనామా ఎజెండాతో కొత్త మలుపు తిరిగింది. జగన్‌ కీలకమైన సమయంలో చేసిన ఈ ప్రకటన తర్వాత వైసీపిని రాజకీయంగా విమర్శించే తెలుగుదేశం ఇరకాటంలో పడకతప్పదు. వాస్తవానికి 2016 అక్టోబరు 25న కర్నూలులో యువభేరి సమావేశంలో జగన్‌ ఈ ప్రకటన చేసినప్పుడే నేను దాని ప్రాధాన్యతపై వ్యాఖ్యానించాను.ఇప్పటికీ నా వెబ్‌సైట్‌లో పాపులర్‌ పోస్టు కింద అది వుంటున్నది. ప్రత్యేక హౌదా ఇవ్వకపోతే రాజీనామా అన్న ప్రకటనను వైసీపీ 2017లో అమలు చేయలేదని టిడిపి ఎప్పుడూ దెప్పిపొడుస్తుంటుంది. వాస్తవానికి బిజెపితో కలసి పాలనే చేస్తున్న టిడిపికి ఆ విమర్శ చేసే రాజకీయ హక్కు వుందనిచెప్పలేము గాని దాడి సహజమే. ఇటీవల ఆరుణ్‌జైట్లీ బడ్జెట్‌పై టిడిపి నిరనస ప్రహసనం ఒకవైపు, కేంద్రాన్ని ఉపేక్షించే వైసీపీ నేత మౌనం మరోవైపు నాలాటి వారి విమర్శకు గురైనాయి. తాజాగా జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌ రంగ ప్రవేశం జెపి ఉండవల్లి .సిపిఐ రామకృష్ణ వంటివారితో కలసి ఎపి కోర్కెలపై అధ్యయనం ఉమ్మడి సమావేశం వంటివి వూపందుకున్నాక జగన్‌ వ్యూహం మార్చుకోవలసి వచ్చింది. 16వ తేదీన విజయవాడలో తలపెట్టిన ఉమ్మడి సమావేశానికి సభలో ప్రాతినిధ్యం లేని పార్టీలనే పిలుస్తామని వారు ప్రకటించారు.టిడిపి వారు ఎంపి గల్లా జయదేవ్‌ను వూరేగిస్తూ తమ వ్యూహం అమలు చేస్తున్నారు. ఇలాటితరుణంలో ప్రధాన ప్రతిపక్షం కూడా వ్యూహానికి పదును పెట్టి రాజీనామాస్త్రాన్ని బయిటకు తీసింది. బడ్జెట్‌ సమావేశాలలో ప్రత్యేక హౌదా ప్రకటించకపోతే ఏప్రిల్‌ 6న రాజీనామా ఇస్తామన్న జగన్‌ ప్రకటన ఒక సంచలనమే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చాలాసార్లు ఈ రాజీనామాల రాజకీయం చూశాం. ఇప్పుడు కూడా వైసీపీ రాజీనామా చేసినా స్పీకర్‌ వెంటనే ఆమోదించకపోవచ్చు.కాలయాపన జరగొచ్చు.కాని వారు నిఖార్సుగా నిలబడినట్టు అవుతుంది.టిడిపి నుంచి చొరవ తమ చేతుల్లోకి లాక్కనే అవకాశం కలుగుతుంది. తర్వాతి పరిణామాలు ప్రజల స్పందనపై ఆధారపడి వుంటాయి.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *