మోడీజీ! చరిత్ర సరే, చేసిందేమిటి?

చరిత్ర అడక్కు చెప్పింది విను అన్నట్టు ప్రధాని మోడీపార్లమెంటు ప్రసంగంలో రామాయణం ధారావాహిక నుంచి దేశ చరిత్ర వరకూ ఏకరువు పెట్టారు. కాని ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హౌదాతో సహా ఇచ్చిన హామీలపై నిర్దిష్టంగా ఒక్క ముక్కయినా చెప్పలేదు. తెలుగు రాష్ట్రాల విభజన హామీల గురించి అడుగుతుంటే దేశ విభజన గురించి మాట్లాడటం ఎంత అసందర్భమో అవకాశవాదమో చెప్పనవసరం లేదు. అత్యున్నత అధికార పీఠం నుంచి అలాటి మాటలు వూహించలేము కూడా.ఆఖరి పూర్తి బడ్జెట్‌లో అన్యాయమే మిగిలిందని ఆగ్రహావేదనలకు గురవుతున్న ఎపి ప్రజల ఘోషను పట్టించుకోకుండా రాజకీయ పరిభాషలో అంటే కాంగ్రెస్‌ వర్సెస్‌ బిజెపి అన్నట్టే మాట్టాడారు.రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలూ కేంద్రాన్ని వదలిపెట్టి వైసీపీ వర్సెస్‌ టీడీపీ క్రీడనే సాగిస్తున్నాయి. కెవిపి రామచంద్రరావు వంటి కాంగ్రెస్‌ సభ్యులు ప్లకార్డుల నిరసన తెల్పుతున్నా జాతీయ óనేతలు అతిరథ మహారథులు మాత్రం నోరు మెదపడం లేదు. ఇలా హేమాహేమీలంతా రాజకీయ వ్యూహాత్మక స్పందనలకు పరిమితమైన వేళ ఉనికి లేనివిగా హేళన చేయబడే వామపక్షాలు ఎపి బంద్‌కు పిలుపివ్వడం ఒక చారిత్రిక సన్నివేశం. దానికి బిజెపియేతర పక్షాలు మద్దతు చెప్పక తప్పని స్థితీ. బళ్లు బస్సులు ఉపసంహరించినప్రభుత్వం పార్టీ కూడా ఆందోళన తతంగం నడిపించింది. ప్రతిపక్ష నేత జగన్‌ పాదయాత్ర విరమించి సంఘీభావం ప్రకటించారు. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ బంద్‌ల పట్ల తన వైముఖ్యాన్ని ప్రకటిస్తూనే బలపరుస్తున్నట్టు ప్రకటించారు. టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత జితేందర్‌ రెడ్డి కూడా ఎపి కోర్కెలకు మద్దతు తెల్పడం మరో విశేషం. నీలం సంజీవరెడ్డిని అంజయ్యను అవమానించడం సరే ఎపి ముఖ్యమంత్రికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండామీరెంత అవమానించారన్నది వర్తమానం. ఆ మాటకొస్తే హైదరాబాద్‌ వచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి సమయం కోరినా ఇచ్చింది లేదు. పార్లమెంటుసాక్షిగా హామీలను ఉల్లంఘించడం రాజ్యాంగాన్నే అవమానించడం కాదా?
కాంగ్రెస్‌ ఆ రోజున లోక్‌సభ తలుపులు మూసి మరీ విభజన చట్టం ఆమోదించిందని మోడీ కొత్తగా కనిపెట్టినట్టు చెబుతున్నారు. ఆ రోజున ఒక తలుపు కాంగ్రెస్‌ మూస్తే మరో తలుపుమూసింది బిజెపి. అక్కడ బాధ్యత కానట్టు రాజ్యసభలో మాత్రం మంతనాలు జరిపి ప్రత్యేక హౌదా పట్టుపట్టింది బిజెపి నేత, ఇప్పుడు సభాద్యక్షుడు వెంకయ్య నాయుడే.విభజన చట్టంలోని రెండు మూడు అంశాలను పునరుద్ఘాటించడంతో పాటు అయిదేళ్ల ప్రత్యేక హౌద, రెవెన్యూలోటు భర్తీ, రాజధానికి సహాయం, పోలవరం జాతీయ హౌదా, వెనకబడిన జిల్లాలకు సాయం, బొందేల్‌ఖండ్‌ ప్యాకేజీ అన్న అంశాలను నాటి ప్రధాని రాజ్యసభలో లిఖితపూర్వకంగా ప్రకటించారు. దాన్ని అమలు చేస్తామని బిజెపి ఎన్నికల ప్రణాళికలో ఘనంగా వాగ్గాదనం చేసింది. నమ్మి ఓటేశాక చట్టబద్దత లేదని ఎగనామం పెట్టింది. పోనీమీరు చట్టబద్దత కల్పించివుండొచ్చు. ఇలా హౌదాతో సహా అన్ని అంశాలను అరకొరగా అమలు చేస్తున్న కేంద్రంపై రాష్ట్రమంతటి తరపున ఒత్తిడి తెచ్చేబదులు చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ రాజీబేరాలు నడిపింది. హౌదా సంజీవిని కాదన్న మాటతో మొదలు పెట్టి 2016 సెప్టెంబరులో వచ్చిన ఉత్తుత్తి ప్యాకేజీకి శాసనసభలో కీర్తనా తీర్మానం వరకూ వెళ్లింది. ఇందుకు వెంకయ్య నాయుడకు సన్మానాలు చేసి తరించింది. ఆ సమయంలో వెంకయ్య పాత్రపై కొత్తపలుకులో మిత్రులుఆర్కే ్ణ కూడా అమితమైన హర్షం ప్రకటిస్తే నేను విమర్శావ్యాఖ్యానం రాశాను. వెనక్కు తిరిగి చూస్తే అదంతా ఎంత బూటకమో తెలుస్తుంది. నిజానికి ప్యాకేజీ మిథ్య. దాన్ని అంకెలలోనిర్ధారించింది లేదు. హౌదా వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం పెట్టుబడుల రాక ఉపాధికి దోహదం అనుకుంటే ఆ అంశమే ప్యాకేజీలో లేదు. కెబికె ప్యాకేజీ ప్రసక్తీ లేదు. అయినా సరే చంద్రబాబు దాన్ని స్వాగతించడం నిరాధారమైన ఆశలు కల్పించింది.రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీసే బదులు అఖిలపక్ష ఒత్తిడి తెచ్చేబదులు ప్రభుత్వం రాజకీయ మంతనాలపై లాబీయింగులపై ఆధారపడింది. తాను 42 సార్లు ఢిల్లీ వెళ్లానన్న చంద్రబాబు ఏమీ జరగడం లేదనే నిజం ప్రజలతోపంచుకున్నది లేదు.ఇటీవలనే ప్యాకేజీ కింద రావాలసింది రాలేదని ఆయన చెప్పాల్సి వచ్చింది. కాని కార్యాచరణ లేదు. టిడిపి చెప్పుల్లో తాను కాలుదూర్చి బిజెపితో బంధం పెంచుకోవాలని చూస్తున్న వైసీపీ టిడిపిని తప్ప కేంద్రాన్ని నిశితంగా విమర్శించిందే లేదు. ముఖ్యమంత్రి గాని ప్రతిపక్ష నేత గాని మీడియా ముందుకొచ్చి బడ్జెట్‌పై తమ అభిప్రాయాలు అసంతృప్తులూ పంచుకున్నది(ఇప్పటికి) లేదు. వామపక్షాల పిలుపుపై జరుగుతున్న బంద్‌లో పాల్గొనడం ద్వారా జగన్‌ ఆ విమర్శను కొంచెం సర్దుకున్నారు గాని చంద్రబాబు మాత్రం ఇప్పటికి ప్రత్యక్షంగా మాట్లాడింది లేదు. కనుకనే ఆ పార్టీ ఎంపిలు పార్లమెంటులో చేస్తున్న ఆందోళన అన్నది కూడా రాజకీయ ప్రహసనంగా వుంది తప్ప నమ్మకం కలిగించడం లేదు. కేంద్రంలో మంత్రి సుజనాచౌదరి మాట్లాడ్డం దానిపై విజయసాయి రెడ్డి అభ్యంతరం ా ప్రహసనం కొనసాగింపే.
ఈ నేపథ్యంలో వామపక్షాల బంద్‌కు ప్రత్యేక రాజకీయ ప్రాధాన్యత ఏర్పడటం సహజం.విభజనకుముందు గాని తర్వాత గాని ఇన్ని పార్టీలు ఏకాబిప్రాయంతో అడుగేయడం ఆంధ్ర ప్రదేశ్‌లో చూడని పరిణామం. వాస్తవానికి తెలుగుదేశం చొరవతో అందరినీ కలుపుకుని రాష్ట్రం కోసం పోరాడవలసింది. దానికి బదులు బిజెపిపైన కేంద్రంపైన మరీ ముఖ్యంగా వెంకయ్యపైన నమ్మకం పెట్టుకుని కూచోమన్నారు. వారిద్దరినీ బలపర్చిన పవన్‌ కళ్యాణ్‌ ప్యాకేజీని పాచిపోయిన లడ్డూ అన్నారు గాని తర్వాత మాత్రం పరిశీలించాలన్నట్టు కాలం వెళ్లబుచ్చారు.ఇప్పుడు జెపిని ఉండవల్లిని మేధావులను కలుపుకుని తెలంగాణ తరహాలో జెఎసి అంటున్నారు. టిజెఎసిలోనూ అందరూ అన్ని వేళలా ఒకే విధంగా కలిసి వున్నది లేదని గుర్తుపెట్టుకోవాలి.ఎప్పుడైనా ఎక్కడైనా పాలకవర్గ పార్టీలకు స్వప్రయోజనాలు పట్టినంతగా విశాల దీర్ఘకాలిక కోణాలు పట్టవు. ఇప్పుడు ఎపిలో పాలక ప్రతిపక్షాలు తమ తమ కేసుల కారణంగానే మోడీ ముందు సాగిలపడుతున్నట్టు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. మిత్ర ధర్మం గనక మాట్టాడలేకపోతున్నామని బిజెపి టిడిపిలు చేసే వాదన హాస్యాస్పదమైంది. ప్రజల పట్ట రాజ్యాంగ ధర్మం అన్నిటికన్నా ఉత్షృష్టమైందని వారికి చెప్పవలసి వుంది. లక్షన్నర కోట్లు ఇచ్చేశామని బిజెపి అద్యక్షుడు అమిత్‌ షా రాజమండ్రి సభలో చేసిన ప్రసంగం నిజం కాదని ప్రధాని ప్రసంగం నేపథ్యంలో కేంద్రం విడుదల చేసిన లెక్కలే చెబుతున్నాయి. ి . అందులో ఖచ్చితంగా రెవెన్యూలోటు కింద ఇచ్చింది 7500 కోట్లు, అమరావతికి 2500 కోట్లు మాత్రమే వున్నాయి. ఘనంగా చెప్పే ఏడు కేంద్ర విద్యా సంస్థలకు 111 కోట్లు ఇచ్చారట. ఇతర పద్దుల కింద ఇచ్చినవన్నీ కలిపి చూపినావచ్చే సంవత్సరం ఇవ్వబోయేది కూడా కలిపి 22వేలకోట్లకు లోపే వుంటే అమిత్‌షా లక్షన్నర కోట్టు అని ఎలా అన్నారు? తాము డబ్బులు ఇచ్చినా రాష్ట్రప్రభుత్వం లెక్కలుచెప్పడం లేదని నివేదికలు పంపడం లేదని బిజెపి నేతలు చేసే వాదన ఒకటి. అమరావతికి ఇచ్చిన నిధులతో తాత్కాలిక భవనాలే కట్టారనీ, డ్రైనేజీ నిధులతో కాల్వల తవ్వకమే ప్రారంభించలేదని చేసే విమర్శలను ప్రజల ముందు పెట్టాలి. పోలవరం బాధ్యత తీసుకోవాలి. ఒకరినొకరు కప్పిపుచ్చుకుంటూ ప్రజలను మభ్యపెట్టడం దారుణం. ఇప్పటికీ వైసీపీ ఆచితూచి స్పందిస్తుంటే పవన్‌ కళ్యాణ్‌ జెపిలు చంద్రబాబు తరహాలోనే వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడం మార్గం కాదని హితబోధ చేయడం ఆశ్చర్యకరం. వీధికి నెట్టింది కేంద్ర రాష్ట్ర పాలకులే తప్ప పార్టీలో ప్రజలో కాదు. ే ఎవరి తరహాలో వారు చేస్తున్న విన్యాసాలను ప్రజలు అర్థం చేసుకోగలరు. ప్రభుత్వాలకు పాఠమూ చెప్పగలరు. అవకాశవాదం ఎవరిలో ఏ రూపంలో వున్నా విశ్వాసఘాతుకతకు ఎవరు పాల్పడినా అందుకు మూల్యం తప్పదు.్ల ఆ క్రమంలో రాజకీయ సామాజిక మధనాలూ మార్పులూ రాబోయే రోజులోతప్పనిసరిగా చూస్తాం. (గమనం ఆంధ్రజ్యోతి ఎడిట్‌పేజి, 9,2,18)
తోక: ఈ వ్యాసం ప్రచురణకు పంపాక గురువారం రాత్రి తిరిగి శుక్రవారం రాత్రి కూడా అరుణ్‌జైట్లీ ఎపికి శూన్య హస్తం చూపిస్తూ ఒకటికి రెండు సార్లు మాట్లాడటం కొసమెరుపు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *