రాజమౌళి+ శ్రమ = బాహుబలి- త్రివిక్రమ్‌ +బద్దకం = అజ్ఞాతవాసి – శ్రద్దపెడితే త్రివిక్రముడే!

రాజమౌళి+ శ్రమ = బాహుబలి
త్రివిక్రమ్‌ +బద్దకం = అజ్ఞాతవాసి

త్రివిక్రమ్‌ పవన్‌ కళ్యాణ్‌ల అజ్ఞాతవాసి మూడో రోజున చూశాను. ఆ చిత్రంపై అంత దాడి చేసి వుండాల్సింది కాదు. వారి శైలిలో కార్పొరేట్‌ ఫైట్స్‌ కమ్‌ కామెడీలను కలిపి సెంటిమెంటు జోడించబడి షరా మామూలుగానే వుంది. కొన్ని చోట్ల నవ్వొచ్చింది.కొన్ని చోట్ల పవన్‌ నటన బాగుందనిపించింది. కుష్బూ పెద్ద అసెట్‌గా కనిపించింది. పాటలు బాలేవే అనిపించింది. అన్నిటికన్నా ఎక్కువగా అనిపించిన విషయాలు రెండు- త్రివిక్రమ్‌కు కార్పొరేట్‌ నేపథ్యంపైన గ్లామర్‌ వుంది గాని ఆ తరహాలోనే తీయడానికి అవసమైన నమ్మకం(ప్రేక్షకులపై) లేదని. ప్రతిభ వున్నా ప్రయత్న లోపం, ప్రేక్షకులపై విశ్వాసరాహిత్యం అతుకుల బొంతగా స్వీయానుకరణకు లోను చేస్తున్నాయని. అత్తారింటికి దారేది లాగా అజ్ఞాతవాసి నాన్నారింటికి దారేది అని చాలా మంది అన్నారు గాని వాస్తవానికి త్రివిక్రమ్‌ అతడు, ఖలేజా,జల్సా లలో కూడా ఒక విధమైన అజ్ఞాత వాసం లేదా అసలు రూపం ఆలస్యంగా తెలియడం సర్వసాధారణం. ఆ మాటకొస్తే సన్నాఫ్‌సత్యమూర్తి ఛాయలు లేవా? నాకైతే అతడు చాలా చాలా ఇష్టం గాని అందులో కొన్ని భాగాలు హాలివుడ్‌నుంచి తెచ్చిపెట్టినట్టే వుంటాయి. అతడులో రోటీ+ ఇతరం వుంటే అత్తారింటికి దారేదిలో గుండమ్మకథతో సహా మరెన్నొవుంటాయి. ఆ తర్వాత తీసిన అఆ అచ్చంగా అత్తారింటి కథ అది కూడా మీనాకు అనుకరణ. ఆ సంగతి ఒప్పుకోవడం కూడా ఆలస్యమైంది. జల్సాలో నగ్జలైట్‌ మారడం అనేది ఇతివృత్తమైనా తాగుడు, టీజింగ్‌ శాడిస్టిక్‌ నిండిన క్యారెక్టర్‌ ఒకే తండ్రి పిల్లలైన ముగ్గురినీ ప్రేమించడం ఇన్‌క్రెడిబుల్‌. పాజిబుల్‌ ఓన్లీ విత్‌ త్రివిక్రమ్‌ అండ్‌ పవన్‌ కళ్యాణ్‌.
చెప్పదల్చుకుందేమంటే త్రివిక్రమ్‌ కథనంలోనూ కూర్పులోనూ బద్దకం వదిలేస్తే మరింత మంచి చిత్రాలు పట్టుగా తీయడమే గాక చాలామంది హీరోలను కాపాడగలరు.పవన్‌ ఇప్పుడు పవర్‌ స్టార్‌ మాత్రమే గాక పొలిటికల్‌ స్టార్‌ కూడా. ఎంజిఆర్‌ ఎన్టీఆర్‌లాగా మంచి చిత్రాలు తీస్తే ప్రేక్షకులు చూస్తారు. చిలిపి చిన్నవాడిలా(దానిలాకూడా ) చేయించడంతోనే ఆగిపోనక్కర్లేదు. తొలి చిత్రం నువ్వే నువ్వేలో తరుణ్‌ను లార్జర్‌ దేన్‌ లైఫ్‌లో చూపగలిగినచేవ వున్న త్రివిక్రమ్‌ ఇన్నేళ్ల తర్వాత ఇవే వేషాలు వేయాలా? ఒక రాజమౌళి తన హీరోలను ఎమోషనల్‌ పీక్‌కు తీసుకుపోవడంపై కేంద్రీకరిస్తారు. ఆ పీక్‌ అన్ని పాత్రలకూ పెట్టి దీర్ఘకాలం శ్రమించి బాహుబలి తీస్తే ప్రపంచ రికార్డులు వచ్చాయి.బాహుబలి అసాధారణకథ కాదు.కాని ప్రతి అంగుళం అపారమైన శ్రద్ధ- అతడులో పార్థు కొట్టినంత శ్రద్ధ- బాహుబలిసృష్టికర్తను ధన్యుణ్ని చేసింది. త్రివిక్రమ్‌నిజంగా చేస్తే అలాటిత్రివిక్రముడు కాగలడు.పవన సుతుడి అభిమానులూ హర్షిస్తారు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *