పవన్‌ కళ్యాణ్‌ భిన్న సంకేతాలు

జనసేన అద్యక్షుడు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మూడు రోజుల పర్యటన ఆయన రాజకీయ ప్రయాణంలో మలిదశగా చెప్పొచ్చు. విజయనగరంలో డిసిఐ ఉద్యోగుల ఆందోళనకు సంఘీభావం, ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్‌కు నివాళి తదితర అంశాలలో మానవీయ స్పందన ఆహ్వానించదగింది. మొదటిసారిగా ఒక కమ్యూనిస్టేతర నాయకుడు ప్రైవేటీకరణ గురించి మాట్లాడ్డం విశేషం. లాభాలతో నడిచే కీలకమైన డిసిఐని ప్రయివేటీకరించవద్దంటూ ప్రధాని మోడీని తొలి కోర్కె కోరుతున్నానన్నారు.
ఇతర అంశాల్లోకి వస్తే – 2014 ఎన్నికల్లో తెలుగుదేశం బిజెపిలను లేదా నరేంద్రమోడీ చంద్రబాబులను ఎందుకు సమర్ధించారన్న దానిపై ఆయన వివరణ ఇచ్చారు. అదే సమయంలో ఆ పార్టీ ఎంపిలైన కంభం పాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్‌ వంటివారు డిసిఐ సమస్యపైన స్పందించడం లేదని విమర్శించారు.అలాటివారికిఓటడిగే హక్కు లేదని ప్రకటించారు. తనకు ఎవరిని విమర్శించాలన్నా భయం లేదని ఎవరూ ఏం పీకలేరని చెప్పి కేరింతలు కొట్టించారు.
మూడో ముఖ్యమైన అంశం తాను ఎవరితో కలసి ఎన్నికల్లో పోటీ చేస్తాననేది ప్రస్తావించి అస్పష్టంగా వదిలేశారు. రాజకీయాలు అధికారం కోసం కాదని, సమస్యలు ముఖ్యమని చెప్పారు. తను ఎంపిక చేసే కార్యకర్తలు ఎన్నికల్లో ఇతరులను బలపర్చడానికి సిద్దంగా వుండాలని కూడా వివరించారు. ఏ ఒక్కపార్టీ లేదా నాయకుడు అన్నీ చేయలేరని పదేపదే చెప్పడం ద్వారా ఏదో కలయిక తథ్యమనే భావన ఇచ్చారు. వున్న పార్టీలోనే ఏదో ఒకటి ఎంచుకోక తప్పదని కూడా చెప్పేశారు. అదే సమయంలో . వారసత్వ రాజకీయాలు వేల కోట్ల అవినీతి ఆరోపణల కారణంగానే ు తాను జగన్‌ను ఎందుకు బలపర్చలేదని చెప్పారు. వారసత్వం అన్నప్పుడు మంత్రి లోకేశ్‌ను కూడా తమాషాగా ప్రస్తావించి ఆయన సత్తా ఏమిటో వాళ్ల నాన్నకే తెలుసునని వ్యాఖ్యానించారు.తొలిదశలో పవన్‌ కళ్యాణ్‌ కూడా వారసత్వంతోనే వచ్చారని నేను టీవీ చర్చలో అన్నాను.
రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హౌదా వంటి విషయాన్ని తడిమినా వివరాల్లోకి పోలేదు. చంద్రబాబు ప్రభుత్వంపైనా చెప్పుకోదగ్గర విమర్శలు చేయలేదు. బిజెపి హిందూమతమైనా అప్పటి పరిస్థితుల వల్ల దాన్ని బలపర్చాల్సి వచ్చిందని చెప్పేశారు.
మరో ముఖ్యమైన విషయం- ప్రజారాజ్యం ప్రస్తావన ద్వారా పవన్‌ కళ్యాణ్‌ ఆ సామాజిక పునాదిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. మెగాస్టార్‌ చిరంజీవికి ద్రోహం చేసిన వారెవరనీ తాను మర్చిపోలేదనీ వారిని దెబ్బ తీస్తానని చెప్పి చప్పట్టు కొట్టించారు. అయితే ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం, తాను కూడా దూరం కావడం వంటి పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలో పవన్‌ చెప్పివుంటే బావుండేది. ఏది ఏమైనా చిరంజీవి కంటే ఆయన భిన్నమనీ గట్టిగా వుంటారని చెబుతున్నవారికి ఈ మాటలుకొంత ఆశ్చర్యం కలిగించాయి.
సుదీర్ఘంగా సాగిన పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగంలో ఆదర్శాలు ధ్వనించినంతగా ఆచరణ మార్గం ఏమిటో అర్థం కాలేదు.మామూలుగా కమ్యూనిస్టుల గురించి సానుకూలంగా మాట్లాడే ఆయన ఈ సారి ఆ ప్రస్తావన తేలేదు గాని ప్రజలతోవుండే పార్టీలనే తాను కోరుకుంటానన్నారు. కాబట్టి ఆయన ఇతరులను బలపర్చబోతున్నారని అయితే అది జగన్‌ మాత్రం కాదని అర్థం చేసుకోవచ్చు. పైగా తనకు సిఎం కావాలని లేదని అనుభవం వుండాలని చెప్పడం కూడా అలాగే వుంది.
బహుశా రేపు పోలవరం సందర్శనకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితిపై చేసే వ్యాఖ్యలను బట్టి పవన్‌ కళ్యాణ్‌ ఎలా వ్యవహరించేది మరికొంచెం తెలియొచ్చు.అయితే ఆయన అన్ని అప్పుడే స్పష్టంగా చెప్పదల్చుకోలేదన్నది స్పష్టం. కాకుంటే చంద్రబాబు చేయిస్తాడని నాకు తెలియదా వంటి వ్యాఖ్యలతో తనకు పరిపక్వత వుందని చెప్పడానికి ప్రయత్నించారు. ఆఖరుకు చూస్తే మాత్రం అస్పష్టతే మిగిలింది. బండి మళ్లీ ప్రజారాజ్యం ఆగిపోయినచోటికి వచ్చి నిలబడింది.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *