అయోధ్య కాండ-పాతికేళ్ల పాఠాలు

పేరుకు రామ జన్మభూమి అయినా రావణ కాష్టంలా కొనసాగుతున్న అయోధ్య వివాదం అందుకు పరాకాష్టగా బాబరీ మసీదు విధ్వంసం జరిగి ఇప్పటికి పాతికేళ్లు. సరిగ్గా ఈ సమయంలోనే అత్యున్నయ న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపే తీర్పు వెలువరిస్తానంటూ నిత్య విచారణ ప్రక్రియ ప్రారంభించింది. దేశంలోని ప్రగతిశీల లౌకిక మేధావులు అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని ప్రశాంతంగా వుండేఆలా మతాతీతంగా వుంచాల్సిందిగా కోరుతూ ఒక ఉమ్మడి విజ్ఞప్తి కోర్టుకు సమర్పించారు. మరో వంకన ఇదే కోర్టు ఆదేశం మేరకు బాగా ఆలస్యంగా పునరుద్ధరించబడిన బాబరీ విధ్వంసం కుట్ర కేసులో నిందితుడైన బిజెపి నేత వినరు కతియార్‌ ఇదంతా బాహాటంగా చేశామే గాని కుట్ర ఎక్కడని సవాలు చేశారు. ప్రాణాలైనా ఇస్తాగాని అయోధ్యలో రామమందిర నిర్మాణం మానుకోబోనని మరో నిందితురాలైన మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి ప్రకటించారు. ఇక అయోధ్య వివాదానికి కేంద్రమైన ఉత్తర ప్రదేశ్‌ను పాలిస్తున్న కాషాయాంబర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ అక్కడకు వెళ్లి రామమందిరం అనేది తన వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన అంశమని ప్రకటించారు. పాతికేళ్ల నుంచి వున్నట్టే ఇకముందు కూడా అయోధ్య సమస్య వుంటుందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్టీ వ్యాఖ్యానించారు. అక్కడ రామమందిర నిర్మాణానికి ఇప్పటి కన్నా మరెప్పుడూ అనుకూల పరిస్థితి వుండబోదని ఆరెస్సెస్‌ సంర్‌సంఫ్‌ు చాలక్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టీకరించారు. కాంగ్రెస్‌అద్యక్ష పదవి చేపట్టబోతున్న రాహుల్‌ గాంధీ కొద్ది రోజుల కిందట అయోధ్యలోని హనుమాన్‌ ఘరిని సందర్శించి విశ్వాసం ప్రదర్శించుకున్నారు. బాబరీ మసీదు విధ్వంసం జిరిగి పాతికేళ్లయిన సందర్బంగా దేశమంతటా సభలు జరిపి నిరసనతో పాటు లౌకిక విధానాలను ప్రచారం చేయాలని వామపక్షాలు నిర్ణయించాయి. అయోధ్య వివాదానికి కోర్టు వెలుపల పరిష్కారంపై రకరకాల కథలు వస్తున్నాయి. హిందూత్వ సంస్థల నుంచి ఈ కథనాలు వస్తుండగా మరోవైపున వివాద స్థలంపై షియాలకు తప్ప సున్ని వక్ఫ్‌ బోర్డుకు ఏ సంబంధం లేదని మరో కొత్త వాదన ముందుకొచ్చింది. ఈ సమస్య పాతికేళ్ల తర్వాత కూడా ఎంత పచ్చిగా వుందో అర్థం కావడానికి ఈ ఉదాహరణలు చాలు.
బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం ఆరెస్సెస్‌ పరివార్‌ క్రృత్రిమంగా రగిలించిన అయోధ్య వివాదం చరిత్ర ఏమిటో ఇర్ఫాన్‌ హబీబ్‌ మరో వ్యాసంలో వివరించారు. మతతత్వ విధానాలతో అంతకు ముందు నుంచి రకరకాల తంటాలు పడినా పెద్దగా ఫలితం సాధించలేకపోయినా బిజెపికి అయోధ్య వి వాదం అందివచ్చిన అవకాశమైంది. షాబానో కేసులో ముస్లిం చాందసుల వత్తిడికి లొంగిపోయి మహిళా వ్యతిరేక శాసనం తెచ్చిన అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఆ ప్రభావం నుంచి బయిటపడటానికి యాభై ఏళ్లుగా తాళాలు వేసి వున్న వివాదాస్పద స్థలంతాళాలు తెరిపించారు. ఒక మతతత్వ ఒత్తిడి మరో దానికి ఎలా అవకాశమిస్తుందో ప్రత్యక్షంగా నిరూపించారు. ఆ వెంటనే బిజెపి శిలాన్యాస్‌ తదితర తతంగాలు తలపెట్టింది. రాజీవ్‌ గాంధీ రామరాజ్యం తెస్తానంటూ 1989 ఎన్నికల ప్రచారం అయోధ్యలోనే ప్రారంభించారు. ఆయనను వ్యతిరేకించి జనతాదళ్‌ స్థాపించిన విపిసింగ్‌ కూడా యుపి బీహార్‌లలో బిజెపితో సీట్ట సర్దుబాటు చేసుకున్నారు. నాటి కాంగ్రెస్‌ వ్యతిరేక వాతావరణాన్ని పొత్తులను ఉపయోగించుకున్న బిజెపి మొదటిసారిగా 86 స్థానాలతో పెద్ద శక్తి కాగలిగింది. అయినా వామపక్షాలు అడ్డుపడిన కారణంగా వాటిలాగే బిజెపి కూడా విపిసింగ్‌ ప్రభుత్వాన్ని బయిటనుంచి బలపర్చడానికి ఒప్పుకోవలసి వచ్చింది. ఆ సమయంలోనే విపిసింగ్‌ మండల్‌ కమిషన్‌ నివేదిక అమలు ప్రకటించడంతో మండల్‌ వర్సెస్‌ మందిర్‌అన్నట్టు అయోధ్య ురథయాత్ర ప్రారంభించారు. దేశ చరిత్రలో మొదటిసారి ఒక సీనియర్‌ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి ఎసి కారు రథంపై ఒకవైపు రాముడి బొమ్మ మరో వైపు కమలం గుర్తు వేసుకుని వూరేగారు. ఆ యాత్ర వెళ్లిన చాలా చోట్ల మతఘర్షణలు దాడులు జరిగాయి. చివరకు అద్వానీని బీహార్‌లో లాలూ ప్రసాద్‌ ప్రభుత్వం అరెస్టు చేయగా బిజెపి సింగ్‌కు మద్దతు ఉపసంహరించుకుంది. బిజెపి కాంగ్రెస్‌ రెండూ కలసి ఆ ప్రభుత్వాన్ని కూలదోశాయి. 1991 ఎన్నికల నాటికి బిజెపి బలం మరింత పెరిగినా రాజీవ్‌ హత్యానంతర సానుభూతి వల్ల పివి నరసింహారావు మైనార్టి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బిజెపి పరోక్షంగా బలపర్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించి 1992 డిసెంబరులో కరసేన ప్రకటించింది. ఇది భయంకర సేవ అనీ, మందే అడ్డుకోవాలని ప్రతిపక్షాలన్నీ పివికి అధికారం ఇచ్చాయి. అయినా సరే ఆయన అక్కడ చేరుతున్న మతతత్వ మూకలను ఆపేందుకు చిటికన వేలు కదల్చలేదు. అయోధ్య చుట్టుపక్కల కరసేవకులు విధ్వంంలో శిక్షణ పొందుతున్నట్టు వార్తలు వచ్చినా నిఘా సంస్థలు నిర్లిప్తంగా వుండిపోయాయి. అయోధ్యలో 20 వేల కేంద్ర బలగాలు వున్నా ఆదేశాలు ఇవ్వకుండా మసీదు కూల్చివేతను పూర్తికానిచ్చారు. ఇదంతా యాదృచ్చికమేనని పివిని మోసం చేశారని ఆయన భక్తులు అనేది అర్థం లేని సమర్థన. కరసేవ అంటే భజనలు మాత్రమేనని సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన నాటి బిజెపి ముఖ్యమంత్రి కళ్యాణ్‌ సింగ్‌ అంతా జరగనిచ్చి తర్వాత రాజీనామా చేశారు. జరిగిన దానికి ఆ తర్వాత కోర్టు ఒకరోజు జైలు శిక్ష కూడా విధించింది.
కూల్చివేసిన మసీదును పునర్నిర్మిస్తామని మొదట హామీ ఇచ్చిన పివి ప్రభుత్వం తర్వాత 1993 అయోధ్య చట్టం తీసుకొచ్చి యథాస్థితిని కాపాడతానంటూ కరసేవకులు ఏర్పాటు చేసిన తాత్కాలిక రామాలయానికి చట్టబద్దత కల్పించింది. అయినా ప్రజలు ఆ రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలను ఓడించి లౌకిక చైతన్యం చాటారు. కాని రాజకీయ వ్యవస్థలో నిజాయితీ లోపించిన కారణంగా ఆ పార్టీ పెరిగింది. బిజెపి 1996లో 13 రోజులు, 1998లో 13 నెలలు తర్వాత పూర్తికాలం వాజ్‌పేయి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగల శక్తి పెంచుకుంది. తెలుగుదేశం, సమతా పార్టీ ఉభయ డిఎంకెలు, ఎల్‌జెఎస్‌వంటి ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం మతతత్వంతో రాజీ పడటం, వామపక్షాలు కొన్ని ఎదురుదెబ్బలు తినడం ఇందుకు కారణమైంది.కాంగ్రెస్‌ తరహా ఆర్థిక విధానాలనే బిజెపి కొనసాగిస్తుంది గనక పెట్టుబడిదారులూ దాన్ని సాగనిచ్చారు. ఈ క్రమంలోనే 2002 గుజరాత్‌ మారణహౌమం అయోధ్య కాండను మించిన మతతత్వ కాండగా మిగిలిపోయింది. ఆ విధ్వంసంలో ఎదిగిన ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని కాగలిగారు. ఈ క్రమంలో దేశంలోనూ ప్రపంచంలోనూ పెరిగిన ఇస్లామిక్‌ టెర్రరిజం మత చాందసం వంటివి బిజెపి పూర్తి మెజార్టి పొందడానికి కూడా కారణమైనాయి. ఈ మొత్తం కాలంలోనూ వామపక్షాలు మినహా ఇతర ప్రధాన పార్టీలు మతతత్వంపై పోరాడేందుకు సిద్ధం కాకపోగాా రాజీ పడుతూ లొంగిపోతూ వచ్చాయి. పైగా ఆయా రాష్ట్రాలలోనూ తాము బిజెపికి తీసిపోమన్నట్టు యజ్ఞయాగాలూ పూజా పురస్కారాలతో హంగామా చేయడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు చెప్పవనవసరం లేదు. అమెరికా యూరప్‌లలో కూడా మితవాద మతవాద శక్తులు పెరుగుతున్న నేపథ్యం భారత్‌లో ఈ పరిస్థితి మరింత దిగజారడానికి కారణమైంది. రాముడిని రాజకీయాల్లోకి లాగడంతో మొదలైన మతతత్వం ఇప్పుడు ఆవుల వరకూ పాకింది. లౌకిక తత్వం విసయంలో రాజీ కాస్తా ఇప్పుడు దేశం పేరునే హిందూదేశంగా మార్చాలని భగవద్గీతను అధికార గ్రంధంగా ప్రకటించాలని వాదించే స్థితికి చేరింది. దళితులు ముస్లిములపై దాడులు నిత్యకృత్యమైనాయి. ఎవరు ఏది మాట్టాడినా రాసినా, వార్త రాసినా చెప్పినా చిత్రం తీసినా మతం పేరుతో వేధించే అసహనం తాండవిస్తున్నది. ఆరెస్సెస్‌ విహెచ్‌పి భజరంగ దళ్‌ వంటి వాటికి ప్రతిరూపాల్లాంటి ముస్లిం మతతత్వ వాదనలు కూడా ముందుకొచ్చాయి. చాపకింద నీరులా ఈ మతోన్మాద రాజకీయాలు ప్రజల మధ్య సంబంధాలను విద్వేష పూరితంచేశాయి. రవిశంకర్‌లు, రామ్‌దేవ్‌లు చిన జియ్యర్లు పరిపూర్ణానందులు ఇప్పుడు అధికార వ్యవస్థలోనూ సామాజిక జీవితంలోనూ పెద్ద పాత్రధారులై పోయారు. స్వాతంత్రపోరాటా సంఘ సంస్కరణ, సామ్యవాదం, సామాజిక న్యాయం వంటి ఉదాత్తమైన ఉద్యమాలకు వూపిరిపోసిన భారతావని ఇప్పుడు అత్యంత అనర్థదాయకమైన అభివృద్ధి నిరోధక భావజాలానికి నిలయంగా మారుతున్నదంటే పాతికేళ్లనాటి అయోధ్య పరిణామాలలో అందుకు పునాదులున్నాయి.
అయోధ్య సమస్య ఇన్ని దశాబ్దాలు నానబెట్టిన న్యాయవ్యవస్థ ఏం చెబుతుంది, కేంద్రంలో రాష్ట్రంలో వున్న బిజెపి ప్రభుత్వాలు ఏం చేస్తాయి, రకరకాల మతశక్తుల పాత్ర ఎలా వుంటుంది ఇంకా అస్పష్టమే. కాని ఇప్పటికే అంతులేని విధ్వంసానికి విషాదానికి ధన ప్రాణ నష్టాలకు కారణమైన ఈ అయోధ్య క్రీడలో ప్రత్యక్ష పరోక్ష వ్యూహాల పట్ల అప్రమత్తత అత్యవసరం. మొత్తంగా మతతత్వ రాజకీయాలపై అవకాశవాదాలపై పోరాడి ఓడించలేకపోతే ప్రజాస్వామ్యం మనుగడకే ముప్పు తప్పదు. పాతికేళ్ల రామరాజకీయం చేస్తున్న హెచ్చరిక అదే. రాజకీయ కార్యాచరణతోపాటు ప్రజా బృందాలలో ఆవాసాలలో సాంసృతిక జీవినంలో చొరబడిన చాందస తిరోగమన పోకడలను తొలగించే వైజ్ఞానిక చైతన్యం ప్రజాస్వామిక భావజాలం కూడా పెంపొందించడం ముఖ్యం.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *