‘పద్మావతి’పై పగబట్టిన పరివారం

అభివృద్ది నిరోధక అప్రజాస్వామిక అరాచక శక్తులు అందలమెక్కితే అన్ని రంగాల్లోనూ అల్లకల్లోలమేనని అనుదినం రుజువు చేస్తున్న సంఘ పరివార్‌ ఇప్పుడు హిందీచిత్రం పద్మావతిపై కత్తి కట్టింది. చివరకు ఆ చిత్రం విడుదలనే వాయిదా వేయించింది.. చెదురు మదురు సంస్థలు గాక బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలే ఆ చిత్రం రాకుండా చేయాలని రాజకీయ వాజ్యాలు బెదిరింప్యులకు పాల్పడుతున్నాయి. కేంద్ర మంత్రులైన నితిన్‌ గడ్కరీ వంటి వారు ఈ విధ్వంసకారులకే వంత పాడుతున్నారు. గతంలో ఆరక్షణ్‌(2011) విశ్వరూపం(2013) జోదా అక్బర్‌(2008) వంటి చిత్రాలపై సాగిన దాడిని మించి రెచ్చిపోతున్నారు. జాతీయ పురస్కారాలు పొందిన ప్రతిభాశాలి దీపికా పడుకునే ముక్కు చెవులు కోస్తామని అనాగరికంగా భయపెడుతున్నారు.
డిసెంబర్‌ 1న విడుదల కావలసిన పద్మావతి చిత్రాన్ని ప్రసిద్ధ దర్శకుడు సంజరు లీలా భన్సాలీ 180 కోట్లతో నిర్మించారు. బన్సాలీ గతంలో 1942 ఎ లవ్‌ స్టోరీ, దేవదాసు, బ్లాక్‌, ఫరిందా, కామోష్‌ తదితర భారీ చిత్రాలతో ఘన విజయాలు సాధించిన వ్యక్తి. చరిత్ర నేపథ్యంలో కల్పన మేళవించిన ప్రసిద్ధ గాధ పద్మావతి.జస్థాన్‌లోని చితోర్‌ఘర్‌ లేదా చిత్తూరు రాజ్యానికి చెందిన రాణి పద్మిని పేరు భా రతీయులకు సుపరి చితం. పాఠాలలో ¸ చాలా కాలం వుండేది. . 13వ శతాబ్డంలో ఆ రాజ్యాన్ని పాలించిన రతన్‌ సింగ్‌, పద్మావతిల గురించి 1540లో. సూఫీ కవి మాలిక్‌ మహ్మద్‌ బేనీ రాసిన ప్రేమ కథగా ఇది ప్రాచుర్యం పొందింది. నాగమతి అతని మొదటి భార్య. ఆ కథ ప్రకారం రతన్‌ అపురూప సౌందర్యరాశి. సింహళ యువరాణి పద్మిని (లేదా పద్మావతిని) గురించి విని రతన్‌ సేన్‌ అక్కడకు వెళ్లి ప్రయత్నించి పెళ్లి చేసుకుంటాడు. తన కొలువులో ముఖ్యుడైన రాఘవ చేతన్‌ క్షుద్ర విద్యలకు పాల్పడుతున్నట్టు తెలుసుకున్న రాజు అతన్ని వెళ్లగొడతాడు. అప్పుడు ఢిల్లీని అల్లావుద్దీన్‌ ఖిల్జీ పాలిస్తున్నాడు. రాఘవ చేతన్‌ ఎలాగో ఖిల్జీ దృష్టిలో పడి పద్మావతి సౌందర్యం గురించి చెప్పి ప్రలోభపెడతాడు. ఖిల్జీ ఒక పథకం ప్రకారం రతన్‌ సింగ్‌తో స్నేహం కలిపి పద్మావతిని ఒక సోదరిగా చూడాలనుకుంటున్నానని కబురు చేస్తాడు.భర్త చెప్పినా ఒప్పుకోని పద్మావతి అద్దాలలో ప్రతిబింబం ద్వారా మాత్రమే ఖిల్జీ తనను చూడటానికి అనుమతిస్తుంది. ే అలా వెళ్లిన సమయంలోనే ్‌ కోట రహస్యాలు తెలుసుకున్న ఖిల్జీతర్వాత(1303లో) దాడి చేస్తాడు. రతన్‌ సింగ్‌ బందీ అవుతాడు. అయితే ఖిల్జీ కోటలోకి వెళ్లే సరికి పద్మావతి అంత:పుర పరివారంతో సహా ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడుస్తుంది. దీన్నే జౌహార్‌ లేదా జోహార్‌ అంటారు. అప్పటి నుంచి రాజస్థాన్‌లో ఆమెకు ఆలయాలు కట్టించి దేవతగా పూజిస్తున్నారన్నది కథ. నిజానికి ఈ కథలో తేదీలే గాక పద్మావతితో సహా పాత్రలు కూడా భిన్న తరహాలలో ప్రచారంలో వున్నాయి.. అవన్నీ అప్రస్తుతమే.
ఈ చిత్రం షూటింగు ప్రారంభదశలోనే శ్రీరాజపుత్రకర్ణిసేన దాడి ప్రారంభించింది. ి ఈ సేన ప్రతిసందర్భంలో ఏదో వివాదం రగిలించి డబ్బులు దండుకుంటుందని ఆరోపణలు ఆధారాలతో సహా వున్నాయి. ఈ సేన దుండగులే రాజస్థాన్‌ కోటలో చిత్రం సట్టింగులను ధ్వంసం చేశారు.సేన స్థాపకుడైన లోకేంద్ర సింగ్‌ కర్వాన్‌ దర్శకుడైన బన్సాలీని కొట్టిన వారికి పదివేలు ఇస్తానని ఆఫర్‌ చేశాడు. నిజంగానే ఆయనను కొట్టారు కూడా. ఈ దాడులను సినీ ప్రముఖులతో పాటు అందరూ ఖండించారు. ఎన్ని బెదిరింపులు వస్తున్నా భయపడకుండా బన్సాలీ బృందం నిర్మాణం పూర్తి చేసింది. అయితే సెన్సార్‌కు కూడా పంపించే లోగానే చిత్రంలో ఒక కల పాట వుందని , అందులో ఖిల్జీ పద్మావతి కనిపిస్తారని వదంతి పుట్టింది.. ఇది రాజపుత్ర వనితలకు అవమానమంటూ దుమారం తీసుకొచ్చారు. అలాటిదేమీ లేదని బన్సాలీ స్పష్టమైన వివరణ ఇచ్చినా సరే ఈ ే ప్రచారం ఆపలేదు. అఖిలేశ్‌ ఖండేల్వాల్‌,రాజ్‌ కె. పురోహిత్‌ వంటి బిజెపి నేతలు చిత్రాన్ని నిషేదించాలని గగ్గోలు మొదలు పెట్టారు. ఆఖరుకు సెన్సార్‌ బోర్డు సభ్యుడైన అర్జున్‌ గుప్తా ఇది దేశద్రోహమేనని ప్రకటించారు. . హర్యానా మంత్రి విపుల్‌ గోయల్‌, రాజస్థాన్‌ మంత్రి కిరణ్‌ మహేశ్వర్‌ వంటివారు కూడా బహిరంగంగా విమర్శలు గుప్పించారు.ఇక యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ అయితే ఈ చిత్రంపై వివాదం శాంతి భద్రతలకు భంగకరమంటూ స్తానిక ఎన్నికల దృష్ట్యా సెన్సారింగు, విడుదల వాయిదా వేయాలని అధికారికంగానే కోరారు.గతంలోనూ జోదా అక్బర్‌ చిత్రంపై ఇలాగే దాడి చేయడంతో రాజస్థాన్‌లో విడుదల చేయనేలేదు. బాజీరావు మస్తానీ పైన వివాదాలు లేవనెత్తినా జనాదరణ పొందింది. ఇప్పుడు పద్మావతిని విడుదల కాకుండా ఆపాలని అడ్డుకోవలని బరితెగించారు. ఇందుకు చెబుతున్న కారణాలు హాస్యాస్పదమైనవే గాక హానికరమైనవి కూడా.ఒక ముస్లిం పాలకుడు రాజపుత్ర స్త్రీ గురించి ఆలోచించినట్టు చూపడమే తప్పంటున్నారు. తాము చెప్పే లవ్‌ జిహాద్‌కు ఈ చిత్రం నిదర్శనమని మరో విష ప్రచారం ఎత్తుకున్నారు. త్వరలో రాజస్థాన్‌ మధ్య ప్రదేశ్‌ ఎన్నికలు వస్తాయి గనక రాజపుత్రులను ఆకట్టుకోవడానికి ఇదో ఆయుధమని బిజెపి నేతల వ్యూహంగా వుంది.
సింహళ రాజకుమార్తె పద్మావతికోసం రతన్‌ సింగ్‌ మారువేషంలో వెళ్లడం వంటివి చాలా కథల్లోచూస్తాం. అల్లా వుద్దీన్‌ ఖిల్జీ గురించికూడా చరిత్ర చెప్పేదానికి ఈ కథలో చూపిన దానికి చాలా తేడా వుంటుంది. చరిత్రకు సంబంధించిన పేర్లను తీసుకుని ప్రణయగాధలు అల్లడం ప్రతిచోటా వున్నదే. . నిన్న మొన్నటి అల్లూరి సీతారామరాజులో ప్రేయసి సీత నిజం కాదని నిర్మాతలే చెప్పారు. ఆ మాటకొస్తే చారిత్రిక వ్యక్తి అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వరుడు కనిపించడం ఆ నాడు ఎవరైనా చూశారా? స్క్రీన్‌ప్లే రాశారా? కృష్ణదేవరాయలు తిమ్మరుసు కధల వంటివాటిలో నిజమెంత కల్పన ఎంత? అలాటిది ఏడెనిమిది వందల ఏళ్లనాటి కథలు తీసేప్పుడు ా సృజననూ వూహాశక్తిని ఉపయోగించి ఖాళీలను పూరించడం జరుగుతుంది. ఆ మాటకొస్తే శివాజీ గురించి రాణా ప్రతాప్‌ గురించి సంఘ పరివార్‌ చెప్పే చాలా విషయాలు కల్పనలే. గతంలోనూ ముంబాయి చిత్రాన్ని బాల్‌థాకరేకు చూపి అనుమతి పొందారు మణిరత్నం. వారణాసిగంగా తీరంలో దీపా మెహతా వాటర్‌ చిత్రం షూటింగుపైనా దాడి చేశారు. అయితే ఇప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం 16 రాష్ట్రాలలో బిజెపి పాలన వున్నందువల్ల కర్ణిసేన వంటివి మరీ చెలరేగిపోతున్నాయి.
ఈ వివాదం జరుగుతుందగానే సుప్రీం కోర్టు సృజన స్వేచ్చపై ఒక కీలకమైన తీర్పు నిచ్చింది. సామాన్యుడుగా వుండి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కిన అర వింద్‌ కేజ్రీవాల్‌పై తీసిన చిత్రాన్నిముందే ఆపాలంటూ ఆయనపై ఒకప్పుడు ఇంకుచల్లిన ే నాచికేత వాహ్లేకర్‌ వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. . ” ఒక చిత్రం, నాటకం, నవల ఏదైనా సరే సృజనాత్మక ప్రక్రియ. కళాత్మక అభివ్యక్తి. చట్టం నిషేదించని పరిధిలో తన భావాలు ప్రకటించడానికి కళాకారుడికి రచయితకూ స్వేచ్చవుండాల్సిందే’ అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది..రచయితలు కళాకారులు నవలాకారులు చిత్రకారుల వంటి వారు రాసింది తీసింది తమకు నచ్చలేదంటూ రెచ్చగొట్టే శక్తులకు లోబడిపోకూడదని అత్యున్నత న్యాయస్ణానం హెచ్చరించింది పద్మావతి చిత్రంపైనా నిషేదానికి ఇంతకు ముందే నిరాకరించింది. సినిమా రంగంలోనూ మీడియాలోనూ కూడా కర్ణిసేన దాడులపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. గతంలోనూ పెరుమాల్‌ మురుగన్‌ వంటి వారిపట్ల దౌర్జన్యం, కల్బుర్గి తదితరుల హత్యలు పద్మావతి ఉదంతం మరోసారి గుర్తుచేస్తుంది. ఆవుల నుంచి అమ్మాయిల వరకూ , చదువుల నుంచి చిత్రాల వరకూ ప్రతిదీ తమ ఇష్టానుసారం జరగాలనే ఈ ధోరణిని తీవ్రంగా ప్రతిఘటించాలి. .బాధితులకు సంఘీభావంగా నిలవాలి. ఆలస్యంగానైనా పద్మావతి సజావుగా విడుదలవుతుందని భావ ప్రకటనా స్వేచ్చను కాపాడుతుందని ఆశించాలి. ఏమైనా అఘాయిత్యాలు జరిగితే మాత్రం అందుకు బిజెపి సంఘ పరివార్‌లే బాధ్యత వహించాల్సి వుంటుంది.మూల్యం చెల్లించవలసీ వస్తుంది.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *