అధ్వాన్న దశలో అద్యక్ష పీఠం..

రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అద్యక్ష పీఠం అధిష్టించే ప్రక్రియ మరో వారం పది రోజుల్లో అధికారిక ముద్ర వేసుకుంటుంది. డిసెంబర్‌ 4న అద్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ సమయంలో(బహుశా) ఆయన పేరు ఒక్కటే వుంటుంది గనక ఏకగ్రీవంగా ఎన్నిక కావచ్చు. ‘డిసెంబరు 31లోగా మీ పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల’ని ఎన్నికల సంఘం తాఖీదు ఇచ్చిన దృష్ట్యా ఇంకా ఆలస్యానికి ఆస్కారమే లేదు. 2013లో ఎన్నికలకు ముందు ఉపాద్యక్ష పదవి చేపట్టిన రాహుల్‌ గాంధీ అప్పటి నుంచి నాయకత్వ పాత్ర బాగా పెంచినా లాంఛనంగా సోనియాగాంధీ పేరు మీదే అన్నీ జరిగిపోతున్నాయి. ఎట్టకేలకు గత సెప్టెంబరు 12న రాహుల్‌ అమెరికాలోని క్యాలిఫోర్నియా యూనివర్సిటీ సమావేశంలో మాట్లాడుతూ తాను నాయకత్వ బాధ్యతలు స్వీకరించడానికి వెనకాడబోనని ప్రకటించారు. అద్యక్ష పదవి అలంకరించాల్సిందిగా మొన్న ఏడవ తేదీన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆయనను అభ్యర్థించింది. కొన్ని రాష్ట్ర పిసిసి లు కూడా ఆ మేరకు సిఫార్సులు పంపాయి. ఇంత కాలం నుంచి కుమారుడికి పగ్గాలు అప్పగించడం కోసమే ఆరోగ్యం బాగలేకపోయినా అద్యక్ష పీఠాన్ని కాపాడుతూ బాధ్యతలు నెట్టుకొస్తున్న సోనియా గాంధీ వూపిరి పీల్చుకోవచ్చన్నమాట. అయితే కాంగ్రెస్‌ కొత్త వూపిరి పోసుకోవడం ఏ మేరకు జరుగుతుందన్నది ఇక్కడ ప్రధాన సమస్య.
1885 డిసెంబర్‌ 28న ఆవిర్భవించిన భారత జాతీయ కాంగ్రెస్‌ దేశంలో అతి పెద్ద పురాతన రాజకీయ పార్టీ మాత్రమే గాక దాదాపు ఆరు దశాబ్దాలు దేశాన్ని పాలించిన పాలక వర్గ పార్టీ కూడా. కేంద్రంలో నలభై ఏళ్ల కిందట కాంగ్రెస్‌ గుత్తాధిపత్యం బద్దలైపోయింది. అది అనుసరించిన రాజకీయ ఆర్థిక విధానాలు, అవకాశవాద పోకడలు, అవినీతి కుంభకోణాలు, అత్యవసర పరిస్థితితో పరాకాష్టకు చేరిన అప్రజాస్వామిక పోకడలు… ఇవన్నీ ఆ పార్టీ ప్రభావాన్ని, పరిధిని కుదిస్తూ వచ్చాయి. స్వాతంత్య్రానంతరం ఏకొద్ది కాలమో మినహాయిస్తే కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలూ కూడా నెహ్రూ కుటుంబ వారసుల నాయకత్వంలోనే నడిచాయన్నది వాస్తవం. అయితే వారంతా రాజకీయ ప్రక్రియలో భాగం పంచుకుంటూ వచ్చారన్నది కూడా నిజం. ఆ కుటుంబం పైన వుంటేనే కాంగ్రెస్‌ను ఐక్యంగా వుంచగలదనే భావన ఏర్పడిపోయింది. అయితే వారెవరూ ఎకాఎకిన నాయకత్వాలు స్వీకరించకుండా క్రమపద్ధతిలో కీలక బాధ్యతల్లోకి రావడం ఒక వ్యూహంగా పెట్టుకున్నారు. నెహ్రూ వుండగానే ఇందిరాగాంధీ కాంగ్రెస్‌ అద్యక్షురాలైనప్పటికీ ఆయన మరణానంతరం మొదట లాల్‌ బహుదూర్‌ శాస్త్రిని ప్రధానిని చేసి ఆ తర్వాత ఆమెను గద్దెక్కించారు. ఆ రోజున ఆమెకు పోటీగా వున్న మొరార్జీ దేశాయి మితవాది, మొండి వారు గనక ఇందిర మెరుగని అప్పటి కాంగ్రెస్‌ అద్యక్షుడు కామరాజ్‌ తలపోశారు. అయితే తర్వాత ఆమె బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు, సోవియట్‌తో స్నేహంగా వుండటం వంటి పనులు పాత మితవాదులకు నచ్చక కాంగ్రెస్‌ చీలిపోయింది. ఎమర్జన్సీ కాలంలో ఇందిర రెండవ కుమారుడైన సంజరు గాంధీ పెత్తనం చలాయించారు. వందిమాగధులు ‘ఇందిరే ఇండియా’ అన్నారు. తల్లీ కొడుకులే గాక వారి చుట్టూ చేరిన వారి అకృత్యాలు ప్రజాగ్రహానికి కారణమైనాయి. ే 1977లో ఇందిరను ప్రజలు ఓడించిన దశలో…మిగిలిన నాయకులు చాలా వరకూ దూరం కాగా…ఆ బృందమే ఆమెతో నిలబడి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడింది. అందుకే 1980 తర్వాత ఇందిరాగాంధీ పార్టీ అద్యక్ష బాధ్యతలు కూడా తనే చేపట్టి ద్వంద్వ నాయకత్వ కేంద్రాలు లేకుండా చేశారు. సంజరు గాంధీ ప్రమాదంలో మరణించాక రాజీవ్‌గాంధీ రంగ ప్రవేశం చేసి ఎం.పి గా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా వున్నారు. 1984 అక్టోబరు 31న ఇందిర దారుణ హత్య తర్వాత ప్రధానిగా పార్టీ అద్యక్షుడుగా మారి 1984 చివరలో సానుభూతి నేపథ్యంలో ఎన్నికల్లో 400 స్థానాలు గెలిచి కనీవినీ ఎరుగని విజయం సాధించారు. మొదట్లో రాజీవ్‌ గాంధీని ‘మిస్టర్‌ క్లీన్‌’ అనీ ‘కంప్యూటర్‌ బారు’ అనీ అనేక విధాల పొగిడినా చివరకు బోఫోర్స్‌ ఆరోపణలు మూటకట్టుకుని ఓటమి పాలైనారు. విపి సింగ్‌ , చంద్రశేఖర్‌ను ప్రభుత్వాల తర్వాత ్‌ 1991 ఎన్నికల ప్రచారం మధ్యలో రాజీవ్‌ హత్యకు గురయిన వెంటనే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సోనియా గాంధీని నాయకత్వం చేపట్టమని కోరింది. కాని అప్పటికి ా ఆమె దూరంగా వుండిపోయారు. పివి నరసింహారావు నాయకత్వం- ఓటమి తర్వాత నెమ్మదిగా ఆయనను తప్పించి, సీతారామ్‌ కేసరిని కొద్ది కాలం అద్యక్షుడుగా వూరేగించి, ఇరవయ్యేళ్ల కిందట 1997లో సోనియా అద్యక్ష బాధ్యతలు తీసుకుని అత్యధిక కాలం కొనసాగుతుండడం మరో ఘట్టం. రెండు యుపిఎల పేరిట పదేళ్ల పాటు కాంగ్రెస్‌ నాయకత్వంలో కేంద్రంలో పాలన సాగింది.
ఈ కాలమంతా రాహుల్‌ గాంధీ పార్టీ ఎంపిగా వుంటూ పరోక్షంగానూ బలమైన ప్రభావం చూపిస్తూనే వచ్చారు. తన తలిదండ్రులతో పోలిస్తే ఆయన ప్రత్యక్ష నాయకత్వం చేపట్టడానికి ఎక్కువ కాలం తీసుకోవడమే గాక భిన్న సంకేతాలు ఇస్తూ వచ్చారు. మన్మోహన్‌ మంత్రివర్గంలో ఆయన చేరకపోవడం కూడా త్యాగానికి సంకేతంగా ఆ పార్టీ వారు చెబుతుండేవారు. వామపక్షాలు వ్యతిరేకించిన అణు ఒప్పందానికి సమర్థనగా ఆయన ప్రస్తావించిన కళావతికి కూడా ఏమీ న్యాయం చేయలేకపోయారు. పాలనలో ఒక దశలో తనే కీలక వ్యక్తినని అర్థం కావడానికి రాహుల్‌ ఓ ఆర్డినెన్సును చించి పారేసి సంచలనం సృష్టించారు. అయితే యుపిఎ 2 వరుస కుంభకోణాల్లో చిక్కుకుపోతుంటే ఆయన చేసిందేమీ లేకపోయింది. ఒక్కసారి మాత్రం యుపి ఎన్నికల్లో పార్టీ బలం కాస్త పెరగడానికి దోహదం చేయడం తప్ప ఎన్నికల రంగంలోనూ ఆయన ఆకర్షణ పని చేయలేదు. విద్యార్థులు యువజనులతో సమావేశాలు జరుపుతూ ఒక వరవడి తీసుకురావడానికి కొంత కాలం ప్రయత్నించినా తర్వాత అది కూడా కొనసాగించలేదు. అయినా సోనియా తీవ్ర అస్వస్థతకు తర్వాత రాహుల్‌ పగ్గాలు చేపట్టడం తథ్యమని అర్థమైంది. 2013 ప్లీనరీలో అదే ప్రధానాకర్షణగానూ మారింది. బిజెపి మిగిలిన ఎత్తుగడలతో పాటు తెలివిగా2014 ఎన్నికలను రాహుల్‌ వర్సెస్‌ మోడీ అన్నట్టు చిత్రించే ప్రయత్నం చేసింది. అప్పటికే అప్రతిష్టలో అడుగంటిన కాంగ్రెస్‌ ఎన్నడూ లేనంత తక్కువకు 44 లోక్‌సభ స్థానాలకు పడిపోయి నరేంద్ర మోడీ నాయకత్వంలో మొదటిసారి కేంద్రంలో బిజెపి మెజార్టీ సాధించింది. ఆ వెంటనే రాహుల్‌ మాట్లాడుతూ సరైన నాయకత్వం లేకపోవడం ఈ ఓటమికి కారణమన్నారు. కాని బిజెపి ప్రభుత్వ పొరబాటు విధానాలు, అసహన రాజకీయాలు, మతతత్వ పోకడలపై పోరాడే బదులు తటపటాయింపులకు అవకాశమిచ్చారు. ఒక దశలో చెప్పాపెట్టకుండా మాయమైపోవడం దేశ రాజకీయాల్లోనే ఎరుగని పరిణామం. ఆ దశలో ఆయనేదో శిక్షణ తీసుకున్నారని తర్వాత సమర్థత పెరిగిందని ఒక ప్రచారం. బీహార్‌ శాసనసభ ఎన్నికలలో చొరవగా పాల్గొనడం, బిజెపిని ఓడించి లాలూ నితిష్‌ కాంగ్రెస్‌ కూటమి విజయాన్ని సుసాధ్యం చేయడంలో రాహుల్‌ కృషి మన్నన పొందింది. కాని యుపి, హర్యానా, మధ్య ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌… ఇంకా చాలా చోట్ల ఈ మంత్రం పారలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ కేవలం ఆరు చిన్న రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో వుంది.
ఇలాంటి తరుణంలో నాయకత్వం చేపడుతున్న రాహుల్‌ గాంధీ అస్తిత్వ సవాలునే ఎదుర్కోవలసి వుంటుంది. నోట్ల రద్దు తర్వాత ఆయన చొరవ కదలిక పెరిగిన మాట నిజం. దేశ విదేశీ గుత్తాధిపతులు కూడా మోడీ ఒక్కడినే నమ్ముకోవడం కన్నా రాహుల్‌ను కూడా అందుబాటులో వుంచుకోవడం అవసరమన్న అభిప్రాయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. అందుకే అమెరికా పర్యటనలో ఆయనకు చాలా ప్రచారమిచ్చారు. బిజెపి చెబుతున్నట్టు ఆయన మరీ ‘పప్పు’ కాదనీ, నాయకత్వ లక్షణాలు, సమస్యలపై స్పష్టత వున్నాయని ఆమెరికా మీడియాలోనూ రాజకీయ వర్గాలలోనూ వ్యాఖ్యలు మొదలైనాయి. దేశంలో బడా మీడియా కూడా రాహుల్‌ అంటేనే అపహాస్యం చేసిన దశ నుంచి రాజకీయ ప్రాముఖ్యత పెంచడం చూస్తున్నాం. కాంగ్రెస్‌ పాలిత హిమచల్‌లో పోలింగ్‌ పూర్తయిపోగా బిజెపికి ప్రాణవాయువులాటి గుజరాత్‌లో జరగబోతున్నాయి. మరో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రమైన కర్ణాటక కూడా ఎన్నికలకు వెళ్లవలసి వుంది. ఈ పలితాలు రాహుల్‌ నాయకత్వంపై చాలా ప్రభావం చూపిస్తాయనడం నిస్సందేహం. హిమచల్‌లో ౖ కాంగ్రెస్‌ ఓడిపోతుందనే అనుకుంటున్నారు. ఎందుకైనా మంచిదని ఆ ఫలితాలు రాకముందే ఆయన పదవీ బాధ్యతలు తీసుకుంటున్నారు. 1991 సరళీకరణకు కాంగ్రెస్‌ తలుపులు తెరిచింది.అమెరికాకు ఉపగ్రహంగా మారే ప్రక్రియ ఉధృతమైంది. అంతర్గతంగానూ ఆ పార్టీ పునాది బలహీనపడి బిజెపి ప్రధాన పార్టీగా ముందుకొచ్చింది. అవినీతి వ్యవహారాలతో మరీ అధ్వాన్న దశకు చేరింది. మరి వీటన్నిటినీ రాహుల్‌ గాంధీ మంత్రించినట్టు మాయం చేసి నూతనోత్సాహం తీసుకురాగలరా అనేది విధానపరంగా చేసే ఆలోచనలపైన అంతర్గత ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం వంటివాటిని పెంపొందించడంపైనా ఆధారపడి వుంటుంది. అలాంటి మార్పులు లేకపోతే కాంగ్రెస్‌ పూర్వ వైభవం గురించి, వంటరిగా అధికారం గురించి మాట్లాడ్డం అర్థం లేనిదవుతుంది. (ప్రజాశక్తి, నవంబరు 26, 2017)
000

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *