కుల ‘గీత’ల భగవద్గీత- 2

తాత్విక గ్రంధంగా చెప్పే గీతలో లెక్కలేనన్ని వైరుధ్యాలుంటాయి.కృష్ణుడు వేదాలను పాటించనవసరం లేదంటాడు,తనే వేదం అంటాడు. కర్మయోగం గొప్పదంటాడు, ఏ పని చేయకుండానే యోగసిద్ధి పొందవచ్చునంటాడు. యుద్ధం గెలిస్తే రాజ్యం వస్తుందంటాడు, కాని ప్రతిఫలం ఆశించకుండా పనిచేయమంటాడు. ఈ వైరుధ్యాలను అర్జునుడే ఎత్తిచూపినప్పుడు పొంతనలేని సమాధానాలిస్తాడు.దీనంతటికీ కారణం ఒక్కటే-పాత సమాజ నీతులలో పెరిగిన అర్జునుణ్ని మారుతున్న కాలానికి రాజ్యంఅవసరాలకు అనుగుణంగా యుద్ధంలో దింపాలి.కాని దానికి తాత్వికమైన తొడుగు కావాలి. అందుకే రకరకాల అంశాలు పరస్పర విరుద్ధమైనవి కూడా కలబోసి గందరగోళ పర్చాడు. ఆ పైన విశ్వరూపం చూపి లోబర్చుకున్నాడు. ఇప్పటికీ దైనందిన జీవితంలో కొందరు ఏదేదో చెప్పేస్తారు, వినకపోతే బెదిరించి లొంగదీసుకుంటారు. ఇక్కడ వర్గ నీతి కూడా వుంది. కులమే ధర్మం .ఫలితం ఆశించకుండా పనిచేయాలన్నది కిందివర్గాల కోసం.రాజ్యం వస్తుందనే ఆశ పై వారి కోసం!

ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా వున్న కుల ప్రస్తావన చూద్దాం.
న కాంక్షే విజయం కృష్ణా- న చ రాజ్యం సుఖాని చ!
కిం నో రాజ్యేన గోవింద- కిం భోగైర్జీవేవితే వా!! (1-32వ శ్లోకం)
(కృష్ణా! నాకు విజయము గాని రాజ్యము గాని సుఖములు గాని అక్కరలేదు.ఈ రాజ్యము వల్ల సుఖాల వల్ల భోగాల వల్ల జీవితం వల్ల ప్రయోజనం ఏమిటి)
క్లైబ్యం మాస్మ గమ: పార్థ-నై తత్వయ్యుపదపద్యతే!
క్షుద్రం హృదయ దౌర్బల్యం- త్యక్త్వోత్తిష్ట పరంతప!(2-3)
(పార్థా! పురుషత్వం కోల్పోవద్దు. నీ వంటి పురుషుడికిది ఉచితం కాదు. ఓ పరంతప, క్షుద్రమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని విడనాడి యుద్ధానికి నడుం బిగించు)
ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు. గిట్టదు. పుట్టి వుండలేదు. ఇది అజన్మ. నిత్యము. శాశ్వతము పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు(2-20)
స్వధర్మాన్ని బట్టి చూసినా నీవు సందేహించనక్కరలేదు. క్షత్రియునికి యుద్ధాన్ని మించిన నీతి దాయక కర్తవ్యం ఏదీ లేదు. ఓ పార్థ , ఇలాటియుద్ధం క్షత్రియులకు లభించడం అదృష్ఠం.ఇది స్వర్గానికి
తెరచిన ద్వారం. ఈ యుద్ధం నీకు ధర్మబద్దం. ఒక వేళ నీవు దీనిని ఆచరించకపోతే
స్వధర్మం నుంచి పారిపోయినవాడవవుతావు. దానివ్ల కీర్తిని కోల్పోతావు. పైగా పావము చేసిన వాడవవుతావు(2-31,32,33 శ్లోకాలు)

ఇలా భోగభాగ్యాలు వస్తాయని చెప్పిన కృష్ణుడే మళ్లీ 44వ శ్లోకానికి వచ్చేసరికి వివేకహీనులు మాత్రమే భోగభాగ్యాలలో తలమునకలవుతుంటారని విమర్శిస్తాడు. అంతేగాక 45వ శ్లోకంలో అసలు వేదాలు ప్రతిపాదించే త్రిగుణాలకు అతీతుడవు కమ్మంటాడు. బుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలాలను పరిత్యజించి జనన బంధాల నుంచి విముక్తులవుతారనీ,కష్టాల నుంచి విముక్తి పొందుతారని 51వ శ్లోకంలో వివరిస్తాడు. దేనిమీద ఆసక్తి లేనివాడే స్తిత ప్రజ్ఞుడనీ, తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్టు ఇంద్రియాదుల నుంచి విషయాల నుంచి ఉపసంహరించుకుంటేనే బుద్ధి స్థిరంగా వుంటుందని 57,58 శ్లోకాలలో బోధిస్తాడు. మరి జ్ఞానమే అంత శ్రేష్టమైనదైతే నన్నెందుకు భయంకరమైన యుద్దంలోకి దింపుతున్నావని అడుగుతాడు అర్జునుడు. ఈ కలగాపులగపు మాటలతో బుద్ధిభ్రమకు లోనుచేస్తున్నావని కూడా సూటిగానే చెబుతాడు. అప్పుడు కృష్ణుడు సాంఖ్యులకు జ్ఞానయోగం ద్వారా యోగులకు కర్మయోగం ద్వారా పరమపదం ప్రాప్తిస్తుందని కొత్త సూత్రంచెబుతాడు. ఇదంతా మూదవ అధ్యాయంలో వస్తుంది. కర్మ చేయకుండా వుండటం అసంభవమని అంటూనే ఆత్మతోనే తృప్తిపొందేవాడు నిత్య సంతుష్ఠుడని అలాటివాడిని ఏ కర్తవ్యమూ వుండదని మరో మాట చెబుతాడు.(17,18శ్లోకాలు) అసలు తనకు ఏ కర్తవ్యమూ వుండదని, అన్నీ పొందినప్పటికీ కర్తవ్యం చేస్తూనే వున్నానని లేకపోతే లోకాలు నాశనమై పోతాయని చెబుతాడు(22,23 శ్లోకాలు) మూడవ అధ్యాయంలోని ఈ భాగాన్నే తదుపరి కొనసాగిస్తూ సృష్టి రహస్యమంతా తనలోనే వుందని ప్రకటిస్తాడు.
ఇలా పరస్పర విరుద్ధంగా చెబుతున్న కృష్ణుడిని అర్జునుడు నీవు నిన్నమొన్న పుట్టినవాడివి కదా అంతా నేనేనని ఎలా చెబుతున్నావని నిలదీస్తాడు. అప్పుడు కృష్ణుడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేందుకు ప్రతి యుగంలో తను అవతరిస్తుంటానంటూ సంభవామి యుగేయుగే శ్లోకం(4-8) చెబుతాడు. కర్మల వల్ల ఫలాలు కోరుకునేవారు తనను ఆరాధిస్తారంటాడు.కర్మలు ఎలా చేయాలంటే-
గుణాన్ని బట్టి కులం కాదు, పుట్టుకతోనే..
చాతుర్వర్ణం మయాసృష్టం- గుణకర్మ విభాగశ:
తస్యకర్తారమపి మా విద్యకర్తార మవ్యయం (4-13)
ఇందులో రెండో సగాన్ని తీసుకుని గుణకర్మలను బట్టి తప్ప పుట్టుకతో కులాలు వస్తాయని కృష్ణుడు చెప్పలేదని వాదిస్తుంటారు. ఈ మధ్యన పరిపూర్ణానంద స్వామి ప్రత్యేకంగా ఇదే చెబుతున్నారు.కాని అర్జునుడు మనస్తత్వాన్ని బట్టి యుద్దం చేయలేనంటూ వుంటే క్షత్రియుడవు గనక తప్పక చేయాలని చెప్పడం కులధర్మమే. అసలు కర్మ అంటే ఏమిటో అకర్మ అంటే ఏమిటో మహాపండితులకు కూడా తెలియడం లేదని ఆయనే చెబుతాడు. తర్వాత అయిదో అధ్యాయానికి వచ్చే సరికి అర్జునుడు నీవు ఒకసారి కర్మ మంచిదనీ మరోసారి అకర్మ మంచిదని చెబుతున్నావేనని సందేహం వెలిబుచ్చుతాడు. కర్మ సన్యాసం కంటే కర్మ యోగం అంటే ఆచరించడం శ్రేష్టమైనదంటూ తద్వారా కులాల వారి కర్మలు చేయడం మంచిదని చెప్పేస్తాడు. ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయాలంటాడు. అక్కడి నుంచి తదుపరి మూెడు అధ్యాయాలలోనూ తనే భగవంతుడినని తనపైన మనసు లగం చేస్తే ముక్తి వస్తుందని అంటాడు. ఇతర దేవతలను కూడా పూజించేవారు తనను పూజిస్తే ఫలితం దక్కదంటాడు. తనను పూజించేవారు దుర్మార్గులైనా సత్పురుషుడే అవుతాడని చెబుతాడు(9-30) అంతకన్నా విపరీతం ఏమంటే కులాలలో పై కులాల వారు పుణ్యాత్ములనీ కింది కులాల వారు పాపులని సూటిగా చెప్పేస్తాడు

మాం హి పార్థ! వపాశ్రిత్య- యే పి స్యు: పాపయోనయ!
స్త్రియా వైశ్యౄస్థథా శూద్రా:- తేపి యాంతి పరాం గతిమ్‌ (9-32)
(పార్థా: స్త్రీలు వైశ్యులు శూద్రులు అట్లే పాప జన్మ కలవారు కూడా నా శరణుపొంది నన్ను చేరతారు)
కింపునర్బ్రాహ్మణా: పుణ్యా – భక్తా రాజర్సయస్తథా
అనిత్యమసుఖం లోకం- ఇమం ప్రాప్య భజస్వ మామ్‌ (9-33)
ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులు రాజులు నన్ను శరణుపొందితే వారు పరమపదాన్ని చేరతారని చెప్పవలసిన పనిలేదు. ఈ మానవ శరీరంక్షణ భంగురం. దు:ఖ భాజనం. కనుక నిరంతరం నన్నే భజించు.
ఇలా 9,10 అధ్యాయాలలో తన గొప్పతనాన్ని, అయోమయ వేదాంతాన్ని అదేపనిగా చెప్పిన కృష్ణుడు 11వ అద్యాయంలో భయంకరమైన విశ్వరూపం చూపిస్తాడు. అర్జునుణ్ని భయకంపితుణ్ని చేసినా అది అనుగ్రహం వల్ల ఆ రూపం చూడగలిగాడని అంటాడు. అతని అభ్యర్థనపై మామూలు రూపానికి వచ్చేస్తాడు. తర్వాత ఆరు అధ్యాయాలలోనూ మళ్లీ తన విశ్వజనీనత, వివిధ లక్షణాల వివరణ ఇదే నడుస్తుంది. కాని అసలు సందేశం మిగిలివుంది.
ఆఖరుదైన 18వ అధ్యాయంలో కుండ బద్దలు కొట్టినట్టు కుల ధర్మాలు మరింత సూటిగా బండగా చెప్పేస్తాడు. గుణాలను బట్టి కర్మలు అనే నిర్వచనం వెనక్కు నెట్టి సత్వ తమో రాజస గుణాలు ప్రకృతిసిద్దంగానే వస్తాయని వాటి ప్రకారమే మనుష్యుల కర్మలు నిర్ణయించబడతాయని(18-40 శ్లోకం)లో చెప్పేస్తాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలు అట్లే శూద్రుల కర్మలు వారి వారి ప్రకృతి సిద్ధ గుణాలను బట్టి విభజించబడి వున్నాయన్నాడు(18-41శ్లోకం)
నిశ్చలత నిగ్రహం సన్యాసం శుచిత్వంసహనం పారదర్శకత జ్ఞానం దేవుడిపై విశ్వాసం ఇవి బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు(శ్లోకం 42) శౌర్యం తేజస్సుధైర్యం దక్షత యుద్ధం నుంచి పారిపోకపోవడం దానం ఈశ్వరభావం తదితరమైనవి క్షత్రియుల స్వాభావిక కర్మలు(శ్లోకం 43) వ్యవసాయం పశుపోషణ వాణిజ్యం ఇవన్నీ వైశ్యుల స్వాభావిక కర్మలు. పరిచర్య(శారీరక శ్రమ)శూద్రుల స్వాభావిక కర్మ(శ్లోకం44) ఇలా నిర్దేశించిన తమ తమ స్వాభావిక కర్మలలో తత్పరులైన వారు దేవుడైన తనమీద మనసు లగం చేయడం ద్వారా ఉత్తమ గతి పొందుతారని హామీనిస్తాడు కృష్ణుడు. క్షత్రియుడుగా స్వభావ కర్మ కారణంగా యుద్ధం చేసి తీరాలని శాసిస్తాడు(శ్లోకం60)సర్వధర్మాలను పరిత్యజించి తన శరణు వేడితే అన్ని పాపాల నుంచి విముక్తున్ని చేస్తానంటాడు(శ్లోకం 66)
ఇదంతా విన్న తర్వాత అర్జునుడు తన మోహం లొలగిపోయిందంటాడు.

కనుక భగవద్గీతను వివరంగా పరిశీలిస్తే అందులోచెప్పింది రాజ్యరక్షణ కోసం గీసిన కులగీతలేనని తేలిపోతుంది. అవి స్వభావాన్ని బట్టి నిర్ణయించబడవు, ప్రకృతి సిద్ధంగానే అంటే పుట్టుకతోనే జరిగిపోతాయి. అప్పటికి నాలుగు వర్ణాలే వుండగా తర్వాత పంచములంటూ అయిదో తరగతిని సృష్టించి అతిదారుణంగా చాకిరీ చేయించుకోవడమే గాక మనుషులుగా కూడా చూడలేదు. ఈ వివక్ష ఇప్పటికీ అనేక రూపాల్లో కొనసాగుతూనే వుంది.
భగవద్గీతలో శ్లోకాలను ఘంటసాల గానంలో విని ఆనందించవచ్చు గాని వాటికి స్వాములు సన్యాసులు చెప్పే కపట వ్యాఖ్యానాల బుట్టలో పడకూడదు. గీతను కృష్ణున్ని దూషించడం కంటే అందులో సామాజిక సత్యాలు అన్వేషించడం కులాల మూలాలను బహిర్గతం చేయడం కీలకం. కృష్ణుడు అర్జునుణ్ని సమ్మోహనపరిచి భయపెట్టి లోబర్చుకుని వుండొచ్చు.కాని అదే మోహంలో ఇప్పటికీ కొట్టుకుపోవడం అర్థరహితం. మోడీ ప్రభుత్వం వచ్చాక భగవద్గీతను జాతీయ గ్రంధంగా చేయాలని విదేశాంగ మంత్రి ప్రతిపాదించడం, ఆయన విదేశీ పర్యటనలల దాన్ని తీసుకుపోయి తన కానుకగా ఇవ్వడం కూడా లౌకిక తత్వంతో పొసిగేవి కావు. భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ప్రజాశక్తి బుకహేౌస్‌ ప్రచురించిన యోధుడు సారథి చాలా ఉపయోగపడుతుంది.అందులో శ్లోకాలకు అచ్చతెనుగులో వాస్తవికార్థాలు వున్నాయి. ఇవి ఆధ్మాత్మికత పేరుతో ఇష్టానుసారం చేసిన భాష్యాలకు పూర్తి భిన్నంగా వుండటం చూస్తాం. (ఇందులో గీతలోని విషయాన్ని తప్ప కాల నిర్ణయం సమాజ పరిణామం వంటి అంశాలలోతుల్లోకి వెళ్లలేదు.)
డిడి కోశాంబి,దేవీ ప్రసాద్‌చటోపాధ్యాయ,రాంభట్ల కృష్ణమూర్తి, నంబూద్రిపాద్‌ వంటివారి రచనలు చదివితే ఆ విధమైన స్పష్టత వస్తుంది.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *