విన్యాసాలు విఫలం… ఆట ముగిసింది.. వేట మొదలైంది

తెలుగుదేశం పార్టీకి రేవంత్‌రెడ్డి రాజీనామా జరిగిపోయింది. ఇది పూర్తిగా వూహించిందే అయినా ఎందుకు ఆలస్యమైంది? ఎందుకింత తర్జనభర్జన జరిగింది? ఈ విషయంలో ఎవరు పై చేయి సాధించారు?
టిడిపి కాంగ్రెస్‌ల నుంచి ఇప్పటికి చాలామంది టిఆర్‌ఎస్‌లో చేరారు. తనూ వారిలో గప్‌చిప్‌గా చేరిపోతే ప్రచారం రాదని రేవంత్‌ భావించారు. నాటకీయ ప్రచార శైలి బాగా తెలిసిన ఆయన అధినేత విదేశాలకు వెళ్తున్న రోజును ఎంచుకున్నారు. అయితే మరోవైపువన పార్టీ సమావేశాలకు హాజరై గందరగోళం కొనసాగడానికి తద్వారా తనచుట్టూ కథనాలు తిరగడానికి వ్యూహం వేసుకున్నారు. షరా మామూలుగా మన మీడియా అదే చేసింది. ఈ లోగా రెండు రాష్ట్రాల తెలుగుదేశం నాయకులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాని వాటిని ప్రత్యక్షంగా గాక పరోక్ష పద్ధతిలో చిట్‌ చాట్‌ అంటూ చెప్పాల్సింది చెప్పేశారు. పార్టీ అధినేత చంద్రబాబుపై తిరుగుబాటుగా కనిపించకూడదు, కాని రెండు చోట్ల ఇతర నాయకులపై ఆరోపణలు కురిపించి తనే మెరుగనిపించుకోవాలి.
దీంతో పాటే ఈ వ్యాఖ్యల వల్ల టిడిపిలో ప్రకంపనాలు కలిగి తనకు గొప్ప మద్దతు ప్రజ్వరిల్లుతుందని కూడా ఆయన ఆశించివుండొచ్చు. దానివల్ల తన వెంట వచ్చేవారి సంఖ్యను అతిగా వూహించి వుంటారు.కాని అదేమీ జరగలేదు. అతి కొద్దిమంది మాత్రమే ఆయన వెంట నడుస్తున్నారు. టిడిఎల్‌పి సమావేశం వేసి మిగిలిన ఎంఎల్‌ఎలు రారనితెలిశాక వెనక్కు తగ్గారు. ఈ పరిస్తితుల్లో ఆయన తన రాజీనామా లేఖ ఇచ్చి బయిటకు వచ్చారు. అప్పటి వరకూ చిట్‌చాట్‌లలో చేసిన వ్యాఖ్యలు లేఖలో రాయకపోవడం వెనుకంజే. రేవంత్‌ ఆశించిన స్తాయిలో సంచలనం లేకపోగా చప్పగా ముగిసింది.
మరోవంక చంద్రబాబు కూడా ఆచితూచి వ్యవహరించారు. ఈ మాటల కారణంగా రేవంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు పట్టుపడుతున్నా కావాలనే కాలయాపన చేశారు. చివరి క్షణంలోనూ ముఖాముఖి మాట్లాడకుండా విలేకరుల సమావేశంలో కూచున్నారు. మరో విధంగా చెప్పాలంటే రేవంత్‌తో సావధానంగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. తాము చర్య తీసుకుంటే రేవంత్‌ సభ్యత్వం కొనసాగుతుందనీ, ఆయనే వైదొలగితే ఏ బెడద వుండదనీ చంద్రబాబు భావించారు. అదే జరిగింది. మరోవైపున ఇలాటివి కొత్త కాదని స్వంత భవిష్యత్తుకోసం వెళుతుంటారని తేలిగ్గా స్పందించారు. ఇది కూడా రేవంత్‌కు ఆశాభంగమే. తర్వాత టిటిడిపి అద్యక్షుడు రమణ గట్టిగానే విమర్శించారు.అయితే మొత్తంపైన ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా రేవంత్‌ను మరీ ఎక్కువగా తిట్టకుండా ఇప్పటికి తమ అనుచరుల నోటికి తాళం వేశారన్నది స్పష్టం. ఎవరూ ఏమీ అననప్పుడు ఆయన కూడా ఎదురుదాడిచేసే అవకాశం లేకుండా పోయింది.
శాసనసభకు రాజీనామా చేయడం రేవంత్‌ చేసిన మంచిపని. దాన్ని స్పీకర్‌కు ఎప్పుడు పంపుతారో ఎలా ఆమోదం పొందుతుందో తెలియదు. కాని ఉప ఎన్నికలలో మాత్రం గట్టిపోటీనే ఎదుర్కోవలసి వుంటుంది. టిఆర్‌ఎస్‌ మాత్రమే గాక అంతర్గత శత్రువులు కూడా ఆయనను ఓడించేందుకు చేయగలిగినంతా చేస్తారు. సాధారణంగా గెలవొచ్చు గాని ఒకవేళ ఓడిపోతే భవిష్యత్తు సమాధి అయిపోతుంది. కాంగ్రెస్‌లో విలువ పడిపోతంది. అసలు కాంగ్రెస్‌ ప్రాంగణంలో ప్రవేశించాక వ్యక్తులు నిమిత్తమాత్రులై అధిష్టానమే అన్నీఆదేశిస్తుంటుంది. ఒకరు చేసే దానిపై ఇతరులు విమర్శలు చేస్తుంటారు. ఇన్నిటి మధ్యనా ఎలా నెట్టుకొస్తారోతెలియదు. ఏమైనా ఇప్పటి వరకూ వున్న రేవంత్‌ వేరు, కాంగ్రెస్‌ నేతగా చూడబోయే రేవంత్‌ వేరు.
చివరంగా రేవంత్‌రెడ్డితో నాకున్న పరిచయాన్ని బట్టి కొన్ని ముక్కలు చెబుతాను. చురుకైన కరుకైన రేవంత్‌కు ముఖ్యమంత్రి కావడమే పరమాశయం. . చంద్రబాబు గురించి ఎంత చక్కగా మాట్లాడినా ఆయన సెంటిమెంట్లకు పెద్ద విలువ ఇచ్చేవ్యక్తి కాదు. చంద్రబాబు తడబాటుపై అసంతృప్తిని దాచుకునే వారూ కాదు. అవసరమైతే టిడిపిని వదలడానికి సిద్ధమని ఆయన ఎప్పుడూ పరోక్షంగా చెబుతూనే వున్నారు. రెడ్డి వర్గం గురించి కూడా మీడియాతో చాలా సార్లు మాట్లాడారు. తన మాటలూ చేతలూ తెలంగాణను వూపేస్తున్నాయని ఆయన నమ్ముతున్నారు. మీడియాలో ఎంత ప్రచారం వచ్చినా ఇంకా రావలసినంత రాలేదని కొరత పడుతున్నారు. పదేళ్లుతిట్టిపోసిన కాంగ్రెస్‌లోకి దూరడం ద్వారా ఇకపై తన నోరు కట్టేసుకోబోతున్నారు. కాబట్టి రేవంత్‌ భవిత నల్లేరు మీద నడక కాదు. భీకర పోరాటమే.కొడంగల్‌ ఉప ఎన్నికతోనే అది ప్రారంభం కావచ్చు. ముగిసిపోనూ వచ్చు. చరిత్ర ఎల్లకాలం ఎవరిచుట్టూ తిరగదు. పైగాఇప్పుడు ఆయన కాంగ్రెస్‌తో ముడిపడాల్సిందే.

ఓటుకు నోటు కేసులో రేవంత్‌ బెయిలుపై విడుదలైనప్పుడు ఆట మొదలైంది ఆని ఆయన అభిమానులు ఫ్లెక్సీలు పెట్టారు. ఇప్పుడు ఈ రాజీనామాతో ఆట ముగిసి వేట మొదలవుతున్నది. ఈ వేటలో ఎవరు ఎవరికి దొరుకుతారన్నది చూడాల్సిన విషయం. కెసిఆర్‌కు తానే సమవుజ్జీనని రేవంత్‌ అనుకుంటున్నారు గాని ఈ సందర్భంలో మాత్రం వారిద్దరి మధ్య చాలా దూరం వుంది. కాకపోతే విశృంఖల నిందారోపణల్లో మాత్రం రేవంత్‌ సమవుజ్జీ మాత్రమే గాక నాలుగాకులు ఎక్కువే చదివారని చెప్పొచ్చు. ఆ దూకుడును విధానాల చర్చలోకి మరల్చాలి. పైగా కాంగ్రెస్‌లో పాత కాపులకు సమవుజ్జీ కావడానికే రేవంత్‌ చాలా పెనుగులాడవలసి వుంటుంది

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *