విజయేంద్ర ప్రసాద్‌ ఆరెస్సెస్‌ కథలు

తెలుగుచిత్ర పరిశ్రమలో అభ్యుదయ భావాలూ, ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్టు తరహా పోరాటాలు పాటలూ ఎక్కువగానే కనిపిస్తుంటాయి. ఎన్టీఆర్‌ అలాటి ప్రజా పక్ష పాత్రలు వేయడం ద్వారానే ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమం చేసుకున్నారన్నది అందరికీ తెలుసు. అయితే క్రమేణా ఈ పరిస్థితి కొంత మారింది. వాణిజ్య ధోరణి వెర్రితలలు వేసింది. మరోవైపున చాపకింద నీరులా మితవాద మతవాద రాజకీయాలు కూడా ప్రవేశించాయి. 1986లో విజయవాడలో బిజెపి జాతీయ సమావేశాలు జరిగినపుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి వేదికమీద హాజరై స్వాగత గీతం పాడారు. తర్వాత ఆయనే వేటూరి సుందరరామమూర్తిని కూడా బిజెపి దగ్గరకు తీసుకెళ్లారు. సిరివెన్నెల మానసపుత్రుడైన కృష్ణవంశీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో ఖడ్గం సినిమాతో నేరుగా అప్పటి ప్రభుత్వ తరహా ప్రచారాన్ని వినిపించారు. అప్పుడే నాగార్జున ఆజాద్‌, జై వంటి చిత్రాలు కూడా వచ్చాయి. శ్రీరామదాసు చిత్రంలోనూ చరిత్రతో సంబంధం లేని కొన్ని నినాదాలు పెట్టారు. హిందీ డబ్బింగ్‌ను ఎల్‌.కె అద్వానీతో ఆవిష్కరింపచేశారు. ఇవన్నీ రాజకీయ కోణం లేనివి కాదు.
ఇప్పుడు దేశంలో అసహన రాజకీయాలు పెరిగి ఆరెస్సెస్‌ బిజెపిలపై విమర్శలు తీవ్రమవుతున్నాయి.తాజాగా విజరు తమిళ చిత్రం మెర్సల్‌లో నోట్లరద్దును విమర్శించినందుకు బిజెపి దాడి చేస్తున్నది.
ఈ నేపథ్యంలో ప్రసిద్ధ కథకుడు, ప్రఖ్యాత దర్శకుడైన రాజమౌలి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఆరెస్సెస్‌ అగ్రనేత ఆరాధ్యుడు గోల్వాల్కర్‌ జీవితం ఆధారంగా కథను తయారు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఏ రూపంలో వుంటుందో తెలియదు. తను రూపొందించే అనేక కథల్లో ఇదొకటిగా ఆయన చెప్పారు. ఒకవైపున ప్రజారోగ్యం వంటి విషయాలపై కథలు రాస్తానంటూనే గోల్వాల్కర్‌ జీవితాన్ని తెరకెక్కించాలనుకోవడం కొత్త పరిణామమే. ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడిన ఒక వీరుడి కథ కూడా రాస్తారట. అది కూడా అలాటి సంకేతమే.
నిజానికి ఈ తండ్రీ కొడుకుల చిత్రాలలో ఫ్యూడల్‌ భావజాలం పుష్కలంగా వుంటుందని గతంలోనే రాశాను. బాహుబలికి ప్రధానాకర్షణ ఒక బానిసయోధుడు కట్టప్పకావడం కాదనలేని వాస్తవం. మరి విజయేంద్ర ప్రసాద్‌ నిర్ణయం ఆ ధోరణికి పరాకాష్ట అనుకోవాలా? తెలుగు సినీ రంగంలోనూ కాషాయ పవనాలు వీస్తాయా? సరే ఎవరి ఇష్టం వారిది. కాని తెలుగు సినిమా మాత్రం అభ్యుదయ మార్గంలో వుంటుందనుకోవచ్చు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *