మామ అల్లుళ్ల అవిశ్వాసం- లక్ష్మీపార్వతి ప్రభావం -నిజానిజాల ఇంటర్వ్యూ

చాలా కాలంగా నేను నందమూరి లక్ష్మీపార్వతి గారితో చర్చలలో పాల్గొంటున్నా, ఆమె గౌరవంగా మాట్లాడుతున్నా ఇంటర్వ్యూ చేసేపని పెట్టుకోలేదు. ఆమెను ఎన్టీఆర్‌ వివాహం చేసుకోవడం విషయంలో ఎవరికీ ఎలాటి ఆక్షేపణలకూ ఆస్కారమే లేదు. ఎన్టీఆర్‌ వివాహంపై, లేదా లక్ష్మీ పార్వతిపై పనిగట్టుకుని ప్రచారం చేయడం వంటివిగాని, కుటుంబంలో వ్యతిరేకత పెరగడం గాని కాదనలేనివి.అయితే 1995 ఆగ!ుష్టులో ఎన్టీఆర్‌పై వచ్చింది తిరుగుబాటా వెన్నుపోటా అనే విషయంలో నా అభిప్రాయాలు భిన్నంగా వున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే తర్వాత చంద్రబాబుపై నాకు తీవ్ర విమర్శలు వున్నా ఆ సమయంలో అంతా బహిరంగంగానే జరిగిందని నాటి పరిణామాలు చూసిన నివేదించిన వ్యాఖ్యానించిన నా ఉద్దేశం. అప్పుడు వాటిని ఎక్కువ చేసిన నా పాత్రికేయ మిత్రులు కూడా ఇప్పుడు తమ అనుబంధాలను బట్టి అనేక విధాల మాట్లాడుతుంటారు. అయితే కుటుంబాలు రాజకీయాలు కలగలసి పోయినప్పుడు వచ్చే సమస్య ఇది. మనకు ప్రజల కోణం రాజకీయ కోణం ముఖ్యం గనక ఆ విధంగానే మన పరిశీలన వుండకతప్పదు. బాలకృష్ణ ఎన్టీఆర్‌ బయోపిక్‌ ప్రకటించినప్పుడు చర్చలలో ఎన్టీఆర్‌ అంటే కేవలం చివరి దశ మాత్రమే కాదు, లక్ష్మీ పార్వతి అధ్యాయం అందులో ఒక భాగమేనని ఆమెతోనే వాదించాను కూడా. ఇటీవల రామ్‌గోపాల్‌ వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ నిర్మాణం ప్రకటించడంతో తెలుగు పాపులర్‌ నిర్వాహకుల కోరిక మేరకు ఆమెను ఇంటర్వ్యూ చేసే సందర్భం వచ్చింది. నాటి ఘటనల గురించి నా అభిప్రాయాలనే గాక తర్వాతి కాలంలో జయప్రకాశ్‌ నారాయణ్‌, ఐ.వెంకట్రావ్‌,దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి వారు బహిరంగంగానూ, చంద్రబాబు నాయుడు సంభాషణలలోనూ చేసిన కొన్ని వ్యాఖ్యలను నిర్ధారించుకునే వీలు కలిగింది. అంతా అయ్యాక తేలిందేమంటే-
1.లక్ష్మీపార్వతి రాజకీయంగా బలంగానే జోక్యం చేసుకున్నారు. కాకుంటే అది భర్త కోసం , ఆయనకు సహాయంగా చేశానంటున్నారు
2.1994 ఎన్నికలకు ముందే ప్రాంతీయ సదస్సులతో తన సత్తా ఎన్టీఆర్‌కు తెలిసిందంటున్నారు.ఇక ఆ ప్రచారంలో తనే ప్రధాన ఆకర్షణ అని ఆమె నమ్ముతున్నారు. తర్వాత వచ్చిన స్థానిక ఎన్నికలలోనైతే తన చేతిమీదుగానే నడిచినట్టు భావిస్తున్నారు
3.ఎన్టీఆర్‌ మొదటి నుంచి చంద్రబాబు పట్ల అవిశ్వాసంతో వున్నారు. ఆ విషయాలు ఆమెతో పంచుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో ఉప ఎన్నికల తర్వాత పూర్తిగా వెళ్లిపోమని ఆయన ఆదేశిస్తే తను జోక్యం చేసుకుని చేతిలో చేయి వేయించుకుని కొనసాగించేలా ఒప్పించారు. దగ్గుబాటి ఈ ఘట్టాన్ని గురించే దెప్పిపొడుస్తున్నారు
4. చంద్రబాబుకు రెండు పదవులు ఇచ్చామని విజయవాడలో విలేకరులతో అనడం కేవలం ఒక పత్రిక కల్పన కాదు. ఒక వేళ తెలిసీ తెలియక అన్నా అంత రాద్ధాంతం అవసరమా అని అడుగుతున్నారు.
5. ఎన్టీఆర్‌పై విశ్వాసం లేదంటూ గవర్నర్‌కు మెమోరాండం ఇచ్చేందుకు వెళుతున్న విషయం రాత్రి ఐ.వెంకట్రావు ఫోన్‌ చేసి చెప్పారో లేదో గుర్తు లేదంటున్నారు. అంత చెప్పిన వ్యక్తి అవతల శిబిరంలో ఎలా చేరారని ప్రశ్నిస్తున్నారు
6.మొత్తంపైన ఈ ఉదంతంలో ఇన్నేళ్ల తర్వాత కూడా తన వైపు నుంచి ఎలాటి పొరబాటు గాని తప్పిదం గాని జరిగిందని ఆమె భావించడం లేదు
7.వైసీపీ కూడా తనను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదనీ, ఇంతవరకూ ఒక్కసారి కూడా వారి కార్యాలయంలో పత్రికాగోష్టి జరపలేదని చెబుతున్నారు.వైసీపీలో చేరడం ఎన్టీఆర్‌ ఆశయాలకు వ్యతిరేకం కాదని వివరిస్తున్నారు.
8.లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ తీస్తున్నందుకు మరీ ఎక్కువ సంతోషించడం లేదు. తీసే నిర్మాత రాకేశ్‌ ఎవరో ఆమెకు తెలియదట. ఆ చిత్రంలో తనకు న్యాయం జరిగితే రాజకీయాల నుంచి కూడా విరమించుకోవడానికి సిద్ధమేనంటున్నారు
9.కుటుంబ పరంగా బాలకృష్ణ మాత్రమే ఆమెను ఆదరించగా పురంధేశ్వరి ఎక్కువగా వ్యతిరేకించారు. మొదట వ్యతిరేకత పెంచింది ఆమేననన్న విషయంలో మాత్రం చంద్రబాబుతో ఏకీభవిస్తున్నారు.
10. ఆనాటి పరిణామాలపై జయప్రకాశ్‌ నారాయణ్‌ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా ఆమెకు అభ్యంతరాలు వున్నాయి.

ఇంటర్వ్యూలోని కొన్ని ప్రధానాంశాలు ఇవి. లక్ష్మీ పార్వతి ఇప్పుడు రాజకీయాల్లో కీలక పాత్ర ముఖ్య పాత్ర వహించే అవకాశం చాలా తక్కువే అయినా ఒకప్పటి పరిణామాలపై నిజానిజాలు తెలుసుకోవడానికి ఈ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది. వీలైనంత వరకూ సెంటిమెంటల్‌, కాంట్రవర్సియల్‌ విషయాలు తగ్గించడానికి ప్రయత్నించాను. ఎందుకంటే ఇది కేవలం రాజకీయ చరిత్ర కోణం తప్ప వారి కుటుంబంలో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అన్న మీమాంసతో సంబంధం లేదు.ఓపిక వున్న వారు దీన్ని జాగ్రత్తగా చూస్తే నేను చెప్పిన అంశాల నిజానిజాలు వారికే అర్థమవుతాయి.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *