మీడియాధిపతులూ, దోస్తులూ!

మీడియాలో ఎక్కువ భాగం మిత్రులే గనకా- దాదాపు అన్ని ఛానల్స్‌కూ వెళ్తాను గనకా- ఆంధ్రజ్యోతి కాలమిస్టును గనకా- మీడియా ధోరణులపై వ్యాఖ్యానించడం ఒకింత ఇబ్బందిగానే వుంటుంది. అయినా అందరికీ కనిపిస్తున్న వాటిపై కూడా మాట్లాడకపోతే పొరబాటవుతుంది.
అనంతపురంలో పరిటాల శ్రీరాం పెళ్లికి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ హెలికాప్టర్‌లో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ దిగడం ఎవరినీ ఆశ్చర్యపర్చలేదు. వారిద్దరూ పూరాశ్రమంలో మంచి మిత్రులని అందరికీ తెలుసు. అయితే కొద్ది మాసాల ఆటు ఎబిఎన్‌ ప్రసారాలను నిలిపేయడం, కారాలు మిరియాలూ నూరుకోవడం నేపథ్యంలో ఇది కొంతవింతగా అగుపించవచ్చు. అయితే ఎర్రవల్లిలో యాగానికి వెళ్లిన సమయంలోనే ఈ దూరం చెరిగిపోయిందని కూడా కొందరు గుర్తు చేశారు. ఇప్పుడున్న మీడియాలో స్వయంగా జర్నలిస్టుగా కొనసాగుతూ సమాజంలో ఒక భాగానికి హీరోచితంగా కనిపించే ఆర్కే కెసిఆర్‌ వెంట దిగడం ఆయన ఇమేజిపై ఎలాటి ప్రభావం చూపిస్తుందని మీడియా వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గరా మాట చెల్లించుకోగల సత్తా తనకే వుందని ఈ అభిమాన బృందం ఆనందిస్తుందని మరో అంచనా. కెసిఆర్‌ అనంతపురం యాత్ర వెనువెంటనే రాజకీయ సామాజిక పునస్సమీకరణల గురించి వినవస్తున్న కథనాలు దీని కొనసాగింపుగానే చూడాల్సి వుంటుంది. ముఖ్యమంత్రి మీడియా గోష్టికి ఆంధ్రజ్యోతిలో నాది తెలంగాణ కులం అంటూ ఇచ్చిన శీర్షిక, ఈనాడులో నేను దొరను కానంటూ పెట్టిన శీర్షిక కూడా ఒకే కోణంలో చూస్తున్నారు.అయితే ఇప్పటికీ ఆంధ్రజ్యోతి వివిధ రాజకీయ సామాజిక కోణాలను ప్రతిబింబిస్తుందనే ప్రతిష్ట వుంది.
ఇలాటి పరిస్తితి రెండేళ్ల కిందట రామోజీరావు జగన్‌ ల విషయంలో చూశాం. అప్పటి వరకూ జగన్‌కేసుల వార్తలే గాక పరిశోధనాత్మక కథనాలూ కూడా పేజీల కొద్ది వస్తుండేవి. నేనే కొన్ని డజన్ల చర్చలలో పాల్గొని వుంటానా ఛానల్‌లో. అలాటిది ఒక శుభ ముహూర్తాన జగన్‌ రామోజిని సందర్శించడం, కొన్నాళ్లలోనే ఈ కేసుల ఫోకస్‌ ఆగిపోవడం అందరూ చూస్తున్నారు. స్వతహాగా పెద్ద మీడియాధిపతి అయిన రామోజీతో ఇద్దరు ముఖ్యమంత్రులే గాక వెంకయ్యనాయుడు కొంతవరకూ ఫ్రధాని మోడీ కూడా మంచి సంబంధాలు పాటిస్తుంటారనేది అందరికి తెలుసు. సంబంధాలు తప్పు కాదు గాని వాటి ప్రభావాలు మీడియాపై పడుతున్నాయా అనేదే ప్రశ్న.
ఈ కోవలోకి రాకపోయినా మిత్రుడు మాజీ సంపాదకుడు టంకశాల అశోక్‌ నమస్తే తెలంగాణలో రాసే వ్యాసాలు చూస్తే ఎంతసేపటికీ పభుత్వాన్ని ఏదో విదంగా సమర్థించడమే గాక విమర్శలను విమర్శించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనికోసం ఏవేవో తర్కాలు సూత్రీకరణలూ తీసుకొచ్చినా సారాంశంలో తేడా వుండదు. కెసిఆర్‌ కెటిఆర్‌ వంటివారైనా కొన్నిసార్లు కొన్ని విమర్శలు స్వీకరిస్తారేమో గాని ఈ సంపాదకమిత్రుడు ససేమిరా ఒప్పుకోరు. ఒకప్పుడు టంకశాల లశోక్‌, ఎబికె ప్రసాద్‌ల సంపాదకీయాల పుస్తకాన్ని పరిచయం చేసిన వ్యక్తిగా ఈ మార్పు చాలా ఆసక్తి కలిగిస్తుంది.

ఇక్కడే సాక్షి గురించి కూడా చెప్పుకోవచ్చు. అనతి కాలంలో బాగా అభివృద్ది చెందిన సాక్షి ప్రభుత్వాల అవకతవకలపై అధ్యయనాత్మక కథనాలు ఇస్తుండేది. కాని ఇటీవల రాజకీయం ఎక్కువై విషయం తగ్గుతుందన్న భావన పెరుగుతున్నది. వైసీపీ నేతలు కూడా చాలామంది సాక్షితో పాటు ప్రజాశక్తి కూడా చూస్తేనే ప్రజా సమస్యలు ప్రత్యామ్నాయ విధానాలు తెలుస్తాయని చెబుతున్నారు. ప్రజాశక్తి విభజన తర్వాత బాగా పెరుగుతున్నది కూడా. తెలంగాణలో దాని స్థానంలో వచ్చిన నవతెలంగాణ కూడా విమర్శనాత్మకపత్రికగా ఒక గౌరవం పొందుతున్నది. టిఆర్‌ఎస్‌ మిత్రులు కూడా దాంట్లో వచ్చే వార్తలు కథనాల గురించి మాట్లాడుతుంటారు.
దీర్ఘకాలంగా మీడియాతో రాజకీయాలతో సంబంధం వున్న వ్యక్తిగా కొన్ని పరిశీలనలు చెప్పడమే తప్ప ఎవరూ ఎక్కువనీ తక్కువనీ చెప్పడం కోసం ఇది రాయలేదని అర్థం చేసుకోగలరని విశ్వాసం.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *