ప్రగతిభవన్‌లో అసహనం, అభద్రత

సింగరేణిలో టిబిజికెఎస్‌ విజయోత్సవాన్ని వివాద గ్రస్తం చేసుకోవడం పూర్తిగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్వయంకృతమే.ఎన్నికల నియమావళి వుండి వుంటే ఒక ముఖ్యమంత్రి అధికార నివాసంలో ఒక కార్మిక సంఘం గెలుపుకోసం మాట్లాడ్డం ఆక్షేపణీయమై వుండేది. అలాటిది లేదు గనకే బాహాటంగా తమ సంఘం కోసం సర్కారు తరపున ప్రచారం చేసుకోవడమే గాక సకల వనరులనూ గుమ్మరించి విజయాన్ని సాధించారు. ఏదైనా విజయం విజయమే గనక వేడుక చేసుకోవచ్చు. కాని ఆ వూపులో కెసిఆర్‌ మాట్లాడిన మాటలు అసహనానికి అభద్రతకూ పరాకాష్టగా వున్నాయి. ప్రతి ఎన్నికల్లో విజయపరంపరలు సాధిస్తున్నామంటున్న ఆయన నిజంగా దానివల్ల ఆత్మవిశ్వాసం పొందివుంటే ఒక యూనియన్‌ విజయానికి ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసి వుండేవారు కాదు. బహుశా ఈ విజయం వచ్చాక మాట్లాడ్దానికే ఆయన చాలా అంశాలు అట్టిపెట్టుకున్నట్టున్నారు. కెసిఆర్‌ మీడియా గోష్టికి ముందే దీనిపై టీవీ చర్చల్లో నేను నాలుగు అంశాలు చెప్పాను. అవి మరో చోట చూడొచ్చు.
తొక్క కుక్క లంగ, వాడు వీడు వంటి మాటలు ఆ స్థాయిలో వూహించలేము. పైగా గతంలో తనకు కుడిభుజంగా ఒక సమీకరణ బిందువుగా పనిచేసిన కోదండరాం వంటివారి గురించి మాట్లాడ్డం అనైతికం కూడా. ఆయనను ఎంతైనా విమర్శించవచ్చు గాని తనే తయారు చేశానని, తన పార్టీనే జెఎసి అని మాట్లాడ్డం ఇటీవలి చరిత్రను కూడా వక్రీకరించడమే అవుతుంది.
ఇది కెసిఆర్‌ ఈ గోష్టిలోనే చెప్పిన మాటలకు కూడా విరుద్ధంగా వుంది. ఎవరూ వ్యక్తులతో పార్టీలు రావనీ నిలవలేవని అంటూ చెన్నారెడ్డిని, చిరంజీవిని ఉదాహరణగా చెప్పారు. బాగానే వుంది. మరి అదే మాట తన పార్టీకీ తన నాయకత్వానికి వర్తించదా? ఆయన చేస్తే ఎవరైనా నాయకులై పోయి తీసేస్తే చెల్లకుండా పోతారా? బంగారం, నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీక అని తనే వర్ణించిన కోదండ ఇప్పుడు కొరగానివాడై పోతాడా? . ఇప్పుడు వెనక్కు తిరిగి చూస్తే కోదండరాం కెసిఆర్‌ ఉభయులకూ ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని స్పష్టమవుతుంది. నేను చేసిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మొదటి నుంచి తేడాలు వుంటూనే వచ్చాయని, తర్వాత కూడా పోరాడవలసి వుంటుందని తమకు తెలుసని చెప్పారు! ఆ ఘట్టాలన్నీ ప్రత్యక్షంగా చూస్తూవారితో వాదనలు చేస్తూ వున్న నావంటి వారికి అదంతా ఒక రీలులాగా గుర్తుంది. అయితే ఇప్పుడు కూడా కోదండరాం వ్యక్తిగతంగాపెద్ద స్పందించకుండా విధానాలపైనే కేంద్రీకరించడం బాగుంది. కోదండరాం భవిష్యత్‌ వ్యూహం పార్టీ ఏర్పాటు వంటివి ఇంకా అస్పష్టమే కావచ్చు. కాని ఆయన ఆలోచనలు ఆయనవి.
జానారెడ్డిని కూడా గతంలోఏదో చేశారంటూ కెసిఆర్‌ దరిద్రుడు, దొంగ వంటి పదాలు వాడటం ఉద్రేకాన్ని ఉక్రోషాన్ని సూచిస్తుంది.ఆ రోజుల్లో కెసిఆర్‌కు తనతో మాట్లాడే సత్తా స్థాయి వుండేవి కావని, తను మాట్లాడినట్టు నిరూపించే ఒక్క సాక్షినైనా తీసుకురాగలరా అని ఆయన సవాలు చేస్తున్నారు. వీటన్నిటివల్లఏం సాధించినట్టు? కాంగ్రెస్‌ నిర్ణయాత్మక పాత్ర లేకపోతే తెలంగాణ సాధ్యమయ్యేది కాదని అందరికీ తెలుసు. పిసిసి అద్యక్ష పదవి ఇస్తే కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని కెసిఆర్‌ సిద్ధపడ్డారని ఆయనతో అప్పుడూ ఇప్పుడూ సన్నిహితంగానే వున్న ప్రకాశ్‌ నాకో ఇంటర్వ్యూలో చెప్పారు. పిసిసి అద్యక్ష పదవికి సిద్ధపడిన నేత, టిడిపిలోనూ అనేక బాధ్యతలు నిర్వహించిన నేత ఇప్పుడు కడిగిన ముత్యంలా ఎలా మాట్లాడతారు? వారి నిర్వాకాల్లో ఆయనకూ భాగముంటుంది కదా?
పైగా ఆ రోజులలో తమ తరపున సమన్వయం చేసిన కోదండరాంపై విరుచుకుపడుతూ అప్పట్లో తనను దూషించిన వ్యతిరేకించిన వారిని మంత్రులుగా సలహాదారులుగా చేసుకోవడం ఎలాటి ద్వంద్వనీతి?

కమ్యూనిస్టులు ప్రగతిశీలంగా ఆలోచిస్తారని ఆయన సానుకూలంగానే చెప్పారు. అయితే వారు ప్రజల తరపున చేసే పోరాటాలు నెగిటివ్‌ మైండ్‌సెట్‌ అనుకుంటే ఎలా? సద్విమర్శలు స్వీకరిస్తామనే వారు మీడియలో సోషల్‌ మీడియాలో వచ్చే రాతలపై చర్యలు తీసుకుంటామని బెదిరించడం దేనికి సంకేతం?
కెసిఆర్‌ ఇవన్నీ పరిశీలించుకోవలసిన అవసరం వుంది. వాగ్బాణాలు వ్యూహాలు మాత్రమే ఎప్పుడూ కాపాడబోవు. కెసిఆర్‌పై మిగిలిన వారి రాజకీయ శైలికి భిన్నంగా టిడిపి నేత రేవంత్‌ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలలోనూ అవాంఛనీయమైన ధోరణులున్నాయి. ఆఖరుకు తమ పార్టీ వారిని కూడా ఆయన వదలిపెట్టడం లేదు. ఇది కొంతమంది భక్తులకు నచ్చవచ్చునేమో గాని ప్రజలు మెచ్చరు. రాజకీయ సంవాదాలెప్పుడూ హుందాగా విషయ ప్రధానంగా జరగాలి.
ఎన్నికల తర్వాత ఎన్‌డిఎతో పొత్తుకు తలుపులు తెరిచే వుంటాయని చెప్పడంలోనూ అవకాశవాదమే గోచరిస్తుంది. కులాల వారి రాజకీయాలు నడవవని చెప్పడం బాగానే వుంది గాని ఆయన వేసే ప్రతి అడుగులో కులాలవారి ప్రసన్నం చేసుకోవడం ప్రధాన లక్ష్యంగా వుందని ఆయన శిష్యులే చెబుతున్నారు. పాత్రికేయ ధర్మం ప్రకారం పేర్లు చెప్పడం లేదు.
చివరగా ఒకటి వాస్తవం. 2014 ఎన్నికలలో లాగే సింగరేణిలోనూ టిఆర్‌ఎస్‌కు పరిమితమైన ఆధిక్యతే వచ్చింది. నల్గొండపైన చేసిన సర్వేలోనూ యాభైశాతం ఓటింగు లేదు. మధ్యలో జరిగిన రెండు ఉప ఎన్నికలు జిహెచ్‌ఎంసి ప్రత్యేక పరిస్థితులు మినహాయిస్తే రాజకీయంగా ఏకపక్ష వాతావరణం లేదన్నది నిజం. పాలనా పరంగా కలెక్టర్లు ఎంఎల్‌ఎల వివాదాలు, నాయకుల మధ్య కలహాలు , కుటుంబ వారసత్వంలో ప్రచ్చన్న యుద్ధం ఇవన్నీ కెసిఆర్‌ పాలనకు ఇరకాటాలే. బహుశా ఆ అసౌకర్యం నుంచి వచ్చిన అభద్రతే అసహనానికి దారితీసి అనరాని మాటలు అనిపిస్తుండొచ్చు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా చారిత్రికమైన అవకాశం పొందిన కెసిఆర్‌ తనే చెప్పిన పరిస్తితులు సమీకఱణలు కూడా గమనంలో పెట్టుకుని ప్రజాస్వామికంగా అడుగులేస్తే మేలు జరుగుతుంది.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *