కేరళలో కాషాయ కథా కళి!

కథాకళి నృత్యానికి, కమ్యూనిస్టు రాజకీయాలకు ప్రసిద్ధిగాంచిన కేరళ ఇప్పుడు బిజెపి కేంద్ర నేతల మంత్రుల రాజకీయ యాత్రలకు కేంద్రంగా మారడం విచిత్రం, విశేషం. తమ కార్యకర్తలపై హత్యాదాడులు జరుగుతున్నాయి గనక అక్కడున్న పినరాయి విజయన్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని ఆరెస్సెస్‌ ఆగష్టు5న ఢిల్లీలో హడావుడి చేసింది. అదే సమయంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పర్యటించి ౖ విమర్శలు గుప్పించి వెళ్లారు. ఇప్పుడు ఆ పార్టీ అద్యక్షుడు అమిత్‌ షానే జనరక్షణ యాత్ర పేరిట పదిహేనురోజుల ప్రహసనం నడిపిస్తున్నారు. ఆయనకు తోడుగా ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగిపోయారు. అరవై ఏళ్ల కిందట కేరళలో ఇంఎంఎస్‌ నంబూద్రిపాద్‌ మంత్రివర్గం ఏర్పడినప్పుడు ప్రపంచంలోనే మొదటి ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వంగా ప్రశంసలు కురిస్తే శాంతి భద్రతలు లేవన్లి కాంగ్రెస్‌ అద్యక్షురాలు ఇందిరాగాంధీ చేసిన విమోచన యాత్ర ఇప్పుడు గుర్తుకు వస్తుంది. కేంద్రంలోని ఆమె తండ్రి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆ ప్రభుత్వాన్ని 1959లో బర్తరఫ్‌ చేశారు.ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాల తొలగింపు మొదలైంది. ఇప్పుడు ఆరెస్సెస్‌ అడగడం, అరుణ్‌జైట్లీ, అమిత్‌ షా , ఆదిత్యనాథ్‌ ఆగమనం ఆరోపణలూ అన్నీ ఆ దిశలోనే వుండటమే కాదు, అంతకన్నా ఆందోళనకరంగా సాగుతున్నాయి.
ఆరెస్సెస్‌ వారైనా కమ్యూనిస్టులైనా ఎవరూ హత్యలకు గురి కాకూడదనే కోరుకోవాలి. దురదృష్టవశాత్తూ కేరళలోని కన్నూరు జిల్లాలో అలాటి వాతావరణం కొనసాగుతున్నది. ఆ ఒక్కచోటే ఆరెస్సెస్‌పై పనిగట్టుకుని దాడి చేయాల్సిన అవసరం సిపిఎంకు ఏముంటుందనేది ఆలోచించాల్సిన విషయం. అక్కడ కొంత పట్టు సంపాదించిన ఆరెస్సెస్‌ మరింత విస్తరించేందుకు చేసే వ్యూహంలో ఇలాటి ఘర్షణలు పెరిగివుండొచ్చు. 70వ దశకం చివరలో చెదురుమదురుగా జరిగే ఈ హత్యలు తర్వాత పెరిగాయన్నది కూడా నిజమే. అయితే ఇవి పరస్పర హత్యలే గాని ఏకపక్షంగా ఒకవైపే వున్నాయన్నది మాత్రం నిజం కాదని వాస్తవాలు చెబుతున్నాయి. 1971 నుంచి 2017 వరకూ చూస్తే రాష్ట్రంలో జరిగిన రాజకీయ హత్యలలో సిపిఎంకు చెందిన వారు 527 మంది చనిపోగా మిగిలిన అన్నిపార్టీల వారూ కలిపి 442 మంది మరణించారు. ఇందులో 185 మంది సంఫ్‌ుకు చెందినవారని పోలీసు లెక్కలు చెబుతున్నాయి. 2000-2017 మధ్య కాలంలో చూస్తే సిపిఎం వారు 86 మంది హత్యకు గురైతే ఆరెస్సెస్‌ వారు 65 మంది మరణించారు. ఇదే కాలంలో గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగా వుందని రికార్డులు చెబుతున్నాయి. .ఎల్‌డిఎప్‌ విజయం సాధించిన రోజునే విజయయాత్రపై విజయన్‌ స్వగ్రామంలోనే దాడి చేసి రవీంద్రన్‌ అనే కార్యకర్త హత్యకు కారణమైనారన్నది కాదనలేని ఒక ఉదాహరణ.పాలకపక్షంగా వరుసవారీగా కొనసాగుతున్న ఒక పార్టీకి సంబంధించిన వారు ఒక పరిమిత శక్తిగా వున్న ఆరెస్సెస్‌వారి చేతిలో ఇంత మంది చనిపోయారంటే ఎవరు సంయమనం చూపుతున్నది కొంత తెలుస్తుంది
అయినా హత్యలు ఘర్షణలు మంచివి కావు గనకనే ముఖ్యమంత్రి విజయన్‌ ఆగష్టు6న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడాన్ని చాలామంది హర్షించారు. దానికి ముందు సిపిఎం బిజెపి ఆరెస్సెస్‌ ప్రతినిధులతోచర్చలు జరిపారు. ఆరుణ్‌జైట్లీ అదేరోజున కేరళకు వెళి దానికి విలువ లేకుండా చేసి వచ్చారు. ఇప్పుడు అమిత్‌షా, ఆదిత్యనాథ్‌లు. షా హౌంశాఖ సహాయమంత్రిగా వుండగా(అసలు శాఖ చూసింది మోడీజీనే) గుజరాత్‌లోనూ ఇప్పుడు ఆదిత్యనాత్‌ పాలిస్తున్న ఉత్తర ప్రదేశ్‌లోనూ మత మారణహౌమాలూ, హత్యలు దౌర్జన్యాలు ఏ స్థాయిలో వున్నదీ చూస్తూనే వున్నాం. 2002 గుజరాత్‌ జాతి హత్యాకాండపై ఇప్పటికీ పశ్చాత్తాపం లేదు. ఇక ఉత్తర ప్రదేశ్‌లోనైతే యోగి అధికారంలోకి వచ్చాక రెండు నెలల కాలంలోనే 729 హత్యలు, 803 బలాత్కారాలు జరిగినట్టు 2017 జులై 18న ఆ ప్రభుత్వమే శాసనసభలో వెల్లడించింది. గో సంరక్షణ పేరిట ఘోరాలూ మైనార్టీలు దళితులపై దాడులు మరింత దారుణం. దేశంలో మత కలహాలు దాడులు హర్యానా, కర్ణాటక,మహారాష్ట్ర,బీహీర్‌, జార్ఖండ్‌, యుపిలలో అత్యధికంగా జరుగుతున్నట్టు జాతీయ నేరాల విభాగం ప్రత్యేకించి పేర్కొంది. ఆ జాబితాలో కేరళ పేరేలేదు! అయినా సరే అరుణ్‌జైట్లీలకు అమిత్‌ షాలకు కేరళ టెర్రరిస్టు రాష్ట్రంగా కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారంల ప్రధాని మోడీ కేరళలను సోమాలియాతో పోలిస్తే ఇప్పుడు ఆదిత్యనాథ్‌ జీహాదీ నేలగా చిత్రిస్తున్నారు.క్రైస్లవముస్లిం జనాభా గణనీయంగా వున్నా మతసామరస్యంతో జీవిస్తున్న చోట ఇలాటి వ్యాఖ్యలు ఎంత హానికరమో వారికి పట్టదు. 100 శాతం అక్షరాస్యతతో సామాజిక సూచికల్లో ముందంజలో వున్న కేరళను తమ అవసరాలకోసం తప్పుగా చిత్రించడం బాధాకరమైన విషయం. తాజాగా ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ గతంలో పశ్చిమ బెంగాల్‌లాగానే ఇప్పుడు కేరళ కూడా దేశ వ్యతిరేకులకు నిలయంగా మారిపోయిందని నిందించారు. కేరళ ప్రభుత్వం మాత్రమే గాక ప్రతిపక్షాలూ ప్రజా సంస్థలు కూడా ఈ దుష్ప్రచారాన్ని సహించలేని స్థితి.
. సిపిఎంనూ , విజయన్‌ ప్రభుత్వ తప్పొప్పులను తప్పక విమర్శించవచ్చు. వారు కూడా లోపాలు దిద్దుకోవచ్చు. అయితే ఆరెస్సెస్‌వారిపై దాడులు అన్నదే ఒక మంత్రంగా మార్చడంలో ఔచిత్యం లేదు. జాతీయ మీడియాలోనూ పెద్ద భాగం ఈ ప్రచారాలను సమర్థించడానికి పాల్పడ్డం మరింత విచారం కలిగిస్తుంది. 2017 జనవరి30న కేరళలో రెండు హత్యలు జరిగాయి.ఒకటి సుకుమారన్‌ అనే సీనియర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తను ఆరెస్సెస్‌ వారు హత్య చేసినట్టు ఫిర్యాదులు రాగా సాజిత్‌ అనే ఆరెస్సెస్‌ వాదిని సిపిఎం వారు హత్యచేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వార్తలను ప్రముఖ మళయాల పత్రికలు సమానంగానే ప్రచురించాయి. కాని జాతీయ మీడియాలో ఆరెస్సెస్‌ వాది హత్య మాత్రమే వచ్చింది! ఒక టీవీ ఛానల్‌ సరిగ్గా ఇవ్వలేదని ట్రోల్స్‌ వత్తిడి తేవడంతో క్షణాల మీద సవరించుకుని 20 మంది ఆరెస్సెస్‌వారు గాయపడినట్టు అదనంగా జోడించింది. ఇంతకన్నా దారుణం- అలెప్పీ జిల్లాకు చెందిన అనంత్‌, త్రిసూర్‌కు చెందిన నిర్మల్‌ ఆరెస్సెస్‌శాఖలకు వెళ్లే యువకులు. అంతర్గత కలహాల్లో వారిని చంపేసినట్టు సమాచారం. అందుకే బిజెపి ప్రకటించే హతుల జాబితాలో ఇలాటి పేర్లు వుండవుగాక వుండవు! నిజానికి రాష్ట్ర బిజెపి నేతలలో అంతర్గత విభేదాలు, అవినీతి ఆరోపణలు కూడా తీవ్రంగానే రావడంతో ఒకరిద్దరిని తొలగించాల్సి వచ్చింది కూడా. మెడికల్‌ కౌన్సిల్‌ దగ్గర పైరవీ కోసం కోట్టు తీసుకున్నవారు, నకిలీ నోట్ల కుంభకోణంలో అరెస్టయిన వారు, బ్యాంకు ఉద్యోగం కోసం ముడుపులు పుచ్చుకున్నవారు ఇలా చాలా మంది బిజెపి నేతల లీలలు కేరళలో అప్రతిస్టకు కారణమైనాయి. ఎన్నికల ప్రాతినిధ్యం పెరిగింది లేనేలేదు. మాజీ ఐఎఎస్‌ అధికారిని మోడీ ఏరికోరి కేంద్రమంత్రిగా తీసుకుంటే ఆయన కూడా వరుసగా వివాదాస్పద ప్రకటనలు చేశారు. ఇటీవల ఆరెస్సెస్‌ కార్యాలయాల్లో పేలుడుపదార్థాలు పట్టుబడ్డమే గాక కృష్ణాష్టమి శోభాయాత్రలతో ముడిపడిన చోట కూడా మందుగుండు దొరకడం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ అపఖ్యాతినుంచి దృష్టి మళ్లించడానికే బిజెపి యాత్రల యాగీ అని సిపిఎం నేతలంటున్నారు.తమకు అణగిమణిగి వుండని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో చిచ్చు పెట్టడం, రాజకీయ జోక్యం చేసుకోవడం కేంద్రానికి తగని పని. తమ రాష్ట్రాలలో ఉద్రిక్తతలు మేధావుల హత్యలు దళితులు మైనార్టిలపై దాడులు వంటివి విస్మరించి రాజకీయ కోణంలో దాడి చేయడం రాజ్యాంగ ధర్మానికే విరుద్ధం.రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ మెతకవైఖరి అనుసరిస్తున్నా కేంద్రం నుంచి రావలసిన సహాయం రాకపోవడానికి రాజకీయ వ్యూహాలే కారణం.రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆరెస్సెస్‌ కోరితే కన్నూరును కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి కేంద్రబలగాలను పంపించాలని సుబ్రహ్మణ్యస్వామి అడుగుతున్నారు. అరవై ఏళ్ల కిందట విమోచన యాత్ర చేయలేకపోయిన పని అమిత్‌ షా రక్షణ యాత్ర చేస్తుందనుకోవడం హాస్యాస్పదం. ఆయన రక్షణ యాత్ర నుంచి రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని ఎలా రక్షించుకోవాలో ప్రజలే చూసుకుంటారు. కాని ప్రజాస్వామ్యం లౌకికతత్వం సమాఖ్య విధానం మన రాజ్యాంగానికి మూడు మూల సూత్రాలు గనక రాష్ట్రాలపై దాడులను కేంద్రం జోక్యాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది మాత్రం అందరూ ఆలోచించాల్సిన విషయం.

(ఆంధ్రజ్యోతి ఎడిట్‌పేజిలో నా గమనం శీర్షికన 6.10.17న ఈ వ్యాసం ప్రచురితమైంది. ఇది వెలువడేలోగా మరి కొన్ని పరిణామాలు జరిగాయి. మొదటిది- అమిత్‌ షా అర్థంతరంగా తన పర్యటన ముగించి ఢిల్లీ వెళ్లిపోయారు. ప్రధాని మోడీ ఏదో అత్యవసర చర్చకోసం పిలిపించారని చెబుతున్నా స్పందన సరిగ్గా లేక జనం రాక వెనక్కువెళ్లారని సిపిఎం విమర్శించింది, గాంధీ హంతకుడైన గాడ్సేను పూజించేవారి నుంచి తాను నీతులు నేర్చుకోవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ ఘాటుగా సమాధానమిచ్చారు.)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *