ఒక ఇంటర్వ్యూ- నాలుగు స్పందనలు

అనేక విషయాలపై వ్యాఖ్యానించే నేను నాకు సంబంధించి నడుస్తున్న వివాదంపై మాట్లాడ్డకపోవడం సముచితం కాదు గనక చాలా క్లుప్తంగా ఇది రాస్తున్నా. తెలుగు పాపులర్‌లో స్ట్రైయిట్‌ టాక్‌ విత్‌ తెలకపల్లి పేరిట నేను దాదాపు ఆరునెలలుగా ఇంటర్వ్యూలు చేస్తున్నాను.నచ్చిన వారున్నారు,నచ్చని వారున్నారు. మెచ్చిన వారున్నారు, తిట్టిన వారున్నారు. వారి వారి ఇష్టం. రామలక్ష్మీ ఆరుద్ర ఇంటర్వ్యూ ఆ కోవలోదే తప్ప ఆమెతో ఏదో సంచలనం కలిగించాలన్న తాపత్రయం లేదు. మద్రాసు కేంద్రంగా హేమాహేమీలను దగ్గరగా చూసిన ఒక రచయిత్రి మాటలు చెప్పించాలనుకున్నానంతే. ఆరుద్రగారున్నప్పటి నుంచి ఆమెతో పరిచయం వుంది. ఆమె భావాలు భాషాశైలి అందిరికీ తెలుసు. అయినా ఆమె రాజాజీ గురించి ఖాసా సుబ్బారావు గురించి లేదంటే ఎన్టీఆర్‌ కుటుంబం గురించి ప్రస్తావనగా చెబుతుంటే బాగా అనిపించింది. అందుకే వెళ్లాము. చేశాము. లక్షల మంది చూశారు, చూస్తున్నారు. ఇతర దేశాలు రాష్ట్రాల నుంచికూడా నాకు అభినందనలు వచ్చాయి. నటులు దర్శకులు కళాకారులు పాత్రికేయులు ప్రత్యేకంగా కొందరు మహిళలు ఫోన్లు చేశారు. మెసేజ్‌లు పంపారు. ఇది గాక సైట్‌లోనూ వందల మంది వ్యాఖ్యలు విమర్శలు చేశారు. ఈ విమర్శలు నాలుగు రకాలు:
1.ఆమె మాట్లాడింది బాగా లేదు
2.చాలా గొప్పగా మాట్లాడారు
3.నేను అడ్డుపడకపోతే ఆమె చాలా చెప్పేవారు. కొంతమంది( రెండు మూడు పేర్లు ఉదహరిస్తూ) ఈ ఇంటర్వ్యూ చేసి వుంటే ఆమెతతో ఇంకా చాలా చెప్పించేవారు. అయిదారు గంటలు చేసి వుండేవారు.కొందరు మహిళల గురించిన ఆమె మాటలకు నేను అడ్డు పడనందుకు ఇద్దరు ముగ్గురు బాధపడ్డారు.
4. తెలకపల్లి రవి కావాలనే పాత విషయాలు కెలికి ఇవన్నీ చెప్పించారని అతి కొద్ది మంది ఆరోపించారు. ఒక వెబ్‌పోర్టల్‌లో ఇంబర్య్యూ సారాన్ని ముఖ్యమైన అంశాలను బాగా క్రోడీకరించారు. ఆమె చెప్పిన దాంట్లో సారం వుందని అంగీకరించారు. అయితే నేను ఇప్పటి వాళ్లను చేయగలిగి కూడా పాత వారితో అనవసరంగా చెప్పించానంటూ ఇదేమిటిసార్‌ అని ప్రశ్నించారు.
ఈ విమర్శలలోనే పరస్పర విరుద్ధతను కాస్త పరిశీలిస్తే ఎవరైనా సులభంగా పసిగట్టవచ్చు. రామలక్ష్మి గారితో మరిన్ని రసవత్తరమైన విషయాలు చెప్పించకుండా నేను అడ్డుపడ్డానని కొందరి కోపం. కావాలని చెప్పించానని కొందరి భావం రెండో విమర్శకు జవాబు అనవసరం. నేను ఇది వరకూ చేసిన/రాసిన ఇకముందు చేయబోయే/రాయబోయే విషయాలు చూస్తే నా స్వభావం తెలుస్తుంది. సంచలనాలు చవకబారు కథలు వ్యక్తిగత వ్యవహారాలు బొత్తిగా ఆసక్తి వుండదు. ఈ మొత్తం ఇంటర్వ్యూలో ఒకటైనా అలాటిది నేనడిగింది లేదు. జయలలిత శోభన్‌బాబు గురించి ఎప్పుడూ ఎందుకు మాట్లాడుతుంటారేమిటని అడిగనప్పుడు ఆమె ఆ రూపంలో చెబుతారని వూహించలేదు. అందుకే పొడగించలేదు కూడా. ఆయన భార్య గురించి ఆమె అన్న మాట తీసేయాలని నిర్వాహకులకు అప్పుడే చెప్పాను. అదే గాక ఇంకా కొన్ని మాటలు కూడా వద్దని అన్నాను. (ఎలాగూ వుండవు గనక ఆ పెద్దావిడతో వాదన ఎందుకని అప్పుడు వదిలేశాను) వారు ఒప్పుకున్నారు. ప్రోమోలో తీసేశారు కూడా. కాని తర్వాత పూర్తి పాఠంలో పెట్టారు. దానిపైన ఎంత గొడవ చేశానో నాకే తెలుసు. అలా జరగడం వ్యక్తిగత వైఫల్యమా సాంకేతిక నిర్లక్ష్యమా చెప్పగలిగింది లేదు. కాని ఒక పాత్రికేయ మిత్రుడు( నిజంగానే దీర్ఘకాలంగా మిత్రుడు) కనీసం అడగకుండానే విమర్శ పెట్టినప్పుడు దాన్ని అంగీకరిస్తూ విషయాలు వివరించాను. బహిరంంగానే.
పాత వాళ్ల గురించి తెలిసిన వారే అతి తక్కువ మంది అయినప్పుడు వారి గురించి అడిగితే నాలుగు మంచి విషయాలు రావాలని అనుకుంటాం. ఆమె మంచి విషయాలు కూడా చెప్పకపోలేదు. ఒకరి భార్య గురించి వాడిన పదాన్ని పదే పదే పొందుపరచడంలో ఉద్దేశాలు వుండకపోవు. అయినా అది వారి ఇష్టం.వాడిన పొరబాటు పదాన్నే చెబుతూ ఆమె చాల మంచిది అన్న వర్ణనను వదిలేస్తుంటారందుకే. సినీ లోకంలో స్త్రీల బాధావేదనలు, అందునా ప్రముఖుల కుటుంబాలలో విషాదాలు అనేకం ఆమె మాటల్లో చూడొచ్చు
నా పోర్టల్‌ మిత్రుడు అన్నట్టు కావాలంటే చాలామందిని వివిద రంగాల వారిని కలిసి మాట్లాడించగల స్నేహ సంబంధాలు గౌరవాభిమానాలు వున్నాయి. ముఖ్యమంత్రులనూ అధినేతలను ముఖాముఖిగా అడిగిన ప్రశ్నలున్నాయి. రామలక్ష్మి గారి రాజకీయాభిప్రాయాలు అనేకం నచ్చకపోయినా వెళ్లాను. శ్రీశ్రీజయభేరి పుస్తకం రాసిన నాకు ఆమె చెప్పే విషయాలు ఎలా నచ్చుతాయి? కాని ఆమె పెద్దరికం.. ప్రత్యక్షానుభవం.. కూడా గమనించాలి కదా.. తనకు వేరే ఉద్దేశాలు లేవని ఆమె కూడా తర్వాత అన్నారు. వాస్తవానికి నేను చాలా సార్లు మద్యలోనూ వ్యాఖ్యలు చేశాను. దురదృష్టవశాత్తూ రెండు మైకులూ పనిచేయలేదు.
లక్షలాది మిత్రులు సవ్యంగా తీసుకున్నారు గనకే బహుశా ఇంత విస్త్రతంగా ప్రచారం పొందిన ఈ కార్యక్రమంపై వివాదం పరిమితంగానే నడిచింది. అందుకు కూడా అవకాశం రాకుండా వుంటే బాగుండేది. మరింత జాగ్రత్త తీసుకుందాం.. మెచ్చుకున్న వాళ్లకు ధన్యవాదాలు. నొచ్చుకున్న వాళ్లకు కృతజ్ఞతలు. దురుద్దేశాలు ఆపాదించిన వాళ్లకోసం సారీ.

కొసమెరుపు: రామలక్ష్మిగారితో దాదాపు పదేళ్ల కిందట నేను ప్రస్థానం కోసం చేసిన ఇంటర్వ్యూ పూర్తి పాఠం సైట్‌లో పెడతాను. చూడండి..
మన మధ్య మెలిగే ఒక గొప్ప కళాకారుడితో చేసిన ఇంటర్వ్యూ త్వరలో వస్తుంది.చూసి ఆనందించండి.
ఏ విషయంపైనైనా ఏదైనా విమర్శించండి.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *