నంద్యాల, కాకినాడ….. 2019?? ..హాస్యాస్పదం!

నంద్యాలలో పెద్ద మెజారిటీ రావడం,కాకినాడ కార్పొరేషన్‌ కైవశం తర్వాత తెలుగుదేశం నాయకత్వం తమ పాలనను ప్రజలు మొత్తంగా ఆమోదించినట్టు చెప్పడం, 2019లోనూ వచ్చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదం. వైసీపీ వ్యూహరాహిత్యం, పరస్పర దూషణ పర్వం, టిడిపి అతివ్యూహం, అధికార యంత్రాంగంపై పట్టు, ఆర్థిక వనరులు అన్నీ కలిపి విజయం లభించిన మాట నిజం. వైసీపీకి ముఖ్యంగా దాని నాయకుడు జగన్మోహనరెడ్డి అతి విశ్వాసానికి ఇది మరో దెబ్బ అన్నదీ నిజం. అయితే అంత మాత్రాన తెలుగుదేశం దాని ప్రభుత్వం అద్బుతంగా పనిచేస్తున్నట్టు చెప్పుకున్నా అతిశయోక్తి. గతంలోనూ చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు అనేక ఉప ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో విజయాలు సాధించారు. కాని 2004లోనూ తర్వాత 2009లోనూ గెలవలేకపోయారు. విజయానికి సంతోషించి ఉత్సాహం ప్రకటించవచ్చు గాని ఈ ఎన్నికల పరిమితులు గత పాఠాలు మర్చిపోతే కష్టం.తన విజయాన్ని టిడిపి అతిగా చూపిస్తుంటే తన పరాజయాన్ని వైసీపీ మరీ తక్కువ చేస్తున్నది
ఈ నాలుగు ఉప ఎన్నికల్లోనూ అందరినీ అమితంగా ఆకర్షించింది నంద్యాల ఉప ఎన్నిక. పాలక టిడిపి,ీ అధినేతల అధికార ప్రయోగం, ప్రతిపక్ష వైసీపీ అత్యుత్సాహం అందుకు కారణమైనాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉప ఎన్నికలు వేటిలోనూ లేనంత హడావుడి హంగామా నడిచాయి. . చర్చ ఫిరాయింపుల గురించే అయినా అంతకు ముందు తమపై టిడిపి తరపున పోటీ చేసిన మాజీ కాంగ్రెస్‌ మంత్రి శిల్పా మోహనరెడ్డిని తమ అభ్యర్థిగా తెచ్చుకుంది వైసీపీ. అక్కడ టికెట్‌ కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన తర్వాతే ఆయన ఇటొచ్చారు. ఈ లోటు కనిపించకుండా జగన్‌ ఆయన తమ్ముడైన శిల్పాచక్రపాణి రెడ్డికి ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేయించారు. (ఈ అంశానికి ప్రచారం రాలేదని వైసీపీ ఫిర్యాదు చేస్తుంది గాని ఆయన అభ్యర్థి కాదని గుర్తించాలి) అధికారంలో వుంటే ఉప ఎన్నికల విజయం కోసం ఎంత దూరమైనా వెళ్లి పనిచేసే ముఖ్యమంత్రిచంద్రబాబు ముందునుంచే సర్వ శక్తులూ కేంద్రీకరించారు.రాజధానినే నంద్యాలకు మార్చినంత పనిచేశారు..నా రోడ్లపై నడవడం, నా పెన్షన్లు తీసుకోవడం అంటూ మొదట మాట్లాడింది బెడిసికొట్టడంతో అభివృద్ది పాలన వంటి మంత్రాలు జపించడం మొదలెట్టారు. భూమా బ్రహ్మానందరెడ్డినే అభ్యర్తిగాపెట్టారు. తండ్రి చనిపోగానే అఖిల ప్రియను మంత్రిని చేశారు. ఇదంతా నంద్యాలను కాపాడుకునే వ్యూహంలో భాగమే. ఎన్నికల కోసం యాభై మంది ఎంఎల్‌ఎలను 12 మంది మంత్రులతో సహా మొత్తం నాయకత్వమంతటినీ దించారు. ప్రజాశక్తి(29.8.17) కథనంలో ఇచ్చినట్టు కులాలవారి సమీకరణాలు ఉధృతం చేసి ఆయా కులాల మంత్రులను కార్పొరేషన్ల చైర్మన్లను రప్పించారు. ఇదంతా చాలా భారీ ఎత్తున పథకం ప్రకారం జరిగింది. ఓట్ల కొనుగోలు కోసం నోట్ల వరద పారింది. వైసీపీ సామాజిక సమీకరణలు, నోట్ల పంపిణీ చేయలేదని కాదు గాని ప్రతిపక్షంగా దాని పరిమితులు దానికి వున్నాయి. పైగా జగన్‌ తనుగా ఖర్చు చేయరంటారు. శిల్పా మోహనరెడ్డికి అనుభవం హంగులూ వున్నా జగన్‌ అక్కడే వుండి పోవడంతో ఉత్సవ విగ్రహంగా మారిపోయారు. జగన్‌ ఆయన సహచరుల అనుభవ రాహిత్యం, అనాలోచిత వ్యాఖ్యలు పరిస్థితిని మరింత దిగజార్చాయి, నంద్యాల ఎన్నిక రాబోయే మార్పునకు నాంది అనీ, ప్రభుత్వ విధానాలపై రెఫరెండం అని ప్రకటించేముందు వాస్తవాలను బేరీజు వేసుకున్నారా అనేది సందేహమే.( గతసారి శోభానాగిరెడ్డి మరణానంతర సానుభూతితో కూడా భూమా నాగిరెడ్డి కేవలం 3వేల ఓట్ల పైచిలుకు మెజార్టితోనే గెలవగలిగారు తప్ప వైసీపీ కంచుకోటఅనుకోవడానికి లేదు.) చంద్రబాబును కాల్చేయాలంటూ మాట్లాడితే ప్రజలు మెచ్చరని కూడా జగన్‌ తెలుసుకోలేకపోయారు. విమర్శలు వచ్చాకైనా సర్దుకోకపోగా బట్టలు వూడదీయించాలని వురి తీయాలని మరింత తీవ్రంగా మాట్లాడి తన ధోరణి అదేనని చెప్పుకున్నారు వైసీపీ ప్రధాన ప్రచారకర్తగా ఎంచుకున్న సినీ నటి రోజా మంత్రి అఖిల ప్రియ వేషధారణపై వ్యాఖ్యలు చేసి వెగటు పుట్టించారు. జగన్‌, రోజాల మాటలను పదేపదే వినిపించడంలో మంత్రులు పోటీ పడ్డారు. దళితులపై మంత్రి ఆదినారాయణ రెడ్డి అవాకులు మాట్లాడారు. అయినా.. అధికార పక్షంతో వుంటేనే అభివృద్ది అన్న సిద్ధాంతం అక్కడ బాగా ఎక్కింది. మిగిలిన ఒకటిన్నర ఏడాదైనా ఏదైనా జరుగుతుందనే ఆశతో ప్రజలు అధికార పార్టీకి ఓటేసి వుండొచ్చు..
జయాపజయాలు ఎలా వున్నా నంద్యాలలో విభజితాంధ్ర ప్రదేశ్‌ అపరిష్క్రత సమస్యలు, కేంద్రం సహాయ నిరాకరణ, బిజెపి హయాంలో మతోన్మాద దాడులు, దానితో టిడిపి చెలిమి వంటి అంశాలు చర్చకు రావలసింది. విదానపరమైన తప్పిదాలు, రాయలసీమ సమస్యలు కర్నూలు జిల్లాలోనే ఏకపక్షభూసేకరణ, పునరావాస సమస్యల వంటివి మాట్లాడవలసింది. కాని బిజెపికి దగ్గరగా జరిగిన జగన్‌ ఆ అంశాలు బలంగా ముందుకు తేలేదు.(తీరా ఇప్పుడు వారు తీసిపారేశారు) తానే కాబోయే ముఖ్యమంత్రి అన్న ఏకైక కోణంలో దుందుడుకుగా మాట్లాడ్డం ద్వారా జగన్‌ వున్న అనుకూలతను కూడా పోగొట్టుకుని అత్యధిక తేడాతో ఓటమి కొని తెచ్చుకున్నారు. తర్వాత కూడా రాజకీయ వాస్తవికత చూపకపోగాఎదురుదాడికే పరిమితమవుతున్నారు. ప్రభుత్వంపైన అధికార దుర్వినియోగంపైనా తప్పక విమర్శ చేయవలసిందే. కాని తమ తప్పిదాలపై ఆత్మ విమర్శ కూడా జరగాలి. మిగిలిన 20చోట్ల రాజీనామా చేయండని సవాలు చేయండని తాము విసిరే సవాలను పాలకపక్షం ఎలాగూ తీసుకోదని కాకినాడ ఫలితాల తర్వాత చంద్రబాబు తేల్చిచెప్పేశారు. జగన్‌ భాషను తప్పుపట్టిన వారు ఆయనను డేరాబాబు అని ముఖ్యమంత్రి అంతటివారు అనడం ఏ విధంగా సమంజసం? దానిపై విమర్శల కారణంగానే కావచ్చు, కాకినాడ పలితాలపై కాస్త జాగ్రత్తగానే స్పందించారు. వైసీపీ అయితే ఇస్పష్టతలో వుంది.
ఇక నంద్యాల ఫలితాల నేపథ్యంలొ కాకినాడలో ముందే టిడిపి గెలుపు ఖాయమై పోయింది. అయితే ఇది బిజెపితో కలసి సాధించిన విజయమే. మరోవైపవు 2014లోనే గాక ఇప్పుడూ వైసీపీకి ఇక్కడ ఎందుకింత ఆశాభంగం కలిగింది?కాపునాడు ఆందోళన ప్రభావం ఏమైంది? ఇలాటి ప్రశ్నలు వేసుకోవాలి.పట్టణాల కోసం విజన్‌ 2029 ప్రకటించిన ప్రభుత్వం దానికి లక్ష కోట్లు కావాలన్నది. కాకినాడను స్మార్ట్‌ సిటీ అంటున్నా అసంఖ్యాక సమస్యలు పేరుకుపోయాయి. ముంబాయిలో తాజా వర్షం అనుభవాల తర్వాతనైనా వాటిపై దృష్టి పెట్టడం మంచిది గాని 2019 గురించి మాట్లాడ్డం వ్యర్థం.
ఈ ఫలితాల తర్వాత వైసీపీ నుంచి మరోసారి ఫిరాయింపులను ప్రోత్సహిస్తారనే మాట వినిపిస్తుంటే ఆ పార్టీ ముఖ్యనేతలు ఎంఎల్‌ఎలు ఎంపిలు ఖండించలేక అల్లాడుతున్నారు. ప్రజల తీర్పును ఫిరాయింపులకు దిగజారిస్తే ఇప్పుడే బెడిసికొట్టొచ్చు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *