‘మెగా’ నరసింహారెడ్డికి స్వాగతం..

మెగాస్టార్‌ చిరంజీవి తన తదుపరి చిత్రంగా తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తీసుకోవడం మంచి విషయం. పేరు కాస్త మార్చారని వారసులు బాధపడినా అసలు పేరు అలాగే వుంది గనక ఓకె. మొదటి పోస్టర్‌ కూడా ఆకర్షణీయంగా వుంది. రాజమౌళి విడుదల చేసినందుకేమో బాహుబలిలో భళిరబాహుబలి అన్నట్టు సైసైలు వినిపిస్తున్నాయి. అమితాబ్‌ బచన్‌తెలుగులో నటించడం, ఇతర తారాబలం, రెహమాన్‌ సంగీతం వంటివి గొప్ప అసెట్స్‌ అవుతాయి. పరుచూరి సోదరుల ఆవేశం నిండిన సన్నివేశాల కల్పనకూ సంభాషణలకూ పేరు గాంచారు గనక చెప్పనవసరం లేదు. తెలుగుసినిమా స్థాయి పెరిగిందనడానికి , తీరు మారుతుందనడానికి మొన్న బాహుబలి, నిన్న శాతకర్ణి ఇప్పుడు ఈ చిత్రం సంకేతాలవుతాయి. మూడు దశాబ్దాల కిందట మా నాన్న, కమ్యూనిస్టు నాయకుడు నరసింహయ్య కర్నూలులో మొదటిసారి ఒక ఉపన్యాసంలో ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గురించిప్రస్తావించినప్పుడే చాలా ఆసక్తి కలిగింది. ఎస్‌విడిఅజీజ్‌ పాలెగాడు నవల బాగా ఆదరణ పొందింది. ప్రజా నాట్యమండలి కళాకారులు మంచి నాటకంగా మలచారు. చిత్రం తీసేవారు హేమాహేమీలైనా ఆ తొలి బీజాలు వేసిన ఆ కళాకారులనూ రచయితనూ కూడా గుర్తించి సహాయపడాలని నా మనవి. నిజానికి కర్నూలు నవాబు,బనగానపల్లి నవాబు కూడా బ్రిటిష్‌ వారిపైన వారి తొత్తుగా వున్న నిజాంపైన తిరగబడిన వారే. తెర్నేకల్లు అనే చోట సంకుల సమరమే జరిగింది. ఈ చిత్రంతోరాయలసీమలో స్వాతంత్ర పోరాటాలకు గుర్తింపు వస్తుందని ఆశిద్దాం.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *