పార్లమెంటేరియన్లుగా, పాలకులుగా కమ్యూనిస్టులు

సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాజ్యసభ సభ్యత్వం ముగింపు సందర్భంలో అన్ని పార్టీల వారూ ప్రత్యేకంగా ఆయన పాత్రను కొనియాడారు. జెఎన్‌యు కాలం నుంచి ఆయనకు సైద్ధాంతిక ప్రత్యర్తిగా వున్న ఆర్థికమంత్రి ి జైట్లీ కూడా ఏచూరి సభలో చర్చల స్థాయిని పెంచారని ప్రశంసించారు. అయితే అదే సమయంలో ఒక చమత్కారంగా జైట్లీ ఒక మాటన్నారు. ‘ఏచూరి ఎన్నడూ అధికారంలో భాగంగా లేరు. అన్ని సమస్యలపైనా ఆయన ఆదర్శంగా మాట్లాడుతుంటారు. అందులో అవాస్తవికతా వుంటుంది. అందుకే ఏచూరి ఒకసారైనాఅధికారంలోకి వస్తే వాస్తవికంగా మాట్లాడతారని అనుకుంటున్నాను’ అన్నారు. వాస్తవం ఏమిటంటే కేంద్ర రాష్ట్ర చట్టసభల్లో మిగిలిన సభ్యులకంటే కమ్యూనిస్టులే బాధ్యతగా వ్యవహరిస్తారు.వ్యక్తిగత వివాదాలు స్వార్థపూరితమైన అంశాలపై చర్చలు వృథా గాకుండా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపైకి మళ్లించి ప్రయోజనకరమైన శాసనాలు సాధించడంపై వారు కేంద్రీకరిస్తారు. అవకాశవాదంతో కొన్ని అంశాలు దాటేసే పరిస్థితీ వారికి వుండదు. ధనస్వాములు భూస్వాముల ప్రాపకం కోసం పాకులాడే వారు కాదు గనక శ్రమజీవుల బలహీనుల సమస్యలు నిరంతరం లేవనెత్తుతుంటారు. బయిట జరిగే పోరాటాలకు మద్దతుగా సభలో గళం వినిపిస్తుంటారు.
తొలిపార్లమెంటులో…
అరుణ్‌జైట్లీ అన్నట్టు ఏచూరికి గాని ఇతర నేతలకు గాని అధికార నిర్వహణ తెలియకపోవడం లేదు. కమ్యూనిస్టులంటే ప్రజల కోసం ఉద్యమాలు పోరాటాలు చేసే వారన్నది ఎంత సత్యమో చట్టసభల్లోనూ ఆ ఉద్యమాల లక్ష్యాలను ప్రతిబింబిస్తారనేది అంతే నిజం. దేశంలో(దాదాపు ప్రపంచంలో కూడా) తొలిమలి కమ్యూనిస్టు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ తన జ్ఞాపకాలలో పుచ్చలపల్లి సుందరయ్య, ఎకెగోపాలన్‌ ఇద్దరూ ఉద్యమాల నేతలే గాక మంచిపార్లమెంటేరియన్లు కూడా నని జోహారులర్పించారు. నంబూద్రిపాద్‌ మొదటి ముఖ్యమంత్రి కావడం వల్ల కేరళలో సామాజిక వికాసానికి విముక్తికి పునాదులు పడ్డాయి.ఇప్పటికి మానవాభివృద్ధి సూచికల్లో కేరళ ముందుంటుంది. అలాటి నంబూద్రిపాద్‌ ఈ ఇద్దరు నేతలను సవ్యసాచుల వలె ఉద్యమాలోనూ పాలనలోనూ ప్రశంసించడం గమనించదగ్గది. కేరళలో ప్రజల మనిషిగా పేరొందిన ఎకెజి పేరే సిపిఎం కేంద్ర కార్యాలయానికి పెట్టారందుకే. ఇక తెలుగు వారెవరైనా సరే సభా గౌరవం ఉత్తమ సంప్రదాయాలు అనగానే ముందు సుందరయ్య పేరు ప్రస్తావించడం నిత్యానుభవం. తెలంగాణ సాయుధ పోరాట నాయకత్వం తర్వాత ఆంధ్ర నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుందరయ్య భారత పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నాయకులు. ఆ సమయంలో లోక్‌సభలో హీరేన్‌ ముఖర్జీ, ఎకెగోపాలన్‌, ఆనంద నంబియార్‌ వంటి ఎంపిలు కమ్యూనిస్టుపార్టీకి ప్రాతినిధ్యం వహించారు. నెహ్రూకన్నా అధికంగా మెజార్టి తెచ్చుకుని లోక్‌సభకు ఎన్నికైన రావి నారాయణ రెడ్డి, విజయవాడ నుంచి కమ్యూనిస్టుల మద్దతుతో స్వతంత్రుడుగా నెగ్గిన హరీంద్ర నాథచటోపాధ్యాయ లాటివారంతా సభ్యులే. హీరేన్‌ ముఖర్జీ మహామేధావిగా పేరు. ఆయనకూ నెహ్రూకు మధ్య హౌరోహౌరీ నడిచేదట. గొపాలన్‌ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో చాలా చొరవ చూపించేవారు. గోపాలన్‌ వ్యక్తిత్వం ఎలాటిదంటే పార్లమెంటు సభ్యులకు వుండే సౌఖ్యాలు సదుపాయాలు సామాన్య కార్యకర్తలైన తన వంటివారిని ఇవి ఎలా ప్రభావితం చేస్తాయోనని హడలిపోయానని రాశాడు. మాకినేని బసవపున్నయ్య, నండూరిప్రసాదరావు వంటి వారు కూడా ఆ కాలంలో రాజ్యసభలో వున్నారు.భూపేష్‌ గుప్తాను ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
సుందరయ్య అనుభవాలు
రాజ్యసభలో సుందరయ్యకూ నెహ్రూకు మధ్య వాదనలు నడిస్తే సభాపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సర్దుబాటు చేసిన సందర్భాలున్నాయి. అయితే అంతా చాలా హుందాగా వుండేది. ఇలాటి పలు ఉదంతాలు ఆయన తన ఆత్మకథలోనే రాశారు.” ఏ సమస్యనైనా క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, పార్లమెంటులో గాని అసెంబ్లీలో గాని అన్ని కోణాల నుంచి వివరంగా విశ్లేషించడం కామ్రేడ్స్‌ అలవాటు చేసుకున్నారు. ఎంపిలు ఎంఎల్‌ఎలలో ఈ అలవాటు పెంపొందించేందుకు నేను వ్యక్తిగతంగా చాలా శ్రద్ధ తీసుకున్నాను.ఆ కారణంగానే ఢిల్లీలో పార్టీ ప్రతిష్ట పెరిగింది. మా ప్రత్యర్థి వర్గాలు కూడా మేము సాధికారికంగా మాట్లాడతామని అంగీకరించేవి. ఒకసారి ఆర్థిక మంత్రి దేశ్‌ముఖ్‌ రాజ్యసభలో లేచి ఏవో గణాంక వివరాలు ఇస్తే మేము అభ్యంతరం చెప్పి ఇతర గణాంకాలు ఇచ్చాము. ఆయన వాటిని అప్పటికప్పుడే తోసిపుచ్చలేదు సరికదా అధికారులను పిలిచి కమ్యూనిస్టులు చెబుతున్నారంటే అధికారయుత సమాచారమై వుంటుంది. నిర్ధారించుకోండి.. అని పురమాయించారట. హౌరాహౌరీగా జరిగిన 1955 ఎన్నికల కోసం సుందరయ్య ఆంధ్రకు వచ్చారు. ఎన్నికల్లో గెలవకపోయినా ప్రతిపక్ష నేతగా పనిచేశారు. అప్పుడు కూడా సభలో చర్చలకు ఎంతో దోహదం చేసేవాళ్లమని వివరంగా రాశారు. తాను ఏ విషయమైనా రాత్రింబవళ్లు చదివి లోతుగా అధ్యయనం చేస్తాను గనక ఏ డాక్యుమెంట్లు ఫైళ్లు అడిగినా ఇవ్వాల్సిందిగా నాటి అసెంబ్లీ కార్యదర్శి ఎ.వి.చౌదరి ఆదేశాలిచ్చారట. ఆంధ్ర ప్రదేశ్‌గాఏర్పడిన తర్వాత ఆంధ్ర నుంచి15మంది, తెలంగాణ నుంచి 40 మంది కలిసి 55 మందితో బలమైన ప్రతిపక్ష నేతగా వున్నారు. తరిమెల నాగిరెడ్డి తర్వాత కాలంలో ప్రతిపక్ష నాయకుడైనారు. బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి వంటి ముఖ్యమంత్రులను వీరు ముప్పుతిప్పలు పెట్టేవారు. 1960లో సుందరయ్య అనారోగ్యంతో చికిత్స కోసం మాస్కో వెళ్తున్నప్పుడు నీలం సంజీవరెడ్డి ఏదైనా కోరుకోమని అడిగితే ఇంకా విదుడల కాని తెలంగాణ ఖైదీలను విడుదల చేయమని కోరారు. నీలం నవ్వుతూనే అందుకు అంగీకరించారు. సిపిఎంగా ఏర్పడిన తర్వాత 1967లో కాసు హయాంలోనైతే తమ్ముడు డా.రామ్‌ను తనతో పాటు మాస్కోలో చికిత్సకు తీసుకుపోవాలంటే జైలులో వున్నారని కాసు తటపటాయిస్తుంటే నీలం ఢిల్లీ నుంచి ఫోన్‌ చేసి అవకాశం కల్పించారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఎన్ని వున్నా పరస్పర గౌరవ సంబంధాలు, పార్లమెంటరీ సంప్రదాయాలు కాపాడటంలో నెహ్రూ నుంచి సంజీవరెడ్డి వరకూ స్పందించిన తీరు ఆసక్తికలిగిస్తుంది. సభలో వారి ప్రసంగాలలోనూ ప్రతిపక్షాలకు గౌరవంగా సమాధానమిచ్చేవారు.

శాసనసభలో, పార్లమెంటులో తరిమెల నాగిరెడ్డి, పిల్లల మర్రి వెంకటేశ్వర్లు, బిఎన్‌రెడ్డి,నర్రా రాఘవరెడ్డి, గుంటూరు బాపనయ్య వంటి వారు మంచి ముద్ర వేశారు. ఈ జాబితా చెబుతూ పోతే చాలా పెద్దదవుతుంది. మిగిలిన వారిలా గాక నిరాడంబరంగా వుండటం , నిర్మాణాత్మకంగా వ్యవహరించడం సిపిఎం సిపిఐ సభ్యుల ప్రత్యేకత అని ఇప్పటికీచాలామంది అంగీకరిస్తారు. పదవుల కోసం పాకులాడేవారు, ఫార్లీలు ఫిరాయించేవారికి లోటు లేని రోజుల్లో ఇలాటి ఆదర్శం అరుదుగా చూస్తాం.
ఉన్నత విలువలకు పట్టం
ఇందిరాగాంధీ నిరంకుశత్వం చెలరేగే రోజుల్లోనూ లోక్‌సభలో జ్యోతిర్మయిబోసు గొప్పగా వాదించేవారు. తర్వాత సోమనాథ్‌ చటర్జీ కూడా చాలా కాలం లోక్‌సభలో పార్టీనేతగా వుండి మొదటి యుపిఎ కాలంలో తొలి కమ్యూనిస్టు స్పీకర్‌ అయ్యారు. అయితే పార్టీ నిర్ణయం మేరకు పదవి వదులుకోలేక క్రమశిక్షణా చర్యకు గురైనారు. ఇది కూడా కమ్యూనిస్టు ప్రమాణాలకు ఒక ఉదాహరణే. 1996లో జ్యోతిబాసు ప్రధాని పదవి తీసుకోవద్దని నిర్ణయించిన తర్వాత వెళ్లి బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారే గాని ఎలాటి సమస్య చేయలేదు. చారిత్రిక తప్పిదం అని ఆత్మకథ కోసం చేసిన వ్యాఖ్య ఆధారంగా చాలా మంది చాలా వూహలు చేసినా జ్యోతిబాసు గీత దాటకపోవడం ఒక కమ్యూనిస్టులోనే చూడగల ఔన్నత్యం.కరళలో అచ్యుతానందన్‌ జీవితం ఇప్పుడు త్రిపురలో మాణిక్‌సర్కార్‌ సరళి అందుకు నిదర్శనంగా వున్నాయి.
ప్రజాస్వామ్య ఓటింగు మార్క్స్‌ ఎంగెల్సుల చివరి దశలో వచ్చింది. దాన్ని రాజకీయ మార్పుల కోసం ఉపయోగించుకోవలసిన అవసరాన్ని ముఖ్యంగా ఎంగెల్సు గట్టిగానే చెప్పారు. ఇక లెనిన్‌ రష్యా విప్లవ కాలంలో డ్యూమా అనబడే వారి పార్లమెంటును పోరాటవేదికగా చేసుకోవాలన్నారు. అయితే ఎన్నికలలో ప్రభుత్వాలలో పాల్గొంటూ ప్రజల హక్కులు సాధించడం వేరు. ఆ భ్రమల్లో కూరుకుపోయి ప్రజలకు దూరం కావడం వేరు. అలాగే పోరాటాల పేరుతో అసలు ఎన్నికలు పోటీలు తప్పంటూ నేలవిడిచి సాముచేసినట్టు బహిష్కరణ పిలుపులివ్వడం వేరు. పదవీ వ్యామోహాలు లేకుండా ప్రజల కోసం పనిచేయడం కమ్యూనిస్టుల మార్గంగా వుంటుంది. అందుకే ఇప్పటికీ ప్రభుత్వాలు ఇచ్చే అనేక ప్రయోజనాలు స్థలాలు ఇతర ప్రలోభాలకు వారెన్నడూ లోనవకుండా తోసిపుచ్చుతుంటారు. ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చిన ప్రశ్నల కుంభకోణంలో ఒక్క వామపక్ష సభ్యుడు కూడా లేకపోవడం వారి ప్రత్యేకతను చెప్పకనే చెబుతుంది. రాజకీయాలలో నాలుగు రోజులు పాల్గొనగానే ఏదో ఒక పదవిలోకి వచ్చేసి ఎంతో వెనకేసుకోవాలనే కలుషి త రాజకీయ నేపథ్యంలో మినహాయింపులుగా మిగిలారు గనకే సీతారాం ఏచూరి వంటి వారికి అంత విలువ. అధ్యయనం ఆచరణల మేళవింపుగానే వారికి గౌరవం. కమ్యూనిస్టులకు సీట్లు రావని ఎగతాళి చేసేవారు కాలం చెల్లిపోయిందని చెప్పేవారు కనిపిస్తుంటారు. గంగగోవు పాలు గరిటెడైనను చాలు అన్నట్టు ఉన్న కొద్ది మంది ఎ ంతటి ఉన్నత విలువలు పాటించారో అధికారంలో వున్న చోట ఎలా అవినీతి కళంకం లేకుండా పాలించారో తెలుసుకోవడం అవసరం.

( ప్రజాశక్తి, నవ తెలంగాణ – 11.8.17)

Facebook Comments

One thought on “పార్లమెంటేరియన్లుగా, పాలకులుగా కమ్యూనిస్టులు

  • August 12, 2017 at 2:37 pm
    Permalink

    Mention must have been made of Com. Indrajit Gupta also who was an outstanding parliamentarian and proved his mettle as administrator.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *