మైల’ చర్చ మానేస్తే మంచిది
చాలా రోజుల తర్వాత అనుకోకుండా టీవీ9లో రోజా, అఖిల ప్రియల సంవాదం చూశాను. అధికార పార్టీ వ్యూహాలు, పార్టీ ఫిరాయింపులు, నైతిక విలువలు వీటి గురించి ఎంతైనా చర్చించవచ్చు. పార్టీ మారి పదవులకు రాజీనామా చేయకపోవడం తప్పన్నది నిర్వివాదాంశం. కాని రాజకీయ చర్చలు సంప్రదాయాలు చాదస్తాల సమర్థనగా మారడం మంచిది కాదు. చాలా కాలంగా నటిగా రాజకీయ నాయకురాలుగా ప్రజా జీవితంలో వున్న రోజా వంటి వ్యక్తి తండ్రి చనిపోయిన మరుసటి రోజునే శాసనసభకు రావడం మహాపరాధమైనట్టు మైల గురించి మాట్లాడ్డం మాత్రం హాస్యాస్పదంగా వుంది. తెలుగు మహిళ నాయకురాలుగా కూడా చేసిన రోజా ‘మగాడే’ బయిటకు రాడంటూ వాడిన భాష కూడా బాగాలేదు.మహిళలు శ్మశానానికి వెళ్లడం కూడా తప్పే ఆచారం ప్రకారం. అమ్మాయిలు అంత్యక్రియలు కూడా చేస్తున్నారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడమే గాక విదేశాల నుంచి వచ్చిన దేశాధినేతలతో చర్చలు సంప్రదింపులు కూడా జరిపారని గుర్తు చేయాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి మృతదేహం వుండగానే జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని కొందరు సంతకాల సేకరణ చేయడం(ఆయనకు తెలియకుండా) ఇప్పటికీ విమర్శలకు గురవుతుంటుంది.
తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించడానికి వంద పాయింట్లు వున్నాయి గనక ఈ మైల చర్చను మానేస్తే మంచిది. పైగా వైసీపీని టీడీపిని బలపర్చే ఓటర్లలో అన్ని మతాల వారూ వుంటారని, ఈ మైల సిద్ధాంతం ఒక మతానికే సంబంధించిందని కూడా అర్థం చేసుకోవాలి. ఈ మొత్తం చర్చ ఏమైందో నేను చూడలేదు గాని రాజకీయ ప్రధానంగా నంద్యాల పోరాటం జరిగితే మంచిది.వ్యర్థ వివాదాలతో పక్కదోవ పట్టడం ప్రజలు హర్షించరు.
ఒక ఆలోచనా పరుడుగా హేతువాదిగా అర్థం లేని చర్చను భరించలేక మాత్రమే ఈ నాలుగు ముక్కలు రాశాను. వైసీపీ అభిమానులు అక్కడి వరకే తీసుకుంటారని ఆశిస్తాను. చర్చలు జరిపే మిత్రుదు రజనీ కాంత్ వంటి వారు కూడా దాన్ని సాగదీసే బదులు మానవీయ దృక్పథంతో ముగించడం అవసరం. మగాడు ఆడది, మడి మైల వంటి భావనలు జుగుప్సాకరమైనవి. ే అవి మనం వేసుకునే ప్రకటిత ప్రోమోలకు అనుగుణం కాదు కదా!