|| మీడియా సర్కారీ భజన-ఉద్యమాల విస్మరణ ||

 

—విశ్లేషక్ (ప్రజాశక్తి)

మీడియా విమర్శనాత్మక పాత్ర వహిస్తుందని పేరు. అది దాని విద్యుక్తధర్మం కూడా. కాని ఆంధ్ర ప్రదేశ్‌లో మీడియాలో ఒక పెద్ద భాగం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఇటీవలి కాలంలో కొన్ని తెలుగు పత్రికలు, ఛానళ్లు పాక్షికతకు మారుపేరుగా తయారైనాయి. ప్రభుత్వ విధానాల లోపాలోపాలను ఏనాడు విమర్శనాత్మకంగా నివేదించకపోగా ఏలిన వారి ప్రచారార్భాటాలను ప్రజలకు చేర్చడమే పవిత్ర కర్తవ్యంగా పరవశిస్తున్న పరిస్థితి. ఎప్పుడైనా సమస్యల గురించి రాసినా అధికారుల లోపాలు, స్థానిక నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల తప్పిదాలైనట్టు వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘సీరియస’్‌గా తీసుకుని చక్కదిద్దుతున్నట్టు నిరంతరం కథనాలు ఇవ్వడమే పనిగా పెట్టుకుంటాయి. ఈ పైత్యం ముదిరిపోయిన కారణంగానే ప్రజా ఉద్యమాలు, నిరసనలు ఆందోళనలు వీటికి అస్సలు అగుపించడం లేదు.

|| పోరాటాలకు చోటు లేదు ||

మున్సిపల్‌ కార్మికులు ఇటీవల సమ్మె చేశారు. పట్టణాలలో సమస్యలు పేరుకుపోయాయి. అంతకు ముందు సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక శంఖారావం పేరిట రాష్ట్రమంతటా ప్రభుత్వ కార్యాలయాల ఎదుట భారీ నిరసనలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో దళితుల సామాజిక బహిష్కరణపై పోరాటం సాగుతూనే వుంది. ప్రకాశం జిల్లా దేవరపల్లిలోనూ దళితుల భూమి సమస్య అట్టుడుకుతున్నది. మహిళల ‘మద్యవ్యాపార వ్యతిరేకోద్యమం’ ఉవ్వెత్తున సాగుతున్నది. అంగన్‌వాడీలు, ఆశా వర్కర్ల వంటి వారు తమ కోర్కెలపై ఉద్యమాలు చేస్తున్నారు. వివిధ చోట్ల ప్రభుత్వం సాగిస్తున్న ఏకపక్ష భూ సేకరణలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. రాజధాని అమరావతి లోనే రైతులు భూ సమీకరణలో పాల్గొన్నవారితో సహా ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నారు. పాలక పక్ష నాయకులు రకరకాల మాఫియాలుగా ఇసుక-మట్టి కాంట్రాక్టులు, వడ్డీ వ్యాపారాలు, కమీషన్లు, మామూళ్లు, దందాలు, బినామీ లావాదేవీలలో మునిగి తేలుతున్న ఉదంతాలు పట్టి కుదుపుతున్నాయి. అధికారులపై, ప్రజలపై, ప్రత్యర్థులపై పాలక పక్ష ప్రముఖుల బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు తీవ్రాందోళనకు కారణమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఏ మీడియా సంస్థ ఆలోచన ఏదైనా సరే ముందు దిగజారుతున్న పరిస్థితులను ప్రతిబింబించాలి. పోరాడుతున్న ప్రజలకు అండగా నిలవాలి. కాని ఇప్పుడు జరుగుతున్నదేమిటి? వేలాది మంది కార్మికులు డజన్లకొద్దీ పట్టణాల్లో సమీకృతమై నిరసన తెల్పితే ఈ పత్రికలకు కనిపించదు. ఈ నెలలో ఇప్పటి వరకూ జరిగిన ఏ పెద్ద ప్రజా నిరసన ఏ సమీకరణ కూడా ‘ఆంధ్రజ్యోతి లేదా ఈనాడు’లో పెద్దగా ప్రచురణకు నోచుకోలేదు. అసలే ఇవ్వకుండా విస్మరించడం, మరికొన్ని సార్లు స్థానిక సంచికల్లో సరిపెట్టడం, అధవా అనివార్యమై మెయిన్‌లో ఇచ్చినా లోపల ఎక్కడో డబుల్‌ కాలమ్స్‌లో మొక్కుబడిగా ఇచ్చేసి సరిపెట్టడం ఇదే తంతు! సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధును పర్చూరులో బస్సులోనే అరెస్టు చేసినా పోలీసు స్టేషన్లన్నీ తిప్పినా వార్త కాదు. మహిళలపై మద్యం మాఫియా రౌడీలు పిడిగుద్దులు గుద్దినా పోలీసులు విరుచుకుపడినా కనీసంగా కనిపించదు. ఒకప్పుడు సారా వ్యతిరేక సారథ్యమే వహించిన వారు ఇప్పుడు గప్‌ చుప్‌. రైతులు, వ్యవసాయ కార్మికుల నిరాహారదీక్షలు, ధర్నాలు, ప్రదర్శనలు వార్తార్హత లేనివి. ఆఖరుకు మహాసభలు జరిగినా చోటు వుండదు. జూలై 14 వరకూ చూస్తే ‘ఆంధ్రజ్యోతి’లో మధు అరెస్టు వార్త కొద్దిగానూ, సర్వశిక్ష అభియాన్‌ ధర్నా ఒక మేరకు ఇవ్వడం తప్పిస్తే పైన చెప్పుకున్న ఏ ఒక్క సందర్భం కూడా సమాచార యోగ్యత గలదిగా కనిపించలేదు. పాడేరు గిరిజన ప్రాంతాల్లో విషమించిన ఆరోగ్య పరిస్థితి గురించి వామపక్ష నాయకులు పదే పదే పర్యటించి సహాయ చర్యలు ప్రారంభిస్తే పట్టదు గాని, తామే కనిపెట్టినట్టు స్పీకర్‌ పర్యటించి పరిష్కార చర్యలు తీసుకున్నట్టు చిత్రించారు.

|| ఎదురుదాడులకు పెద్ద పీట ||

ఈ ప్రజాఉద్యమాలకు వ్యతిరేకంగా పాలక పక్ష నేతల అవాకులు చవాకులు మాత్రం తాటికాయంత అక్షరాలతో ప్రచారం పొందుతున్నాయి. అసలు విమర్శ రాగానే ప్రభుత్వాధినేతలు స్పందించే లోగానే ఈ మీడియా మాంత్రికులే మహా సమర్థకులై మాయ కథలు అల్లేస్తుంటారు. చంద్రబాబుకు వత్తాసుగా కొత్త కొత్త కథనాలు ప్రచారంలో పెట్టేస్తారు. ప్రతిపక్షాలను అపహాస్యం చేసే అవిడియాలు గుమ్మరిస్తారు. అమరావతి అపర స్వర్గం అని అధికార పక్షం చెప్పుకుంటే అంతకంటే రెండక్షరాలు ఎక్కువే రాస్తారు. అంతేగాని ‘అక్కడ జరిగిందేమిటి? ఎందుకీ జాప్యం? రైతుల పట్ట నిర్లక్ష్యం!’ అని నిలదీయవు. విమర్శనాస్త్రాలన్నీ ప్రతిపక్ష నేతపైన లేదంటే ఉద్యమాలు చేసే వామపక్షాలపైన సంధిస్తారు. ఇటీవల జాతీయ మీడియా వస్తే రైతులు ప్రభుత్వాన్ని సమర్థించినట్టు కథనాలిచ్చారు. మరి అదే రైతులు, వామపక్షాలు లేదా ఇతర ప్రతిపక్షాల నాయకత్వంలో నిరసన తెల్పితే ఇంతే ప్రముఖంగా ఇవ్వొద్దా? వారే రైతులు! వీరు కాదా? కోర్టులు ప్రభుత్వానికి పదే పదే అక్షింతలు వేస్తుంటే వాటి లోతుపాతులు చెప్పొద్దా? ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తే చేయొచ్చు. కాని ముందు గద్దెపై కూర్చున్నవారికి బుద్ధి చెప్పకుండా ప్రతిపక్షంపై ప్రతాపం చూపిస్తే ఫలమేమిటి? ప్రతిపక్షాల వ్యాఖ్యలను ఇచ్చిన తీరుకూ ప్రభుత్వ భజన శీర్షికలకు కొట్టిచ్చినట్టు తేడా వుంది.

|| ప్రశంసలు.. కీర్తనలు… ||

రాష్ట్ర ప్రభుత్వాన్నే కాదు-కేంద్రం పైన కూడా ఈగ వాలనీకుండా ఈ పత్రికలు కాపలా కాస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో ఘోరంగా మాట తప్పిన కేంద్రం వైఖరిని నిశితంగా విమర్శించే బదులు నకిలీ ప్యాకేజీ నయమైందనే నయ వంచక ప్రచారానికి వంత పాడుతున్నాయి. ఆఖరుకు ‘ఆంధ్రజ్యోతి’ ఆర్కే అయితే వెంకయ్య నాయుడు కేంద్రమంత్రిగా వుండటం మన అదృష్టమని ఆయన దయా ధర్మం వల్లనే ఈ మాత్రం మేళ్లు జరుగుతున్నాయని రాసి పారేసిన ఉదాహరణలున్నాయి. అందుకు తగినట్టే వెంకయ్య కూడా ఆ స్టాల్‌ దగ్గర నుంచుని ఫోటోలకు ఫోజులిచ్చి అనుబంధాన్ని చాటుకున్నారు.
సవాలు చేసి చెప్పొచ్చు- కొన్ని వారాల తరబడి ఈ పత్రిక తిరగేస్తే మొదటి పేజీలో గాని లోపలైనా సరే ప్రముఖంగా గాని ప్రభుత్వ విధానాలపై, దుష్ఫలితాలపై ఒక్కటంటే ఒక్క సమగ్ర నివేదిక, సావధాన విశ్లేషణ కనిపిస్తే ఒట్టు. ‘పరిశోధనాత్మక జర్నలిజం’ పేరిట ఒకప్పుడు కుంభకోణాలను తవ్వి తీసిన ఘనాపాటీలు ఇప్పుడు కప్పి పుచ్చే కావలి కాపరి పాత్ర పుచ్చుకున్నారు. ఈ రెండు పత్రికలు గాక మరేదైనా మీడియా విమర్శనాత్మక కథనం ఇస్తే వెంటనే ప్రభుత్వ తాఖీదులు, కక్ష సాధింపులు ప్రసారాల బిగింపులు, ఆదాయం కత్తిరింపులు ఒకటేమిటి.. బాబు తల్చుకుంటే బాదుడుకు కొదవా? ఆర్కే ‘కొత్త పలుకు’ చదవమని ముఖ్యమంత్రి సూటిగానే చెప్పి నట్టు వచ్చింది. విమర్శ చేసే వాటిపై విరుచుకుపడటమూ జరుగుతున్నది. ఏతా వాతా ఇదో విష వలయంగా మారిపోయింది. ‘సాక్షి’ ప్రస్తుతం ప్రతిపక్షంలో వుంది గనక ప్రభుత్వ విధానాలపై, విమర్శనాత్మక వార్తలు విశ్లేషణలు ఇస్తున్నా దాని దృష్టిలో వైఎస్‌ పాలన స్వర్ణయుగం. జగన్‌ను తీసుకురావడమే కర్తవ్యం. విధాన పరమైన మౌలికాంశాలు పట్టవు. రేపు తామొచ్చినా ఈ విధానాలు మార్చేది లేదని వారికి తెలుసు. ఒకటి రెండేళ్ల పాటు ‘సాక్షి’లో ‘ఈనాడు’ రామోజీ రావుపై పుంఖాను పుంఖంగా కథలు వస్తుండేవి. తర్వాత ఆయనకూ జగన్‌కు రాజీ కుదిరింది. ఇప్పుడు ఇందులో రామోజీపైన అందులో జగన్‌పైన దాడులు బంద్‌. మొన్న జరిగిన వైఎస్‌ఆర్‌సిపి ప్లీనరీ సమావేశాల వార్తలు కూడా ‘ఆంధ్రజ్యోతి’ కన్నా ‘ఈనాడు’ మెరుగ్గా ఇచ్చింది. జరిగిన సమావేశాల సమాచారం కన్నా విమర్శించిన టిడిపి మంత్రులు, నేతల ప్రకటనలే ప్రముఖంగా ఎక్కువ స్థలం ఆక్రమించడం విచిత్రమే!

|| సర్కారీ ప్రచారం సిగ్గు చేటు ||

‘సాక్షి, ఈనాడు’ మధ్య అనేక విషయాల్లో ‘ఆంధ్రజ్యోతి’ కొంత తేడా చూపడానికి ప్రయత్నించినా- ఎడిట్‌ పేజీలో భిన్నాభిప్రాయాలకు చోటు కల్పించినా-చంద్ర బాబు భజన మాత్రం మామూలే. కేంద్రంలోనూ మోడీత్వ మహత్వాన్ని ఇవి ఎప్పుడూ కీర్తిస్తూనే వుంటాయి. రాష్ట్రపతి ఎన్నికలలో అవగాహన తర్వాత ‘సాకి’్ష కూడా తమకు అనుకూలంగా మారిపోతుందని బిజెపి నేతలు ఆశపడుతున్నారు. వీరందరికీ కార్పొరేట్‌ కాషాయ కూటమి ప్రీతిపాత్రమైంది. మోడీ వీరభక్తులైన అర్నబ్‌ గోస్వామి వంటి వారి వింత వేషాలు దేశమంతా చూసింది గాని… తెలుగు మీడియా అధిపతులు అంతకంటే విధేయత చాటుకుంటున్నారు. గత మూడేళ్లలోనూ వీరి లీలా విన్యాసాలు ఉద్దేశపూర్వక వార్తా కథనాలు విష ప్రచారాలు విధేయ ప్రశంసలూ వివరంగా అధ్యయనం చేయవలసి వుంది. అయితే అలాంటి వివరాలు వచ్చేలో గానే తమ పోకడలు సరిదిద్దుకుంటే పరువు మిగులుతుంది. తమాషా ఏమంటే ఇంతగా ప్రభుత్వాల పల్లకి మోస్తున్న ఈ పత్రికలు సిపిఎం వంటి పార్టీలకు దురుద్దేశాలు ఆపాదిస్తుంటాయి. పవన్‌ కళ్యాణ్‌ బిజెపి టిడిపిలకు అనుకూలంగా వుంటే అమిత ప్రచారం ఇచ్చిన వీరు ఆయన కొన్ని చర్యలను విమర్శిస్తే విస్మరించడం రివాజు. ఇదే వాటి అవకాశవాద పక్షపాత పోకడ. ప్రజాస్వామ్య వాదులెప్పుడూ మీడియా స్వేచ్ఛను గౌరవిస్తారు. అందుకోసం పోరాడతారు. ఆయా యాజమాన్యాలు ఇష్ట ప్రకారం వాటిని నడుపుకోవచ్చు. కాని మీడియా కూడా ప్రజాస్వామ్య లౌకిక విలువలను ప్రజా ఉద్యమాలను గౌరవించే సంస్కారం నిలబెట్టుకోవాలి. సర్కారీ సేవక ప్రచారక పాత్ర విరమించాలి. అక్షరం ఎప్పుడూ ప్రజల పక్షాన వుండాలి.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *