సీ మోడీ సమావేశంపై కథనాల వింత

భారత చైనాల మద్య ఘర్షణ పెరిగితే బావుంటుందని చూసే శక్తులు దేశంలోనూ విదేశాల్లోనూ వున్నాయి. అయితే రాజకీయ పరిపక్వత గల ఈ రెండు దేశాలలో ఎవరు అధికారంలో వున్నా యుద్దం వల్ల కలిగే అనర్థాలు తెలుసుకోగలరు గనకే అక్కడి దాకా వెళ్ల నివ్వరు. అయితే ప్రధాన ప్రతిపక్షంలో వున్నవారు మాత్రం చైనాతో రాజీ పడ్డారని లొంగిపోయారని అంటుంటారు. మీడియా సంచలనం కోసం అలాటి కథనాలు చర్చలు ఇస్తుంటుంది. అక్కడో ఇక్కడో ఉద్రిక్తత పరస్పర వాగ్బాణాలు సైనిక కదలికల తర్వాత మళ్లీ సర్దుకోవడం అర్థశతాబ్దిపైగా చూస్తున్నదే. ఇప్పుడు సిక్కిం సరిహద్దులోని డొకొలం ఉదంతం కూడా అలాగే సమిసిపోతుంది తప్ప సమరం దాకా వెళ్లడం జరగని పని. ఇందులో ఎవరు ఒప్పు మరెవరు తప్పు అనే మీమాంస కన్నా శాంతియుతంగా పరిష్కరించుకోవడం ముఖ్యం. చర్చలు ఎలాగూ జరుగుతూనే వుంటాయి.
ఈ సారి మాత్రం ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయనే కథనాల మధ్య హేంబర్గ్‌లో బ్రిక్స్‌ సమావేశంలో బారత చైనా అధినేతలు మోడీ సీ జింగ్‌ పింగ్‌లు పరస్పరం అభినందించుకోవడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. అయితే దీనికి రాజకీయంగా పెద్ద విలువ నివ్వడానికి ఇరు దేశాలు సిద్ధంగా లేవు. భారత ప్రభుత్వ అధికారిక వివరణలో దీన్ని గురించి చెప్పలేదని మోడీ వెంట వెళ్లిన మీడియా ప్రతినిధులు కొందరు విమర్శా వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్‌ బోల్గే, నీటి ఆయోగ్‌ అరవింద పంగారియా దీనిపై ట్వీట్లు పెట్టారట. ఇంత శ్రమపడి వచ్చినా మేము బయిటనుంచి తెలుసుకోవలసి వస్తుందని మీడియా వారు వాపోతున్నారు.
ఇక చైనా పరిస్థితి మరోలా వుంది. మోడీ సీల మధ్య సమావేశం జరగలేదని వారి విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. అంటే అధికార పూర్వకంగా జరగలేదా మాటామంతీ కూడా లేదా అని నిర్దిష్టంగా అడిగితే సమావేశం జరగలేదు అని మాత్రమే రికార్డు వినిపిస్తున్నారు. దీని అర్థం స్పష్టమే కదా?
ఈ రెండు గొప్ప ఆసియా దేశాలు కలహించుకోవాలని కోరే వారి కలలు నెరవేరకపోవచ్చు. భారత చైనాల మధ్య వైరుధ్యాలు గతం తాలూకూ విభేదాలు తొలగిపోవడం అంత సులభం కాదు.అవి మరింత ముదరకుండా చూసుకోవడమే ఇరు దేశాల విజ్ఞత. ఇందులో హెచ్చుతగ్గులుండొచ్చు గాని రెచ్పిపోకూడదని ఉభయులకూ తెలుసు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *