ఈపాటి కాన్సెప్ట్‌లకు పేటెంట్లు కూడానా? పూరీజీ?

జై లవకుశ చిత్రం టీజర్‌పై ఇప్పటికే పరిశ్రమలో ప్రముఖులు ప్రశంసలు కురిపించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ పరస్పర కితాబులు ఇటీవల సర్వసాధారణమై పోయాయి. అయితే ఆ పాత్ర వేషభాషలు మ్యానరిజమ్స్‌ గతంలో తాను జూనియర్‌ ఎన్టీఆర్‌కు చెప్పిన దానికి దగ్గరగా వున్నాయని దర్శకుడు పూరీ జగన్నాథ్‌ బాధపడినట్టు మీడియా రాసింది. చెబితే చెప్పి వుండొచ్చు గాని అందులో అంత అసాధారణమైన వైవిధ్యం ఏముంది? అలాటివి గతంలో చూళ్లేదా? జూనియర్‌ ఎన్నో చేయలేదా?
ఇటీవలి కాలంలో మన దర్శకులు ముందే ఇమేజ్‌ వున్న హీరోలను దృష్టిలో పెట్టుకుని ఏవో పాత్ర చిత్రణలు కొన్ని సన్నివేశాలు అనుకోవడం, వాటికి ముందే విపరీత ప్రచారం కల్పించడం పరిపాటిగా మారింది. గతంలో సీనియర్‌ హీరోలు పరస్పరం సంబంధమే లేని పాత్రలు రకరకాల మేకప్‌లతో నటించినా ఇంత ముందస్తు హంగామా వుండేది కాదు. మీడియా విస్తరణ ఒక్కటే ఇందుకు కారణం కాదు. కథాబలం లేకపోవడం, రెండు మూడు రోజుల్లోనే వసూళ్లు మొత్తం లాగేసుకోవాలన్న వ్యూహం ఇందుకు కారణమవుతున్నాయి. హీరో వేసుకునే దుస్తులు చేసుకునే మేకప్‌ ప్రతిదీ అతిగా చెప్పి ఏదో అద్భుతం రాబోతుందన్న భ్రమ కల్పించడం అలవాటై పోయింది.పోటీ ప్రపంచంలో మనుగడ కోసం హీరోలు కూడా అందుకు అంగీకరించక తప్పదనుకుంటున్నారు. గ్యాంగ్‌స్టర్‌ వేషం కట్టినా బ్రాహ్మణ వేషం వేసినా, కుర్రాడిలా కనిపించినా ముసలాడిగా మెప్పించినా కావలసింది కథ ఏదైనాచెప్పిందా లేదా?అని మాత్రమే. బడిపిల్లల ఫ్యాన్సీడ్రస్‌ల్లా లేక టీవీ ఎపిసోడ్లలా ఏవో సీన్లు ప్యాషన్లు చూపించి మురిపించేసి జేబులు ఖాళీ చేయించడం పెద్ద విషయం కాదు.. వాస్తవానికి మహేష్‌బాబుతో పూరీ చిత్రాలు చూస్తే అంతకు ముందు విజయం సాధించిన వాటి కొనసాగింపుల్లానే వుంటాయి. నా ఉద్దేశంలో ఆయన మొదటి చిత్రం తప్పిస్తే మిగిలినవి చాలా మటుకు రోటీన్‌ స్టఫ్ఫే. ఆ పాటి దానికి తామేదో సృజనాత్మక యోచన చేసినట్టు చెప్పుకోవడం హాస్యాస్పదం.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *