రాజమౌళి పశ్చాత్తాపం..బెటర్‌ లేట్‌ దేన్‌ నెవర్‌

బాహుబలిలో శివగామి పాత్రకు శ్రీదేవి ఒప్పుకోకపోవడంపై దర్శకుడు రాజమౌళి చాలా వ్యాఖ్యలే చేశారు. ఒక దశలోనైతే అసలు ఆమెను గురించి ఆలోచించినందుకు రమ్యకృష్ణకు క్షమాపణలు చెప్పారు. అప్పుడు(ఏప్రిల్‌12) నా పేజీలో ఇది సరికాదని రాశాను. పారితోషికం లేదా మరేదైనా కారణంతో ఒప్పుకోకపోయినంత మాత్రాన ఇలా క్షమాపణలు చెప్పడం అంటే శ్రీదేవిని అవమానించినట్టవుతుందని వ్యాఖ్యానించాను. అప్పటికి నిజానికి ఆ విషయంలో రాజమౌళిని పల్లెత్తుమాట అనడానికి కూడా ఎవరూ సిద్దం కాని దశ అది. సాంకేతిక వైభవంతో వసూళ్ల శిఖరాలపై ఆసీనుడైన రాజమౌళిని ఎవరూ పల్లెత్తు మాట అనడానికి సిద్దపడని దశ అది. నేను కూడా ఈ వ్యాఖ్యలు ఆయన వినయశీలతకు సరిపోయేవిగా లేవని పేర్కొన్నాను. దానిపై మిత్రులొకరు మీరు శ్రీదేవి ఫ్యానా అని కూడా అడిగినట్టు (ఇప్పుడు చూశాను.) రామ్‌గోపాల్‌ వర్మ ఎలాగూ ఆ అవకాశం ఇవ్వరు! పైగా 300 చిత్రాలు పూర్తిచేసుకున్న అసాధారణ ప్రతిభాశాలి శ్రీదేవిని ఎవరైనా అభిమానిస్తారు. అది వేరే విషయం. శ్రీదేవి పారితోషకం, షరతులపై రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చాలా దిగ్భ్రాంతికరమైన జాబితా చెప్పారు. అదంతా నిజమా అనకున్నా మనకు తెలియదు గనక మాట్లాడలేదు. తర్వాత ఆమె ఆ మాటలు ఆలస్యంగా ఖండించారు. పైగా వేయని పాత్రను గురించి పదే పదే మాట్లాడ్డం ఎవరికైనా చిరాకే. చరిత్రలో ఇలాటివి చాలా వున్నాయి. మిస్సమ్మలో భానుమతితో షూట్‌ చేసి తీసేయడం, దేవదాసులో జానకి అనుకుని సావిత్రి రావడం ఒకటి కాదు. సాంఘికాలలో అక్కినేని నిరాకరించిన చాలా పాత్రలు అంధుడు అవిటివాడు వంటివాటితో సహా ఎన్టీఆర్‌ నిస్సంకోచంగా పోషించి కొన్ని విజయాలు కూడా సాధించారు. వాటినే పట్టుకుని వేళ్లాడనవసరం లేదు. దీనిపై ఇప్పటికైనా రాజమౌళి అలా మాట్లాడివుండవలసింది కాదని విచారం వెలిబుచ్చడం స్వాగతించదగింది. అయితే మామ్‌తో శ్రీదేవి మరోసారి తన సత్తా చాటిన తర్వాత ఇది జరగడం కూడా పరిశీలకులు గమనించకపోరు. రాజమ!ళి చెప్పడానికి అది కారణం కాకపోవచ్చుగాని ఆ మాట రాకుండా వుండదు. బెటర్‌ లేట్‌ దేన్‌ నెవర్‌.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *