వర్మ చేతిలో ఎన్టీఆర్‌ బొమ్మా! హతవిధీ!!

ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీస్తానంటూ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఒక పాట విడుదల చేశారు. కొంతమందికి ఇన్‌స్పైరింగ్‌గా కొంతమందికి ఇరిటేటింగ్‌గా వుండే తన గొంతుతో సుదీర్ఘ వ్యాఖ్యానం కూడా జోడించారు. ఎన్టీఆర్‌ శత్రువులెవరో బయిటపెడతానని మసాలా కూడా జోడించారు. శివ గీతాంజలి రంగీలా వంటి చిత్రాలు తీసిన నేపథ్యం వున్నా (నాకైతే గాయం ఎక్కువ ఇష్టం) వర్మ తన స్థాయి తనే తగ్గించేసుకున్నారు. ఒక ద్వితీయశ్రేణి వ్యాపారాత్మక దర్శకుడుగా చవకగా చౌకబారుగా చిత్రాలు తీసే స్థితికి వచ్చేశారు. రక్త చరిత్ర వంగవీటి చూస్తే తెలుస్తుంది ఈ సత్యం.చరిత్ర పేరిట ఇవన్నీ తీయడంలో ఉద్దేశం ప్రజల్లో ఆ అంశాల పట్ల వున్న ఆసక్తిని సొమ్ము చేసుకోవచ్చన్న వ్యూహమే. తెలుగు ప్రజల ఆరాధ్య నట నాయకుడు ఎన్టీఆర్‌ కథకు ఆయన న్యాయం చేయడం అటుంచి అంత సీరియస్‌గా అంత రిచ్‌గా తీయాలన్న ఆలోచనే లేని మనిషి.ఈ రెండు చిత్రాల్లోనూ ఎన్టీఆర్‌ పాత్ర ఏమాత్రం గౌరవంగా చూపించారో ఉదాహరణ మనముందుంది. చిత్రం వచ్చే వరకూ ప్రచారంలో నానొచ్చు గనక ఈ తతంగం తలపెట్టారు. ఆయన ఆశించినట్టే ప్రచారం మొదలై పోయింది. బాలకృష్ణ ఈ పాత్రకు సరిపోరని లక్ష్మీ పార్వతి అప్పుడే ప్రకటించేశారు. ఈ విషయంలో గతంలో మేము ఒక ఛానల్‌లో వివరంగానే చర్చ చేశాము. వర్మ ప్రోమో బొమ్మల్లో ఆమె ఎక్కువగానే కనిపిస్తున్నారు. మొదట నాదెండ్లను చూపించి చంద్రబాబునూ లీలామాత్రంగా మెరిపించి తీసేశారు. వర్మ జాగ్రత్త ఎలా వుంటుందో తెలియడానికి ఒక ఉదాహరణ. పొగడరా నీ తెలుగుతల్లిని అని ఆ వెంటనే నీ తండ్రి ఎన్టీఆర్‌ను అంటున్నారు. ఈ సీక్వెన్స్‌లో ఆ పదాలు ఎలా ధ్వనిస్తాయనే పరిశీలన కూడా లేదన్నమాట. పైగా అన్నగా ప్రసిద్ధుడైన ఎన్టీఆర్‌ను తండ్రి అనడంలో ఔచిత్యం ఏమిటో కూడా ఆయనకే తెలియాలి. నవసరసభరితమైన ఏ చిత్రంలోనూ లేనంత నాటకీయమైన ఎన్టీఆర్‌ జీవితం వర్మ చేతిలో హతమవకుండు గాక!

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *