కులదౌర్జన్యాలపై బడా మీడియా, పెద్ద పార్టీలు గప్‌చిప్‌

అనేక రకాల సమస్యలపై ఆయా రాజకీయ పార్టీలు విమర్శలూ ప్రతి విమర్శలూ చేస్తుంటాయి.మీడియా కూడా ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టింగులు జరుపుతుంటుంది.కాని దీనికి ఒక మినహాయింపు కులం. కింది కులాలపై అందులోనూ దళితులు బలహీనవర్గాలపై అగ్రవర్ణాలు, దురహంకారులు అత్యాచారాలకు పాల్పడితే లేదైనా ఏదైనా వివాదం వస్తే ఇవన్నీ అదృశ్యమై పోతాయి. కొద్దిమాసాల కిందట భువనగిరి యాదాద్రి జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్నందుకు గాను అంబోజు నరేష్‌ ఘోరంగా హత్య చేయబడ్డాడు. అతని కోసం కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. మేనెలలో భార్య స్వాతి ఆత్మహత్య చేసుకున్నట్టు దానికి ముందు ఏదో సెల్ఫీలో రికార్డింగు చేసుకున్నట్టు బయిటకు వచ్చాక గాని తీగ కదిలింది లేదు. అది కూడా ఆత్మహత్య కాదని, అనుమానాస్పద మరణమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, దళిత సంఘాలు వామపక్షాలు పోరాడిన తర్వాతనే కేసును పునర్విచారించారు. స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి నరేష్‌ను అంతకు ముందే మట్టుపెట్టినట్టు అప్పుడు ఒప్పుకున్నాడు. ఈ అమ్మాయిని కూడా చంపేసినట్టే అందరూ అనుకుంటున్నారు. ఈమొత్తం ఉదంతం కూడా 10 టీవీ కథనాల తర్వాతనే బయిటకు వచ్చింది.ఆ పైన కూడా పెద్ద ఆసక్తి చూపింది లేదు. చెప్పాలంటే ఇప్పుడు శిరీష మరణంపై వరస కథనాలు విడుదల చేస్తున్న మన మీడియా సంస్థలు దాన్ని పరిమితంగానే కవర్‌ చేశాయి. ఇక ప్రధాన రాజకీయ పార్టీల నేతలు గాని ప్రభుత్వ ప్రముఖులు కూడా అటు చూసింది లేదు. హిందూత్వ రాజకీయాల నేపథ్యంలో ఉత్తరాదిన చాలా రాష్ట్రాలలో దాడులు హత్యలు నిత్యకృత్యంగా మారాయి.
ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఇలాటి ఉదాహరణలు చాలా వున్నాయి. తాజాగా జరుగుతున్న గరగపర్రు ఘటనలో అంబేద్కర్‌ విగ్రహం పెట్టుకోవడానికి అడ్డు తగలడమే గాక దాడులకూ ఉద్రిక్తతలకూ , వెలివేతకూ కారణమైన వివక్షలపై మీడియా మౌనమే పాటించింది.పెద్ద పార్టీలూ డిటో డిటో.. ఇక్కడా కెవిపిఎస్‌, సిపిఎం, ప్రజా సంఘాలు గట్టిగా పోరాడిన తర్వాతనే శివాజీ వంటి వారు సందర్శించారు. ఈ దశలోవెళ్లిన వైసీపీ అధినేత జగన్‌ కూడా ఇరుపక్షాల మధ్య రాజీ కోసం ఎక్కువ ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది తప్ప సూటిగా తప్పును ఖండించారా అన్నది తెలియదు. అదైనా మంచిదే. ఇప్పుడు కొన్ని అరెస్టులు చేశారు, శాంతి కమిటీలు ఏర్పాటుచేశారు. మరోవైపు వీడియోలలో అగ్రవర్ణ మహిళలు కొందరి ఆవేశ భాషణాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రకాశం జిల్లా దేవరపల్లిలోనూ దళితుల భూములపై ఇలాటి ఉద్రిక్తతనే సృష్టించారు. కులాల ఘర్షణకు అణగారిన తరగతులపై వివక్షకూ తేడా తెలుసుకోవడం చాలా అవసరం.
ఈ లోగా నాకొక పరిచితుడు ఫోన్‌ చేశాడు.అది ప్రకాశం జిల్లాలో ఒక వూరు. తను అమ్మవారిని చేస్తానంటే వూళ్లో దళితులు రావడంలేదని బయిటి వారిని కూడా రానివ్వడంలేదని ఆయన ఫిర్యాదు. రాకపోతే వారి ఇష్టం గాని పై వూళ్లవారిని రానివ్వకపోతే ఎలా అని ఆయన ఆవేదన ఆగ్రహం. ఎక్కడైనా సరే ఏదైనా పోరాటం ఉద్యమం జరుగుతున్నప్పుడు అందుకు పోటీగా బయిటవారిని తీసుకొస్తామంటే ఎలా అనుమతిస్తారు? కాని కింది కులాల వారు అదే మాటంటే ధిక్కారం అనుకుంటున్నాడీ మిత్రుడు. మన సమాజంలో పేరుకుపోయిన కులాల అంతరాలను తెలిపే ఉదాహరణ ఇది. దళితులకు గాను వెనకబడిన తరగతులకు గాని లేక ముస్లింలకు గాని హక్కులు వుంటాయని ఒప్పుకుని గౌరవించాలి తప్ప వారేదో తక్కువ అనుకోవడం చాలా పొరబాటు. కాని మన పాలక పార్టీలూ మీడియా సంస్థలూ ఆ మాట చెప్పవు. దాన్ని సమస్యగానే పరిగణించవు. పైరెండు సందర్బాలలోనూ స్పష్టమవుతున్న సత్యమదే.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *