1928- 38 పదేళ్లలో మహాకవిగా మారిన శ్రీశ్రీ

ఈ రోజు మహాకవి శ్రీశ్రీ వర్ధంతి. ఏది రాసినా ఏం లాభం వెనకటికి మహాకవి ఎవడో చెప్పే వుంటాడు..బహుశా ఆ చెప్పిన వాడెవడో నాకంటే బాగానే చెప్పుండొచ్చు.. అని శ్రీశ్రీయే అన్నట్టు ఆయన కవిత్వ ఔన్నత్యాన్ని గురించి ఎన్నెన్నో విశేషాలు ఇప్పటికే చెప్పుకున్నవే.
కావాలని కవి అయినవాడో లేక రాజకీయ సందేశం కోసం కవితలు మొదలు పెట్టిన వాడో కాదు శ్రీశ్రీ. సంప్రదాయ కుటుంబంలో పుట్టి ప్రాచీన సాహిత్యం చదువుకుని వాటి పట్ల ఆకర్షితుడై ఆ విధమైన రచనలు కూడా చేసిన వ్యక్తి. ఆనాడు ప్రభావశీలంగా వున్న భావకవిత్వాన్ని అప్పటికి దిగ్దంతులైన భావ కవితా పితామహుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి, పాషాణపాక ప్రభువు అనిపించుకున్న సంప్రదాయ సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ఉభయులనుంచి ప్రేరణ పొందిన వాడు. కృష్ణశాస్త్రి ప్రసంగం విని వూగిపోయి తిండీ తిప్పలూ లేకుండా తిరిగిన వాడు. అయితే ఉత్తరోత్తరా ఆ కృష్ణశాస్త్రిని కూడా తన మార్గానికి తీసుకురావడమే గాక తననే అనుకరించేలా పాటలు రాయించడం శ్రీశ్రీ ప్రతిభాపాటవాలకు ఒక మచ్చుతునక.
శ్రీశ్రీ మొదటి కావ్యం ప్రభవ 1928లో వెలువడింది. మానవ చరిత్రకే మహాభాష్యమనదగిన దేశచరిత్రలు గీతం, మానవుడా మానవుడా అంటూ మనిషి విశ్వజనీనతను చాటిన గీతం 1938లో రాశాడు. అంటే ఒక కవిగా శ్రీశ్రీ పరిణామ క్రమం 1928ా38 మధ్య చాలా వరకూ జరిగింది. ప్రభవలోని కవితల్లోనూ ఇతరత్రా ఆ దశలో రాసిన వాటిలోనూ కూడా శ్రీశ్రీ ఏదో బాధావేదనను ప్రతిబింబిస్తూనే వుండటం చూస్తాం. మామూలు భావ కవితల తరహాలో అప్రాప్త మనోహరి కోసం అశ్రుతర్పణ చేయడం గాక ఆవేదనా మూర్తులు ఆర్తులను ఆయన పట్టుకుంటాడు. తనలో జరుగుతున్న మధనాన్ని, నూతనాన్వేషణలను వినిపిస్తాడు. వాటిలో యుద్ధాలు పరాక్రమాలు ప్రేమలూ కళలూ కలలూ అన్నీ చూపిస్తాడు. అగ్నిహౌత్రము అన్న కవిత(1928)లో శ్రీశ్రీ ‘ప్రజ్వరిల్లెడు బాడబ జ్వాల నేను’ అని ప్రకటించుకుంటాడు. నిశీథి సాంత్వనము(1929) అన్న కవితలో పొంగిపొర్లుతున్న భావావేశాన్ని వర్ణిస్తాడు. ఈ కవిత మనకు వేళకాని వేళలలో అన్న మహాప్రస్థాన గీతాన్ని గుర్తు చేస్తుంది. సంధ్యాభావన అనే కవిత(1932) చదివితే భవిష్యత్తులో రానున్న సంధ్యాసమస్యలు కనిపిస్తాయి. అదే ఏడాది రాసిన గీతం ఖండశశిలో ముందు ముందు ప్రసిద్ధికెక్కబోతున్న ఆకాశాపుటెడరిలో కాళ్లుతెగిన వంటరి ఒంటెలాటి జాబిల్లి అగుపిస్తుంది.
ఈ పరిణామ క్రమానికి పరాకాష్ట 1933. ఆ మార్చిలో విద్యున్మాలికలు రాశాడు. ‘.. పావడా అంచుల బంగారు తీవియలో? కావవి.. ప్రళయ తాండవ భయంకర సౌదామినులు’ అంటూ ముగించాడు. అదే ఏడాది జులైలో ఆంధ్రభూమిలో ‘కోల్పడిన ప్రేమకు’ రాశారు. ‘.. నా అడుగులంట పర్వు శూన్యత కడుగు పెనుతరంగాల మ్రోతలె వినగవలతు’ అని ప్రకటించారు. ్త ఈ కాలంలోనే మద్రాసులో బిఎ చదవడం, 63 రోజుల పాటు టైఫాయిడ్‌ రావడం, 1931-33 మధ్య తను చదివిన ఎవిఎన్‌ కాలేజీలోనే డిమానుస్ట్రేటర్‌గా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకోవడం వంటివి జరిగాయి. తొలి సోషలిస్టు దేశమైన సోవియట్‌ యూనియన్‌ మినహా తతిమ్మా ప్రపంచంలో భారత దేశంలో కూడా ఆర్థిక మాంద్యం. మరోవైపున రెండవ ప్రపంచ యుద్ధ దిశలో నాజీయిజం పెరుగుదల, భారత రాజకీయాలలో కమ్యూనిస్టుల వ్యాప్తి అప్పటి పరిణామాలు.
1928 తర్వాత ఖచ్చితంగా అయిదేళ్లకు 1933లో పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీ దిశగా యువతను సమీకరించే కృషి జరుగుతున్నది. అదే ఏడాది శ్రీశ్రీ జయభేరి రచించి నేను సైతం అంటున్నాడు. భువన భవనపు బావుటానై పైకి లేస్తానని ప్రకటిస్తున్నాడు. మనిషి నిమిత్తమాత్రమనే భావనను పటాపంచలు చేసి వ్యక్తి సంకల్పాన్ని సార్థకతనూ చెప్పే సార్వకాలిక సందేశం ఆ గీతం. . ఆకలేసి కేకలేసినా ఎండకాలం మండిపోయినా మనిషి నిలిచే వుంటాడు.( లేదా వుంటుంది ) ఏ ఒక్కరి పాత్ర తక్కువది కాదు, ఆ ఒక్కరే లేకపోతే ప్రళయమే వస్తుందంటాడు. తర్వాత తెల్లరేకై పల్లవించడం, విశ్వవీణకు తంత్రి కావడం, బావుటాగా పైకి లేవడం. ఈ కవిత రాసిన తర్వాత రెండు మాసాలకు ‘ఒకరాత్రి’ రాస్తూ ‘బహుళ పంచమి జ్యోత్స్య భయపెట్టునన్ను’ వెన్నెల భయపెడుతుందన్నాడు.ఒక బ్రహ్మాండమైన ఫైవ్‌స్టార్‌ హౌటల్‌ చూసిన నిరుపేదకు కలిగే భయం లాటిదే ఇదీ!
మరో ఆరు నెలలు గడిచాయి. 1934 ఫిబ్రవరి. ఆ సమయంలో ఆయనకు గంటలు వినిపించాయి. పట్టణాలలో పల్లెటూళ్లలో కర్మాగారంలో కార్యాలయంలో ,ప్రాణము మోగె ప్రతిస్థలంలో గంటలు గంటలు! నిజానికి ఇవి ఆయనలో కదిలే నవభావాల ధ్వనులు. ఇంతలోనే ఆకాశదీపం రాశాడు. 1934లో తొలి ఆంధ్ర కమ్యూనిస్టు కమిటీ ఏర్పడుతున్నది. ఆ ఏడాదే మహాప్రస్థానం గేయం వెలువడుతున్నది. జయభేరిలో వ్యక్తి ప్రస్థానం చెప్పిన శ్రీశ్రీ మహాప్రస్థానంలో సామూహికంగా పదండి ముందుకు అంటూ ఆ వ్యక్తి ఆ సమూహంలో భా గంగా నడవడాన్ని చెప్పారు భువన భవనపు బావుటానై పైకి లేస్తానన్న శ్రీశ్రీ ‘ఆ గేయం చివరలో ‘ ఎర్రబావుటా నిగనిగలు’ కనబడలేదా అని ప్రశ్నించాడు. సామ్రాజ్యవాదుల పాలన దేశంలో భూస్వామ్య శక్తుల పాలకవర్గాల అణచివేత మధ్యన నవ యువకులు సమీకృతమవుతుంటే శ్రీశ్రీ నదీనదాలు అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి .. పదండి ముందుకు పదండి తోసుకు అని పిలుపునిస్తున్నాడు. ఒక సమాజ పరిస్థితులలో రాజకీయ సిద్ధాంతాలతో పాటు భావ చైతన్యసృజనకు కూడా ఎలా బాట వేస్తాయో చెప్పే గొప్ప సందర్భమిది. మహాప్రస్థానం రాసేనాటికి శ్రీశ్రీకి మార్క్సిజం తెలియదన్నారు. తర్వాత అయిదేళ్లు కూడా ఆయన జీవితం కోసం పెనుగులాడటం తప్ప ఉద్యమాలతో పెద్దగా కలసి నడిచిందేమీ లేదు. కాని ఆయన భావాలు పదునెక్కుతూ వచ్చాయంటే అది ఆయన పరిశీలనకూ ప్రతిభకూ మాత్రమే గాక పరిస్థితుల ప్రభావానికి కూడా నిదర్శనం. 34 లోనే కాదేదీ కవితకనర్హమన్న ‘రుక్కులు, పుడమి తల్లికి పురిటి నొప్లులు అంటూ నూతన సృష్టిని చూపిన ‘అవతారం’ కూడా రాశాడు. ఆశాదూతలు అంటూ నూతన చైతన్యంతో నలుదిక్కులకూ ప్రయాణించడాన్ని చిత్రించాడు. ‘అవతలి గట్టు’కు పోతానన్నాడు. పోనీ పోతే పోనీ అనుకున్నదే చేయాలంటూ ‘కళారవి’ గీతం అందించాడు. తనను బాధపెడుతున్న ‘బాటసారి’ని ‘బిక్షు వర్షీయస’ీని కూడా ఈ ఏడాదే దర్శించాడు.

వీటన్నిటి విశ్వరూపమైన తన కవితా జననిని అమోఘంగా దర్శిస్తూ ‘కవితా కవితా’ 1937లో రాశాడు. ఇది విని విశ్వనాథ కూడా లేచి ఆలింగనం చేసుకున్నాడట. తను చెప్పేది నిజం కాదని మెట్టవేదాంతం చెప్పే మిథ్యావాదిని ఆక్షేపించే కవిత రాశాడు. ఏవో ఏవేవో ఘోషలు వినిపిస్తున్నాయంటూ ‘అభ్యుదయం’ దర్శించాడు. ‘వ్యత్యాసం’ లో ముందుకు పోతాం మేము ప్రపంచం మా వెంట వస్తుంది’ అని దృఢంగా ప్రకటించాడు. అప్పుడే అబ్బూరి రామకృష్ణారావు ఇచ్చిన లండన్‌ అభ్యుదయ రచయితల ప్రణాళిక చూసి సహస్త్ర వృత్తులసమస్త చిహ్నాలు తన నవీన గీతికి నవీన రీతికి ప్రాణం ప్రణవం అని చాటి చెప్పేసి మజిలీ చేరుకున్నాడు. అయినా ఒకింత సందేహంతో ‘చేదుపాట’ రాసి మళ్లీ ‘నవకవిత’ లో ఎగరేసిన ఎర్రనిజెండాను తీసుకొచ్చాడు.మహాప్రస్థానంలో ఆ తర్వాత రాసిన గీతాలు మరో నాలుగైదు మాత్రమే వుంటాయి. జగన్నాథ రథచక్రాలు, కొంపెల్లకు అంకితం, సంధ్యా సమస్యలు, గర్జించు రష్యా,నిజంగానే. వాటి విశేషాలు సాహితీ మిత్రులకు సుపరిచితమే.
మహాప్రస్థానంలోని ప్రతి గేయం, ప్రతిచరణం ఇప్పటికీ వర్తిస్తాయి. కొన్ని అచ్చంగా ఇప్పటి పరిస్థితులే రాసినట్టు వుంటాయి. ఎందుకంటే శ్రీశ్రీ కోరుకున్న సమధర్మం ఇంకా రాకపోగా ఆర్థిక అసమానతలూ వివక్షలు తీవ్రమవుతున్నాయి. పదండి ముందుకు పదండి తోసుకు అంటూ సాగిపోవడమే దీనికి విరుగుడు. ఇక అక్షర ప్రియులు చేయవలసింది ఆయనలా చిరదీక్షా తపస్సమీక్షణ, నిరంతర అధ్యయనం, ప్రగాఢ పరిశీలనం, నిత్య క్రియాశీలత.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *