అతి తక్కువఖర్చుతో ఆకట్టుకునే సినిమా. డా.విరించి విరివింటి ‘పెర్‌సెప్షన్స్‌'(1.39గం, కుదింపులో 45 ని.)

చాలామంది మిత్రులు చెప్పాలంటే వందల సంఖ్యలో తమ పుస్తకాలు ఇచ్చి సమీక్షలు రాయండని కోరడం జరుగుతుంటుంది.కొన్ని తప్పక రాయాలనుకోవడం రాస్తానని చెప్పి మాట తప్పడం కూడా మామూలే. వారంతా నన్ను తిట్టుకుంటారనీ అది న్యాయమేనని కూడా తెలుసు…
ప్రస్తుతానికి వస్తే ..ఆ మిత్రుడికి మార్చి7 మాటిచ్చాను రాస్తున్నానని. ఇప్పటికి ఎన్నాళ్లయింది? రోజూ అనుకుటూనే.. కవిగా రచయితగా నిరంతర భావుకుడుగా, డా.విరించి విరివింటి నాకు పరిచయం. కాని ఆయన రూపొందించిన పెర్‌సెప్షన్స్‌ గురించి ఇన్నాళ్ల తర్వాతనైనా రాయడానికి అవేవీ కారణం కాదు. మూస సినిమాల్లో మాయలకు అతి చవుకగా ప్రత్యామ్నాయం అందించగల మన యువత ప్రతిభకు నిదర్శనంగా ఈ చిత్రం కనిపించింది. షార్ట్‌ పిల్ములు చాలా వస్తుంటాయి .కొన్ని చమక్‌ అని కొన్ని చురుక్‌ అని అనిపిస్తుంటాయి. నిడివి నిర్వచనం నాకు తెలియదు గాని వాస్తవంగా గంట ముప్పై తొమ్మిది నిముషాలు, కుదింపులో 45 నిముషాలు నడిచే ఈ చిత్రం అంతకన్నా ఎక్కువ. ఇంత నిడివితో అర్థవంతమైన ఆలోచనాత్మకమైన పెర్‌సెప్సన్స్‌ తీయడానికి కేవలం 25 వేల రూపాయలే ఖర్చయింది. (మరికొంత పెట్టుబడివ్యయం భవిష్యత్తులోనూ ఉపయోగకరమే ) హాలులో చూస్తున్నప్పుడు ప్రేక్షకులు- ఆహ్వానితులే అనుకోండి.. రామ్‌గోపాల్‌ వర్మనో మరొకరినో అనుకోవడం దానిలోని సత్తాను చెప్పింది. ఇది మామూలు చిత్రం కాదు అని ముందే చెప్పినప్పటికీ వాటిని చూసిన వారిని కూడా ఆకట్టుకునేట్టు నడవడం నాకు నచ్చింది.
చిత్రం కథ చాలా చిన్నదే గాని భావం చాలా చాలా పెద్దది. మనం అనుకునేదంతా సంపూర్ణ సత్యం కాదు. పాక్షిక దృష్టితో చేసే వూహలు ఉపద్రవాలు కావచ్చు.
చిత్రం మొదట్లొ ప్రశాంత్‌(హృదరు) కెమెరాతో ఏవో షూట్‌ చేసుకుంటుంటాడు. కాలేజీలో ఇంట్లొ బయిటా అదో విధంగా ఎవరూ పట్టకుండా తన లోకంలో తను సంచరిస్తుంటాడు. తన కెమెరా కన్నుతో ఎవరికీ తెలియని ఏదో లోకాన్ని ఆవిష్కరించాలనేది తన తపన. ప్రీతి(లోక్‌షిత్‌) చొరవగా అతనికి చేరువవుతుంది.. ఇంట్లో నిరంతరం హిచ్‌కాక్‌ చిత్రాలు చూస్తూ తనపై కేకలేస్తూ తమలో తాము కీచులాడుకునే అమ్మానాన్నల మధ్య ప్రశాంత్‌కు ఆమె మంచి స్నేహితురాలై అతని వూహలను పంచుకుంటూ ఒకింత హుషారు తెప్పిస్తుంది. తల్లిలేని ప్రీతిని ఎంతో ప్రేమగాపెంచే చిత్రకారుడైన తండ్రి వారి స్నేహంపై విరుచుకుపడతాడు. ప్రీతి అతన్ని కలవడం మానేస్తుంది. రహస్యంగా చూద్దామని వెళ్లిన ప్రశాంత్‌కు పై అంతస్తు కిటికీ లోంచి ఏవేవో దృశ్యాలు కనిపిస్తాయి.వాటి ఆధారంగా అదను విషయం వూహిస్తాడు. ఇంతలోనే వాళ్లు ఇళ్లు ఖాలీ చేసి వెళ్లారని తెలుస్తుంది. అనుకోకుండా అతని తండ్రి చేతికి ఆ ఇంటి తాళాలు రావడంతో ప్రశాంత్‌ రహస్యంగా వాటిని తీసుకుని అక్కడ అన్వేషణకు బయిలుదేరతాడు. అప్పుడే ప్రీతి తండ్రి వచ్చి ఘర్షణ పడతాడు. మరుసటిరోజు ప్రీతిఫోన్‌ వచ్చాక జరిగింది అర్థమవుతుంది. నిజం ఏమిటి వూహలేమిటి తెలిసిందేమిటి. కింద లింకులోచూడొచ్చు.
నటీనటులు కథాగమనం, సంభాషణలు సస్పెన్స్‌, సంగీతం, చిత్రణలో సింబాలిజం వంటివి కొన్ని సగటు సినిమాలకంటే మెరుగ్గా వున్నారుా.విరించిని ఆయన బృందాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నా. ఇతివృత్తానికి సంబంధించి ఒకే ఒక ముక్క ఏమంటే అసలు సత్యమే లేదని కాదు.దాన్ని గ్రహించడానికి వూహించడానికి మధ్యలో తేడా వుంటుందని మాత్రం చెప్పగలం.
హృద్రోగ నిపుణుడూ హృదయ గతమైన సాహిత్య ప్రియుడు డా.విరించి చిత్ర నిర్మాణంలో తప్పక రాణిస్తారని, సహృదయులు సహకరిస్తారని అనుకుంటున్నా. చిత్రంలో చిన్న చిన్న లోపాలు పరిమిఈలు వున్నాయి గాని కాన్సెప్ట్‌లో మేకింగ్‌లో సానుకూల అంశాలే అత్యధికం. అనుభవంలో వాటిని సవరించుకోవడం పెద్ద సమస్య కాదు. పెట్టుబడి కూడా అతి తక్కువ గనక ఎవరైనా ప్రయత్నించవచ్చు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *