దర్శక దర్శనం..

1973.ఇంటర్మీడియట్‌ చదువుతున్న కాలం. క్లాసుల కన్నా సినిమాలకు వెళ్లడం ఎక్కువ. అందులో తేడాలు తప్పొప్పులు గొప్పలు తెలుసుకోవడం ఆనందం.అప్పుడొచ్చింది తాత మనవడు. ఒక కుదుపు అప్పటి వరకూ ఎన్టీఆర్‌పార్టీ ఎఎన్నార్‌ పార్టీ కాదంటే కొత్తగా వస్తున్న కృష్ణ శోభన్‌బాబులకే పరిమితమైన మా కుర్ర బుర్రలు హుషారెక్కాయి. రాజబాబు సత్యనారాయణ, ఎస్వీఆర్‌ అంజలి వంటివారితో అంత పెద్ద హిట్‌. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం పాట..అన్నీ వూపేశాయి. చెప్పాలంటే తెలుగు సినిమా కొత్తమలుపు తిరిగింది. గూడవల్లి రామబ్రహ్మం, కెవిరెడ్డి బిఎన్‌రెడ్డి,ఆదుర్తి, ప్రత్యగాత్మ,కెస్‌ప్రకాశరావు వంటిహేమాహేమీలను చూసినప్పటికీ సగటు ప్రేక్షకులకు మొదటి సారి దర్శక దర్శనం జరిగింది. తారాలోకంలో తారలే వుంటారన్న భావన పోయి- దాసరి నారాయణరావు పేరు మేఘాల్లో కనిపించింది. అదిగో అలా ప్రేక్షకుల దృష్టిలోకొచ్చిన దాసరి మరో 25 ఏళ్లపాటు తెలుగు సమాజంలో బహుముఖ ప్రజ్ఞతో ప్రభావం చూపించారు. ప్రయోగాలు చేసి ప్రకంపనాలు తెచ్చారు. ఢక్కాముక్కీలు తిన్నారు.. ఏది ఏమైనా ఒక వటవృక్షంలా ఎందరికో నీడనిచ్చారు. వందమంది దర్శకులు రచయితలు ఆయనను తమ గురువుగాచెప్పుకుని సత్కరించుకోవడం కన్నా ఇందుకు మరో నిదర్శనం అవసరం లేదు. కన్నీరు అబద్దం చెప్పదు. ఎందరో సీనియర్లు ఆయనే తమ తండ్రి అని కన్నీరు మున్నీరయ్యారు.
అగ్ర నటులు, మహాదర్శకులు గొప్ప కవులు రచయితలు దక్షత గల నిర్మాతలు వున్నా చాలాకాలం మన సినిమా మూసధోరణిలోనే నడిచింది. కదిలిస్తే ఏమవుతుందోననే భయం రాజ్యమేలింది. క్రమంగా ఇద్దరు పెద్ద హీరోల తీరుతెన్నులే సర్వస్వం శాసించిన దశ మారుతున్నది. 1972, 73ల్లో మంచి చిత్రాలు చాలా వచ్చాయి. పరిశోధకులు చూసుకోవచ్చు.ఉత్తరోత్తరా తెలుగుతెరపై గొప్ప పేరు సంపాదించబోతున్న కె.విశ్వనాథ్‌, బాపు కూడా 1972లో హిట్లు ఇచ్చి ఈ ఏడాది కొనసాగుతున్నారు. తెలుగుతెర మార్పునకు సిద్ధమైందన్నమాట. (రాఘవేంద్రరావు మాత్రం మరో మూడేళ్లకు అంటే 1976లో బాబు ద్వారా రంగ ప్రవేశంచేస్తారు. ). ఈ ముగ్గురికి తరతమ తేడాలతో స్వంత నేపథ్యాలున్నాయి. విశ్వనాథ్‌ తండ్రి సినీసాంకేతిక నిపుణుడు. రాఘవేంద్రరావు తండ్రి కెఎస్‌ప్రకాశరావు దిగ్గంతుడైన దర్శకుడు.బాపు చేయి తిరిగిన చిత్రకారుడు పైగా ముళ్లపూడి తోడు. పోల్చకూడదు గాని వీరితో పోల్చితే దాసరికి అలాటివిలేవు. శైలిపరంగానూ రాఘవేంద్రరావు మొదటి రెండు మూడు చిత్రాలు పక్కనపెడితే తర్వాత వాణిజ్య ఫార్ములాలనే పండించారు. విశ్వనాథ్‌ మొదట్లో సామాజిక చిత్రాలు తీసినా తర్వాత సంగీతం పేరిట సంప్రదాయ ధోరణిని ఎత్తుకున్నారు. ఇక బాపు తనదైన కళాత్మకత ముళ్లపూడి మార్కు ్ప సందేశం కలిపి అందంగా తీయడంపై దృష్టిపెట్టారు. దాసరి అలాటిి నిర్వచనాలు మార్చేశారు. తమిళంలో బాలచందర్‌ వంటివారు తెచ్చిన ఆఫ్‌బీట్‌ పద్దతులను ధైర్యంగా అనువర్తింపచేశారు. సెంటిమెంట్లనూ సామాజిక సమస్యలనూ కూడా మేళవించారు. చిత్రీకరణలో సింబాలిక్‌ షాట్స్‌ పెంచారు. నాటకీయ సంభాషణలు తెచ్చారు. కొత్త సంవిధానానికి కొత్త ముఖాలు కూడా అవసరమని నిరూపించారు. వచ్చిన కొద్ది కాలంలోనే యవ్వనం కాటేసింది వంటి చిత్రం తీయడం దాసరి సాహసదృష్టిని నిరూపించింది. ఆ తర్వాత కొన్నేళ్లకు కూడా బాలచందర్‌ అంతటి దర్శకుడు గుప్పుడు మనసులో అనుకోకుండా అత్యాచారానికి గురైన నాయిక ఆత్మహత్య చేసుకున్నట్లే చూపించారంటేనే ఇది ఎంత సాహసమో తెలుస్తుంది.
అన్ని రకాల చిత్రాలు అంత సంఖ్యలో తీసి విజయాలు సాధించింది దాసరి మాత్రమే. మానవ సంబంధాలు దెబ్బతినడం అన్న ఒక్క అంశంపైనే తాతమనవడు,సూరిగాడు, బహుదూరపు బాటసారి, ఓ తండ్రి తీర్పు, బంగారు కుటుంబం, తదితర చిత్రాలు తీశారు. మహిళల గొప్పతనాన్ని చెప్పడానికి రాథమ్మ పెళ్లి, భారతంలో ఓ అమ్బాయి, కళ్యాణి, శివరంజని, కంటే కూతుర్నే కను, ఒసే రాములమ్మ, ఓ ఆడది ఓ మగాడు,మజ్ను , అమ్మ రాజీనామా వంటివన్నీ అందించారు. పిల్లల పెంపకంపై నీడ తీశారు. తన నాటక నేపథ్యానికి గుర్తుగా చిల్లరకొట్టుచిట్టెమ్మను తెరకెక్కించడమే గాక రంగూన్‌ రౌడీ పేరును ఉపయోగించారు. కళాత్మక విలువలతో సున్నితమైన సమస్యతో మేఘ సందేశం అందించారు. అక్కినేనిని దేవదాసుగా మళ్లీ పుట్టించి ప్రేమాభిషేకంతో మరో మహాప్రేమికుడుగా మలచారు. సావిత్రిని మళ్లీ తీసుకొచ్చి అహౌ అనిపించారు. ఎన్టీఆర్‌ను సర్దార్‌గా బొబ్బిలిపులిగా మార్చారు. . శోభన్‌బాబుతో బలిపీఠం గోరింటాకు వంటి చిత్రాలు తీసిన దాసరి కృష్ణతోనూ చక్కటిచిత్రాలు రూపొందించడమే గాక విశ్వనాథనాయకుడు వంటి చరిత్ర కథనూ తీసుకొచ్చారు.కృష్ణం రాజుతో దశలవారిగా పలు రకాల చిత్రాలు తీసి కటకటాల రుద్రయ్య రంగూన్‌రౌడీ వంటి వాటితో దశను మార్చేశారు. వాటరీమేక్‌ితో హిందీ సినిమానూ వూపేశారు. మెగాస్టార్‌ రిక్షావోడుకు పోటీగా నారాయణమూర్తితో ఒరే రిక్షా తీసి ఆహొ అనిపించారు. మోహన్‌బాబు, మురళీమోహన్‌,నారాయణమూర్తి, వంటి వారికి ఆయనే ప్రారంభకుడు. ఇవన్నీసినిమా మాటల్లా కనిపించినా వీటి వెనక ఒక సామాన్యుడు సాధించిన విజయం వుంది. ఇందుకు కారణం ఏమంటే ఆయన ఏదో నైరూప్య పరిపూర్ణత కోసం పాకులాడలేదు. . కుటుంబ సంబంధాలు ప్రేమలు విప్లవాలు కులమతాలు మహిళలఅసమానత, ఉద్యమాలు, సాయుధ పోరాటాలు రాజకీయ వ్యూహాలు, కళాప్రస్థానాలు ఒకటేమిటి ఆయన చేయని ప్రయోగం లేదు. ఆయనకు చాలా ఇష్టమైన అద్దాలమేడలో సినిమా జగత్తును చూపించి శివరంజని ద్వారా నాయికను శిఖ్షరాగ్రాన ప్రతిష్టించారు. ే రావూరి భరద్వాజ పాకుడు రాళ్లు నవలకు మరో కోణం మనం శివరంజనిలో చూడొచ్చు. నటుడుగానూ ఆయన చిత్రాల సంఖ్య, విజయాలు కూడా తక్కువ కాదు. ఖచ్చితంగా 20ఏళ్లకిందట వచ్చిన ఓసే రాములమ్మ ఆయన చివరి ఘన చిత్రమని చెప్పొచ్చు. మరో మూడేళ్ల తర్వాతదైన కంటే కూతుర్నుకను కూడా జోడించవచ్చు.ఇంత భారీగా చేసినప్పుడు లోపాలోపాలుకూడా వుంటాయి. కాని ఆయన వెలిగించిన దీపాలే ఎక్కువ.
చాలా మాటలత ోనాటకీయతతో ముంచెత్తినట్టుకనిపించే దాసరిలో భావుకత చూడాలంటే మేఘసందేశంలో ఆకాశదేశాన, శివరంజనిలో జోరు మీదున్నావు తుమ్మెద, సీతారాములులో తొలిసంధ్యవేళలో, గోరింటాకులో కొమ్మకొమ్మకో సన్నాయి వంటివి గుర్తుచేసుకోవచ్చు. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, ఒసే రాములమ్మ వంటి ఆయన చిత్రాల పాటలు తెలుగు వారి చైతన్యంలో భాగమై పోయాయి.అన్నట్టు వేటూరితో పోట్లాట వచ్చి తనూ పాటలు రాయడం మొదలుపెట్టి కొన్ని మంచివి కూడా రాశారు.అన్నీ సహాయకులతో చేయించాడనేవారు ఎప్పుడూ వుంటారు గాని స్వంత శక్తి లేకుండా అది జరిగేపని కాదు. విశ్వనాథ్‌ అంతటివారు నోరు లేని మాలాటి వారికి ఆయన నోరిచ్చారని జోహార్లుచెప్పడం దాసరి జీవితంలో అతి గొప్ప భాగం. సినిమా కార్మికులు పనివారు బక్కమనుషుల కోసం నిలబడ్డారాయన. పత్రికా రంగంలోనూ మూసధోరణిని చేదించి కొత్త వరవడి పెట్టిన ఆయన వరవడి కూడా మరవలేనిది. ఉదయం పత్రిక అస్తమించి వుండొచ్చు గాని ఆ కిరణాలుి అన్ని చోట్లా ప్రసరించాయి. దాసరి దంపతుల దానధర్మాలు సేవలు కూడా అందరికీ తెలుసు. సామాజిక రాజకీయకోణం.స్వంత పార్టీతో రాజకీయాల్లోకి రావాలనుకొని వివిధ ప్రభావాలతో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఎంపిగా మంత్రిగా దీర్ఘకాలం పనిచేశారు. ఆ కాలంలోని కాలుష్యం ఆయనపైనా పడివుండొచ్చు. అదంతా విచారణలో వుంది. ఆ సందర్భంలోనూ మూలపీఠమైన ప్రధాని కార్యాలయాన్ని విచారించాలని దాసరి ధైర్యంగా అడగడం సమంజసమే. రిలయన్స్‌ వివాదంలో జైపాల్‌రెడ్డి, స్వంత కేసులో చిదంబరంకూడా అలాటివే మాట్లాడారు.అప్పటికి ఇప్పటికీ అది జరగలేదు. జరగదు కూడా. చివరి దశలో ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ఆందోళనలో పెద్దన్న పాత్ర దాసరి ఆఖరి క్రియాశీలజోక్యమని చెప్పాలి. ఆ వెంటనే ఆయన ఐసీయులో చేరిన సన్నివేశం. ి అప్పటికే పరిస్థితి అర్థమై పోయింది. ఆయన ఆఖరి పుట్టిన రోజును అందరూ చేరి ఆ మహాదర్శకున్ని గౌరవించడం సంతృప్తి కలిగించిన సందర్భం.
కట్టించిన కోటలేమో మిగిలిపోయెను..కట్టుకున్న మారాజు తరలిపోయెను అని ఆయన ఎవరికి వారే యమునాతీరేలో పాట. దాసరి వెళ్లిపోయినా ఆయన విశ్వరూపం చిరస్థాయిగా వుంటుంది.( ఎడిట్‌పేజి ఆంధ్రజ్యోతి)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *