పోలీసులపై పొగడ్తలు-మరుగుపడిన దారుణ వాస్తవాలు

ప్రతిదీ అతిశయోక్తులతో చెప్పడం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రివాజు. అయితే ఎస్‌ఐ నుంచి ఐపిఎస్‌ ల వరకూ అందరినీ ఒకేచోట సమావేశపర్చి పోలీసులను పొగడ్తలతో ముంచెత్తడం దేశ చరిత్రలో అరుదైన ఘటనే. పోలీసుల విధి నిర్వహణను మెచ్చుకోవడం, వారి సమస్యల పరిష్కార చర్యలు చూడటం వేరు. మీ అంతవారు లేరని ఆకాశానికెత్తడం వేరు. యంగెస్ట్‌ స్టేట్‌ గ్రేటెస్ట్‌ పోలీస్‌ అని పొగడ్డం లో రాజకీయమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి మాత్రమే వుంది గనక పోలీసులను మంచి చేసుకోవడానికి ముఖ్యమంత్రి చాలా ధైర్యంగా ప్రయత్నం చేశారని హిందూ వార్తాకథనం మొదలైంది. నిజంగానే అక్కడ ఆయన ధోరణిచూసిన వారెవరికైనా అదే అనిపిస్తుంది. ఈ మధ్యనే నయీంతో సంబంధమున్న కొందరు పోలీసు అధికారులపై వేటు పడటం, ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేసిన ఘటన పోలీసుల నిర్వాకమేనని చేతులు దులిపేసుకోవడం, దర్నాచౌక్‌ నిరసనలో మప్టీలో వచ్చి కూచున్న మహిళా సిఐని సస్పెండ్‌ చేయడం వంటివి దేనికి ఉదాహరణలో ఆయనే చెప్పాలి. ఇవి చెదరుమదురు ఘటనలని తీసేసినా పోలీసుల వైపు నుంచి చూస్తే ఈ కాలంలో తెలంగాణ పోలీసులలో జరిగినని ఆత్మహత్యలు గతంలో చూడలేదు. వాటన్నిటినీ ఎలాగో దాటేయడం తప్ప లోతుల్లోకి వెళ్లి నిజానిజాలు వెళ్లడించిన సందర్బం లేదు. (ఆఖరుకు ముఖ్యమంత్రి ఫాంహౌస్‌ దగ్గర కాపాలా కాచిన పోలీసు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.)వీరిలో చాలామంది పై అధికారులపై ఫిర్యాదులు రాసిపెట్టి మరీ ప్రాణాలు తీసుకున్నారు. పోలీసు స్టేషన్లలో రాజకీయ వసూళ్లు బాగా పెరిగిపోయాయని ప్రత్యేకంగా వచ్చి చెబుతానని ఒక జిల్లా స్థాయి అధికారి కొన్నాళ్ల కిందట నాతోనే అన్నారు. పోలీసుల సమస్యలు సరేసరి. మావోయిస్టుల విషయంలో తెలంగాణ పోలీసులు బాగా చేశారని జాతీయ స్తాయిలో ఎవరైనా ప్రశంసించి వున్నారేమో గాని అది అంతకుముందున్న దాని కొనసాగింపే. ఈ మధ్యనే ఐఎస్‌ఐఎస్‌చ పేరిట ఫేక్‌ సైట్‌ సృష్టించారని కాంగ్రెస్‌ నాయకుడు డిగ్విజరు సింగ్‌ ట్వీట్‌ చేస్తే అందరం ఖండించాం. కాని ప్రభుత్వం పోలీసులు దానిపై రకరకాల వివరణలు ఇచ్చి చివరకు అర్థంతరంగా ఆపేశారు. అంలే ఏదో అర్థంకాని అంశం వుందన్నమాట. ముఖ్యమంత్రి కెసిఆర్‌ పోలీసులను ప్రశంసిస్తే సదుపాయాలు కల్పిస్తే మంచిదే గాని రాజకీయ కోణంలో పొగడ్దలు కురిపించడం, ఇప్పటికే వెల్లడైన కొండంత లోపాలను కప్పిపుచ్చడం మాత్రం సరికాదు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *