‘స్థానిక’ ముసుగులోని పోలీసుల రక్షణకే ధర్నాచౌక్‌ రణరంగం

హైదరాబాద్‌ ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ ప్రశాంతంగా ఆందోళన చేసుకోవడానికి పోలీసులు అనుమతినిచ్చినట్టు ఈ రోజు ఉదయం తెలిసిన తర్వాత ప్రభుత్వం విజ్ఞత చూపిందని భావించాను. అయితే ధర్నాచౌక్‌ ఎత్తివేత కమిటీగా స్థానికుల నిరసనకు కూడా అక్కడే అనుమతినిచ్చారని తెలిశాక ప్రభుత్వ వ్యూహం అర్థమైంది. ఉద్రిక్తతకు మూలాలు ఇక్కడే వున్నాయి. గత ఏడాది 1600 ధర్నాలు జరిగితే అడ్డుపడని స్థానికులు ఇప్పుడే ఘర్షణకు రావడం వూహకందని విషయం. టీవీ విజువల్స్‌లో కూడా దొరికిపోయినట్టుగా మఫ్టీ పోలీసులు , టిఆర్‌ఎస్‌ నేతలు కొందరు ఎత్తివేత నిరసన చేపట్టారు. తమ వారిని కాపాడ్డం పోలీసుల కర్తవ్యమైపోయింది. ఉదయమే కార్యకర్తలు అక్కడ చేరినా పెద్ద సమస్య రాలేదు.కాని అనుమతి లభించిందని భారీ ఎత్తున రాగానే పోలీసులలో భయం మొదలై బ్యారికేడ్లు పెట్టారు. ఈ పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తల తాకిడికి బారికేడ్లు నిలవలేదు. అవి కూలిపోతుంటే వీరొచ్చి తమ వారిపై పడతారేమోనని పోలీసులు లాఠీచార్జి చేశారు,. అనేకమందికి నెత్తురుకారడం, ఎముకలు విరగడం వరకూ వెళ్లింది. దాంతో వారు కుర్చీలు విరగ్గొట్టారు. అక్కడ పోలీసులు భారీగా కుర్చీలు వేయించారే గాని వాటి నిండా మనుషులను తేలేకపోయారు. ఉన్న మఫ్టీ పోలీసులు కూడా వెళ్లిపోయారు. కనుకనే ఎంతసేపటికి ఫోటోలలో కుర్చీల విధ్వంసమే చూపించగలిగారు గాని మనుషులపై దాడి జరిగిన దృశ్యాలు చాలా నామమాత్రం. వామపక్ష కార్యకర్తలు చాలామందికి దెబ్బలు తగిలాయి.గతంలోనే శాసనసభలో కమ్యూనిస్టులపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను ఆయన పార్టీ నేతలు హౌం మంత్రితో సహా మరోసారి రికార్డు వేశారు.వారి ఛానల్‌ కూడా రోజంతా అదే ప్రసారం చేసింది. ఏతావాతా ధర్నాచౌక్‌ రణరంగమైంది. ప్రశాంతతను కోరుకుని వుంటే వ్యతిరేక ధర్నాకు ఎలా అనుమతినిస్తారు? అది కూడా అక్కడే చేయడమేమిటి?
ఒక వేళ ధర్నాచౌక్‌ వల్ల ఇబ్బంది అనుకుంటే పక్కనే ఎన్టీఆర్‌ స్టేడియంలో స్థలం కేటాయించాలి గాని 15 కిలోమీటర్ల అవతల చేయమంటే ఎలా? అంధులు వికలాంగులతో సహా మొత్తం సమాజం గొంతుక ధర్నాచౌక్‌.దాన్ని ఎత్తివేయించేందుకై ప్రజల మధ్య చిచ్చు పెట్టడం మరీ దారుణం. ఇది ఇలా జరుగుతుందని ఉదయమే టీవీ చర్చలో సూచనగా చెప్పాను గాని మరీ ఇంత తీవ్రమైన లాఠీచార్జికి పోలీసుల నిరసనకు పాల్పడతారని మాత్రం వూహించలేదు.ఇప్పటికైనా రాజకీయ నిందారోపణల బదులు పరిష్కారం చేసుకోవడం ఉత్తమం. ఇది నిస్పందేహంగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కుదుపు. సచివాలయం కూడా వద్దని ప్రగతిభవన్‌కే రమ్మనే వారు ప్రజలను మాత్రం నగరశివార్లలో నినాదాలిచ్చుకోమంటే వినేవారెవరు? సిఎంలు సెలబ్రటీల కోసం వచ్చినట్టు మీడియా కెమెరాలు వస్తాయని వాదించడంలో వాస్తవికత ఎంత? ి వామపక్షాలు కాంగ్రెస్‌తో పాటు జెఎసి కూడా గూండాలని నిందించడంలో రాజకీయ కక్షకు పరమార్థం ఏమిటి?

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *