తెలుగు మహాసభలతో కెసిఆర్‌ సంకేతం

కవి మిత్రుడు నందిని సిధారెడ్డిని తెలంగాణ సాహిత్య అకాడమీ అద్యక్షుడుగా నియమించడంతో పాటే ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఒక కీలకమైన ప్రకటన చేశారు. జూన్‌2న అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంలోనే హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయని. సిధారెడ్డి దీర్ఘకాలంగా సాహిత్య లోకంలోనూ సామాజిక ఉద్యమాలలోనూ పరిచితులే. మొదటి అద్యక్షుడుగా ఆయన తెలంగాణలో సాహిత్య వికాసానికి చర్యలు తీసుకోవచ్చు. గతంలో అకాడమీలపై వున్న విమర్శలను పూర్వపక్షం చేసేలా వ్యవహరించవచ్చు. ఇక ప్రపంచ తెలుగు మహాసభలకు కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయం రాష్ట్రాల సరిహద్దులకు సమస్యలకు అతీతంగా తెలుగు భాషా సాహిత్యాలు వర్థిల్లాలనే సంకేతం అందించాలని కోరుకోవాలి. ఎందుకంటే ఉద్యమ కాలంలో తెలంగాణ భాష అంటూ వేరే వుందన్నట్టు కొందరు మాట్లాడేవారు. కొన్ని వాదవివాదాలు కూడా జరిగాయి. మామూలుగా అనడం వేరు గాని సాంకేతికంగా శాస్త్రీయంగా అలా అనే అవకాశం వుండదని సాహిత్యంపై అవగాహన వున్న కెసిఆర్‌కు బాగా తెలుసు. ఎప్పుడో సినారె అన్నట్టు భాగవతం ఏకశిలా నగరంలో వెలిస్తే మహాభారతం రాణ్మహేంద్రవరంలో పుట్టింది. ఈ రెండూ లేని తెలుగు సాహిత్య చరిత్ర ఎలా సాధ్యం? భాషా ప్రయోగాలు ఉచ్చారణలు క్రియాపదాలు అన్యభాషా ప్రభావాలు ఒక్కో చోట ఒక విధంగా వుండొచ్చు గాని తెలుగు భాష అవిభాజ్యమే. తెలుగుకు 56 అక్షరాలే వుంటాయని నేను చాలా సార్లు అంటుంటాను. గతంలో ఆ కోణంలో చూసినప్పుడు తెలంగాణ పరిధిలోసాహిత్య వికాసానికి భాషా ప్రామాణికతకు కృషి చేయడం వేరు, విశాల తెలుగు భాషా జగతితో సంభాషించడం వేరు.రాజకీయాలు ఎలాగూ వుంటాయి గాని చారిత్రికంగా ఈ సభ నిర్ణయం స్వాగతించదగింది. గౌతమీపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవంలో కెసిఆర్‌ చేసిన ప్రసంగంలోనే ఈ భావన ప్రస్పుటమైంది. సమయం తక్కువగా వున్నా భారీగా జరగడంలో పెద్ద ఇబ్బందులేమీ వుండవనుకోవచ్చు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *