మొక్కులు, మక్కాయాత్రలపై ‘పరిపూర’్ణ పరిహాసం!

పరిపూర్ణానందుల వారికి కోపం వచ్చింది. సర్వసంగ పరిత్యాగులు సకల మానవులను ఒక్కటిగా చూడాలి తప్ప ఒకరికి ఒకరిని పోటీ పెట్టి చూడకూడదనే పరమ సత్యం కూడా మర్చిపోయారు. పోనీండి.. పురాణాల్లోనూ రుషులు శాపాలు పెడుతుంటారు. కోపానికి ప్రతినిధిగా దుర్వాసుడు(కొంతవరకూ విశ్వామిత్రుడు కూడా) వంటి రుషులే వున్నారు. అయితే ఇక్కడ స్వామి వారి కోపం కొంచెం లెక్క తప్పింది. కెసిఆర్‌ తిరుపతి మొక్కులు తీర్చుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టలేదు.కాకుంటే తన వ్యక్తిగత మొక్కులు ప్రభుత్వ ధనంతో తీర్చుడం రాజ్యాంగ రీత్యానూ, భక్తి సిద్ధాంతం రీత్యానూ కూడా పొసగదని నేను చాలా సార్లు రాశాను, చెప్పాను. మరో భాషలో ఇదే విషయం బి.వి.రాఘవులు సురవరం సుధాకరరెడ్డి వంటి వారు కూడా వ్యక్తం చేశారు. అలా అన్నవారంతా సన్నాసులు అని కెసిఆర్‌ దాడి చేశారు. మరి సన్యాసులకు దీనిమీద కోపం రాలేదు.( సన్యాసి సన్నాసి ఒక శ్లేష కనిపెట్టుకున్నారు వాళ్లు.. అంతా మన అభీష్టమే కదా) ఒక పోతే కెసిఆర్‌ ప్రభుత్వ ధనంతో మొక్కులు తీర్చడానికి ముస్లింలను మక్కా యాత్రకు సబ్సిడీ ఇవ్వడానికి పరిపూర్ణానంద పోలిక తేవడం మరీ అసంబద్దం. బహుశా దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఏకీభవించరు. ఆయన మిత్రపక్షమైన మజ్లిస్‌ అసలే ఒప్పుకోదు. అయినా స్వాములు ఏదైనా ఆధ్మాత్మికంగా చెప్పాలి గాని విభిన్న మతాల మధ్య వివాదం పెట్టే మాటలెందుకు? ఇంతకూ భారత రాజ్యాంగం 30వ అధికరణం మతభాషా పరమైన మైనారిటీలకు రక్షణ కల్పిస్తున్నది. మత పరమైన జనాభా రాష్ట్రాలలోనూ ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతాల్లోనూ హెచ్చుతగ్గులతో వుంది. ప్రపంచంలో ముస్లింలు అత్యధికంగా వున్న దేశాల్లో మన దేశం ఒకటి.పాకిస్తాన్‌కన్నా కూడా ఇక్కడే వారు ఎక్కువగా వున్నారు. దేశ సమైక్యత సామరస్యం రీత్యా గతంలో కొన్ని ఏర్పాట్లు చేయగా కొనసాగుతున్నాయి. సబ్సిడీలు మక్కాయాత్రలకే గాక మానససరోవరానికి కూడా ఇస్తున్నారు. పంజాబ్‌ ప్రభుత్వం పాకిస్తాన్‌లోని గురుద్వారాల సందర్శనకు వెళ్లేవారికి సబ్సిడీ ఇస్తుంది. దీనిపై బిజెపి ఎంపి ఒకరు కేసు వేయగా సుప్రీం కోర్టు 2011లో కొట్టి వేసింది. హాజ్‌ యాత్రలకు కొద్దిపాటి సబ్జిడీలు ఇచ్చినంత మాత్రాన 27వ అధికరణం ఉల్లంఘించినట్టు కాదని దేశంలో మతపరమైన వైవిధ్యాన్ని గమనంలో పెట్టుకోవాలని చెప్పింది. ఈ మొత్తం మరీ పెరిగిపోతే ఆలోచించవచ్చని కూడా పేర్కొంది. 2012లో మళ్లీ సుప్రీం కోర్టే దీనిపై విచారణ జరిపి హాజ్‌ సబ్సిడీలు అత్యధిక చార్జిలు వసూలు చేసే సౌదీ విమాన సంస్థలకు పోతున్నాయి గాని యాత్రీకులకు జరుగుతున్న మేలు లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని చక్కదిద్ది క్రమేణా ఈ సబ్సిడీలు కూదా లేకుండా చూడాలని సూచించింది. కాబట్టి పరిపూర్ణానందుల వారు ఇవన్నీ గమనించకుండా హిందూ వర్సెస్‌ ముస్లిం భాషలో మాట్లాడ్డం తగని పని.పైగా కుంభమేళాలకు పుష్కరాలకు మనం ఖర్చు చేస్తున్న వందల కోట్టు ఏ ఖాతాలోవి?టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వాదనలు నమ్మేసి కామన్‌ గుడ్‌ ఫండ్‌నుంచి ఇస్తే తప్పు కాదని ఆయన చెబుతున్నారు గాని వాస్తవానికి ఆ ఫండ్‌ వున్నది శిథిలాయల పునరుద్ధరణకేనని గమనించడం అవసరం. దేవుణ్ని మత విశ్వాసాలను తామే గుత్తకు తీసుకున్నట్టు ఇంకెవరూ మాట్లాడరాదన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత అప్రజాస్వామికమైనవి అన్యాయమైనవి. ఈ దేశ సంప్రదాయంలో లోకాయతం, చార్వాకం నాస్తికత్వం బౌద్దం జైనం వగైరా అనేకం వున్నాయి. వీరు పాటించే చాలా ఆచారాలు రావడానికి ముందే ఇస్లాం వచ్చింది. క్రైస్లవజెసూట్లు ప్రవేశించేనాటికి చాలామంది ఆచార్యులు లేనేలేరు. వారిపేరిట పీఠాలే పెట్టారు గాని ఇన్ని వందల ఏళ్లుగా దేశంలో పాతుకు పోయిన హిందూయేతర విశ్వాసాలను సహించలేరా? బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటే ఇదేనా అర్థం?

మోడీపై పుస్తకం.. టిటిడిలో అమ్మకం!

ఇంతకూ ఈ సర్వసంగ పరిత్యాగుల వారు మోడీ నాయకత్వాన్ని హర్షిస్తూ ఒక పుస్తకమే రాయడం ఏ విధమైన ఆధ్యాత్మికతో తెలియదు. పైగా దాన్ని హైదరాబాదులో టిటిడి కేంద్రం ప్రాంగణంలోని పుస్తకశాలలో అమ్మడం ఇంకా విపరీతం !!

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *