అమెరికా భ్రష్టరూపం – అనాగరిక ట్రంపోన్మాదం-1

పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానంలో ఏదేదో చెప్పాడన్నట్టే అమెరికాలోనూ నోస్టర్డాం భవిష్యత్తును చెప్పాడంటుంటారు. 228 ఏళ్ల అమెరికా రాజ్యాంగ అనుభవం తర్వాత డోనాల్డ్‌ ట్రంప్‌ అనే వ్యక్తి అద్యక్ష భవనంలోకి వస్తాడనీ,దేశాన్ని ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంత పరిచే దిక్కుమాలిన పనులు చేస్తాడని ఆయన వూహించాడేమో తెలియదు. దేశాలు మతాలు జాతులు మానవ విలువలు స్త్రీపురుష సంబంధాలు, విద్య ఉద్యోగాలు ఆర్థిక సామాజిక రాజకీయాంశాలు ప్రతివిషయంలోనూ ప్రజాస్వామ్య విరుద్ధమైన ప్రగతినిరోధకతాన్ని ప్రపంచాధిపత్య తత్వాన్ని రుద్దేందుకై ట్రంప్‌ రోజురోజుకు రోజు చెలిరేగిపోతున్నారు. దేశాలతో జాతి మతాలతో నిమిత్తం లేకుండా ప్రతిమనిషీ ఈ అంతర్జాతీయ అఘాయిత్యాన్ని అర్థం చేసుకోవడం అవసరం.
మొదటి సంగతేమంటే ట్రంప్‌ పైకి రావదం యాదృచ్చిక లేదా ఆకస్మిక పరిణామం కాదు. అగ్రరాజ్యం ముద్రతో ఆధిపత్యం చెలాయిస్తూ అన్ని విధాల క్షీణిస్తున్న అమెరికా మేడిపండు అంత:స్వరూపం ఆయన. దీనివెనక చాలా చరిత్ర వుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా బలపడి యూరప్‌ చితికిపోయింది.సోవియట్‌ చైనా తదితర దేశాలతో బలీయమైన సోషలిస్టు శిబిరం ఆవిర్భవించింది. వర్థమాన దేశాలకు అండగా నిలిచి అలీనోద్యమానికి శాంతిస్వాతంత్రాలకు వూపిరిలూదింది.అమెరికా సోవియట్‌లు రెండు అగ్రరాజ్యాలుగా భిన్న ధృవాలుగా పెంపొందాయి. ఆ దశలో సోవియట్‌కు వ్యతిరేకంగా ప్రచ్చన్న యుద్ధమే గాక ప్రత్యక్షంగా నాటోకూటమి వంటివాటిని అమెరికా పెంచి పోషించింది. రోనాల్డ్‌ రీగన్‌ ఈ క్రమాన్ని పరాకాష్టకు తీసుకెళ్లారు. ఆ దశలోనే సోవియట్‌లో మిహయిల్‌ గోర్బచెవ్‌ నాయకత్వం మొదలైంది. ఆయన మొదలు పెట్టిన సంస్కరణల ప్రహసనం చివరకు ఆ వ్యవస్థనే విచ్చిన్నం చేసింది. మరోవైపున యూరప్‌లో జర్మనీ, ఆసియాలో జపాన్‌, సోషలిస్టు చైనాలు ఆర్థిక శక్తి పెంచుకున్నాయి. ా అంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా రగిలించిన టెర్రరిజం సవాలుగా మారింది. సీనియర్‌ బుష్‌ కాలంలో మొదలైన గల్ప్‌యుద్దం బిల్‌క్లింటన్‌ హయాంలోనూ కొనసాగి చిన్న బుష్‌ కాలంలో సెప్టెంబర్‌ 11 దాడికి , ఇరాక్‌ ఆక్రమణకు దారితీసింది.
ఒబామా పై పూతలు, పాత రీతులు
బుష్‌ హయాంలోనే ఆమెరికా ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది గాని ఆయన నాటో వంటి కూటములపై గాని యూరోపియన్‌ దేశాలకు వ్యతిరేకంగా గాని ఏమీ మాట్లాడలేదు. బుష్‌ పాలన చివరిదశలో అంటే 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభం బాహాటంగా బద్దలైంది. చివరకు ఎలాగో బెయిలవుట్టు ఇచ్చి బయిటపడ్డారు. ఆయనపై అసంతృప్తి ప్రబలిన దశలో మార్పు తెచ్చే ప్రతినిధిగా బారక్‌ ఒబామాను ఎన్నుకున్నారు. తొలి నల్లజాతి అద్యక్షుడుగానూ ఆకర్షణీయమైన మాటలతోనూ ఒబామా కొంత ప్రభావం చూపినా విధానాల పరంగా పెద్ద మార్పు లేదు. ప్రజల ఆరోగ్యరక్షణ కోసం ఒబామా కేర్‌ ఆర్బాటంగా తెచ్చినా అది వాస్తవంలో కార్పొరేట్లకుమేలు చేసేదిగానూ లక్షలాది ఉద్యోగుల జీతాలలో అవసరాన్ని మించిన కోతగానూ మారింది. ఇక లిబియా ఆక్రమణ, సిరియాలో అంతర్యుద్ధం వంటివన్నీ కల్లోలం సృష్టించాయి. ఇరాన్‌తో అంతకు ముందే అమెరికాకు ఘర్షణ నడుస్తున్నది. యూరప్‌ దేశాలకు ఇంధనం ప్రధానంగా ఇరాన్‌ లిబియా రష్యాల నుంచే వచ్చేది. అక్కడే చిచ్చు పెట్టడం వాటికి చిక్కులు కలిగించి ఆగ్రహం తెప్పించింది. ఒబామా ఇరాన్‌తో ఏదో ఒప్పందం తతంగం నడిపి కొంత చల్లబర్చే ప్రయత్నం చేశారు. అయితే చైనాతో దక్షణ చైనా సముద్ర సమస్యపైనా రష్యాతో క్రిమియా విషయంలో వైరుధ్యాన్ని రగిలించారు. ఆసియా కీలకం(పివోట్‌ ఆసియా) పల్లవి ఎత్తుకున్నారు.
మారిన దృశ్యం. విభిన్న విశ్వం
ఈ లోగాసోవియట్‌ విచ్చిన్నానంతర దెబ్బలను తట్టుకుని అధిక ధరలతో ఆర్థిక శక్తి పెంచుకుని రష్యా ఒక ఆయుధ దేశంగా ముందుకొచ్చింది. లాటిన్‌ అమెరికా దేశాలూ అమెరికా గుప్పిట నుంచి జారిపోయి ప్రత్యామ్నాయ మార్గం తొక్కాయి. ఇండియా బ్రెజిల్‌, తదితర దేశాలు బ్రిక్స్‌ గా ఏర్పడ్డాయి. ఇలాటి సమాంతర వేదికలు అమెరికాతో సంబంధం లేకుండాఏర్పడ్డాయి. సంక్షుభిత యూరప్‌లో అలజడి మొదలైంది. సిరియా అంతర్యుద్ధం ఫలితంగా ముస్లిం శరణార్థుల రాక మరో సంక్షోభానికి దారితీసింది. ఇలాటి నేపథ్యంలో అంతకు ముందు చెప్పిన యూరోపియన్‌ యూనియన్‌, ప్రపంచీకరణ వంటి విధానాలు చెల్లకుండా పోయాయి. అమెరికాకు అనుచరపాత్రలో వున్న బ్రిటన్‌ బ్రెగ్జిట్‌కు ఓటేసింది.అమెరికా అగ్ర సైనిక శక్తి ఆయుధాల అమ్మకం కొనసాగుతున్నా ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి ఉపాధి కల్పన పూర్తిగా మందగించాయి. నిరంతరం ప్రచారంచేసిన టెర్రరిస్టుసవాలు అభద్రత ఆవరించింది. ఇది నాగరికతల యుద్ధం పేరిట మత విద్వేషాల పెంపుదలకు ఇస్లామోఫోబియాకు కారణమైంది.. ఇది సామాజిక కౌటుంబిక వ్యక్తిత్వ సంక్షోభాల రూపం తీసుకుని విద్యాలయాల్లో సామూహిక కాల్చివేతలు, పోలీసుల ఉన్నాద దాడులు, దురాక్రమణ సైనికులలో వింత మానసిక పోకడలూ పెరిగిపోయాయి. అత్యంత నాగరిక దేశమంటూనే అటవిక లక్షణాలనూ అమానుషాలనూ చూడవలసి వచ్చింది. అవినీతి ఆరోపణలూ ఆర్థిక పతనాలూ సరేసరి. ఎవరూ వూహించని వాల్‌స్ట్రీట్‌ ఉద్యమం వంటివి జరిగాయి.
(ప్రజాశక్తి,నవతెలంగాణ లలో ప్రచురితం)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *