అమెరికా భ్రష్టరూపం – అనాగరిక ట్రంపోన్మాదం-2

ో ఇలాటి పరిస్థితుల్లో వచ్చిన అద్యక్షుడే డోనాల్ట్‌ ట్రంప్‌. వామపక్ష మేధావి నామ్‌ చామ్‌స్కీ 2010లోనే ట్రంప్‌ పైకి వచ్చేఅవకాశముందని చెప్పడం విశేషం. ఎన్నికల ప్రచారంలోనే ఆయన వికృత ధోరణులన్నీ గుప్పించారు. దేశాలు జాతులు మతాలు మహిళలు అందరినీ అన్నిటినీ అవమానించే ఘోరపదజాలం ప్రయోగించారు. అయితే మరో వైపున అమెరికా దురవస్థను ఆంగీకరిస్తున్నట్టు మాట్లాడ్డం ద్వారా బాధితుల మనోభావాలు చూరగొనే వ్యూహం అనుసరించాడు. దేశ పరిస్థితి బాగాలేదంటనూ అందుకు కారకులు అమాయకులనూ బాధితులను పొట్టపోసుకోవడానికి వచ్చిన వారిని కారకులుగా చూపించడం చరిత్రలో ఫాసిస్టు తరహా వ్యక్తుల నిరంతర ఎత్తుగడగా వుంటుంది.అమెరికా ఫస్టు అన్న ట్రంప్‌ చేసింది అదే. ప్రపంచ పోలీసుగా పెత్తనం చేసిన ఆ దేశాధినేత తామేదో ప్రపంచ భారాన్ని మోస్తున్నట్టు నమ్మించారు. విదేశాల నుంచి వచ్చి తమ శ్రమతో ప్రతిభతో అమెరికాను ఉన్నత శిఖరాలకు చేర్చిన వారిని శత్రువులుగా కష్టాలకు మూలంగా చూపించారు. ఇది మన దేశంలోనూ చూసిందే.ఇన్ని చేసినా ప్రజల ఓట్లలో పరిమితంగానే ఆధిక్యత పొందినా ఆ వ్యవస్థ విపరీతం వల్ల అద్యక్షుడు కాగలిగారు. పై లక్షణాలన్నిటికీ కారణమైన వారిలో హిల్లరీ క్లింటన్‌ కూడా వున్నారు గనక ఆమె ఆయనను ఓడించలేకపోయారు.
ఇక గద్దెక్కిన నాటినుంచి ట్రంప్‌ తన వినాశకర ఎజెండా అమలులో తల మునకలవుతున్నారు. మెక్సికో సరిహద్దులో గోడ కట్టడమే గాక ఆ ఖర్చు వారే భరించాలని హుకుం చేసి దానికోసం 20 శాతం అదనపు సుంకాలు ప్రకటించారు. ఇది ఆ దేశంలో చాలా ప్రజ్వలనకు దారితీసింది. ఇక ముస్లిములను శత్రువులుగా చెబుతూ ఇరాన్‌ ఇరాక్‌ సిరియా సూడాన్‌ లిబియా యెమెన్‌ సోమాలియా అనే ఏడు దేశాల నుంచి వచ్చే వారికి వీసాలు నిలిపేశారు. అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం ఇది ఘోరమైన దురహంకారం. ఈ నిర్ణయాన్ని న్యాయస్థానాలు కొట్టివేస్తే వాటిపైనా దాడి చేస్తున్నారు. ఇక సిరియా నుంచి వచ్చేవారిపై 120రోజులు నిషేదం విధించారు. అదే సమయంలో క్రైస్తవులు వస్తే అనుమతిస్తామనడం ద్వారా మతవిద్వేషాలను అంతర్జాతీయ స్తాయికి తీసుకెళ్లారు. ఈ చర్యలను ఐఎస్‌ఐఎస్‌ ఆహ్వానించిందంటే అవెంత ద్వేషపూరితంగా వుందీ తెలుస్తుంది. సెప్టెంబరు 11 దాడులకు కారణమైన బిన్‌లాడెన్‌ స్వదేశం సౌదీ అరేబియా ఆయన ఆశ్రయం పొందిన పాకిస్తాన్‌ ఈ జాబితాలో లేవంటే తమ విదేశాంగ నీతిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారో తెలుస్తుంది. అంతర్జాతీయ పెత్తనం మాదేనన్న స్థితి పోయి అంతకు ముందు కుదుర్చుకున్న టిటిపి,టిటిఐపి వంటి ఒప్పందాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఇవన్నీ కూడా బలహీనపడిన అమెరికా దుస్తితికి నిదర్శనాలు. మరోవైపున చైనాను ప్రత్యర్థిగా చేసుకుని వ్యతిరేక ప్రకటనలు చేస్తూనే వున్నాడు. ఒబామా కేర్‌ను సంస్కరించేబదులు పూర్తిగా దాడిచేసి ప్రజల ఆరోగ్య భద్రతకు ముప్పు తెచ్చారు. స్త్రీల గర్భస్రావ హక్కును తిరస్కరించడమే గాక ఆవిధమైన సేవలందించినట్టు ఆరోపణలున్న ఎన్‌జివోలపై వేటువేయడంతో తల్లీపిల్లల ఆరోగ్యానికి రక్షణ లేకుండా పోయి వీధుల్లో పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే హెచ్‌1 బి వీసాలను కుదించి వాటికి విషమ షరతులు విధించి ప్రధానంగా భారతదేశం నుంచి అత్యధికంగానూ ఇతరచోట్లనుంచి కొద్దిగానూ వచ్చిన సాంకేతిక నిపుణుల ఉద్యోగులు శ్రమజీవుల బతుకుల్లో మంటపెట్టారు. దీనివల్ల దేశంలో ఉపాధి కల్పన కూడా జరగడం లేదు. ఎందుకంటే అవసరాల కోసం నియామకాలు చేసుకునే అవకాశం లేకుండా నిబంధనలు మార్చారు. అంటే వున్నవారిని పంపేస్తారు, గోడలు కట్టేస్తారు బయిటనుంచి రానివ్వరు.దీని ఫలితం? ఇప్పటికే వున్నవారిని మరింత పిండడమేనన్నమాట. కార్పొరేట్లు కోరుకునేది అదే.
అన్నిటా అభివృద్ది నిరోధకత్వం
ఇవన్నీ ట్రంప్‌ వ్యక్తిగత ఉన్మాదం అనుకుంటే పొరబాటే. అమెరికా ఇప్పటికి ప్రబల శక్తిగానే వున్నా ఆర్థికసామర్థ్యం తగ్గుముఖం పట్టింది.మరోవైపున కార్పొరేట్‌ అమెరికా అపారంగా పెరిగిపోయి ప్రపంచ సంపదలో సగానికి పైగా శాసిస్తున్నది.వారి కనుసన్నల్లోనే ట్రంప్‌ ఇవన్నీ చేస్తున్నారు. పేదలకోసం మాటలు చెబుతూనే కార్పొరేట్లకు రాయితీలు మినహాయింపులు పెంచుతున్నారు. పర్యావరణాన్ని కూడా ఖాతరు చేయకుండా గతంలో నిలిపేసిన కీస్టోన్‌ ఎక్స్‌ఎల్‌, డకోటా యాక్సెస్‌ పైపు లైన్లను అనుమతించారు. అసలు తన సైట్‌లో పర్యావరణం ఎజెండానే లేకుండా తీసేశారు. నల్లజాతి వారిపైన మహిళలపైన ముస్లింలపైన ద్వేషంరగుల్కొల్పుతున్నారు. మానవహక్కులు తెరచిన తలుపులు అంటూ సూక్తులు చెప్పిన అమెరికా అధినేత ఇంత వికృత రూపంలో బయిటకు రావడం ప్రపంచానికే ఒక హెచ్చరిక లాటిది. వారే చెప్పిన ప్రపంచీకరణ ఇప్పుడు పనికిరానిదై పోయింది. బెర్లిన్‌ గోడలు కూల్చిన వారు మెక్సికో గోడలు కడతామంటున్నారు. ఎండ్‌ ఆఫ్‌ దహిస్లరీ అన్నది కాస్త ఎండ్‌ ఆఫ్‌ ద ఎంపైర్‌ గా మారింది. (ఇంపీరియలిజంను ఎంపైర్‌ అంటుంటారు) ఈ క్రమంలో నిన్నటి ఆగర్భశత్రువు సోవియట్‌ నేటి రూపమైన రష్యా తమకు శత్రువేమీ కాదని ట్రంప్‌ ప్రకటించడం ఒక చారిత్రిక పైపరీత్యం. అంతకు ముందు సోషలిస్టు దేశాలలో కుట్రలు సాగించేందుకు తమ గూఢచారులను పంపిన అమెరికా ఇప్పుడు తమ అద్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా జోక్యం చేసుకుందని గగ్గోలు పెట్టడం మరో వింత. ఒక ఇంటర్వ్యూలో ట్రంప్‌ను హంతకుడైన పుతిన్‌ను మీరు ఇష్టపడతారా అని ప్రశ్నిస్తే మన దగ్గర హంతకులు లేరా అని ఎదురు ప్రశ్నించారట. చైనాకు వ్యతిరేకంగా తైవాన్‌ను చేరదీసి వివాదం రగిలించిన ట్రంప్‌ మళ్లీ ఇప్పుడు తాను ఒకే చైనా విధానానికి కట్టుబడివున్నట్టు చెబుతున్నారు.
ఈ ట్రంపోన్మాదంపై అమెరికాలోనే ఎంత వ్యతిరేకత వచ్చిందంటే ఆయన ప్రమాణస్వీకారం చేస్తుంటే నిరసన ప్రదర్శనలు జరిగాయి. యూరోపియన్‌ దేశాలలో వేలాది మంది మహిళలు వీధుల్లోకి వచ్చారు.బ్రిటన్‌ పర్యటన పెట్టుకుంటే పార్లమెంటులో ఆయన మాట్లాడ్డానికి వీల్లేదని ఆ దేశపు స్పీకర్‌ తీవ్రమైన అభ్యంతరం ప్రకటించారు. ఆఖరుకు ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక ఆయనే నియమించిన న్యాయమూర్తి నీల్‌ గోర్ష్‌ కూడా వీసాలపై నిషేదం న్యాయం కాదని తేల్చిచెప్పారు. విచిత్రమేమంటే ఇన్ని పరిణామాల మధ్యనా బొత్తిగా పెదవి విప్పనిది భారత దేశమే. ఇస్లామిక్‌ తీవ్రవాదంపై ట్రంప్‌ పోరాడుతున్నారు గనక మనకు మిత్రుడన్న వైఖరి తీసుకోవడమే గాక మోడీ అంటే ట్రంప్‌కు చాలా ఇష్టుడన్నట్టు భ్రమపడుతున్నది. ట్రంప్‌ అధికారికంగా మాట్లాడిన దేశాధినేతల్లో ఇజ్రాయిల్‌ కెనడా బ్రిటన్‌ తర్వాత మోడీ నాల్గవవారు. మొదట దేశ విదేశాలలో ఇంత వ్యతిరేకత మూటకట్టుకున్న విపరీత రాజకీయ వేత్త చైనా తర్వాత స్తానంలోవున్న మన పట్ల ఎలా సానుకూలంగా వుంటారన్న ప్రశ్నవేసుకోవడం లేదు. హెచ్‌1 బి నిర్ణయానికి ఎక్కువగా దెబ్బతినేది మన ఐటి నిపుణులేననీ, అక్కడ గణనీయంగా స్థిరపడిన భారతీయ సంతతి భద్రతకు కూడా ముప్పు వుందని గుర్తించడం లేదు. పాలకవర్గాలు వంతపాడినా సరే ప్రపంచ ప్రజలు పెద్ద దేశమైన భారతీయులు ఈ వినాకశర పోకడలపై పోరాడక తప్పదు.
(ప్రజాశక్తి,నవతెలంగాణ లలో ప్రచురితం)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *