ట్రంప్‌ సంతక కంపనం…సిఐఎతో బోణీ- మీడియాపై బాణం…


అమెరికా అద్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తొలి సంతకం ఒబామాహెల్త్‌కేర్‌ కుదింపు లేదా దాదాపు రద్దు. ఇది సంక్షేమంపై దాడిగా కనిపించినా ఆ కేర్‌ అమెరికాలో ఉద్యోగుల వేతనాల్లో వందల డాలర్లకోతకు దారితీస్తుంది గనక లోలోపల స్వాగతించేవారూ భారీగానే వున్నారు. రెండవ రోజు ట్రంప్‌ మొదటి సమావేశం భయానక గూఢచారి సంస్థ సిఐఎతో సమావేశం. అంతకు ముందు ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని అంతం చేయకతప్పదని అదృశ్యశక్తిపై యుద్దం ప్రకటించిన ట్రంప్‌ ఈ సమావేశంలో సిఐఎపైనే కీలక బాధ్యతలున్నాయని అప్పగింతలు పెట్టారు. ఇతర దేశాల్లో జోక్యం చేసుకునే ప్రపంచ పోలీసు పాత్రను విరమిస్తామన్నట్టు సంకేతాలచ్చిన ట్రంప్‌ మరి సిఐఎకు అంత పెద్ద పీట ఎందుకు వేస్తున్నారు? ఇస్లామిక్‌ తీవ్రవాదంపై పోరాటం కోసం ఇతర దేశాలపై దాడి చేయరా?
ఇంతకంటే కూడా తీవ్రమైంది అమెరికా మీడియాపై ట్రంప్‌ ప్రభుత్వ దాడి. మీడియా వారు అస్సలు నమ్మదగిన వారు కాదని ఆయన నోరు పారేసుకున్నారు.తన ప్రమాణ స్వీకారానికి పదిహేను లక్షల మంది వస్తే మీడియా తక్కువ మంది వచ్చినట చూపించిందని ఆయన తిట్టిపోశారు. 25 లక్షలు అని కూడా కొందరు అన్నారని కాని మీడియా ఖాళీ స్థలాలు చూపించిందని మండిపడ్డారు. ఇదంతా చూస్తుంటే మన తెలుగు వల్లభులు మీడియాపై దాడి చేసిన తీరు గుర్తుకు వస్తుంది కదా!అదే పాలకుల నైజం. తమను మించిన వారు లేరని చెప్పమంటారు. ఇక్కడ విషయం ఏమంటే వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శిగానియమితుడైన సీస్‌ స్పైసర్‌ కూడా ఇదే విధంగా దాడి చేశారు. మొదటి రోజునే అద్యక్షుని కార్యక్రమాలను మీడియా తప్పుగా తక్కువగా చూపిందని ఆయన ఆరోపించారు.

ఇదిలా వుంటే అమెరికాలోనే గాక ప్రపంచ వ్యాపితంగానూ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కొనసాగాయి.వీటిలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.

ఈ వ్యతిరేక ప్రదర్శనల వెనక బలమైన శక్తులే వున్నాయని కూడా పరిశీలకులు భావిస్తున్నారు.అసలు ట్రంప్‌ సంతకమే రిచర్డ్‌స్లేలుపై భూ కంపం రికార్డును పోలివుందని మీడియా కథనాలు పోలికలు ప్రచురించింది. సంతకం ఎలా వున్నా ఆయన నిర్ణయాలు విధానాల ప్రకంపనాల గురించే ప్రపంచం ఆందోళన చెందుతున్నది.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *