అమెరికా అసలు రూపం ట్రంప్‌

డోనాల్డ్‌ ట్రంప్‌ అద్యక్ష పదవి చేపట్టగానే చేసిన ప్రసంగం అమెరికా వ్యవస్థ అసలు రూపాన్ని వెల్లడించింది. అదేదో అగ్రరాజ్యమనీ అవకాశాల గని అని అదేపనిగా ఆకాశానికెత్తి అంటకాగుతున్న పాలకవర్గాల మేధావుల మాటల్లో నిజమెంతో ట్రంప్‌ తేల్చిపారేశారు. ఆయన దుందుడుకు అనీ, దురుసు అని వ్యక్తిగత వ్యాఖ్యలతో సరిపెట్టేవారు అమెరికా ఆర్థిక పాలనా వ్యవస్థ డొల్లతనాన్ని చూడటం లేదన్నమాట. కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం చూశామని పరిశ్రమలు మూతబడుతున్నాయనీ వుద్యోగాలు వూడిపోతన్నాయనీ ఆయన వాపోయారు. ఇతర దేశాల్లో అనవసరంగా తలదూర్చి దేశ ప్రజలపై భారాలు రుద్దుతున్నామని ఒప్పుకున్నారు. వాణిజ్య యుద్ధాలలో వెనకబడిపోయామని పరోక్షంగా చైనా వంటి దేశాలనుద్దేశించి అన్నారు.అమెరికాను ఎవరు పాలించినా మేము ప్రపంచాన్ని పాలించాలని చెప్పిన గత గొప్పలకు ఇది పూర్తి భిన్నం. అమెరికా అమెరికన్లకే అనడం బాగానే వుంది గాని ఇదివరలో వారికోసమే తీసుకుపోయిన విదేశీయులకు పెద్ద సంఖ్యలో వున్న భారతీయులకు అభద్రత కలిగించడం అనుచితం. అప్పుడైనా మనమీద ప్రేమతో తీసుకుపోలేదు గనక ఇప్పుడు కూడా వారి లాభనష్టాలనుబట్టి తుది నిర్ణయం వుంటుంది. జపాన్‌ చైనా వంటి దేశాలు ట్రంప్‌ ఏకపక్ష ధోరణిపై పెదవి విరుస్తుంటే మన దేశం మౌనం వహించింది. ఒక విధంగా ఆయన మాటలు 1985లో సోవియట్‌ అద్యక్షుడు మిహయిల్‌ గోర్చచెవ్‌ను గుర్తుచేశాయి. వర్థమానదేశాలకు సహాయం మోయలేని భారమైందని అప్పట్లో ఆయన ప్రకటించి అమెరికా ముందు చేతులెత్తేశారు. తనే ప్రపంచ పోలీసునన్నట్టు ఇరాక్‌తో మొదలు పెట్టి ఆప్ఘనిస్తాన్‌ లిబియా సిరియా అన్ని చోట్లా అమెరికా తలదూర్చింది. ప్రభుత్వాల మార్పు దాని నినాదమైంది.ఇదంతా నెత్తికి చేతులు తెచ్చిందని ఇప్పుడే ట్రంప్‌ ఒప్పుకుంటున్నారన్నమాట. అయితే ఆయన కుర్చీలోకూచోగానే చేసిన పని ఆరోగ్య భద్రతను ఎత్తివేయడం. ఇంట్లో ఈగల మోత బయిటపల్లకి మోత చందంగా వున్న అమెరికా అసలు రూపం గ్రహించి ఇకనైనా మన పాలకులు స్వావలంబనకు ప్రాధాన్యత నివ్వడం దేశీయ ఉత్పత్తి ఉపాధి పెంచడం తక్షణం జరగాలి.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *