చిరు, పవన్‌ల రాజకీయ తేడాలు

ఖైదీ నెంబర్‌ 150 కోసం వరుసగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయ జీవితం, వేడుకలకు పవన్‌ కళ్యాణ్‌ రాకపోవడం, నాగబాబు విమర్శల వంటి ప్రస్తావనలు కూడా వస్తున్నాయి. యండమూరి వీరేంద్రనాథ్‌ వ్యాఖ్యల క్లిప్పింగ్‌ చూస్తే నిజంగానే బాలేదు గనక నాగవాబుకు కోపం రావడం సహజమే. ఇక రాంగోపాల్‌ వర్మ ట్వీట్లకు అనవసర ప్రాధాన్యత ప్రచారం ఇస్తున్నారని నేను గతంలోనే విమర్శించాను. అయితే నాగబాబు కూడా సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని సంయమనంతో విమర్శ చేసి వుండొచ్చు గాని ఆయన ఆగ్రహంలో అర్థం వుంది.
చిరంజీవి రాజకీయాల గురించి పవన్‌తో సంబంధాల గురించి టీవీ ఛానళ్లు కూడా అభిప్రాయం అడిగాయి. సోదరులుగా వారిద్దరి సంబంధాలు ఒకరి గురించి మరొకరు మాట్లాడుకునే తీరులో కనిపిస్తూనే వున్నాయి. పవన్‌ పాత్ర బావుందని, అది సమాజానికి అవసరమేనని చిరు అన్నారు. తన రాజకీయ పాత్ర గురించి అంతగా చెప్పకుండా సినిమాపై కేంద్రీకరించారు.ఇప్పుడు ఆయన ఆలోచనే అది. అయితే ఈ అన్నదమ్ముల రాజకీయాల్లో తేడా ఏమంటే చిరు స్వంతంగా పార్టీ పెట్టి ఓట్లు సీట్టు కూడా బాగానే తెచ్చుకనికూడా పాలకపక్షంలో కలసి పోయారు. వాస్తవానికి అది అభద్రతో లేక అనాసక్తో కాదంటే అవగాహనాలోపమే అయివుండాలి. పవన్‌ విషయానికి వస్తే పార్టీ పెట్టకుండా టిడిపి బిజెపి కూటమిని గెలిపించి అది కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాక దాన్నుంచి నెమ్మదిగా విడగొట్టుకుంటున్నారు.. ఏ మేరకు విడిపోతారు ఎంతవరకూ పోరాడతారు అనేది భవిష్యత్తు చెప్పాలి గాని అన్న ఇటునుంచి అటు వెళితే తమ్ముడు అటు నుంచ ఇటు వస్తున్నారు. దూకుడు విషయంలో పవన్‌ ఎప్పుడూ ఎక్కువే. తెరపైనా బయిటా కూడా. అది ఆయనకు కొంత అదనపు ఆకర్షణ లనొచ్చు. ప్రజల తరపున ఇలాగే గట్టిగా మాట్టాడితే రాజకీయంగా ఆదరణ వుంటుంది. తడబడితే పోతుంది. అంతే.
చిరంజీవి జనసేనలోకి వస్తారా అని కూడా కొందరికి సందేహం.పవన్‌ కళ్యాణ్‌ బిజెపి టిడిపి తరపునే మాట్లాడుతున్నారని ఇంకొందరి ఆరోపణ.ఈ రెండు అభిప్రాయాలతోనూ ఏకీభవించలేను. వాళ్ల వ్యూహాలు వాళ్ల ప్రణాళికలు వాళ్లకు వున్నాయి. కాపు ప్రముఖుల సమావేశానికి చిరు హాజరైనారు గాని పవన్‌ అటు వెళ్లకపోవడం అందరూ చూశారు. అలాగే అంత ప్రసిద్ధుడైన అగ్రజరుడు తమ్ముడి పార్టీలో చేరడం కూడా జరిగే పని కాదు. ఇప్పటికిప్పుడు చిరంజీవి ఆ విషయాలు పట్టించుకోరు కూడా.కాంగ్రెస్‌ కూడా ఆయన మళ్లీ పాత పాపులారిటీ తెచ్చుకోవాలనే కోరుతుంది. బహుశా రాజ్యసభ సభ్యత్వం వున్నంత వరకూ ఆయన ఆ పార్టీలోనే వుంటారు. అదీ సంగతి.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *