షరతుల్లేని స్వాగతాలెందుకు పవన్‌జీ?

ఉద్థానం కిడ్నీ బాధితుల సమస్యపై జనసేన అద్యక్షుడు హీరో పవన్‌ కళ్యాణ్‌ చూపిన చొరవ పర్యటన సమస్యను మరోసారి ముందుకు తెచ్చాయి. అది మంచి విషయమే. దానిపై మొదట్లో కొందరు తెలుగు దేశం నేతలు తాము చేసింది ఏకరువు పెడుతూ దీనివల్ల రాజకీయ ప్రయోజనం పొందే ఆలోచన సరికాదని వాదించారు.మరోవైపున పవన్‌ కళ్యాణ్‌ వెళ్లి తమ అధినేతతో మాట్లాడితే అంతా పరిష్కారమవుతుందన్నట్టు చెప్పారు. పవన్‌పై ఒకవైపున వైసీపీ తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంటే మరోవైపున టిడిపి ఆయన తమ నేస్తమే, అంతిమంగా తమ వైపే అన్న భావన కొనసాగించేలా మాట్లాడుతుంటుంది. ఉద్ధానం సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కమిటీని వేస్తున్నట్టు, కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. బాగానే వుంది గాని ఆ వెంటనే పవన్‌ కళ్యాణ్‌ ఈ ప్రకటనను స్వాగతించేశారు. మీడియాకు కూడా కృతజ్ఞతలు చెప్పారు. అయితే ప్రభుత్వాలు ఇలా చాలా ఏళ్లుగా చెబుతూనే వున్నా సమస్య కొనసాగుతుందని గుర్తుంచుకుంటే ఇప్పుడు చంద్రబాబు చెప్పిన దానికి కూడా ఆ పరిమితులుంటాయని అర్థమవుతుంది. పవన్‌ పూర్తి ప్రకటనలో ఆ మాట వుందో లేదో నాకు తెలియదు గాని ఇది తొలి విజయమని చెప్పినట్టు వుంది. కనుకనే కమిటీ వేయడం మంచిదైనా ఖచ్చితమైన సహాయ చర్యలు తక్షణం తీసుకోవాలన్నది ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఏదైనా సమస్య లేవనెత్తడం ఆ వెంనటే ప్రభుత్వ స్పందనను హర్షించడం ఒక గొలుసుకట్టు చర్యలాగా భావించే అవకాశముంటుంది. పైగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్‌ గాని, వామపక్షాల నేతలు కార్యకర్తలు గాని ఏ ఆందోళన చేసినా పర్యటన అన్నా అడ్డంకులు పెట్టే ప్రభుత్వం పవన్‌ కళ్యాణ్‌ విషయంలోనే మెతక వైఖరి చూపడానికి కారణమేమిటనే ప్రశ్న కూడా రాకుండా వుండదు. కాబట్టి అప్రమత్తంగా వుండటం అవతలి వారి ప్రచారాలకు ఆస్కారం లేకుండా చూసుకోవడం పవన్‌ కళ్యాణ్‌ బాధ్యతే.
ఖైదీకి శుభాకాంక్షలు
ఖైదీ నెం 150 ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు శుభాకాంక్షలు చెప్పడం ద్వారా పవన్‌ రావడం లేదని తేలిపోయింది.ఆహ్వానం ఇస్తాము గాని రావాలా వద్దా చెప్పడానికి ఆయనేమీ చిన్న పిల్లాడు కాదని రామ్‌ చరణ్‌ ఒకింత నిష్టూరంగా మాట్లాడినా బాబాయి మాత్రం తనకే హుందాగా జవాబివ్వడం బాగానే వుంది. ఏదైనా కుటుంబ వ్యవహారమే కదా!

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *