ఖైదీ 150..శాతకర్ణి… వ్యర్థ రాజకీయాలు ..

దీర్ఘ విరామం తర్వాత చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్‌ 150, బాలకృష్ణ 100 వ చిత్రంగా విడుదలవుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి తెరపై పోటీ పడటానికి ముందే వ్యర్థ వివాదాలు ముందుకు రావడం అవాంఛనీయం. ఇద్దరు పెద్ద హీరోల ముచ్చటైన పోటీ కాస్త దీనివల్ల రచ్చకెక్కాల్సి వచ్చింది. చిరంజీవి రాజకీయాలతో సామాజికాంశాలతో ఏకీభవించికపోవచ్చు గాని ప్రజల అభిమాన నటుడుగా ఆయన పునరాగమన సందర్భాన్ని ఆటంకపర్చనవసరం లేదు. ఏవేవో సాంకేతిక కారణాలు అడ్దు పెట్టకపోతే బహుశా అనుకున్నట్టే ఆడియో లేదా ప్రీ రిలీజ్‌ వేడుక జరిగి వుండేది కదా.. ఒకరి చిత్రం కోసం మరొకరి చిత్రాన్ని తొక్కి పట్టడం మంచిది కాదని నాగబాబు అన్నట్టు సోషల్‌ మీడియాలో చూశాను. దీనిపై ఇంకా చాలా చర్చే జరిగింది. అల్లు అరవింద్‌ అక్కడ వుండకపోతే బహుశా జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలాగే ఇదికూడా థియేటర్ల షోల సమస్య ఎదుర్కొనేదేమో. రాజకీయాలు వ్యాపారం సామాజిక కోణాలు కలగాపులగమై పోవడంనిజంగా దురదృష్టకరం. ఒక వేళ ఈ విషయంలో ప్రభుత్వ పాత్ర లేదనుకుంటే అప్పుడు మరింత చొరవగా ముందుకొచ్చి సర్దుబాటు చేయవలసింది. ఇదంతా చెప్పడం చిరంజీవి చిత్రాన్ని భుజాన వేసుకోవడానికి కాదు. దీనిపై నేను ఇదివరకే కొన్ని వ్యాఖ్యలు చేశాను. ఏమైనా ఆయన పునరాగమన చిత్ర వేడుకకు ఆటంకాలు మాత్రం అవాంఛనీయమే. ప్రతిపక్షాల ప్రదర్శనలను అడ్డుకునే సంసృతి ఇక్కడ కూడా పనిచేసిందా? ఇదే విజయవాడలో చిరంజీవి చిత్రం ఇంద్ర విజయోత్సవంలో చంద్రబాబు నాయుడు వెంకయ్యనాయుడు పోటాపోటీగా పొగిడిన దృశ్యం ఇప్పుడు గుర్తుకు రాకమానదు.ఈ విషయమై ఛానల్‌లో ఫోనులో మాట్లాడినప్పుడు ఇదే అభిప్రాయం చెప్పాను. చిరు కూడా అంతగా పాకులాడాలా అని యాంకర్‌ అడిగినప్పుడు ఆయన స్థాయికి మరీ అంత తాపత్రయం అవసరం లేదని ప్రేక్షకులు ఎలాగూ ఆదరిస్తారనికూడా అన్నాను.పైగా ఈ చిత్రంలో రైతులసమస్యలపై తీసిన తమిళ చిత్రం కత్తి స్వతాహాగానే మంచి ఇతివృత్తం.
బయిటివారి వివాదాలు అలా వుంచితే పవన్‌ కళ్యాణ్‌ రాకకు సంబంధించిన సందేహాలపై నిర్మాతగా వున్న రామ్‌ చరణ్‌ చేసిన వ్యాఖ్య కూడా బాలేదు. ఆహ్వానం ఇస్తామని రావాలో వద్దో చెప్పడానికి ఆయనేం చిన్నపిల్లాడు కాదని చిన్నాన్న గురించి అనడంలో స్వారస్యం లేదు.ఎవరికైనా ఆహ్వానం ఇచ్చేది రావాలనే కోర్కెతోనే కదా.. మరో వైపున అల్లు అరవింద్‌ పవన్‌ రాడని ముందే చెప్పేశారు గాని కారణాలు చిరంజీవి చెబుతారన్నారు ఇక్కడ కూడా అంతర్గత రాజకీయం కనిపిస్తుంది.
మళ్లీ శాతకర్ణి దగ్గరకు వస్తే సంక్రాంతికి వస్తున్నాం ఖబర్దార్‌ అని క్రిష్‌ అన్నప్పుడు దానిపై సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఇప్డుడాయన సర్దుకుని ఇద్దరి చిత్రాలు ఆదరించాలంటున్నారు. శాతకర్ణి ప్రారంభం రోజున చిరంజీవి కూడా వున్నారు. చిత్రం విడుదలలోనూ ఒకే రోజు పెట్టుకోవద్దని నాన్న చెప్పినందుకే ఒక రోజు ముందు విడుదల చేస్తున్నట్టు రామ్‌ చరణ్‌ ట్వీట్‌ చేశాడు. ఇవన్నీ ఇలా వున్నప్పుడు ఎందుకు లేనిపోని వివాదాలకు ప్రచారమిచ్చి ప్రేక్షకులలో మరీ ముఖ్యంగా వీరాభిమానుల్లో అనవసరమైన ఆవేశాలు పెంచడం? అసలే రాజకీయ సామాజిక ఉద్రిక్తతలు వివాదాలు వుండగా మరోసారి పాత కాలంలో వలె హీరోల యుద్దం తీసుకురానవసరం లేదు. చిరంజీవి పునరాగమనంలో 150 చిత్రంగా ఖైదీపై ఆసక్తి వుంటుంది. బాలయ్య నూరవ చిత్రంగా శాతకర్ణికి ప్రత్యేకత వుంది. చరిత్ర కూడా వుంటుంది.. ముందే చాలా మార్కెట్‌ జరిగింది. అంతిమ ఫలితం చిత్రాల సత్తాపైన ప్రేక్షకుల అభిరుచిపైన ఆధారపడి వుంటుంది. వ్యర్థ వివాదాలు లేకుంటే ఆ సద్భావన మరింత పెరుగుతుంది.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *