అరకొర మార్పులతో అదే స్విస్‌!

రాజధాని నిర్మాణానికి స్విస్‌ చాలెంజి అంటూనే ఆ పద్ధతిని పాటించనందుకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంపై హైకోర్టు అక్షింతలు వేసింది. ఒరిజినల్‌ ప్రాజెక్టు ప్రపోనెంటు(ఓపిపి) ప్రతిపాదించిన మొత్తం బయిటకు చెప్పకుండానే మాష్టర్‌ డెవలపర్‌ను ఖరారు చేసే అధికారం క్రిడాకు కట్టబెట్టిన తీరు కోర్టులో నిలబడలేదు. ఆ ఉత్తర్వును సవరిస్తానంటూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకుంది.అయితే ఇప్పుడు కూడా అంతిమంగా ఎంపిక అధికారం క్రిడా నియమించే సాంకేతిక కమిటీకే కట్టబెట్టింది. జనవరి2న విడుదలైన జీవో ప్రకారం సవరణలకు చట్టబద్దత కల్పించింది. అయితే వాస్తవంగా మాష్టర్‌ డెవలపర్‌ ఎంపిక అధికారం వుండేది ప్రధాన కార్యదర్శికి కాగా ఇక్కడ సాంకేతిక కమిటీకే అప్పగించడం ద్వారా మరోసారి క్రిడాకే సర్వాధికారం కల్పించినట్టయింది. పైగా అనేక అర్హతలతో పాటు అత్యంత తక్కువ మొత్తం కోట్‌ చేసినవారికి ఇవ్వొచ్చని వుంది గనక సింగపూర్‌ కంపెనీలనే ఖరారు చేయడం తథ్యంగా కనిపిస్తుంది. ఏమంటే ఇతరులు దాఖలు చేసేది ఎంతైనా అంతకన్నా తక్కువ చూపించి వారికి నచ్చిన సంస్థతోనే ప్రతిపాదన చేయించవచ్చు. తర్వాత కావాలంటే ఇతరేతర నిబంధనల కింద పెంచుకునే అవకాశం ఎలాగూ వుంటుంది. నామకార్థంగా కోర్టు ఆదేశాలు పాటించినట్టూ వుంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ తతంగంతో డెవలపర్‌ ఎంపికకు బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ విధంగా క్రిడా చేతుల్లో అధికారం పెట్టడం కూడా చెల్లుబాటు కాదని మాజీ ఐఎఎస్‌ అధికారి ఇఎస్‌ శర్మ స్పష్టం చేశారు. దీనిపై ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారు. ప్రభుత్వమే నిర్ణయం చేయడం సరికాదని కోర్టు చెప్పింది గనక సాంకేతిక కమిటీ ప్రహసనం సృష్టించినట్టు కనిపిస్తుంది. ఎలాగూ టెండర్లు చేరేది వారికే గనక అత్యంత తక్కువ మొత్తం ఏదో తెలుసుకుని అంతకన్నా తక్కువకు వేయించడం పెద్ద సమస్య కాదు. ఏతావాతా స్విస్‌ ఛాలెంజి బూటకం కొనసాగుతుందన్నమాట.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *