నిముషాలు.. సంవత్సరాలు.. గొప్పవాళ్లు!

సమయపాలన, కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆదర్శమే కాదు, అవసరమైన విషయాలు. వివిధ కాలాల్లో వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన వారు ఈ సంగతి చెబుతూనే వున్నారు.

అమెరికా మొదటి అద్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ సమయమంటే సమయమే. ఒకసారి ఆయన గుర్రాలు కొనడానికి తెల్లవారుఝామున అయిదు గంటలకు రావలసిందిగా చెప్పారు. అప్పటికే వెళ్లి గుర్రపు శాల దగ్గర కూచున్నారు. అయితే గుర్రాలు అమ్మేవారు పావు గంట ఆలస్యంగా వచ్చారు.అప్పటికే ఆయన వెళ్లిపోయారు. మీరు వచ్చే వారం రావలసిందేనని సిబ్బంది చెప్పి పంపించారు.పార్లమెంటులోనూ ఆయన ఇంతే ఠంచనుగా హాజరై చర్చల్లో పాల్గొనేవారట.
మరో అద్యక్షుడు అబ్రహాం లింకన్‌ కాలాన్ని జీవితాన్ని కూడా చాలా గౌరవించే వ్యక్తి. నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలున్నాయని కాదు, వున్న సంవత్సరాల్లో ఎంత జీవితం వుందనేది ముఖ్యం అని ఆయన సూక్తి
భా రతీయులలో మహాత్మాగాంధీని మించిన సమయాన్ని పాటించే వ్యక్తి మరివుండరేమో. ఆయన ఇంగ్రెశాల్‌ ప్యాకెట్‌ వాచి ఒకటి పిన్నీసు పెట్టుకుని ఖద్దరు తాడుతో తన పంచెకు వేలాడతీసుకునేవారు. పదే పదే సమయం చూసుకునేవారు. తెల్లవారుఝామున 4 గంటలకు లేచే అలవాటున్న గాంధీజీ అన్నీ నిముషాల లెక్కనే చేసేవారు. ఆయన ధర్మకర్త సిద్ధాంతం కాలానికి అన్వయించారు. మనం కాలానికి ధర్మకర్తలమే. దేశం కోసం వినియోగించవలసిన కాలాన్ని మన ఇష్టానుసారం వ్యర్తం చేయడానికి లేదనేవారు. గాంధీ విదేశీ వాచి gandhi11ఉపయోగించడంపై ఎవరో ఎగతాళి చేస్తే తను దేశీయ వస్త్రాన్ని గురించి మాత్రమే చెప్పాను తప్ప అన్నిటికి వర్తింపచేస్తే అది జాత్యహంకారం అవుతుందని వివరణ ఇచ్చారట. రోజుకు కనీసం యాభై వుత్తరాలు రాసే అలవాటున్న గాంధీ మీకు ఇంకా రాయలేకపోతున్నాను. సమయం అయిపోయింది అంటూ ముగించడం కద్దు. గాడ్సే చేతిలో హతమైన గాంధీజీ వాచిని రక్తసిక్తమైన ఆయన ధోవతితో పాటు మనం ఢిల్లీలోని గాంధీజీ మ్యూజియంలో చూడొచ్చు. అదే నిజానికి ఒక ఆకర్షణ. ఆయన మరణించేసమయానికి అదీ ఆగిపోయింది.
.కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య సమయాన్ని చాలా గౌరవించే వ్యక్తి.వేళకు లేవడం వ్యాయామం పఠనం చర్చలు అన్నీ క్రమపద్ధతిలో చేసేవారు. విప్లవ పోరాటంలో అడవిలో వున్నప్పుడు కూడా గడియారం, ట్రాన్సిస్టర్‌తో పాటు తన ‘మనో గడియారం’ అనుసరించి ఖచ్చితంగా అనుకున్న వేళకు లేచేవారు. మనో గడియారం అన్న మాట ఆయన వాడిందే.
ప్రపంచ ప్రసిద్ద మల్లయోఢుడు మహమ్మదాలీ జీవితానికి మరో విధమైన నిర్వచనం ఇచ్చారు. తన ్ట 20వ ఏట , 50 వ ఏట కూడా ప్రపంచాన్ని ఒకే విధంగా చూస్తున్నాననే వ్యక్తి ముప్పై ఏళ్లు వృథా చేశాడన్నమాట అన్నది ఆయన మాట.
ప్రపంచానికి ఎన్నో సాంకేతిక అద్బుతాలను ఇచ్చి అర్థంతరంగా నిష్క్రమించిన స్టీవ్‌ జాబ్స్‌ జీవితాన్ని సమీక్షించుకోవడంపై మరో మాట చెప్పారు.’రోజూ నేను అద్దం ముందు నిలబడినప్పుడు ఈ రోజు చేసింది సరైందేనా ఇలాగే చేసివుండాల్సిందా అని అడుగుతాను. వరుసగా కొన్ని రోజులు కాదు అని సమాధానం వస్తే మారాల్సిన సమయం వచ్చిందని గ్రహిస్తాను’
బిగ్‌ బి అమితాబ్‌ బచన్‌ షూటింగులైనా మీటింగులైనా టైమంటై టైమే. నన్ను ఆహ్వానించిన వారు నా కోసం చూసేవారు నిరీక్షించే పరిస్థితి రాకూడదని ఆయన అంటారు. భారతీయ చిత్ర రంగ శిఖరాగ్రంపై వున్నా అందరికన్నా ముందే షూటింగుకు చేరుకునేవారు. ఆలస్యంగా వచ్చిన ఇతరులే ఇబ్బంది పడుతుండేవారట. నేను అనేక సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటాను.సమయం వ్యర్థం చేసుకుంటే కుదిరేపని కాదు అని స్పష్టంగా చెబుతుంటారు. నాజీవితంనుంచి నేర్చుకోవలసింది ఏముందని నన్ను అడుగుతుంటారు. అలాటిదేమీ లేదనే అనుకుంటాను. కాని ఏదైనా తప్పక చెప్పాలంటే మాత్రం సమయపాలన అని చెబుతాను. అని ఆయన ఒకసారి అన్నారు. ఇంత ఖచ్చితంగా వుంటారు గనకే ఒకేఒక్కసారి ఏదో కారణం వల్ల భూత్‌నాథ్‌ వేడుకకు ఆలస్యంగా వస్తే అదే పెద్ద శీర్షిక అయింది.

చాలా విషయాల్లోలాగే సమయం విషయంలోనూ భారతీయులు ఒక విధమైన తాత్విక ధోరణి అనుసరిస్తారని పరిశీలకులంటారు. నిన్నకూ రేపటికీ కూడా హిందీలో కల్‌ అనే వాడతారు. ఇది కాల్‌కు మరో రూపం మాత్రమే. కాలం ఒక చక్రం లాటిదని తిరుగుతూనే వుంటుందని భారతీయ విశ్వాసం. అందుకే గంటలు నిముసాల వంటివి ఆట్టే పట్టించుకోరట. సభ పదకొండు గంటలకు అటూ ఇటుగా వుంటుందని అవలీలగా చెప్పేస్తారు.9.30, 11.45 ఇలా గాక అస్పష్టంగా చెప్పేస్తుంటారు. అరగంట గంట ఆలస్యమైతే పెద్ద తప్పనుకోరు.ప్రముఖ రచయిత ఆర్‌కె నారాయణ్‌ దీనిపై ఒక వివరణ ఇచ్చారు. ఇది పెద్ద దేశం గనక రకరకాల తేడాలున్నాయి గనక అనేక ఆటంకాలు ఎదురవుతుంటాయని కాలం నిరంతరాయమైంది గనక నిముషాలలో కొంపలంటుకుపోతాయని ఈ దేశస్తులు అనుకోరని ఆయన వాదన.

మనం మాత్రం ఈ వాదన వినకుండా వుండటమే మంచిది. సమయపాలనలో జాతిపితనే అనుసరించడం మంచిది.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *